• facebook
  • whatsapp
  • telegram

మేఘాలు

మెరుపుల మ‌బ్బులు... గుంపులు గుంపులు!

 

కారు మేఘాలు క్షణాల్లో కమ్ముకొస్తాయి.  దట్టంగా చేరి చీకట్లు సృష్టిస్తాయి. ఇంకొన్ని ఆకాశమంతా తెల్లగా పరుచుకుపోయి మెల్లగా సమూహాలుగా సాగిపోతాయి.  పలుచగా, పారదర్శకంగా ప్రకాశిస్తాయి. మరికొన్ని కుండపోతగా కురుస్తాయి. వడగండ్లుగా వర్షిస్తాయి. చిరుజల్లులై ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇన్ని రకాల మాయలు చేసే మబ్బులు ఎలా ఏర్పడతాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? ఇలాంటి ప్రాథమిక అంశాలపై అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం అవగాహన పెంచుకోవాలి. 


ధూళి కణాలపై వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ద్రవీభవనం చెందడం వల్ల భూమికి కొంత ఎత్తులో మేఘాలు   ఏర్పడుతున్నాయి. ఎత్తు, ఆకృతి, భౌతిక లక్షణాలను బట్టి వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు.


1) ఉన్నత మేఘాలు: వీటి సరాసరి ఎత్తు 6000 మీటర్లు. ఈ తరగతికి చెందిన మేఘాలను సిర్రస్, సిర్రోస్ట్రేటస్, సిర్రోక్యుములస్‌ అని మూడు తరగతులుగా విభజించారు.        

ఎ) సిర్రస్‌: ఇవి మంచు స్ఫటికాలతో కూడుకొని, తెల్లగా,  పారదర్శకంగా ఉండి ఈకలు లేదా నార మాదిరిగా ఉంటాయి. వీటిని ‘మదర్‌ ఆఫ్‌ పెరల్స్‌’ అని పిలుస్తారు. ఇవి అత్యంత ఎత్తులో స్ట్రాటో ఆవరణంలో ఉండే మేఘాలు.

బి) సిర్రోస్ట్రేటస్‌: ఈ మేఘాలు పలుచటి పొర మాదిరిగా ఆకాశాన్ని ఆవరించి ఉంటాయి. దీని ద్వారా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. సూర్య, చంద్రుల చుట్టూ ఒక కాంతి మండలం(పరివేషం)లాగా కనిపిస్తుంది. గాలిలోని మంచు స్ఫటికాల వల్ల కాంతి వక్రీభవనం    చెందడంతో ఈ పరివేషం ఏర్పడుతుంది. ఇది తుపాను రాకను సూచిస్తుంది.

సి) సిర్రో క్యుములస్‌: ఇవి చిన్న చిన్న గోళీల మాదిరిగా ఉండి బారులు/వరుసలు/సమూహంగా ఏర్పడతాయి.


2) మధ్యస్థ మేఘాలు: వీటి ఎత్తు 1950 మీటర్ల నుంచి 6000 మీటర్ల మధ్య ఉంటుంది. వీటిని ఆల్టోక్యుములస్, ఆల్టోస్ట్రేటస్‌ అని రెండు తరగతులుగా విభజించవచ్చు.

ఎ) ఆల్టోక్యుములస్‌ మేఘాలు: ఇవి పొరల మాదిరిగా లేదా గోళంలాంటి రాశుల ఆకృతుల్లో ఉంటాయి. బారులు/వరుసలు/సమూహాలుగా ఉంటాయి. సిర్రోక్యుములస్‌ కంటే తక్కువ పరిమాణం ఉన్న గోళాకార రాశులతో ఉంటాయి.

బి) అల్టోస్ట్రేటస్‌ మేఘాలు: ఇవి నార లేదా తెర మాదిరిగా నీలం రంగులో ఉంటాయి. వీటిలో కాంతి మండలం (పరివేషం) దట్టంగా ఏర్పడటం వల్ల సూర్యకిరణాలు అంత స్పష్టంగా వీటిలోంచి ప్రసరించవు. అందువల్ల  మసకగా ఉంటుంది.


3) నిమ్న మేఘాలు: భూమి నుంచి 1950 మీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయి. ఇవి స్ట్రేటోక్యుములస్, స్ట్రేటస్, నింబో స్ట్రేటస్‌ అని మూడు రకాలు.

ఎ) స్ట్రేటోక్యుములస్‌: తక్కువ ఎత్తులో బూడిద రంగుతో ఉంటాయి. గోళ రాశుల ఆకృతిని పోలి వరుసలు/అలలు/సమూహాలుగా ఏర్పడతాయి.

బి) స్ట్రేటస్‌: ఇవి తక్కువ ఎత్తులో ఉండే పొర మేఘాలు.

సి) నింబోస్ట్రేటస్‌: దట్టంగా ఉండి ఒక నిర్దిష్టమైన ఆకృతి లేకుండా భూమికి కొంత ఎత్తులో ఏర్పడతాయి. వీటివల్ల నిర్విరామంగా వర్షం పడుతుంది.


4) ఊర్ధ్వ వ్యాప్తి మేఘాలు: ఇవి 480 మీ. నుంచి 6000 మీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉంటాయి. ఇవి క్యుములస్, క్యుములోనింబస్‌ అని రెండు రకాలు.

ఎ) క్యుములస్‌ మేఘాలు: కాలీఫ్లవర్‌ లేదా గుమ్మటపు ఆకారంలో ఉండి దట్టంగా ఏర్పడే మేఘాలు. ఇవి ఊర్ధ్వంగా వ్యాపించి ఉంటాయి. గాలి ప్రవాహాన్ని బట్టి వీటి ఎత్తు ఆధారపడి ఉంటుంది.

బి) క్యుములోనింబస్‌ మేఘాలు: చాలా దట్టంగా ఎక్కువ ఎత్తు వరకు వ్యాపిస్తాయి. వాతావరణంలో పెద్ద పర్వతాల మాదిరిగా కనిపిస్తాయి. ఇవి ఏర్పడినప్పుడు ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి సంభవిస్తుంది. వడగళ్లు కూడా పడవచ్చు.


మేఘ విస్తరణ


భూమధ్యరేఖా ప్రాంతంలో ఆకాశం ఎక్కువ మేఘావృతమై ఉంటుంది. ఉప ఆయనరేఖా అధిక పీడన మండలంలో ఆకాశం చాలా తక్కువ మేఘావృతమై ఉంటుంది. ఆయనరేఖా మండలం నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ మేఘావరణం ఎక్కువవుతుంది. 40o నుంచి 60o అక్షాంశాల మధ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తుపానులు అధికంగా సంభవిస్తాయి. ఉన్నత అక్షాంశాల్లో భూ, జల విస్తరణ, పర్వతాలు, లోయలు మొదలైనవాటిపై మేఘావరణం ఆధారపడి ఉంటుంది. ఇది భూమి మీద కంటే సముద్రంపైన, పర్వతాభిముఖాలపైన, మహాచక్రవాతాలు ఏర్పడితే ఎక్కువగా కనిపిస్తుంది.


ప్రపంచంలో మానవ నిర్మిత (కృత్రిమ సరస్సు) 
    సరస్సుల పరిమాణాన్ని అనుసరించి

* అకోసోంబో డ్యామ్‌ను వోల్టా డ్యామ్‌ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలో పరిమాణం పరంగా అతిపెద్ద మానవ నిర్మిత డ్యామ్‌.

 

ప్రపంచంలోని ముఖ్యమైన సరస్సులు


అంతర్భూభాగ జలాశయాలే సరస్సులు. వీటిలో 55 శాతం మంచి నీటి సరస్సులు, 45 శాతం ఉప్పునీటి సరస్సులున్నాయి. ఇవి 1.8% భూభాగాన్ని ఆక్రమించాయి. సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు.

* కజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లో ఉన్న కాస్పియన్‌ సరస్సు ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. 

* యూఎస్‌ఏ, కెనడాలో ఉన్న ‘సుపీరియర్‌’ ప్రపంచంలో రెండో అతిపెద్ద సరస్సు (మంచినీటి సరస్సుల్లో మొదటిది).

* కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాల్లోని విక్టోరియా సరస్సు ఆఫ్రికా ఖండంలో అతిపెద్దది (ప్రపంచంలో మూడోది).

* ఉజ్బెకిస్థాన్, కజికిస్థాన్‌ దేశాల్లోని ఆరల్‌ సరస్సు ప్రపంచంలో నాలుగో అతిపెద్దది.

* టాంజానియా, జైరీలో ఉన్న ‘టాంగాన్యీకా’ ప్రపంచంలో పొడవైన సరస్సు. 

* రష్యా (సైబీరియా)లోని ‘బైకాల్‌’ ప్రపంచంలో అతి లోతైన సరస్సు. 

* పెరూ, బొలీవియా సరిహద్దులోని ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘టిటికాకా’ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సరస్సు.

ర‌చ‌యిత‌: స‌క్క‌రి జ‌య‌క‌ర్‌

Posted Date : 25-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌