• facebook
  • whatsapp
  • telegram

సముద్ర ప్రవాహాలు


 వర్షాలను శాసించే విరుద్ధ కవలలు!

 

 

అంతటా విస్తరించి, అలలు మినహా అంతా స్థిరంగా ఉన్నట్లు కనిపించే సముద్రాలు కూడా ప్రవహిస్తాయి. అనేక కారణాలతో ఆ ప్రవాహాలు నిరంతరం సాగుతుంటాయి. భూగోళాన్ని రకరకాలుగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రాంతాలవారీగా వేడెక్కుతూ, చల్లబడుతూ ఉంటాయి. ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ వర్షాల గతినీ మారుస్తుంటాయి. ఎడారులు ఏర్పడటానికీ, చేపల ఉత్పత్తి పెరగడానికీ దోహదపడుతుంటాయి. అందుకే పర్యావరణంలో అత్యంత కీలకమైన ఆ మహా ప్రవాహాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

సముద్ర జలం అధిక మొత్తంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి స్థిరంగా, నిర్ణీత దిశలో చలించడాన్ని సముద్ర ప్రవాహాలు అంటారు. ఇందుకు కారణాలు..

 

భూభ్రమణం: సముద్ర ప్రవాహాలు భూభ్రమణం వల్ల ప్రభావితమై వివిధ దిశల్లో ప్రయాణిస్తాయి. భూభ్రమణం వల్ల పవనాలు ఉత్తరార్ధ గోళంలో కుడి వైపు, దక్షిణార్ధ గోళంలో ఎడమ వైపు వీస్తాయని ‘ఫెరల్స్‌’ అనే శాస్త్రవేత్త సూత్రీకరించారు. ఈ పవనాలను అనుసరించి సముద్ర తరంగాలు ఏర్పడి కదులుతాయి.

గురుత్వాకర్షణ శక్తి: గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉన్న భూమధ్యరేఖపై సముద్ర ప్రవాహాలు కదులుతాయి. సముద్ర ప్రవాహాల పుట్టుక, చలనాలపై గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుంది.

పవనాలు: భూగోళంపై ఏర్పడే పశ్చిమ, తూర్పు వ్యాపార పవనాలు అవి వీచే దిశలో సముద్ర ప్రవాహాలను ఏర్పరుస్తాయి.

ఖండాల ఆకృతి: సముద్ర ప్రవాహాల మార్గంలో ఖండాలు ఎదురైనప్పుడు ఖండ భాగాలను ప్రవాహాలు తాకి వాటి వేగంలో, దిశలో మార్పు చెందుతాయి. అలాగే ఎత్తయిన తరంగాలు, ఖండ భాగాలను తాకి వాటి దిశ మార్చుకొని సముద్ర ప్రవాహాలుగా మారతాయి.

ఉష్ణోగ్రత వ్యత్యాసం: ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తరంగాల స్వభావాన్ని మారుస్తాయి. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఖండ భాగంపై అధిక ఉష్ణోగ్రత, సముద్ర భాగంపై తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఫలితంగా పీడనంలో తేడా వస్తుంది. ఈ మార్పులు సముద్ర ప్రవాహాలపై ప్రభావం చూపుతాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట సముద్రపు నీరు వేడెక్కి ఉష్ణ ప్రవాహాలు ఏర్పడి, అల్ప ఉష్ణోగ్రతా మండలాల వైపు అంటే ధ్రువాల వైపు పయనిస్తాయి. అతిశీతల మండలాలైన ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్యరేఖ వైపు ధ్రువపు ప్రవాహాలు పయనిస్తాయి.

పీడనం: ఉష్ణోగ్రత వ్యత్యాసాలతో పీడనంలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక, అల్పపీడన మండలాలు ఏర్పడుతాయి. పీడన వ్యత్యాసాలననుసరించి సముద్ర ప్రవాహాలు కూడా అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు ప్రయాణిస్తాయి.

సముద్ర లవణీయత: సముద్ర జల విస్తరణలో ఒకేరీతి లవణీయత కనిపించదు. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల లవణీయతలో తేడా వస్తుంది. ఎక్కువ లవణీయత ఉన్న ప్రాంతాలకు సముద్ర ప్రవాహాలు దిశలు మార్చుకుంటాయి. ఉదాహరణకు అట్లాంటిక్‌ మహాసముద్ర ఉపరితల ప్రవాహాలు మధ్యధరా సముద్రం వైపు పయనిస్తాయి. ఉపరితల అంతర్గత సముద్ర ప్రవాహాలు సముద్ర జల లవణీయత, సాంద్రత, ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏర్పడతాయి.

వర్షపాతం: వర్షాల వల్ల సముద్ర జల మట్టం, లవణీయతలో మార్పు వస్తుంది. ఈ వ్యత్యాసాలతో సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి.

రుతుపవనాలు: వీటి ప్రభావం, దిశను అనుసరించి సముద్ర ప్రవాహాలు పయనిస్తాయి.

 

రెండు రకాలు

ఉష్ణోగ్రత ఆధారంగా సముద్ర ప్రవాహాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు.

ఉష్ణ ప్రవాహాలు: ఇవి భూమధ్యరేఖ ప్రాంతంలో మొదలై ఖండాల తూర్పు తీరం వెంబడి ఉపరితల ప్రవాహంగా ధ్రువాల వైపు కదులుతాయి. వీటి కారణంగానే ఖండాల పశ్చిమతీర ప్రాంతాలతో పోలిస్తే తూర్పు తీర ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది.

శీతల ప్రవాహాలు: ఇవి ధ్రువప్రాంతాల్లో మొదలై ఖండాల పశ్చిమతీరం వెంబడి అంతర ప్రవాహంగా భూమధ్య రేఖ వైపు కదులుతాయి. వీటి కారణంగా ఖండాల తూర్పు తీర ప్రాంతంతో పోలిస్తే, ఖండాల పశ్చిమతీర ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది.

 

అట్లాంటిక్‌ సముద్ర ప్రవాహ వ్యవస్థ: దీన్ని రెండు భాగాలుగా విభజించి పరిశీలించవచ్చు. 

ఎ) ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్‌ ప్రభావం వల్ల ఇది సవ్య దిశలో తిరుగుతుంది. ఇందులో ఉష్ణ, శీతల ప్రవాహాలు రెండూ ఉంటాయి.

ఉష్ణ ప్రవాహాలు: 1) ఉత్తర భూమధ్యరేఖా ప్రవాహం 2) ఎంటలీస్‌ ప్రవాహం 3) గల్ఫ్‌ స్ట్రీమ్‌ 4) ఉత్తర అట్లాంటిక్‌ డ్రిఫ్ట్‌ 

శీతల ప్రవాహాలు: 1) గ్రీన్‌లాండ్‌ లేదా ఇరమింజల్‌ ప్రవాహం 2) కెనరీ శీతల ప్రవాహం (సహారా ఎడారి ఏర్పడేందుకు కారణం) 3) లాబ్రడార్‌ శీతల ప్రవాహం

ముఖ్యాంశాలు

* న్యూఫౌండ్‌లాండ్‌ వద్ద ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహించే లాబ్రడార్‌ శీతల ప్రవాహం గల్ఫ్‌ ప్రవాహంలో కలుస్తుంది. ఈ శీతల, ఉష్ణప్రవాహాల కలయిక వల్ల దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. దీనివల్ల సముద్రంపై నౌకా రవాణాకు ఆటంకం కలుగుతుంది. గ్రీన్‌లాండ్‌ నుంచి వచ్చే అనేక మంచుదిబ్బలు సముద్రంలో తేలుతుంటాయి. వీటిని ఓడలు ఢీకొంటే సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

* ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రాంతం - కెనడా తూర్పుతీరంలోని న్యూఫౌండ్‌లాండ్‌ దీవి వద్ద ఉన్న గ్రాండ్‌ బ్యాంక్‌ ప్రాంతం. ఇందుకు కారణాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇక్కడ ఖండతీరపు అంచు ప్రపంచంలోనే అత్యధిక వెడల్పుతో ఉంది.

* ఈ ప్రాంతంలో గల్ఫ్‌ స్ట్రీమ్‌ అనే ఉష్ణ జలరాశి, లాబ్రడార్‌ అనే శీతల జలరాశులు కలవడం వల్ల చేపలకు ఆహారంగా ఉపయోగపడే ప్లాంక్టన్స్‌ (వృక్ష ప్లవకాలు), నెక్టాన్స్‌ (జంతు ప్లవకాలు) అనే సముద్ర జీవులు ఎక్కువగా నివసిస్తాయి.

* ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో ద్వితీయస్థానంలో ఉన్న ప్రాంతం - బ్రిటన్, నార్వే తీరాల్లోని డాగర్‌ బ్యాంక్‌ ప్రాంతం. ఇందుకు కారణం..

* గ్రాండ్‌ బ్యాంక్‌ తర్వాత ఇక్కడి ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుతో ఉంటుంది.

* ఉత్తర అట్లాంటిక్‌ డ్రిఫ్ట్‌ అనే ఉష్ణప్రవాహం, ఇరమింజల్‌/గ్రీన్‌లాండ్‌ శీతల ప్రవాహాలు కలవడం.

* బ్రిటన్, నార్వే తీర ప్రాంతాల మీదుగా ఉత్తర అట్లాంటిక్‌ డ్రిఫ్ట్‌ అనే ఉష్ణప్రవాహం కదులుతుంది. అందువల్లే శీతాకాలంలోనూ ఆ ప్రాంత జలరాశి గడ్డకట్టకుండా నౌకాయానానికి వీలుగా ఉంటుంది. అక్కడి వాతావరణాన్ని వేడి చేసి ఉష్ణోగ్రతలను యథాతథ స్థితిలోకి తీసుకొస్తున్న ఈ ప్రవాహాన్ని ‘ఐరోపా శీతాకాల దుప్పటి’ అంటారు.


బి) దక్షిణ అట్లాంటిక్‌ సముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్‌ ప్రభావం వల్ల ఇది అపసవ్య దిశలో తిరుగుతుంది. ఇందులో ఉష్ణ, శీతల ప్రవాహాలు ఉంటాయి.

ఉష్ణ ప్రవాహాలు: 1) దక్షిణ అట్లాంటిక్‌ భూమధ్యరేఖా ప్రవాహం 2) బ్రెజీలియన్‌ ఉష్ణప్రవాహం 

శీతల ప్రవాహాలు: 1) పశ్చిమపవన డ్రిఫ్ట్‌ 2) ఫాక్‌లాండ్‌ ప్రవాహం. 3) బెనిగ్వులా ప్రవాహం (కలహరి ఎడారి ఏర్పడేందుకు కారణం)

ముఖ్యాంశాలు: 1) అంటార్కిటికా ప్రాంతం నుంచి వీచే ధ్రువ పవనాల ప్రభావం వల్ల ఫాక్‌లాండ్‌ శీతల ప్రవాహం పుడుతుంది. 2) అర్జెంటీనా ఆగ్నేయతీరంలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉండటానికి కారణం అక్కడ కలుసుకొనే బ్రెజీలియన్‌ ఉష్ణప్రవాహం, బెనిగ్వులా ప్రవాహాల కలయిక వల్ల ప్లాంక్టాన్స్, నెక్టాన్స్‌ పరిమాణం అధికంగా ఉండటం.


పసిఫిక్‌ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: దీన్ని రెండు రకాలుగా విభజించవచ్చు.

ఎ) ఉత్తర పసిఫిక్‌ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్‌ ప్రభావం వల్ల ఈ ప్రవాహ వ్యవస్థ సవ్యదిశలో తిరుగుతుంది. ఇందులో ఉష్ణ, శీతల ప్రవాహాల తీరు ఈ విధంగా ఉంది.

ఉష్ణ ప్రవాహాలు: 1) ఉత్తర పసిఫిక్‌ భూమధ్యరేఖా ప్రవాహం 2) కురుషివో ప్రవాహం 3) శుషిమా ప్రవాహం 4) కురుషివో ఎక్స్‌టెన్షన్‌ ప్రవాహం

శీతల ప్రవాహాలు: 1) ఉత్తర పసిఫిక్‌ డ్రిఫ్ట్‌ 2) ఒయాషియా లేదా కాంచెట్కా ప్రవాహం 3) ఏలూషియన్‌ ప్రవాహం 4) కాలిఫోర్నియా ప్రవాహం (మొజావే, సోనారన్‌ ఎడారులు ఏర్పడటానికి కారణం)

ముఖ్యాంశాలు: * ఒయాషియా జలరాశి, ఉత్తర పసిఫిక్‌ థ్రిఫ్ట్‌ కలవడం వల్ల అది శీతల ప్రవాహంగా మారుతుంది. * జపాన్‌ తీరంలో కురుషివో ఎక్స్‌టెన్షన్, ఒయాషియా ప్రవాహాలు కలవడం వల్ల ఆ దేశం చేపల ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉంది.


బి) దక్షిణ పసిఫిక్‌ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్‌ ప్రభావం వల్ల ఈ ప్రవాహ వ్యవస్థ అపసవ్య దిశలో తిరుగుతుంది. ఇందులో ఉష్ణ, శీతల ప్రవాహాల తీరు ఈ విధంగా ఉంది.

ఉష్ణ ప్రవాహాలు: 1) దక్షిణ పసిఫిక్‌ భూమధ్యరేఖా ప్రవాహం 2) తూర్పు ఆస్ట్రేలియన్‌ ప్రవాహం 3) క్రామ్‌ వెల్‌ ప్రవాహం 4) ఎల్‌ నినో ప్రవాహం

శీతల ప్రవాహాలు:  1) పశ్చిమ పవన డ్రిఫ్ట్‌ 2) పెరూవియన్‌ లేదా హంబోల్డ్‌ ప్రవాహం (అటకామా ఎడారి ఏర్పడటానికి కారణం)

ముఖ్యాంశాలు: * పెరూవియన్‌ ప్రవాహం అంటార్కిటికా ప్రాంతం నుంచి వీచే బ్లిజార్డ్స్‌ ప్రభావం వల్ల శీతల ప్రవాహంగా మారుతుంది.* ఎల్‌ నినో అంటే పెరూ తీరప్రాంతంలో ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పసిఫిక్‌ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. ఎల్‌ నినో అనేది స్పానిష్‌ (లాటిన్‌) పదం. లాటిన్‌ భాషలో ఎల్ని అంటే క్రీస్తు శిశువు జననం. దీని కారణంగా భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.* లా నినో అంటే పెరూ తీర ప్రాంతంలో వేడెక్కిన జలరాశి చల్లబడే ప్రక్రియ. దీనికారణంగా భారత్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. లా నినో అనే లాటిన్‌ పదానికి అర్థం ఆడశిశువు జననం. * ఎల్‌ నినో, లా నినో రెండింటినీ ‘విరుద్ధ కవల పిల్లలు’గా పిలుస్తారు.

 

3) హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: ఈ ప్రవాహ వ్యవస్థను రెండు భాగాలుగా విభజించి పరిశీలించవచ్చు.

ఎ) ఉత్తర హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్, రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ప్రవాహ వ్యవస్థ ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్‌ ప్రవాహ వ్యవస్థలకు భిన్నంగా అపసవ్య దిశలో తిరుగుతుంది. రుతుపవనాలు అస్థిర పవనాలు అయినందున ఉత్తర హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ ఏడాదంతా ఉండకుండా, నిర్దిష్ట రుతువులో మాత్రమే ఉంటుంది. మిగిలిన సమయంలో ఉత్తర హిందూ మహాసముద్ర జలరాశి నిశ్చలంగా ఉంటుంది. ఇందులోని ఉష్ణ, శీతల ప్రవాహాల తీరు కింది విధంగా ఉంది.

ఉష్ణ ప్రవాహాలు: 1) ఈశాన్య రుతుపవన డ్రిఫ్ట్‌ 2) నైరుతి రుతుపవన డ్రిఫ్ట్‌

శీతల ప్రవాహాలు: 1) సొమాలియన్‌ శీతల ప్రవాహం

ముఖ్యంశాలు: 1) ఈశాన్య రుతుపవన డ్రిఫ్ట్‌ వల్ల దేశంలో అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం - తమిళనాడు. 2) నైరుతి రుతుపవన డ్రిఫ్ట్‌ వల్ల తమిళనాడు మినహాయించి మిగిలిన ప్రాంతమంతా వర్షాన్ని పొందుతుంది.

బి) దక్షిణ హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: కోరియాలిస్‌ ప్రభావం వల్ల ఇది అపసవ్య దిశలో తిరుగుతుంది. ఇందులోని ఉష్ణ, శీతల ప్రవాహాల తీరు కింది విధంగా ఉంది.

ఉష్ణ ప్రవాహాలు: 1) దక్షిణ హిందూ మహాసముద్ర భూమధ్యరేఖా ప్రవాహం 2) మడగాస్కర్‌ ప్రవాహం 3) మొజాంబికన్‌ ప్రవాహం 4) అగులోస ప్రవాహం

శీతల ప్రవాహాలు: 1) పశ్చిమ పవన డ్రిఫ్ట్‌ 2) పశ్చిమ ఆస్ట్రేలియన్‌ ప్రవాహం (విక్టోరియన్, గిబ్బన్‌ ఎడారులు ఏర్పడేందుకు కారణం)

రచయిత: జయకర్‌ సక్కరి

Posted Date : 02-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌