• facebook
  • whatsapp
  • telegram

సముద్ర వనరులు - ఆర్థిక ప్రాధాన్యత

మానవాళికి నీరు అతి ముఖ్యమైంది. నీటితో కప్పి ఉన్న భూ ఉపరితల ప్రాంతాన్నే జలావరణం అంటారు. భూమిపై సుమారు 71% నీరు ఆవరించి ఉంది.

* ఓజోన్‌ పొర క్షీణించడం, గ్లోబల్‌ వార్మింగ్‌ ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. దీంతో సముద్రాల నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం జలావరణం 79 శాతానికి చేరినట్లు శాస్త్రవేత్తల అంచనా.

* భూమిపై కప్పి ఉన్న జలావరణాన్ని స్థూలంగా మహాసముద్రాలు, సముద్రాలుగా పిలుస్తారు. భూపలకల చలనాల వల్ల ఖండాలకు ఒకవైపు లేదా రెండు ఖండాల మధ్య ఉప్పు నీటితో కూడిన విశాల జల భాగాలను మహాసముద్రాలు అంటారు.

* ప్రపంచంలో మొత్తం 5 మహాసముద్రాలు ఉన్నాయి. అవి: పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్‌. వీటిలో అతి పెద్దది పసిఫిక్, అతి చిన్నది ఆర్కిటిక్‌. 

* ఖండాలు, మహాసముద్రాల మధ్య భూమి/ నీటితో పరివేష్టితమైన జలభాగాలను సముద్రాలు అంటారు. 

* ప్రపంచంలోనే అతిపెద్ద భూపరివేష్టిత సముద్రం - మధ్యధరా.

సముద్ర వనరులు

* సముద్రాల్లోని ఆల్గే, ప్లవకాల ద్వారా 25% ప్రాణవాయువు వాతావరణంలోకి  విడుదల అవుతోంది. మానవులకు 17% ఆహార ఉత్పత్తులు సముద్ర వనరుల నుంచే లభిస్తున్నాయి. వీటిలో అనేక జంతువులు, వృక్షాలు, ఖనిజ వనరులు ఉన్నాయి.

* ఇటీవలి కాలంలో సముద్ర జలాలు  బాగా కలుషితం అవుతున్నాయి. జీవ, పారిశ్రామిక వ్యర్థాలు ఆ నీటిలో కలవడమే దీనికి కారణం. వీటివల్ల నత్రజని ఎరువులు నీటిలో కలుస్తున్నాయి. దీంతో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి అనేక జీవజాతులు నశిస్తున్నాయి. దీనివల్ల సముద్రాల్లో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతోంది. దీన్నే ‘బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌’ అంటారు. 

* సముద్రాల్లోని జీవరాశులను ప్లవకాలు అంటారు. వీటిలో వృక్ష సంబంధమైనవి ‘ప్లైటో ప్లవకాలు’; జంతు సంబంధమైనవి ‘జూ ప్లవకాలు’.

* సముద్ర ఉపరితలం నుంచి 180 మీటర్ల లోతు వరకు, 30ాది ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ప్రవాళభిత్తికలు జీవిస్తాయి. ఇవి కాల్షియం కార్బొనేట్‌ను ఆహారంగా తీసుకుంటాయి. వీటిలో తీరాంచల భిత్తికలు, అవరోధ భిత్తికలు, ఆటొల్స్‌ అనే మూడు రకాలు ఉంటాయి.

* సముద్రాల్లో ఉండే మరో ముఖ్యమైన వనరు ఖనిజ శక్తి. ఇవి నిరంతరం ఏర్పడుతూనే ఉంటాయి. ఒక ఘనపు కిలోమీటరు నీటిలో 1.15 బిలియన్‌ టన్నుల నీరు, 40.2 మిలియన్‌ టన్నుల ఘన పదార్థాలు ఉంటాయని అంచనా.

* సముద్రాల్లో ప్రధానంగా ఉప్పు, ఫాస్ఫేట్, జిప్సం, మెగ్నీషియం, జింక్, క్రోమియం, కోబాల్ట్, రాగి, నికెల్, వెండి, బంగారం, సహజ వాయువు, మీథేన్, ముత్యాలు, చమురు, పెట్రోలియం మొదలైనవి ఉంటాయి. 

  ఉదా: హిందూ మహాసముద్రంలో క్రోమియం, నికెల్, కోబాల్ట్‌; యాడ్రియాటిక్‌లో మీథేన్‌; ఎర్రసముద్రంలో బంగారం, రాగి; అరేబియాలో చమురు, సహజ వాయువు; బంగాళాఖాతంలో ఉప్పు, జిప్సం, ఫాస్ఫేట్‌ లభిస్తున్నాయి.

ఆర్థిక ప్రాధాన్యత

 భూమిపై ఉన్న సుమారు 174 దేశాలు సముద్రాలు, తీర ప్రాంతాలతో అనుసంధానమై  ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నాయి.

* ప్రపంచంలో సుమారు మూడు బిలియన్లకు పైగా ప్రజలు తమ జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడుతున్నారు. ఈ సంఖ్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధికంగా ఉంది. ఈ దేశాల్లో పర్యటకం, చేపల వేట లాంటి సముద్ర ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.

* ఓషియన్‌ ఎకానమీ అండ్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ (OECD) అంచనా ప్రకారం మహాసముద్రాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. 

* తీరప్రాంత పరంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాలు సముద్రాల ఆర్థిక ప్రయోజనాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ దేశాలకు జీడీపీలో 10%, పర్యటకంలో 20% నుంచి 50%, ఉపాధి కల్పనలో 30% పైగా వాటా సముద్రాల నుంచే లభిస్తోంది.

* మహాసముద్రాల ఆర్థిక సహకార సంస్థ, నార్వే తదితర దేశాలు సముద్ర ప్రాదేశిక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. 

* టాంజానియాలోని జాంజిబార్‌లో చేపల వేటను, సముద్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వం భావించింది. దీని కోసం ఆ ప్రదేశాన్ని రక్షిత ప్రాంతంగా, చుంబే ద్వీపాన్ని పగడపు ఉద్యానవనంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

* భారతదేశానికి 1980లో సముద్రాల ద్వారా  సగటున 6  7% ఆదాయం లభించింది.  2014లో ఈ వాటా 10 శాతానికి (78 ట్రిలియన్‌ డాలర్లక్) పెరిగింది.

* 202125 కాలానికి జాతీయ మహాసముద్ర, వాతావరణ పరిపాలన (NOAA) నీలి ఆర్థిక వ్యూహాత్మక ప్రణాళికను విడుదల చేసింది.

* భారతదేశంలో 2.02 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ), 8000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, విభిన్న సముద్ర జీవ వనరులు ఉన్నాయి.

* జీవనోపాధిని మెరుగుపరిచేందుకు దేశంలోని సముద్ర, ఇతర జల వనరుల నుంచి సంపద వినియోగంపై దృష్టి సారించేలా ‘బ్లూ గ్రోత్‌ ఇనీషియేటివ్‌’ (నీలి వృద్ధి చొరవ)ను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

* భారతీయ తీరప్రాంతంలో సముద్ర మత్స్య సంపద వార్షికంగా 4.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అంచనా.

* మన సముద్ర జలాల్లో కోబాల్ట్, జింక్, మాంగనీస్‌ లాంటి అరుదైన ఖనిజాలు పెద్దమొత్తంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీలో వీటిని  ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ఖనిజాలు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను సాకారం చేసేందుకు దోహదపడుతున్నాయి.

* తీరప్రాంతాల్లోని ప్రధాన శక్తివనరులైన పెట్రోలియం, గ్యాస్‌ హైడ్రేట్లను అనేక ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు.

* సముద్రపు నీటిలోని జిప్సం, సాధారణ ఉప్పు లాంటివి ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి.

* సుస్థిరాభివృద్ధి పరంగా హిందూ మహా సముద్రం నుంచి వచ్చే వనరులు భారతదేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. 2022 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

* శక్తి భద్రత కోసం కొత్త వనరులను అందిస్తున్నాయి. 

  ఉదా: గ్యాస్‌ హైడ్రేట్లు

* సుస్థిరాభివృద్ధి లక్ష్యం (ఎస్‌డీజీ)లో 14వ అంశం ‘సుస్థిరాభివృద్ధి కోసం సముద్ర వనరుల సంరక్షణ’. దీన్ని సాధించేందుకు సముద్ర వనరులను స్థిరంగా ఉపయోగించుకోవాలని భారత్‌ పిలుపునిచ్చింది.

* సుస్థిరాభివృద్ధిలో భాగంగా మహాసముద్రాలు, సముద్ర వనరుల నియంత్రిత వినియోగం లక్ష్యంగా భారత్‌ ‘O-SMART’ పథకాన్ని ప్రారంభించింది.

సుస్థిరాభివృద్ధి 14వ లక్ష్యంలో నిర్ధారించిన 10 ఉపలక్ష్యాలు

i) సముద్ర కాలుష్యాన్ని తగ్గించడం.

ii) పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం. 

iii) సముద్ర ఆమ్లీకరణ.

iv) స్థిరమైన చేపల వేట.

v) తీర, సముద్ర ప్రాంతాలను రక్షించడం.

vi) ఉపరితల చేపల ఉత్పత్తి.

vii) సముద్ర వనరుల స్థిరమైన వినియోగం.

viii) శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచడం.

ix)  చిన్నతరహా మత్స్యకారులకు మద్దతు ఇవ్వడం.

x) అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని అమలు చేయడం.

సముద్ర వనరులపై అవగాహన 

* సముద్ర పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించడం, శాస్త్ర-సాంకేతిక ప్రాజెక్టులకు మద్దతునివ్వడం, పర్యావరణంపై గౌరవం లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘బార్సిలోనా ఫౌండేషన్‌ ఫర్‌ ఓషియన్‌’ను ఏర్పాటు చేశారు.

* పర్యావరణంలో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘ప్లాస్టిక్‌ ఓషియన్స్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు.

* యునెస్కో - ఐఓసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ప్రముఖ చిత్ర నిర్మాతలు సముద్రాలపై ఒక శక్తిమంతమైన సముద్ర డాక్యుమెంటరీని రూపొందించారు.

సముద్ర సంస్థలు 

అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO):

అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌)ను 1948లో స్థాపించారు. 1959 నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

* ఇది యూఎన్‌ఓ ప్రత్యేక ఏజెన్సీ. ఇందులో ప్రస్తుతం 174 సభ్యదేశాలు ఉన్నాయి.

* దీని ప్రధాన కార్యాలయం లండన్‌ (యునైటెడ్‌ కింగ్‌డమ్‌)లో ఉంది.

యునెస్కో - ఐఓసీ:

* ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఓషనోగ్రఫిక్‌ కమిషన్‌ (IOC)ను యునెస్కో 1960లో స్థాపించింది. ఇందులో 150 దేశాలున్నాయి.

* దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO): సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని 14వ అంశమైన ‘మహాసముద్రాల పర్యావరణ క్షీణతకు పరిష్కారం’ అమలుకు డబ్ల్యూటీఓ కృషి చేస్తోంది. దీనికోసం ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక ప్రయత్నాలకు మద్దతిస్తుంది.

* దీన్ని 1948లో స్థాపించారు. మొదట్లో దీన్ని జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌గా (GATT) వ్యవహరించేవారు. 1995, జనవరి 1 నుంచి ఇది డబ్ల్యూటీఓగా రూపొందింది. ఇందులో 164 సభ్య దేశాలు ఉన్నాయి.

* ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌). 

హిందూ మహాసముద్ర రిమ్‌ అసోసియేషన్‌ 

(IORA): హిందూ మహాసముద్ర రిమ్‌ అసోసియేషన్‌ (IORA)ను గతంలో హిందూ మహాసముద్ర రిమ్‌ ఇనీషియేటివ్, ఇండియన్‌ ఓషియన్‌ రిమ్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కో ఆపరేషన్‌ (IOR - ARC)అని పిలిచేవారు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. 

* హిందూ మహాసముద్రం సరిహద్దుగా ఉన్న 23 దేశాలు ఇందులో ఉన్నాయి.

* IORA అనేది ఒక ప్రాంతీయ ఫోరం. దీని సమన్వయ సచివాలయ కార్యాలయం మారిషస్‌లోని ఎబేన్‌లో ఉంది.

సముద్ర వనరులు - ఐక్యరాజ్యసమితి పాత్ర:

* సుస్థిరాభివృద్ధి సాధన కోసం 2015లో ఐక్యరాజ్యసమితి 17 లక్ష్యాలను సూచించింది. ఇందులో 14వ లక్ష్యం ‘నీటి దిగువ జీవితం’ (Water Below Life/ Life Below Waterz).

* ఇందులో మహాసముద్రాలు, సముద్రాల సంరక్షణ, వనరులను నిలకడగా ఉపయోగించడం లాంటి వాటిని 2030 నాటికి సాధించాలని సూచించింది.

 

రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి, విషయ నిపుణులు 

Posted Date : 01-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌