• facebook
  • whatsapp
  • telegram

వాహక నౌకల సాంకేతికత

అంతరిక్షంలో ఎదురులేని ఇస్రో గుర్రం!

ప్రపంచంలో చాలా దేశాలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు తమ సొంత ఉపగ్రహాలను తయారు చేసుకుంటున్నాయి. కానీ వీటిని కక్ష్యలో ప్రవేశపెట్టే వాహక నౌకలు/రాకెట్‌లు అతికొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి. వాటిలో మన దేశం ఒకటి. భారత్‌కి సంబంధించి ప్రధానంగా పీఎస్‌ఎల్వీ రాకెట్‌ అత్యధిక విజయాలు నమోదు చేసి అంతరిక్షంలో ఎదురు లేనిని ఇస్రో గుర్రంగా పేరుపొందింది. ఈ రాకెట్‌ టెక్నాలజీ విశేషాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

 

  వాహక నౌకలను రాకెట్‌లు అని కూడా అంటారు. ఇవి ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెడతాయి. భారతదేశం ఇప్పటివరకు నాలుగు రకాల వాహక నౌకలను అభివృద్ధి చేసింది. అవి ఎస్‌ఎల్వీ, ఏఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ. వీటిలో ప్రస్తుతం పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ వాడుకలో ఉన్నాయి.

  ఎస్‌ఎల్వీ (శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌): ఇది భారతదేశ మొదటి వాహక నౌక. ఈ రాకెట్‌ 40 కి.గ్రా. బరువున్న ఉపగ్రహాలను 305 కి.మీ. భూ దిగువ కక్ష్య (లో ఎర్త్‌ ఆర్బిట్‌)లోకి ప్రవేశపెడుతుంది. దీనిలో నాలుగు దశల ఘన ఇంధనం ఉంటుంది. భారతదేశం మొదట పరీక్షించిన వాహకనౌక ఎస్‌ఎల్వీ-3ఇ1. దీనిలో రోహిణి టెక్నాలజీ పెలోడ్‌ను ఉంచారు. 1979, ఆగస్టు 10న దీన్ని పరీక్షించారు. అయితే ఈ పరీక్ష విఫలమైంది. ఎస్‌ఎల్వీ-3ఇ2 ను 1980, జులై 18న పరీక్షించారు. దీని ద్వారా ఆర్‌ఎస్‌-1 (రోహిణి శాటిలైట్‌-1)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైంది.

  ఏఎస్‌ఎల్వీ (ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌): ఈ వాహక నౌక 400 కి.మీ. కక్ష్యలో 150 కి.గ్రా. బరువున్న ఉపగ్రహాలను ప్రవేశపెడుతుంది. దీనిలో అయిదు దశల్లో ఘన ఇంధనం ఉంటుంది. ఏఎస్‌ఎల్వీ మొదటి వాహకనౌక ఏఎస్‌ఎల్వీ-డీ…1. దీనిలో ఎస్‌ఆర్‌ఓఎస్‌ఎస్‌-1 ఉపగ్రహాన్ని ఉంచారు. 1987, మార్చి 24న చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. మొదటగా విజయవంతమైన ఏఎస్‌ఎల్వీ వాహకనౌక ఏఎస్‌ఎల్వీ-డీ2. దీని ద్వారా 1992, మే 20న ఎస్‌ఆర్‌ఓఎస్‌ఎస్‌-2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

  పీఎస్‌ఎల్వీ (పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌): భారతదేశం ఇప్పటివరకు అత్యధిక ఉపగ్రహాలను దీని ద్వారానే కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ వాహక నౌకను ఇస్రో పనిగుర్రం లేదా నమ్మకమైన వాహక నౌక అని అంటారు. ఇది 1550 - 1700 కి.గ్రా. ఉపగ్రహాలను 400 కి.మీ. కక్ష్యలో ప్రవేశపెడుతుంది. దీనిలో నాలుగు దశల్లో ఏకాంతరంగా ఘన, ద్రవ ఇంధనాలు ఉంటాయి.  కొన్ని రకాల రాకెట్‌లలో మొదటి భాగంలో ఉన్న స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ రాకెట్‌కు మొదటి దశలో కావాల్సిన శక్తిని అందిస్తాయి.

 

పీఎస్‌ఎల్వీ రకాలు

పీఎస్‌ఎల్వీ-జీ: దీనికి ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి. ఇలాంటి వాటిలో మొదటిది పీఎస్‌ఎల్వీ-డీ1. దీన్ని 1993, సెప్టెంబరు 20న ప్రయోగించారు.

పీఎస్‌ఎల్వీ-సీఏ: ఇలాంటి వాటిలో మొదటిది పీఎస్‌ఎల్వీ-సీ8. దీన్ని 2007, ఏప్రిల్‌ 23న ప్రయోగించారు.

పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్‌: దీనికి ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి. ఇలాంటి రకంలో మొదటిది పీఎస్‌ఎల్వీ-సీ11. దీన్ని 2008, అక్టోబరు 22న ప్రయోగించారు.

పీఎస్‌ఎల్వీ-డీఎల్‌: దీనికి రెండు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి. ఇలాంటి వాటిలో మొదటిది పీఎస్‌ఎల్వీ-సీ44. దీన్ని 2019, జనవరి 24న ప్రయోగించారు.

పీఎస్‌ఎల్వీ-క్యూఎల్‌: ఈ రాకెట్‌కు నాలుగు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్స్‌ ఉంటాయి. ఈ రకమైన రాకెట్‌లో మొదటిది పీఎస్‌ఎల్వీ-సీ45. దీన్ని 2019, ఏప్రిల్‌ 1న ప్రయోగించారు.

పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా ఇస్రో మన దేశంతో పాటు ఇతర దేశాలు, సంస్థలకు చెందిన అనేక ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 50కి పైగా పీఎస్‌ఎల్వీ ప్రయోగాలు జరిగాయి. వీటిలో కొన్నింటి ప్రత్యేకతలు, ఉపగ్రహాల వివరాలు  ముఖ్యమైనవి. వీటిలో కొన్ని...

పీఎస్‌ఎల్వీ-డీ1: దీన్ని 1993, సెప్టెంబరు 20న ప్రయోగించారు. దీనిలో ఐఆర్‌ఎస్‌-1ఇ ఉపగ్రహాన్ని ఉంచారు. ఇది ప్రయోగ సమయంలో విఫలమైంది. ఇది భారతదేశ మొదటి పీఎస్‌ఎల్వీ.

పీఎస్‌ఎల్వీ-డీ2: దీన్ని 1994, అక్టోబరు 15న ప్రయోగించారు. దీని ద్వారా ఐఆర్‌ఎస్‌పీ2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది భారతదేశ మొదటి విజయవంతమైన పీఎస్‌ఎల్వీ.

పీఎస్‌ఎల్వీ-సీ2: ఈ ఉపగ్రహాన్ని 1999, మే 26న ప్రయోగించారు. దీని ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి ఓషన్‌శాట్‌-1. దీనికి మరొక పేరు ఐఆర్‌ఎస్‌-పీ4. మిగతా రెండు ఉపగ్రహాలు ఇతర దేశాలకు చెందినవి. ఈ వాహక నౌక ద్వారా మొదటిసారిగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

పీఎస్‌ఎల్వీ-సీ4: దీన్ని 2002, సెప్టెంబరు 12న ప్రయోగించారు. దీని ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం మెట్‌శాట్‌-1. ఈ ఉపగ్రహాన్ని కల్పన-1 అని కూడా అంటారు.

పీఎస్‌ఎల్వీ-సీ18: దీన్ని 2011, అక్టోబరు 12న ప్రయోగించారు. దీని ద్వారా మెగాట్రాపిక్స్‌ అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది ఇండియా - ఫ్రెంచ్‌ సంయుక్త ఉపగ్రహం. ఇది రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. ఇది ఉష్ణమండల ప్రాంతంలో వాతావరణాన్ని తెలుసుకోవడానికి, ఆ ప్రాంతంలో నీటిచక్రం, శక్తి మార్పిడి లాంటి వాటి కోసం ప్రయోగించిన ప్రత్యేక శాటిలైట్‌.

పీఎస్‌ఎల్వీ-సీ23: దీన్ని 2014, జూన్‌ 30న ప్రయోగించారు. దీని ద్వారా మొదటిసారి పూర్తిగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

పీఎస్‌ఎల్వీ-సీ28: ఈ ఉపగ్రహాన్ని 2015, జులై 10న ప్రయోగించారు. ఈ వాహకనౌక ద్వారా మొదటిసారి అతి ఎక్కువ బరువు గల వాణిజ్య (విదేశీ) ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ వాహకనౌక ద్వారా ప్రవేశపెట్టిన అయిదు ఉపగ్రహాల బరువు 1439 కి.గ్రా.

పీఎస్‌ఎల్వీ-సీ30: దీన్ని 2015, సెప్టెంబరు 28న ప్రయోగించారు. దీని ద్వారా విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి ఆస్ట్రోశాట్‌ అనే స్పేస్‌ అబ్జర్వేటర్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టారు. 

పీఎస్‌ఎల్వీ-సీ37: దీన్ని 2017, ఫిబ్రవరి 15న ప్రయోగించారు. దీని ద్వారా అత్యధికంగా 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. 

పీఎస్‌ఎల్వీ-సీ48: దీన్ని 2019, డిసెంబరు 11న ప్రయోగించారు. ఇది ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ వాహకనౌకల్లో 50వది. దీని ద్వారా రిశాట్‌-2బీ-ఆర్‌1 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.

పీఎస్‌ఎల్వీ-సీ52: ఇస్రో దీన్ని 2022, ఫిబ్రవరి 14న ప్రయోగించింది. దీని ద్వారా ఈవోఎస్‌-04 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

 

జీఎస్‌ఎల్వీ

  జీఎస్‌ఎల్వీ (జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌): దీని ద్వారా రెండు టన్నుల బరువున్న ఇన్‌శాట్, జీశాట్‌ ఉపగ్రహాలను జియో సింక్రోనస్‌/జియోస్టేషనరి కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. 35786 కి.మీ.  (36000 కి.మీ.) కక్ష్యను జియోస్టేషనరీ కక్ష్య అంటారు. ఈ వాహకనౌకలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉంటుంది. జీఎస్‌ఎల్వీ వాహకనౌకలో మూడు రకాలు ఉన్నాయి. అవి... ఎంకే-I, ఎంకే-II, ఎంకే-III

 

జీఎస్‌ఎల్వీ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు 

* జీఎస్‌ఎల్వీ-డీ1: దీన్ని 2001, ఏప్రిల్‌ 18న ప్రయోగించారు. దీనిలో జీశాట్‌ - 1 ఉపగ్రహాన్ని ఉంచారు. ఈ వాహకనౌక ప్రయోగ సమయంలో విఫలమైంది.

* జీఎస్‌ఎల్వీ-డీ2: దీన్ని 2003, మే 8న ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా జీశాట్‌ - 2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది మొదటి విజయవంతమైన జీఎస్‌ఎల్వీ.

* జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌9: ఈ ఉపగ్రహాన్ని 2017, మే 5న ప్రయోగించారు. దీని ద్వారా సౌత్‌ ఏషియన్‌ శాటిలైట్‌ (సార్క్‌)ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం సమాచార మార్పిడి, వాతావరణ పరిశీలనకు ఉపయోగపడుతుంది.

 

జీఎస్‌ఎల్వీ-ఎంకే-III ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు

* జీఎస్‌ఎల్వీ-ఎంకే-IIIఎక్స్‌: దీని ద్వారా 2014, డిసెంబరు 18న క్రూమాడ్యూల్‌ అట్మాస్ఫియరిక్‌ రీఎంట్రీ ఎక్స్‌పరిమెంట్‌  మిషన్‌ను ప్రయోగించారు.

* జీఎస్‌ఎల్వీ-ఎంకే-IIIడీ1: ఈ వాహకనౌక ద్వారా 2017, జూన్‌ 5న జీశాట్‌-19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం భారతదేశ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువున్న ఉపగ్రహం.

* జీఎస్‌ఎల్వీ-ఎంకే-IIIఎం1: దీని ద్వారా చంద్రయాన్‌-2 ను 2019, జులై 2న ప్రయోగించారు.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  బయోటెక్నాలజీ రంగం

 భార‌త ర‌క్ష‌ణ రంగం

‣ అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌