• facebook
  • whatsapp
  • telegram

పరిశ్రమలు

ప్రగతి రథ చోదకాలు!


ఒక దేశం వ్యవస్థాగతంగా, వేగంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన తప్పనిసరి. వనరుల వినియోగంతో పాటు ఉపాధి అవకాశాలను, ఆర్థిక పుష్ఠిని అందించే ప్రధాన రంగమిది. ఒకప్పుడు ప్రపంచ కార్ఖానాగా వెలుగొందిన భారతదేశం వలస పాలనలో పారిశ్రామికంగా మసకబారింది. స్వాతంత్య్రానంతరం అమలుచేసిన పంచవర్ష ప్రణాళికలు ఆధునిక పారిశ్రామిక రంగానికి బాటలు వేశాయి. తొలుత యంత్ర, తయారీ ఆధారిత పరిశ్రమలు వృద్ధి చోదకాలుగా నిలిస్తే, నేడు విజ్ఞాన ఆధారిత పరిశ్రమలు కీలకంగా మారుతున్నాయి. ఈ పరిణామాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

 

భారతదేశం సహజ వనరుల నిలయం. ఆ వనరులను ముడి  సరకు చేసి వినియోగ వస్తువులుగా మార్చేందుకు పరిశ్రమలు చాలా ముఖ్యం. వాటి స్థాపనకు ముడిసరకులతో పాటు మనిషి బుద్ధి నైపుణ్యం, ఇంధనం, కార్మికులు, మూలధనం, మార్కెట్, రవాణా సౌకర్యాలు అవసరం. వీటి లభ్యత భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, ఆర్థిక స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది.


స్వాతంత్య్రానికి పూర్వమే మన దేశం వస్త్ర పరిశ్రమ, ఉక్కు  పరిశ్రమ, కుటీర పరిశ్రమలకు నిలయంగా ఉండేది. నేటి అభివృద్ధి చెందిన దేశాలకంటే ముందుగానే ఇక్కడ నాణ్యమైన వస్త్రాలు తయారయ్యేవి. దిల్లీలోని కుతుబ్‌మినార్‌ సమీపంలోని ఉక్కు స్తంభం 1500 ఏళ్ల క్రితం నాటి భారతీయుల నైపుణ్యాన్ని చాటుతోంది. చరిత్రలో డమాస్కస్‌లో వాడిన కత్తులను మన దేశంలోనే తయారు చేసినట్లు చెబుతారు. భారత్‌లో 1854లో మొదటి భారీ నూలు మిల్లు ముంబయి దగ్గర ప్రారంభమైంది. 1855లో కలకత్తా సమీపంలోని శ్రీరాంపూర్‌ వద్ద (రిష్రా) జనపనార మిల్లు, 1867లో కలకత్తా సమీపంలోని బాలీ వద్ద కాగితపు పరిశ్రమ, 1907లో జంషెడ్‌పుర్‌ వద్ద టాటా ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రారంభమయ్యాయి.


స్వాతంత్య్రానంతరం 1950 తర్వాత దేశంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమైంది. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో భారీ పరిశ్రమలు, నిత్యావసర వస్తువులు తయారుచేసే పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చారు. వీటిలో జౌళి పరిశ్రమ, లోహ తయారీ, ఇంజినీరింగ్, ఆహార ఉత్పత్తులు, రసాయనిక, ఇనుము ఉక్కు పరిశ్రమలు ముఖ్యమైనవి. మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో   ప్రాథమిక పరిశ్రమలు, యంత్ర నిర్మాణ పరిశ్రమలకు; నాలుగో ప్రణాళిక కాలంలో ప్రభుత్వరంగ పరిశ్రమల అభివృద్ధికి, అయిదో   ప్రణాళిక కాలంలో మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించారు. ఆరో ప్రణాళిక కాలంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగానికి సమ ప్రాధాన్యం ఇవ్వగా, ఏడో ప్రణాళిక కాలంలో ఆహార పదార్థాల పరిశ్రమలపై (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) ప్రధానంగా దృష్టిపెట్టారు. ఎనిమిదో ప్రణాళిక కాలంలో సరళీకృత ఆర్థిక విధానాలతో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి అన్నిరకాల పరిశ్రమలను ప్రోత్సహించారు. దీంతో ప్రైవేటు రంగంలో అభివృద్ధి   వేగవంతమైంది. తొమ్మిదో ప్రణాళిక కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గినప్పటికీ, 10వ ప్రణాళిక కాలంలో ఆ రంగం వృద్ధి 8%గా నమోదైంది. వస్తు తయారీ, ఆటోమొబైల్, మందుల పరిశ్రమల్లో గణనీయ వృద్ధి కనిపించింది. 11వ ప్రణాళిక కాలంలో ఈశాన్య రాష్ట్రాలకు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్ము-కశ్మీర్‌లకు అభివృద్ధి ప్రోత్సాహకాలను ప్రకటించారు. 12వ ప్రణాళిక కాలంలో వ్యవసాయ, గ్రామీణ పరిశ్రమలు, సమూహ ఉత్పత్తుల తయారీ, నూలు, వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభించింది.

 

 

వర్గీకరణ

1) ముడి పదార్థాలపై ఆధారపడిన పరిశ్రమలు 

వ్యవసాయాధారిత పరిశ్రమలు: నూలు, పొగాకు, తేయాకు పరిశ్రమలు.

అటవీ ఆధారిత పరిశ్రమలు: అగ్గిపెట్టె, కాగితపు పరిశ్రమలు.

పశుపోషణ ఆధారిత పరిశ్రమలు: ఉన్ని వస్త్రాలు, తోళ్ల శుద్ధి, మాంసం శుద్ధి పరిశ్రమ.

ఖనిజాధారిత పరిశ్రమలు: ఇనుము-ఉక్కు,   చమురుశుద్ధి, రసాయన ఎరువులు.

సముద్ర ఆధారిత పరిశ్రమలు: ఉప్పు తయారీ, కాడ్‌ లివర్‌ ఆయిల్‌ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ.

 

2) వ్యవస్థీకృత/ యాజమాన్యం ఆధారంగా వర్గీకరణ

ప్రభుత్వ రంగం: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేవి. 

ప్రైవేట్‌ రంగం: ప్రైవేటు వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహంతో నిర్వహించేవి. 

ఉమ్మడి రంగం: ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంయుక్తంగా నిర్వహించేవి.

సహకార రంగం: ఒకరికొకరు సహకరించుకునే విధానం.

 

3) ఉత్పాదకతల ఆధారంగా వర్గీకరణ

మౌలిక పరిశ్రమలు: ఇవి ఇతర పరిశ్రమల   స్థాపనకు దోహదపడతాయి.

ఉదా: ఇనుము-ఉక్కు, సిమెంట్, విద్యుత్‌ రంగం

వినియోగ వస్తు పరిశ్రమలు: వినియోగదారుడు నేరుగా ఉపయోగించేవి.

ఉదా: సబ్బు, కాగితం, షాంపూలు, చక్కెర

 

4) వార్షిక టర్నోవర్, పెట్టుబడి ఆధారంగా వర్గీకరణ

మెగా ప్రాజెక్టులు: రూ.500 కోట్లు, ఆపైన మూలధనం వ్యయం; 1000, అంతకుమించి ఉద్యోగులున్న ప్రాజెక్టు.

భారీ పరిశ్రమలు: రూ.200 కోట్ల వ్యయం, 200 మందికి ఉపాధి కల్పించేవి.

మధ్యతరహా పరిశ్రమలు: రూ.50 కోట్ల కంటే ఎక్కువ వ్యయం, వార్షిక టర్నోవర్‌ రూ.250 కోట్లు ఉన్న పరిశ్రమలు

చిన్న పరిశ్రమలు: రూ.10 కోట్ల పెట్టుబడి, వార్షికంగా రూ.50 కోట్ల టర్నోవర్‌ ఉన్న పరిశ్రమలు.

సూక్ష్మ పరిశ్రమలు: రూ.కోటి పైగా పెట్టుబడి, వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్లలోపు ఉన్న పరిశ్రమలు.

కుటీర పరిశ్రమలు: నామమాత్ర పెట్టుబడితో కుటుంబ సభ్యులు పూర్తిగా/ పాక్షికంగా నిర్వహించే పరిశ్రమలు.

* శ్రామికులు ఎక్కువగా అవసరం ఉండే పరిశ్రమలను శ్రమ ఆధారిత పరిశ్రమ అంటారు. ఉదా: నూలు వస్త్ర పరిశ్రమ. 

* అధిక మొత్తంలో పెట్టుబడులు అవసరమయ్యే పరిశ్రమలను పెట్టుబడి ఆధారిత పరిశ్రమలు అంటారు. ఉదా: ఇనుము, ఉక్కు పరిశ్రమలు. 

* ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగ పరిశ్రమలను విజ్ఞాన ఆధారిత పరిశ్రమలు అంటారు. 

* స్థిర ముడి పదార్థాలు, ఆధునిక పరిజ్ఞానం, అధిక పెట్టుబడితో నడిచే పరిశ్రమలను ఫుట్‌లూస్‌ పరిశ్రమలు అంటారు. ఉదా: వజ్రాలు, ఆభరణాల పరిశ్రమలు.

* నిరంతరాయంగా ముడి పదార్థాలు అవసరమయ్యే పరిశ్రమలను నాన్‌ ఫుట్‌లూస్‌ పరిశ్రమలు అంటారు.

 

 

2021-22 ఆర్థిక సర్వే ప్రకారం ప్రధాన పరిశ్రమలుగా గుర్తించినవి.. 

1) బొగ్గు    2) సహజ వాయువు   3) ముడిచమురు    4) రిఫైనరీ ఉత్పత్తులు   5) ఎరువులు       6) స్టీల్‌ (ఉక్కు)    7) విద్యుత్‌    8) సిమెంట్‌


* 2021-22 సర్వే ప్రకారం అత్యధిక పరిశ్రమలున్న రాష్ట్రాలు: 1) తమిళనాడు    2) మహారాష్ట్ర    3) గుజరాత్‌. 

* భవిష్యత్తులో కొత్తగా, అత్యధికంగా, వేగంగా అభివృద్ధి చెందే పరిశ్రమలను ‘సన్‌రైజ్‌ పరిశ్రమలు’ అంటారు. 

ఉదా:  హైడ్రోజన్‌ ఇంధన ఉత్పత్తి, పెట్రో కెమికల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, అంతరిక్ష పర్యాటకం. 

ర‌చ‌యిత‌:  డాక్ట‌ర్ గోప‌గోని ఆనంద్‌

Posted Date : 03-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌