• facebook
  • whatsapp
  • telegram

క్రమక్షయ భూస్వరూపాలు

కోతలతో.. చేరవేతలతో!

 

అఖాతాలు, లోయలు, గుహలు, సరస్సులు, జలపాతాలు, జలసంధులు, కొండకోనలు, దీవులు, ద్వీపకల్పాలన్నీ రకరకాల మార్గాల్లో ఏర్పడిన భూస్వరూపాలు. శిలావరణంపై అంతర, బాహ్య బలాలు జరిపిన చర్యల ఫలితాలు. వీచే గాలి, ప్రవహించే నీరు, కరిగి పడే మంచు, తీరాలను తాకే అలల వల్ల సంభవించే కోతలు, శైథిల్యాల చేరవేతలతో రూపొందినవి. భూమి పుట్టినప్పటి నుంచి ఈ క్రమక్షయ, నిక్షేపణలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే జాగ్రఫీని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. 

 

భూ ఆవిర్భావం నుంచి క్రమంగా శిలావరణ ఉపరితల దృశ్యాలపై అనేక అంతర్జనిత బలాలు (భూకంపాలు, అగ్నిపర్వతాల లాంటివి), బహిర్జనిత బలాలు (నదులు, పవనాలు, సముద్ర ప్రవాహాలు, అంతర్భూజలం, సముద్ర తరంగాలు) ఒకదానితో ఒకటి పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటాయి. వీటి ఫలితంగానే భూఉపరితలంపై అనేక రకాల మూడో తరం భూస్వరూపాలు ఏర్పడ్డాయి. వాటినే క్రమక్షయ భూస్వరూపాలు (erosional landforms) అంటారు.

 

నదీ ప్రవాహాలతో ఏర్పడేవి

ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో నదీ ప్రవాహాల క్రమక్షయ, నిక్షేపణ చర్యల వల్ల వాటి ప్రవాహ మార్గంలో వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి.

V - ఆకారపు వలయం: నదీ ప్రవాహమార్గంలో పక్కకోత కంటే అధోముఖ (downward) కోత ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి లోయలు ఏర్పడతాయి. 

ఉదా: హిమాలయ నదులు

గార్జ్‌లు: నదుల కోత వల్ల V ఆకారపు లోయల అంచులు కోతకు గురై నిటారుగా ఉన్న గోడలు కలిగిన గార్జ్‌లు అనే భూస్వరూపాలు ఏర్పడతాయి. 

ఉదా: గోదావరి నదికి ఉన్న బైసన్‌ గార్జ్‌

అగాధదరులు: V ఆకారపు లోయలు క్రమేణా కోతకు గురై అతిలోతైన లోయలుగా మారతాయి. అవే అగాధదరులు. వీటి గోడలు నిటారుగా ఉండి 2 లేదా 3 కి.మీ. లోతు కలిగి ఉంటాయి. 

ఉదా: ఉత్తర అమెరికాలోని కొలరాడో పీఠభూమిలో కొలరాడో నది ఏర్పరుస్తున్న గ్రాండ్‌ కాన్యాన్‌

నదీ జలపాతం: లోయ అడుగుభాగం విభిన్న శిలలతో ఉన్నప్పుడు మృదువైన శిలలు కోతలకు గురై నదులు తమ ప్రవాహ దిశలో ఒక్కసారిగా పతనం చెందుతాయి. వీటినే జలపాతాలు అంటారు. 

ఉదా: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతం ఏంజల్‌. ఇది వెనెజువెలాలోని ఒరినాకో నదిపై ఉంది. అతిపెద్దదైన‌ నయాగరా జలపాతం అమెరికాలోని సెయింట్ లారెన్స్ న‌ది (ఇరి, ఒంటారియా స‌ర‌స్సుల‌ మ‌ధ్య‌)పై కెనడా, న్యూయార్క్‌ మధ్యలో ఉంది. 

మోనాడ్‌ నాక్స్‌: క్రమక్షయ కారకాల వల్ల ఒక భూస్వరూపం పెనిప్లేన్‌ స్థితికి చేరకముందు అక్కడక్కడ మిగిలి ఉన్న అవశిష్టాలు లేదా చిన్నచిన్న గుట్టలను మోనాడ్‌ నాక్స్‌ అంటారు.

నదీ వంకరలు (మియాండర్స్‌): ప్రవాహమార్గంలో వక్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వక్రమార్గాన్ని విడిచిపెట్టి నది తిన్నగా ప్రవహించడం వల్ల ఆ వక్రతలు సరస్సులుగా మారిపోతాయి. అవే నదీ వంకరలు. ఇవి ఎద్దు అడుగు రూపంలో ఉండటంతో ఆక్స్‌ బౌ సరస్సులుగా పేర్కొంటారు.

 

హిమానీనదాలతో...

ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో హిమానీనద క్రమక్షయ, నిక్షేపణ చర్య వల్ల ఈ భూస్వరూపాలు ఏర్పడతాయి. హిమానీనదాలనే మంచు నదులు అంటారు. పర్వత వాలును అనుసరించి భూగురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకు జాలువారే మంచు సమూహాన్నే హిమానీనదం అంటారు. హిమానీనద జన్మస్థలాలు హిమక్షేత్రాలు. హిమాలయాల్లో హిమరేఖ 18 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ స్థాయికి ఎగువ ఉన్న ప్రాంతమంతా ఎప్పుడూ మంచుతో నిండి ఉంటుంది.

హిమక్షేత్రాలు: నిరంతరం హిమపాతం జరిగి మంచుతో నిండిన ప్రాంతాలు.

హిమరేఖ: హిమక్షేత్రాల కింది సరిహద్దు.

ఐస్‌బర్గ్‌: హిమానీనదం సముద్రంలో చేరేటప్పుడు దాని అగ్రభాగం ముక్కలుగా విడిపోయి నీటిలో తేలియాడే మంచుగడ్డలు.

అవలాంచ్‌: భూఉపరితలంపై పడే అధిక బరువు ఉన్న మంచు ఖండాలు.

* ప్రపంచంలోనే అతిపెద్ద హిమానీనదం అంటార్కిటికా ఖండంలోని బియర్డ్‌ మోరే.

రోచ్‌ మాటినే: ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాల్లో హిమనీనదాల కోత వల్ల పెద్ద బండరాళ్లు చిత్ర విచిత్రంగా ఆకారాన్ని సంతరించుకుంటాయి. ఇవి కూర్చున్న గొర్రెల మంద ఆకృతిని పోలి ఉంటే ‘షీప్‌ రాక్స్‌’ లేదా ‘రోచ్‌ మాటినే’ అంటారు.

U - ఆకారపు లోయలు: హిమానీనదాల కోతలతో ఈ రకమైన లోయలు ఏర్పడతాయి. 

ఉదా: అమెరికాలోని సెయింట్‌ లారెన్స్‌ లోయ

డ్రమ్లిన్లు (Drumlins): ఇది హిమానీనదాలతో నిక్షేపితమైన భూస్వరూపం. కొన్ని మీటర్ల ఎత్తున్న శిలాఖండాలు, గుళకరాళ్లు, ఇసుకలతో కూడి బోర్లించిన పడవ లేదా బోర్లించిన చెంచా లేదా బోర్లించిన కోడిగుడ్ల గంప ఆకృతిలో ఉంటాయి. వీటిని ఆకాశం నుంచి చూస్తే పరుగెత్తే మోటారు వాహనంలా ఉంటాయి.

ఎస్కర్లు: హిమానీనదాలతో నిర్మితమైన సన్నని పొడవైన రిడ్జ్‌లు. ఇవి ఇసుక, గ్రావెల్‌తో పొరలు, పొరలుగా నిర్మితమై సర్పాకృతిలో రైలు మార్గం వేయడానికి వేసిన గట్ల మాదిరి ఉంటాయి.

 

ప‌వ‌న‌ క్రమక్షయ, నిక్షేపణ చర్యతో...

శుష్క, అర్ధశుష్క శీతోష్ణస్థితి ఉన్న ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో ఈ భూస్వరూపాలు ఏర్పడతాయి.

ఇన్సెల్బర్గ్‌: ఎడారి ప్రాంతాల్లో గాలి క్రమక్షయం, నిక్షేపణ వల్ల మైదానాలుగా మారిన భూ ప్రాంతాలను పెడిప్లేన్లు అంటారు. పెడిప్లేన్లలో మిగిలిపోయిన ఎత్తయిన ప్రాంతాలను ఇన్సెల్బర్గ్‌ అంటారు. 

ఉదా: మధ్య ఆస్ట్రేలియాలోని ఆయరాక్‌ (Ayers Rock) అనే ఇన్సెల్బర్గ్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కానర్‌ శిఖరం అనే బోడిగుట్ట కూడా ఇన్సెల్బర్గ్‌.  

హమ్మడాలు: ఉష్ణోగ్రత వల్ల జరిగే భౌతిక శిలా శైథిల్యంతో పాటు పవన క్రమక్షయంతో ఎడారి ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న పెద్ద బండరాళ్లు కోతకు గురై ఏర్పడే రాతి మైదానాలనే హమ్మడాలు అంటారు. 

ఉదా: సహారా, థార్‌ ఎడారిలో కనిపించే రాతి మైదానాలు

వాడీలు: ఎడారి ప్రాంతంలో అప్పుడప్పుడు కురిసే భారీ వర్షాల వల్ల లోతైన వాగులు, గోతులు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ గోతులు పెద్దవై సమతల లోయలుగా మారతాయి. వీటినే వాడీలు అంటారు. అల్జీరియాలో వీటిని చెబ్కాలు అంటారు. ఇలాంటి భూస్వరూపాన్ని కందర భూమి (Bad Land) అని కూడా అంటారు.

బార్కర్లు: తక్కువ పొడవుతో, ఎత్తుగా అర్ధ చంద్రాకృతిలో ఉండి రెండు కొమ్ములను కలిగి ఉన్న ఇసుక దిబ్బలు. వీటి ఎత్తు 90 మీటర్లు, వెడల్పు 200 మీటర్ల వరకు ఉంటుంది. 

లోయస్‌: లేత పసుపు వర్ణంలో ఉండే లోయస్‌ మట్టి వదులుగా ఉంటుంది. గాలుల కారణంగా చైనా తూర్పు భాగానికి రవాణా అయి ఆ ప్రాంతంలో నిక్షేపం చెందడంతో పసిఫిక్‌ మహాసముద్రానికి లోయస్‌ మట్టి వర్ణం ఆపాదించ‌బ‌డింది. అందుకే  పసిఫిక్‌ మహాసముద్రాన్ని చైనాలో పసుపు సముద్రంగా పిలుస్తారు.

ఎర్గ్స్‌: ఇసుక పొరతో కప్పి ఉన్న ఎడారి భూతలం లేదా ఎడారి ప్రాంతంలో ఉండే ఇసుక మైదానం.

ప్లయాలు: ఎడారి ప్రాంతాల్లోని హరివాణాల్లో ఏర్పడే ఉప్పు నీటిసరస్సులను ప్లయాలు అంటారు. వీటిని ఉత్తర ఆఫ్రికాలో చోట్స్‌, ఆస్ట్రేలియాలో సాలర్స్, కాస్పియన్‌ సముద్ర తీరప్రాంతంలో ఖబారీ అని పిలుస్తారు. ఒక్కోసారి ఈ సరస్సులు ఎండిపోయి ఉప్పునీటి పొరలతో పేరుకుపోయిన మైదానాలు ఏర్పడతాయి. వీటిని సలీనా అంటారు. ఒయాసిస్‌ల  రూపంలోని ఉప్పునీటి గుంటలను భాల్సస్‌లు అంటారు.

 

అంతర్భౌమ జలాలతో..

ఏదైనా భౌగోళిక ప్రాంతం సున్నపురాయి శిలలతో ఏర్పడి ఉన్నచోట అంతర్భూజల చర్య వల్ల ఇలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో ఏర్పడే వాటినే కార్ట్స్‌ భూస్వరూపాలు అని పిలుస్తారు. అవి:

అంతర్భౌమ గుహలు, కందరాలు (Caves and Cavarans): అంతర్భూమిలోని సున్నపురాతి శిలలు ఉపరితలానికి కొంత లోతులో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉన్న నీటిలో కరిగి గుహలుగా ఏర్పడతాయి. విశాలమైన ఇలాంటి గుహలను కందరాలు అంటారు. 

ఉదా: కారల్స్‌ బాడ్‌ గుహ (మెక్సికో), కెంటకీలో ఉన్న మామత్‌ కందరం, ఆంధ్రప్రదేశ్‌లోని బొర్రా గుహలు

టెర్రారోసా (Terrarosa): కొన్ని ప్రాంతాల్లో భూగర్భజల ప్రసరణ వల్ల నేలలో కొన్ని సమ్మేళనాలు కరిగిపోతాయి. ఫలితంగా అక్కడి నేలల రసాయనిక సంఘటనలో మార్పు వస్తుంది. సాధారణంగా ఎర్ర నేలలు ఇలా ఏర్పడుతుంటాయి. ఈ మృత్తిక పొరలు కొన్నిచోట్ల మందంగా, మరికొన్నిచోట్ల పలుచగా ఉంటాయి. అలాంటి మృత్తిక పొరలను కప్పి ఉన్న ప్రాంతాన్ని టెర్రారోసా అంటారు.

స్టాలక్‌ టైట్స్‌: అంతర్భౌమ జలం కార్బన్‌ డై ఆక్సైడ్‌తో కలిసినప్పుడు సున్నపురాయిని కరిగిస్తుంది. ఈ ద్రావణ క్రియ వల్ల ఏర్పడిన ద్రవం గుహ పైకప్పు నుంచి చుక్కలుగా జారుతుంది. ఇలా జారేటప్పుడు అందులోని నీరు ఆవిరై కార్బడై ఆక్సైడ్‌తో కలిసిపోగా, ఘనపదార్థం కప్పుకంటుకొని వేలాడుతూ గట్టిపడుతుంది. ఇలా గుహల్లోని పై కప్పు నుంచి కిందకు వేలాడే స్తంభాకృత నిర్మాణాలను ‘స్టాలక్‌ టైట్స్‌’ అంటారు. వీటినే ఊర్ధ్వ శిలి అంటారు.

స్టాలగ్‌ మైట్స్‌: కొన్ని సందర్భాల్లో నేలకు చేరిన ద్రావణ బిందువుల్లో నీరు ఆవిరై కార్బన్‌ డై ఆక్సైడ్‌తో కలిసిపోయి, మిగిలిన సున్నపురాయి పదార్థం గుహ అడుగు నుంచి స్తూపాకారంగా ఘనీభవిస్తుంది. ఇవి పాముపుట్టలా పెరుగుతుంటాయి. వీటినే స్టాలగ్‌ మైట్స్‌ లేదా పుట్టశీలి అంటారు.

 

సముద్ర తరంగాలతో..

తీరాన్ని తాకే సముద్ర అలల తాకిడి వల్ల తీర ప్రాంత భూభాగాల్లో కొన్నిరకాల భూస్వరూపాలు ఏర్పడతాయి.

సముద్ర భృగువు: ఇవి సముద్ర తీరంలో ఏర్పడే నిర్మాణాలు. సముద్ర తరంగాలతో తీరంలో ఉన్న శిలాఖండాలు కోతకు గురవుతాయి. ఫలితంగా నిట్రంగా ఉండే కొండకోనలు ఏర్పడతాయి. వీటిని సముద్ర భృగువులు అంటారు. 

ఉదా: భారతదేశ తూర్పు తీరంలోని డాల్ఫిన్‌ నోస్, పశ్చిమ తీరరేఖ అంతా ఇలాంటి భృగువులు ఉంటాయి.

కోవ్‌లు: సముద్ర జల క్రమక్షయం కారణంగా శిలలు వాటి నిరోధక శక్తిలోని తేడాల వల్ల భేదాత్మక క్రమక్షయానికి లోనైనప్పుడు తీరం వెంబడి చిన్న అర్ధచంద్రాకృతి భూస్వరూపాలు ఏర్పడతాయి. వీటినే సింధుశాఖలు లేదా కోవ్‌లు అని పిలుస్తారు. రెండు పక్కపక్క కోవ్‌ల మధ్యభాగాలు సముద్రంలోకి చొచ్చుకొని (కఠిన శిలాభాగాలు) వస్తే వాటిని శీర్షభూములు అంటారు. సింధుశాఖలు పరిమాణంలో పెద్దవిగా ఉంటే వాటిని అఖాతాలు అని పిలుస్తారు. 

ఉదా: బంగాళాఖాతం

స్పిట్, రోధిక్‌: సముద్ర తీరం వెంబడి ఇసుక, ఒండ్రు, కంకర లాంటి పదార్థాలు అలల ప్రవాహాల వల్ల కట్టలుగా ఏర్పడతాయి. వీటిని ‘వాలుకా రోధికలు’ అంటారు. దీర్ఘతీర ప్రవాహాలు, అవక్షేపాలను తీరరేఖకు సమాంతరంగా విక్షేపణం చేయడం వల్ల రోధికలు ఏర్పడతాయి. వాలుకారోధికలు ఒక వైపు భూమితో కలిసి, రెండో వైపు సముద్రంలోనికి చొరబడి ఉంటే వాటిని స్పిట్‌లు అంటారు.

టంబోలా: పక్క పక్కన ఉన్న సంధిత ద్వీపాలను రోధికలు కలపడం వల్ల టంబోలాలు ఏర్పడతాయి. లేదా రోధిక్‌లు ఒకవైపు తీరానికి, రెండో వైపున ఏదైనా ఒక ద్వీపానికి అంటుకొని ఉంటాయి. వీటిని కూడా టంబోలా అంటారు. న్యూఇంగ్లండ్‌ తీరంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి.

షోల్స్‌: సముద్రంలో చిన్న పరిమాణంలో ఏర్పడే ఇసుక దిబ్బలు.

లాగూన్లు: వాలుకా రోధికలు (Inhibitors) తీరానికి సమాంతరంగా ఉంటాయి. ఇలాంటి రోధికలు, తీరానికి మధ్య సముద్ర ప్రవాహాలు ఎక్కువ ఎత్తుకు లేచినప్పుడు నీరు ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఉప్పునీటి కయ్యలు ఏర్పడతాయి. వీటినే లాగూన్లు అంటారు. సముద్రజల నిక్షేపణ ప్రక్రియ వల్ల ఏర్పడిన లాగూన్లు భారత్‌ తూర్పు తీరంలో, కేరళ తీరం వెంబడి ఉన్నాయి. 

ఉదా: ఒడిశాలోని చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్‌ సరస్సు

 

తృతీయ భూస్వరూపాలు

ద్వీపం: అన్నివైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగమే ద్వీపం. 

ఉదా: శ్రీలంక, గ్రీన్‌లాండ్, గ్రేట్‌ బ్రిటన్‌ 

ద్వీపకల్పం: మూడువైపులా నీరు, ఒకవైపు భూభాగంతో ఉన్న భూ స్వరూపాన్ని ద్వీపకల్పం అంటారు. 

ఉదా: అరేబియా, భారతదేశం 

భూసంధి: రెండు భూభాగాలను కలుపుతూ, రెండు జలభాగాలను వేరుచేసే సన్నని భూభాగాన్ని భూసంధి అంటారు. 

ఉదా: పనామా, సూయజ్‌ భూసంధులు

అగ్రం: చివరికొన సముద్రంలోనికి చొచ్చుకొనిపోతే ఆ కొనను అగ్రం అంటారు. 

ఉదా: ఆఫ్రికా ఖండపు చివరికొన గుడ్‌హోప్‌ అగ్రం, భారతదేశపు చిట్టచివరి కొన కన్యాకుమారి అగ్రం

ఎడారి: అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాన్ని ఎడారి అంటారు. 

ఉదా: సహారా, థార్, కలహరి

నది: పర్వతాలు, పీఠభూములు, మైదానాల మీదుగా సహజంగా ప్రవహించే జీవ లేదా అశాశ్వత జలప్రవాహాన్ని నది అంటారు.

లోయలు: సన్నని లోతైన భూతలాన్ని లోయలు అంటారు. ఇవి నదులు, హిమానీనదాల క్రమక్షయం వల్ల ఏర్పడతాయి. ఉదా: కృష్ణానదీ లోయ

పగులు లోయ: భూఅంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపైన ఉన్న రెండు సమాంతర భ్రంశాల (Delusions) మధ్య ఉన్న భాగం కిందికి దిగజారగా ఏర్పడిన లోయను పగులు లోయ అంటారు. 

ఉదా: నర్మద, తపతి నదులు ప్రవహించే లోయలు

అగాధదరి: నదీ ప్రవాహం కోత వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడిన లోతైన లోయను అగాధదరి అంటారు. 

ఉదా: అమెరికాలోని కొలరాడో అగాధదరి

జలపాతం: నదీ ప్రవాహజలం ఎత్తయిన ప్రాంతం నుంచి అగాధదరి కిందికి పడే ప్రదేశాన్ని జలపాతం అంటారు. 

ఉదా: ఆఫ్రికాలోని విక్టోరియా జలపాతం, ఉత్తర అమెరికాలోని నయాగరా జలపాతం

డెల్టా: నదీముఖ ద్వారం వద్ద రెండు లేదా అంతకుమించిన పాయలతో సముద్రాన్ని కలుస్తుంది. ఆ పాయల మధ్య ఉన్న ప్రాంతంలో సారవంతమైన ఒండ్రుమట్టిని నిక్షేపిస్తుంది. దాన్నే డెల్టా అంటారు. 

ఉదా: కృష్ణా

సరస్సు: అంతర్భాగంలో ఉన్న నదీ జలభాగాన్ని సరస్సు అంటారు. 

ఉదా: ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు

కాలువ: రవాణా, నీటిపారుదల కోసం కృత్రిమంగా తవ్వి ఏర్పాటుచేసిన జలమార్గాన్ని కాలువ అంటారు. 

ఉదా: సూయజ్, పనామా కాలువ

అఖాతం: సముద్ర అలల ద్వారా క్రమక్షయం చెందిన అర్ధచంద్రాకార భూస్వరూపాన్ని అఖాతం అంటారు. 

ఉదా: బంగాళాఖాతం

జలసంధి: రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూభాగాలను వేరుచేసే సన్నని సముద్ర జలభాగాన్ని జలసంధి అంటారు. 

ఉదా: బేరింగ్‌ జలసంధి, పాక్‌ జలసంధి

రిడ్జ్‌: సముద్ర అంతర్భాగంలోని ఎత్తయిన కొండలే రిడ్జ్‌. 

ఉదా: మిడ్‌ ఓషనిక్‌ రిడ్జ్‌ - అట్లాంటిక్‌ మహాసముద్రం

 

రచయిత: సక్కరి జయకర్‌ 
 

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌