• facebook
  • whatsapp
  • telegram

నీటి పారుదల  - కాలువలు 

మానవ నిర్మిత నీటి దారులు!

  వ్యవసాయానికి, రవాణాకు కాలువలు అతి ముఖ్యమైన ఆధారాలు. ఇవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నదుల, రిజర్వాయర్ల జలాలను తరలించే మానవ నిర్మిత నీటి దారులు.  సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. దేశం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన కాలువల వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం తెలుసుకోవాలి. 

 

  భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. బావులు, కాలువలు, చెరువుల ద్వారా సేద్యం సాగుతోంది. వీటిలో కాలువలు ప్రధానమైనవి. దేశంలో ఉత్తరాన గంగ-బహ్మపుత్ర నదీ మైదానం, దక్షిణాన గోదావరి-కృష్ణ మైదానాల నుంచి కాలువల ద్వారా నీటిపారుదల వసతులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలువలు మూడు రకాలు.

 

1) వరద కాలువలు: వర్షాకాలంలో ఈ కాలువల్లో నీటి లభ్యత ఉంటుంది.

 

2) నిరంతరం నీరు ప్రవహించే కాలువలు: నదులకు అడ్డుగా ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేస్తారు. ఆ రిజర్వాయర్‌కి ఇరువైపులా ఈ కాలువలు ఏర్పాటు చేస్తారు. వీటి నుంచి సమీపంలోని పొలాలకు నీటిని నిరంతరం మళ్లిస్తుంటారు.

 

3) డెల్టా కాలువలు: నదుల డెల్టాలు ప్రారంభమయ్యే చోట అడ్డుగా ఆనకట్టలు నిర్మిస్తారు. ఆ నీటిని డెల్టా కాలువల ద్వారా సాగుకు వినియోగిస్తారు.

మనదేశంలో సుమారు 24% సాగుభూమికి ఆధారం కాలువలే. దేశంలో లక్ష కిలోమీటర్లకు పైగా కాలువల వ్యవస్థ విస్తరించింది. కాలువల ద్వారా సాగునీరు/ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ మొదటి స్థానంలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

 ప్రధానమైనవి కొన్ని

 

1) ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాలువలు: ఇక్కడ కాలువలు వ్యవసాయానికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. వర్షాకాలంలో వర్షపు నీరు, వేసవిలో మంచు కరగడం ద్వారా నీరు నిరంతరం కాలువల్లో ప్రవహిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ భాగంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఈ కాలువల ద్వారా సంవత్సరం పొడవునా వ్యవసాయం చేస్తారు. 

ఎగువ గంగా కాలువ: ఈ కాలువ హరిద్వార్‌ వద్ద గంగా నది నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని 1842-54 మధ్య తవ్వారు. దీని ప్రధాన కాలువ పొడవు 342 కి.మీ., ఇతర కాలువలు 6200 కి.మీ. పొడవున ఉన్నాయి.

దిగువ గంగా కాలువ: ఈ కాలువను 1878లో నరోరా వద్ద గంగా నది నుంచి తవ్వారు. దీని పొడవు సుమారు 6000 కి.మీ. 

శారదా కాలువ: ఈ కాలువ 1928లో నేపాల్‌ సరిహద్దులో బాంబాసా వద్ద ఏర్పాటు చేశారు. దీని పొడవు 13,624 కిలోమీటర్లు. 

తూర్పు యమునా కాలువ: ఈ కాలువ 1831లో ఫైజాబాద్‌ దగ్గర యమునా నదిపైన నిర్మించారు. దీని పొడవు సుమారు 1450 కిలోమీటర్లు.

ఆగ్రా కాలువ: దీన్ని 1874లో యమునా నదికి కుడిపైపు ఓక్లా దగ్గర నిర్మించారు.

బేత్వా కాలువ: ఈ కాలువ ఝాన్సీకి 56 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో బేత్వా నది నుంచి తవ్వారు (3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో).

 

2) పంజాబ్‌: ఈ రాష్ట్రంలో అయిదు కాలువలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ఎగువ బారీదోబ్‌ కాలువ: 1849-59 మధ్య రావినదిపైన మదొపూర్‌ పఠాన్‌కోట్‌ వద్ద నిర్మించారు.

సర్‌హింద్‌ కాలువ: దీన్ని సట్లేజ్‌ నదిపైన రూప్‌సాగర్‌ వద్ద 1886-87లో నిర్మించారు. దీని పొడవు 6,115 కిలోమీటర్లు.

భాక్రా కాలువ: సట్లేజ్‌ నదిపైన 1954లో నిర్మించారు.

నంగల్‌ కాలువ: దీన్ని సట్లేజ్‌ నదిపైన బాకు కాలువ నుంచి నిర్మించారు.

బిస్తుదోబ్‌ కాలువ: ఈ కాలువ భాక్రా-నంగల్‌ ప్రాజెక్టులో భాగం. దీని పొడవు 1090 కిలోమీటర్లు.

 

3) హరియాణా: యమునా నదిని ఆధారం చేసుకొని ముఖ్యమైన కాలువలు ఉన్నాయి.

పశ్చిమ యమునా కాలువ: ఈ కాలువను యమునా నదికి కుడివైపున తేజ్వాలా దగ్గర  ఫిరోజ్‌షా తుగ్లక్‌ నిర్మించాడు. దీని పొడవు 3200 కిలోమీటర్లు.

భాక్రా కాలువ: ఈ కాలువ పంజాబ్‌తోపాటు హరియాణాలోనూ కొంత ప్రాంతం నీరు అందిస్తోంది.

జాయి కాలువ: ఇది ఎత్తిపోతల పథకం. భివాసి పరిసర ప్రాంతాల్లో 169 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.

గురుగావ్‌ కాలువ: దీన్ని 1970లో దిల్లీలో హాక్లా దగ్గర యమునా నదిపై నిర్మించారు.

 

4) రాజస్థాన్‌: రాజస్థాన్‌లో అధికంగా ఎడారి ప్రాంతం ఉంటుంది. దాంతో వ్యవసాయానికి కాలువలే ఆధారం. వీటి ద్వారా అందే నీటితోనే ఎక్కువ భాగం భూమిని సాగు చేస్తున్నారు. 

గంగా కాలువ: ఇది రాజస్థాన్‌లోని పురాతన కాలువ వ్యవస్థ. దీని ద్వారా రాజస్థాన్‌లోని గంగానగర్‌ డివిజన్‌లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇదే కాకుండా భాక్రా కాలువ, గగ్గర్‌ కాలువ, కోటా డివిజన్‌కు నీరు అందించే పార్వతి కాలువలు ఉన్నాయి. బనాస్‌ నదిపై తవ్వి ఏర్పాటు చేసిన పిచ్చునా కాలువ, బనాస్‌ కాలువ, ఆగ్రా కాలువగా పిలిచే భరత్‌పూర్‌ కాలువ, రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి పథకం చంబల్‌ ప్రధానమైనవి. ఇవేకాకుండా బియాస్, సట్లేజ్‌ నదులు కలిసినచోట పంజాబ్‌లో నిర్మించిన హరికే బ్యారేజ్‌ నుంచి 650 కి.మీ.లు పొడవున రాజస్థాన్‌లో నీరు అందిస్తున్న ఇందిరాగాంధీ కాలువ, రాజస్థాన్‌లోని బికనీర్‌ ప్రాంతానికి నీరందించే బికనీర్‌ కాలువ ముఖ్యమైనవి.ఇందిరాగాంధీ కాలువను మరుగంగ, రాజస్థాన్‌ జీవనధార అనే పేర్లతో పిలుస్తారు.

 

5) గుజరాత్‌: ఈ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల కాలువల ప్రాముఖ్యం ఎక్కువ. సూరత్‌ జిల్లాలో కాక్రపర్‌ పథకం, ఉకాయ్‌ ప్రాజెక్టు, రుద్రమాత కాలువ (కచ్చి జిల్లా), జునాగఢ్‌ జిల్లాలో ఓజత, సబర్‌కాంత ప్రాంతంలో తామ రిజర్వాయర్‌ కాలువలు ప్రధానమైనవి.

 

6) బిహార్‌: ఇక్కడ వర్షపాతంలో తరచూ హెచ్చు తగ్గులు ఉంటాయి. 

సోన్‌ కాలువ: దీన్ని 1857లో సోన్‌ నదిపైన వరుణ వద్ద 130 కి.మీ. పొడవున నిర్మించారు.

కోసీ కాలువ: కోసీ నదిపైన ఇండో-నేపాల్‌ సరిహద్దులో నిర్మించారు.

గండక్‌ కాలువ: గండక్, బాల్మికి నదిపైన నిర్మించారు. దీన్ని తూర్పున తిర్వాట్, పశ్చిమాన సారన్‌ అని పిలుస్తారు. మూడో కాలువను త్రివేణి కాలువ అని అంటారు.

 

7) పశ్చిమ బెంగాల్‌: ఇక్కడ అధిక వర్షపాతం ఉన్నప్పటికీ కొంత భూమి సాగుకు నీటి పారుదల వసతి కల్పిస్తున్నారు. 1951లో తీల్‌పారా వద్ద మయూరాక్షి నదిపైన ఒక నీటిపారుదల పథకాన్ని పూర్తి చేశారు. ఇదే కాకుండా కసాయ్‌ నదిపై నిర్మించిన కాంగ్‌ సబాతీ ప్రాజెక్టు బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు, పశ్చిమ బెంగాల్‌లోని బంకూరా, కుగ్లీ జిల్లాలకు నీరందిస్తోంది. 

 

8) మహారాష్ట్ర: మహారాష్ట్రలో నీటిపారుదల ప్రధానంగా ఏడు కాలువల ద్వారా జరుగుతోంది. అహ్మదాబాద్‌ జిల్లాలో ప్రవరా కాలువ ద్వారా సాగు నీరందుతుంది. పునా జిల్లాలో మతో, నీరా కాలువలు పునా, షోలాపూర్, సతారా ప్రాంతాలకు నీరందిస్తున్నాయి. గోదావరి కాలువ అహ్మద్‌ నగర్, నాసిక్‌ జిల్లాలకు: గిర్‌నాల్, గంగాపూర్‌ కాలువలు నాసిక్‌ జిల్లాకు సాగు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తపతి కాలువ కొంత ప్రాంతానికి నీరందిస్తోంది.

 

9) ఒడిశా: హిరాకుడ్, మహానది ద్వారా పూరి, కటక్, సంబల్‌పూర్‌ జిల్లాలకు ఎక్కువ సాగునీరు అందుతోంది.

 

10) కర్ణాటక: తుంగభద్ర, రాజోలిబండ, భద్ర, తుంగ, ఘటప్రభ, మలప్రభ కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

 

11) తమిళనాడు: కావేరీ డెల్టా కాలువల పొడవు 6400 కి.మీ.లు. ఈ నదిపై మెట్టూరు వద్ద ఆనకట్ట నిర్మించారు. కావేరీ ఉపనది భవానీ నదిపై భవానీ రిజర్వాయరు కోసం కాలువ తవ్వారు. నెయ్యూరు డ్యామ్‌ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఉమ్మడి పథకం.

 

12) కేరళ: పాలఘాట్‌ జిల్లాలోని మలంపూజ కాలువ, పాలఘాట్‌కు 19 కి.మీ.ల దూరంలోని వలయార్‌ ప్రాజెక్టు, పాలఘాట్‌ ఆగ్నేయ దిశలోని మంగళం నీటిపారుదల కాలువ, కోజికోడ్‌ జిల్లాలోని పెరియార్‌ ప్రాజెక్టు, త్రివేండ్రానికి ఆగ్నేయంగా ఉన్న నెయ్యార్‌ ప్రాజెక్టు, తిరుచూర్‌ ఆగ్నేయంగా ఉన్న పెచ్చి ప్రాజెక్టు కాలువలు ముఖ్యమైనవి. ఇంతేకాకుండా కిల్వాన్‌ జిల్లాలోని పంబా కాలువ కూడా ప్రధానమైనదే.

 

ముఖ్యాంశాలు

* ఉత్తర్‌ప్రదేశ్‌లో శారద కాలువ పొడవైంది.

* తూర్పు యమునా కాలువ దిల్లీకి నీటి సౌకర్యం కల్పిస్తుంది.

* పశ్చిమ యమునా కాలువను ఫిరోజ్‌షా తుగ్లక్‌ నిర్మించారు.

* ఇందిరా కాలువ (రాజస్థాన్‌) భారత్‌లో అతి పొడవైంది.

* ఇందిరా కాలువను మరుగంగ, రాజస్థాన్‌ జీవనాధార అని పిలుస్తారు.

* కోసీ కాలువ భారత్‌-నేపాల్‌ సరిహద్దులో నిర్మించారు.

* బెత్వా కాలువను 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించారు.

* ఇందిరాగాంధీ కాలువ ద్వారా రాజస్థాన్‌లోని ఎనిమిది జిల్లాలు ప్రయోజనం పొందుతున్నాయి.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో రిహంద్‌ నదిపై ఏర్పాటు చేసిన రిహంద్‌ ప్రాజెక్టు వల్ల గోవింద వల్లభ్‌ పంత్‌ సాగర్‌ సరస్సు ఏర్పడింది. ఇది దేశంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు.

 

తెలుగు రాష్ట్రాల్లో 

 

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి కాలువ: దీన్ని జవహర్‌ కాలువ అంటారు.ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దీని ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందుతోంది.

 

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్, ఎడమ కాలువ: దీన్ని లాల్‌ బహదూర్‌ కాలువ అంటారు. తెలంగాణలో ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందుతోంది. 

 

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మొదటి దశ (ఎస్‌ఆర్‌ఎస్పీ-1), కాకతీయ కాలువ: ఇది తెలంగాణలో పొడవైన కాలువ. దీని ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు అందుతోంది.

 

ఎస్‌ఆర్‌ఎస్పీ-1, లక్ష్మీకాలువ: దీని ద్వారా నిజామాబాద్‌ జిల్లా (తెలంగాణ)కు సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

 

ఎస్‌ఆర్‌ఎస్పీ-1, సరస్వతి కాలువ: దీని ద్వారా నిర్మల్‌ జిల్లా(తెలంగాణ)కు సాగునీరు అందుతోంది. 

 

ఎస్‌ఆర్‌ఎస్పీ - వరద కాలువ: ఈ కాలువ నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం, సంగం గ్రామం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం వరకు ప్రవహిస్తోంది.

 

శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌ఆర్‌బీసీ): ఈ కాలువను 1981లో ప్రారంభించారు. ఇది కర్నూలు జిల్లా(ఏపీ)లో ఉంది. కర్నూలు, కడప జిల్లాలకు సాగునీరు అందిస్తోంది. 

 

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ): ఈ కాలువను 1983లో ప్రారంభించారు. ఇది నల్గొండ జిల్లా (తెలంగాణ)లో ఉంది. తాగు, సాగునీరు అందింస్తోంది.

 

శ్రీశైలం-తెలుగు గంగ కాలువ: దీన్ని 1983 చెన్నై నగరానికి తాగునీరు, రాయలసీమలో కొద్ది ప్రాంతానికి సాగునీరు అందించడం కోసం ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. 

 

జూరాల-పాకాల వరద కాలువ: జూరాల ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని, పూర్వ మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల మీదుగా వరంగల్‌-పాకాల వరకు దాదాపు 700 చెరువులు నింపాలనే లక్ష్యంతో ఈ కాలువను ఏర్పాటు చేశారు. ఇది ఎత్తిపోతల, గ్రావిటీ పథకం. 

 

తుంగభద్ర ఎగువ కాలువ: దీన్ని (తుంగభద్ర) రైట్‌ బ్యాంక్‌ హైలెవల్‌ కెనాల్‌(హెచ్‌ఎల్‌సీ) అని పిలుస్తారు. 1956-57లో ప్రారంభించి 1972 నాటికి పూర్తి చేశారు. ఈ కాలువ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సాగు నీటిని అందిస్తోంది.  

 

తుంగభద్ర దిగువ కాలువ: దీన్ని తుంగభద్ర లోలెవల్‌ కెనాల్‌ (ఎల్‌ఎల్‌సీ) అంటారు. దీన్ని 1945లో నాటి హైదరాబాదు-మద్రాసు ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టాయి. ఈ ప్రాజెక్టు 1957-58 మధ్య కాలంలో పూర్తయింది. దీని వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సాగునీరు అందుతోంది.

 

పులివెందుల కాలువ: చిత్రావతి, తుంగభద్ర ఎగువ కాలువల ఉమ్మడి పథకం. కరవు నివారణకు రూపొందించారు. దీన్ని 1972-73లో ప్రారంభించారు.

 

ఎర్ర కాలువ: ఇది పశ్చిమ గోదావరి (ఏపీ) కొవ్వూరు మండలంలో ఉంది. దీన్ని 1976-77లో ప్రారంభించారు. 

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 23-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌