• facebook
  • whatsapp
  • telegram

వాయు మార్గాలు

ఆర్థిక ప్రగతికి ఆకాశ మార్గాలు!

 

ఎంత ఎక్కువ దూరానికైనా అతి తక్కువ సమయంలో చేరుతుంది. రోడ్లు, రైళ్లు లేని ప్రాంతాలకూ సులువుగా వెళ్లిపోతుంది. కొండలు, గుట్టలు, పర్వతాలు, లోయలు, నదులు, సముద్రాలను సైతం సునాయాసంగా దాటిపోతుంది. ఆధునిక జీవన విధానంలో అతి ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పెద్ద ఎత్తున ప్రయాణికులను, సరకులను రవాణా చేస్తూ ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి అత్యంత కీలకంగా నిలిచింది. అదే విమానయాన రంగం. జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా ఆ లోహ విహంగ ప్రయాణాలకు సంబంధించిన వాయు మార్గాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

 

వేగవంతమైన, ఖరీదైన రవాణా మార్గం విమానయానం. రోడ్లు, రైళ్లు చేరుకోలేని దట్టమైన అటవీ ప్రాంతాలు, ఎత్తుపల్లాలతో ఉండే పర్వతాలు, లోయలు, సముద్ర, ద్వీప ప్రాంతాలను చేరుకోడానికి ఉపయోగించే విధానం. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో (వరదలు, భూకంపాలు, అంటువ్యాధులు, యుద్ధ సమయాల్లో) ఎక్కడికైనా వేగంగా వెళ్లవచ్చు. అంతే కాకుండా భారతదేశ వాతావరణ పరిస్థితులు కూడా (మేఘాలు, మంచు, శీతాకాల పొగమంచు వంటివి తక్కువగా ఉండటం) ఈ ప్రయాణానికి చాలా అనుకూలం.

 

1911లో మొదటి వాణిజ్య పౌర విమానం అలహాబాదు నుంచి నైనిటాల్‌ వరకు మొదటి పోస్టల్‌ సర్వీస్‌ కోసం ప్రారంభమైంది. 1929 - 30ల్లో బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్‌వారు వాయు రవాణా సేవలను మొదలుపెట్టారు. 1933లో ఇండియన్‌ నేషనల్‌ ఎయిర్‌వేస్‌ ప్రారంభమైంది. ఇది కరాచి - లాహోర్‌ మధ్య మొదటి సర్వీసును మొదలుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం కరాచీ, బొంబాయి, దిల్లీ, కలకత్తా, లాహోర్‌ ఇంకా ఇతర ముఖ్య ప్రాంతాలకు వాయు రవాణా సేవలను ప్రారంభించారు. 1947 నాటికి దేశంలో నాలుగు కంపెనీలు వాయు రవాణా సేవలను అందిస్తున్నాయి. అవి 1) టాటాసన్స్‌ (నాటి ఎయిర్‌ ఇండియా) 2) ఇండియన్‌ నేషనల్‌ ఎయిర్‌వేస్‌  3) ఎయిర్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ ఇండియా 4) దక్కన్‌ ఎయిర్‌ వేస్‌. 

 

1951 నాటికి మరో నాలుగు కంపెనీలు ఏర్పడ్డాయి. అవి 1) భారత ఎయిర్‌ వేస్‌ 2) హిమాలయన్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ 3) ఎయిర్‌ వేస్‌ ఇండియా 4) కళింగ ఎయిర్‌ లైన్స్‌. 

 

1953లో భారతీయ వాయు రవాణా రంగాన్ని జాతీయం చేశారు. అప్పుడు రెండు కార్పొరేషన్‌లు ఏర్పడ్డాయి. 1) ఎయిర్‌ ఇండియా 2) ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ 

 

ఎయిర్‌ ఇండియా సంస్థను స్థాపించినవారు జేఆర్డీ టాటా. ఈయనను భారతదేశ విమానయాన పితామహుడు అంటారు. 

 

దేశంలో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణ విధానాలు వాయు రవాణాను అభివృద్ధి చేసి వాటి రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం దేశంలో వాయు రవాణా అభివృద్ధి గణనీయంగా ఉంది. అందుకు కారణం విశాలమైన భూభాగం, దేశం నలువైపులా విస్తరించి ఉన్న అధిక జనాభా, ప్రజల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి. అందుకే నేడు దేశ వాయు రవాణా రంగాన్ని ‘సన్‌రైజ్‌’ సెక్టారుగా అభివర్ణిస్తున్నారు. ఈ మధ్య దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్‌ పరంగా భారతదేశ వాయు రవాణా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు దేశంలో ఉన్న వాయు రవాణా కంపెనీలు ఎయిర్‌ ఇండియా లిమిటెడ్, అలయన్స్‌ ఎయిర్, ఎయిర్‌ ఇండియా చార్టర్స్‌ లిమిటెడ్, జెట్‌ ఎయిర్‌వేస్, జెట్‌లైట్‌ ఎయిర్‌ లైన్స్, గో ఎయిర్‌ లైన్స్‌ (ఇండిగో) ప్రైవేట్‌ లిమిటెడ్, స్పైస్‌ జెట్‌ లిమిటెడ్, ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ లిమిటెడ్, ఎయిర్‌ ఆసియా మొదలైనవి. 

 

ఎయిర్‌ ఇండియా: ఇది దేశంలోని ప్రధాన నగరాల నుంచి వివిధ దేశాల ముఖ్య నగరాలకు రవాణా సేవలను అందిస్తోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, యూరప్, రష్యా, మధ్య  ప్రాచ్య‌ దేశాలైన దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం 1953లో స్వాధీనం చేసుకున్నప్పటికీ, 2022 జనవరిలో తిరిగి టాటాలకు అప్పగించింది.  

 

ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌: ఇది దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల ప్రజలకు, వస్తు సేవల రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా పొరుగున ఉన్న 12 దేశాలకు కూడా విమాన రవాణా సేవలను అందిస్తోంది.

 

వాయుదూత్‌: ఇది దేశంలోని మారుమూల ప్రాంతాలకు, త్వరగా చేరుకోలేని ప్రదేశాలకు వాయు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. 1981లో దీని సేవలు ప్రారంభమయ్యాయి. మొదట ఈశాన్య రాష్ట్రాల్లో 14 ప్రాంతాలకు సేవలను అందించింది. తర్వాత దేశంలో మొత్తం 23 కేంద్రాలకు విస్తరించింది. 

 

పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌: దీన్ని 1985లో ప్రారంభించారు. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, ఎన్‌రాన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ముంబయి హై మొదలైన ప్రాంతాలకు, దేశంలోని ఇతర మారుమూల ప్రదేశాలకు హెలికాప్టర్‌ సర్వీసులను అందిస్తుంది. 

 

ప్రైవేటు రంగం: ప్రైవేటు రంగంలో ఎయిర్‌ టాక్సీలను 1990లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ గుత్తాధిపత్యానికి తెరపడింది. 

 

ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా: ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కలిసి 1995లో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాగా మారాయి. సురక్షితమైన, నిరంతర వాయు రవాణాను అందించడం, ఎయిర్‌ ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం దీని విధి. ప్రస్తుతం దేశంలో సుమారు 487 ఎయిర్‌ పోర్టులు/ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉంంటే, వాటిలో 37 అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులు/ ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి.

 

ఉడాన్‌: ఈ పథకాన్ని 2016, అక్టోబరులో ప్రారంభించారు. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడటం, మారుమూల పట్టణాలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యం. ఒక గంట ప్రయాణ దూరాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం మరో ముఖ్య ఉద్దేశం. ఉడాన్‌ పథకం కింద 70 ఎయిర్‌ పోర్టులు, 128 మార్గాలను ఎన్నుకున్నారు. 100కు పైగా కొత్త ఎయిర్‌పోర్టులు లేదా వినియోగించకుండా ఉన్నవాటిని అందుబాటులోకి తేవడం దీని ప్రధాన లక్ష్యం. ఉడాన్‌ పథకం కింద ఉన్న ఎయిర్‌ పోర్టులు, విమానాల మార్గాలకు కొన్ని కొత్త రాయితీలను కల్పించారు. 

 

నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ పాలసీ (2016): స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 2016, జూన్‌ 15న ఈ పాలసీని ప్రకటించారు. దీని ద్వారా విమానయాన రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపడతారు. ఈ రంగం అభివృద్ధికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు. సమతౌల్య ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతారు. ఎక్కువ మందికి విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం, దానికోసం విమాన ఛార్జీలు అందుబాటులోకి తేవడం, విమాన టికెట్ల బుకింగ్‌ విధానాన్ని సులభతరం చేయడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. 2027 నాటికి 50 కోట్ల దేశీయ టికెట్లు, 20 కోట్ల అంతర్జాతీయ విమాన టికెట్లు అమ్మడం లక్ష్యం.

 

ముఖ్యాంశాలు

దేశంలో అతిపెద్ద విమానాశ్రయం - ఇందిరాగాంధీ ఎయిర్‌ పోర్ట్‌ (న్యూదిల్లీ) 

దేశంలో అతి చిన్న విమానాశ్రయం - తిరుచిరాపల్లి (తమిళనాడు) 

పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంలో వచ్చిన మొదటి విమానాశ్రయం - కొచ్చిన్‌ 

అత్యంత పురాతన విమానాశ్రయం - జుహు ఏరోడ్రోమ్‌ (ముంబయి) 

దేశంలో అత్యంత ఎత్తయిన విమానాశ్రయం - కుశోక్‌ బకుల రింపోచి విమానాశ్రయం (లద్దాఖ్‌) 

విమానయాన అధ్యయనాన్ని ఏరోనాటిక్స్‌ అంటారు. 

1990 ఏప్రిల్‌లో విమానయానంలో ఓపెన్‌ స్కై పాలసీని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రైవేటు ఎయిర్‌ వేస్‌ సేవలు మొదలయ్యాయి. 

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌లో ఉంది. ఇది గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం. దీన్ని బూట్‌ పద్ధతిలో నిర్మించారు. 

ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం - కేరళ.

ఎక్కువ విమానాశ్రయాలున్న రాష్ట్రం - గుజరాత్‌. 

ఆసియా, పసిఫిక్‌ ప్రాంతపు మొదటి కర్బన తటస్థ విమానాశ్రయం - ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (దిల్లీ). 

అధిక రద్దీ ఉన్న భారత విమానాశ్రయం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (కోల్‌కతా) 

తూర్పు చివరన ఉన్న ఎయిర్‌ పోర్ట్‌ - తులిహల్‌ విమానాశ్రయం (ఇంఫాల్‌) 

దక్షిణ భారతదేశంలో రద్దీ ఉన్న విమానాశ్రయం - కోయంబత్తూర్‌ (తమిళనాడు) 

ప్రపంచంలో సౌరశక్తి మీద ఆధారపడి పనిచేస్తున్న మొదటి విమానాశ్రయం - కొచ్చిన్‌ (కేరళ) 

దేశంలో పశ్చిమం చివరన ఉన్న ఎయిర్‌ పోర్ట్‌ - సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయం (అహ్మదాబాద్‌) 

ఉత్తరం చివరన ఉన్న విమానాశ్రయం - షేక్‌ ఉల్‌ ఆలం (శ్రీనగర్‌) 

దేశంలో మొదటి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నెలకొల్పిన గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - రాజీవ్‌గాంధీ (శంషాబాద్‌) 

భారతదేశ దేశీయ వాయు రవాణా మార్కెట్‌ ప్రపంచంలో 3వ అతిపెద్ద మార్కెట్‌ (అమెరికా, చైనా వరుసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి.) 

 

భారత దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు 

1. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  - హైదరాబాద్‌ (తెలంగాణ)

2. శ్రీగురు రాందాస్‌ జీ అంతర్జాతీయ విమానాశ్రయం - అమృత్‌సర్‌ (పంజాబ్‌)

3. లోక్‌ప్రియ గోపీనాథ్‌ బార్‌దోలాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - గువాహటి (అస్సాం) 

4. బీజు పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - భువనేశ్వర్‌ (ఒడిశా)

5. గయ అంతర్జాతీయ విమానాశ్రయం - గయ (బిహార్‌) 

6. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - న్యూదిల్లీ 

7. వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - పోర్ట్‌ బ్లెయర్‌ (అండమాన్‌ నికోబార్‌ దీవులు) 

8. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - అహ్మదాబాద్‌ (గుజరాత్‌) 

9. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం - బెంగళూరు (కర్ణాటక) 

10. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం - మంగళూరు (కర్ణాటక) 

11. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కొచి (కేరళ)

12. కాలికట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కోచికోడ్‌ (కేరళ) 

13. త్రివేండ్రం (నిడుంబస్సెరీ) అంతర్జాతీయ విమానాశ్రయం - తిరువనంతపురం (కేరళ) 

14. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ (శాంతాక్రాజ్‌) అంతర్జాతీయ విమానాశ్రయం - ముంబయి (మహారాష్ట్ర)

15. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర)

16. జైపుర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - జైపుర్‌ (రాజస్థాన్‌) 

17. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం) - చెన్నై (తమిళనాడు) 

18. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం - తిరుచిరాపల్లి (తమిళనాడు) 

19. చౌదరి చరణ్‌ సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్‌) 

20. లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం - వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్‌) 

21. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌) 

22. కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కన్నూర్‌ (కేరళ) 

23. సూరత్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - సూరత్‌ (గుజరాత్‌) 

24. దేవి అహల్యాబాయి హోల్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇందౌర్‌ (మధ్యప్రదేశ్‌) 

25. దబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం - దబోలిం (గోవా) 

26. కోయంబత్తూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం  - కోయంబత్తూర్‌ (తమిళనాడు)   

27. షేక్‌ - ఉల్‌ - ఆలమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - శ్రీనగర్‌ (జమ్ము కశ్మీర్‌) 

28. ఇంఫాల్‌ (తులిహాల్‌) అంతర్జాతీయ విమానాశ్రయం  - ఇంఫాల్‌ (మణిపుర్‌) 

29. మధురై అంతర్జాతీయ విమానాశ్రయం - మధురై (తమిళనాడు) 

30. బాగ్‌దోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయం - సిలిగురి (పశ్చిమ బెంగాల్‌) 

31. షహీద్‌ భగత్‌ సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - చండీగఢ్‌ (పంజాబ్‌/ హరియాణ) 

32. నాసిక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - నాసిక్‌ (మహారాష్ట్ర) 

33. వడోదర అంతర్జాతీయ విమానాశ్రయం - వడోదర (గుజరాత్‌) 

34. కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కుషినగర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)  

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌
 

Posted Date : 25-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌