• facebook
  • whatsapp
  • telegram

భూవనరులు

మట్టితోనే మనుగడ!

  పంటలు బాగా పండాలి. అందరికీ ఆహారం సమృద్ధిగా అందాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆక్సిజన్‌ అవసరమైనంత వాతావరణంలో చేరాలి. పర్యావరణాన్ని కాపాడాలి. చిన్న మొక్క పెద్ద వృక్షమై జీవుల అవసరాలను తీర్చాలి. అందుకు మట్టి కావాలి. అంటే భూగోళశాస్త్రం పరిభాషలో మృత్తికలు. సహజ వనరుల్లో అత్యంత కీలకమైన ఆ మృత్తికల రకాలు, లక్షణాలు, వాటిని కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  

  భూమి ఆవిర్భవించి 4.6 బిలియన్ల సంవత్సరాలైందని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి అది అంతర్గతంగా, బహిర్గతంగా అనేక మార్పులకు గురై నేటి మానవ జీవన విధానానికి అనుకూలంగా మారింది. ఒకప్పుడు అన్ని ఖండాలు కలిసి ఒక మహా ఖండం (పేంజియా)గా భూమి ఉండేది. క్రమంగా అది కొన్ని పలకలుగా విడిపోయి ఏడు ఖండాలు, అయిదు మహా సముద్రాలుగా విస్తరించింది. శిలలతో నిర్మితమైన ఖండాలు భౌతిక, రసాయనిక చర్యల వల్ల శిథిలమై క్రమంగా మృత్తికలుగా విస్తరించాయి. ఇవి ఒక దేశ ఆర్థిక, సాంస్కృతిక, సాంఘిక, ఆరోగ్య, పర్యావరణ అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రకృతిలో లభించే సహజ వనరుల్లో మృత్తికలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణించాలి. ఒక ప్రాంతంలోని వృక్ష సంపద, పంటల వైవిధ్యం ఆ ప్రాంతంలో విస్తరించిన మృత్తికలు/నేలలపై ఆధారపడి ఉంటాయి. 

  ప్రపంచవ్యాప్తంగా 36 బిలియన్‌ హెక్టార్ల భూవనరులు ఉంటే, అందులో 329 మిలియన్‌ హెక్టార్లు భారత దేశంలో ఉంది. భూస్వరూపం, శీతోష్ణ స్థితిగతులు, వృక్ష సంపదను బట్టి దేశంలో వైవిధ్యమైన మృత్తికలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా వాటి భౌతిక, రసాయనిక ధర్మాల్లో కూడా వ్యత్యాసాలు కనిపిస్తాయి. మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. మృత్తిక తయారవడం ఒక దీర్ఘకాల ప్రక్రియ. ఒక సెంటీమీటరు మందం మృత్తిక ఏర్పడటానికి సుమారుగా 400 ఏళ్లు పడుతుందని అంచనా. శిలాశిథిల పదార్థాన్ని మృత్తిక అంటారు. శిలల అధ్యయనాన్ని శాస్త్రాన్ని పెట్రాలజీ/లిథాలజీగా పేర్కొంటారు. కొన్ని చోట్ల నేలపైన కుళ్లిన జీవ పదార్థమైన ‘హ్యూమస్‌’ ఒక పొరలా విస్తరించి ఉంటుంది. అలాంటివి సారవంతమైన నేలలు.

  మృత్తికలు ఏర్పడే తీరును బట్టి రెండు రకాలుగా విభజించారు. 

 

స్థాన బద్ధ మృత్తికలు: ఇవి మాతృశిలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెంది అదే ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. వీటినే ఇన్‌సైటు నేలలు అంటారు.

ఉదా: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లేటరైట్‌ నేలలు, పర్వత నేలలు, ఎడారి నేలలు

 

స్థాన బద్ధంకాని నేలలు: ఈ రకమైన నేలలు మాతృశిలపై ఏర్పడిన తర్వాత నీరు/గాలి వల్ల వేరొక ప్రాంతానికి రవాణా చెంది, ఆ ప్రాంతంలో నిక్షేపితమవుతాయి. వీటినే పరస్థానీయ నేలలు లేదా ఎక్స్‌ సైటు నేలలు అంటారు. 

ఉదా: ఒండ్రు నేలలు, లోయిస్‌ నేలలు, మొరైన్‌ నేలలు. 

 

భారతదేశంలో నేలల రకాలు


మనదేశ భూస్వరూపం అనేక రకాలైన శిలలతో నిర్మితమైన శిలల మ్యూజియం లాంటిది. వాటికి తగ్గట్టుగానే దేశంలో వైవిధ్యమైన శీతోష్ణస్థితి లక్షణాలు కూడా ఉండటంతో అనేక రకాల భౌతిక, రసాయనిక లక్షణాలున్న నేలలు విస్తరించి ఉన్నాయి. అమెరికా శాస్త్రవేత్త వోలేకర్‌ 1893లో మొదటిసారిగా మన దేశ మృత్తికలపై అధ్యయనం చేశాడు. స్వాతంత్య్రానంతరం భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రిసెర్చ్‌) దేశంలోని మృత్తికలపై అధ్యయనం చేసి 1953లో 8 రకాల మృత్తికలున్నట్లు తెలిపింది.


1) ఒండ్రు మృత్తికలు: దేశ భౌగోళిక విస్తీర్ణంలో వీటి వాటా 43 శాతం. ఈ నేలలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం అంతటా, దేశంలో ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో సున్నం, పొటాషియం, కాల్షియం లాంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి. నైట్రోజన్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో ఆహార, వాణిజ్య రకానికి చెందిన అన్ని రకాల పంటలు పండుతాయి. ఇందులో పాత ఒండ్రు (బంగర్‌), కొత్త ఒండ్రు (ఖాదర్‌), సున్నం పొరను ఆవరించిన (కంకర) నేలలు అనే రకాలున్నాయి.  అయితే అక్కడక్కడ నిస్సారమైన ఆమ్ల, క్షార నేలలు కూడా విస్తరించి ఉంటాయి. వీటిని ఉత్తర మైదానంలో ప్రాంతీయంగా రే, కల్లార్, ఉషర్, రకర్, చోపన్‌ నేలలని  పిలుస్తారు. 


2) ఎర్రనేలలు: ఇవి గ్రానైట్, నీస్, సిస్ట్‌ లాంటి నేలలు శిథిలం కావడం వల్ల ఏర్పడతాయి. వీటిలో ఐరన్‌ ఆక్సైడ్‌ లేదా ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉండటంతో ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇనుము, మెగ్నీషియం ఎక్కువ; హ్యూమ‌స్‌
నైట్రోజన్‌ తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మన దేశంలో ద్వీపకల్ప పీఠభూమి వైపున, ముఖ్యంగా ఈశాన్య ఆగ్నేయ భాగాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు దేశంలో 18 శాతం వరకు ఉండి, రెండో ప్రధాన నేలలుగా నిలిచాయి. వీటిలో మొక్కజొన్న, జొన్న, రాగులు, వరి, వేరుశనగలు, పప్పుధాన్యాలు, కూరగాయలు లాంటి ఆహార పంటలు పండుతాయి.    


3) నల్లరేగడి నేలలు: వీటినే రేగురు నేలలు అంటారు. ఇందులో టైటానియం ఆక్సైడ్‌ కలిసి ఉండటంతో నలుపు రంగులో ఉంటాయి. ఇవి మన దేశంలో దక్కన్‌ పీఠభూమి వైపు మాత్రమే 15 శాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు లావా ఘనీభవించడంతో ఏర్పడిన బసాల్ట్‌ శిలలు శిథిలమై ఇవి ఏర్పడ్డాయి. వీటికి నీటిని నిల్వ చేసుకునే స్వభావం ఎక్కువ. వేసవిలో పగిలిపోయి, నెర్రెలు ఇచ్చి మట్టి మార్పిడి జరుగుతుంది. అందువల్ల వీటిని సెల్ఫ్‌ ప్లవింగ్‌ నేలలు అంటారు. ఇందులో పత్తి, పొగాకు, చెరకు, మిరప, పసుపు, నూనె గింజలు లాంటి వాణిజ్య పంటలు బాగా పండుతాయి. 


4) లేటరైట్‌ నేలలు: అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బసాల్ట్, అల్యూమినియం శిలలు శిథిలమైనప్పుడు ఇవి ఏర్పడతాయి. కొండ వాలు ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, వింధ్య పర్వతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ నేలల్లో తేయాకు, కాఫీ, రబ్బరు లాంటి తోటల పంటలు; సుగంధ ద్రవ్యాలు, మామిడి, జీడిమామిడి లాంటి ఉద్యానవన పంటలు ఎక్కువగా పండుతాయి. 


5) పర్వత నేలలు: ఇందులో హ్యూమస్‌ పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటినే అటవీ నేలలు అని కూడా అంటారు. ఇవి కొండల మధ్య లోయల్లో విస్తరించి ఉంటాయి. హిమాలయాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేలల్లో వరి, మొక్కజొన్నలతోపాటు పండ్ల తోటలు సాగు చేస్తారు. వీటిలో కరేవా నేలలు ప్రత్యేకమైనవి. సాధారణంగా సున్నపు నిక్షేపాల వల్ల ఏర్పడతాయి. జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్‌ వ్యాలీ, బద వ్యాలీలోనూ ఉన్నాయి. కుంకుమ  పువ్వు ప్రధానంగా పండుతుంది. బాదం, వాల్‌నట్, ఆపిల్‌ లాంటి వాటినీ సాగు చేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పలంపుర్, పుల్మావా, కుల్గాం ప్రాంతాల్లో నాణ్యమైన కుంకుమపువ్వు పండుతుంది. 


6) ఎడారి నేలలు:  ఇవి మన దేశంలో వాయవ్య ప్రాంతంలో రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోనూ, పంజాబ్, హరియాణా, నైరుతీ ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో ఫాస్ఫేట్లు, నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. తగినంత నీరు అందిస్తే నేల సారవంతంగా మారి జొన్నలు, సజ్జలు, పప్పుధాన్యాలు లాంటి పంటలు పండుతాయి. దేశంలో పొడవైన వ్యవసాయ కాలువగా పిలిచే ఇందిరాగాంధీ కాలువ/రాజస్థాన్‌ కాలువ రాజస్థాన్‌లోని అతి శుష్క ప్రాంతాలకు సాగునీరు అందిస్తోంది. 


7) ఆమ్ల, క్షార నేలలు: నిస్సారమైన ఈ నేలలు దేశంలో 1.29 శాతం ఉన్నాయి. నేల గాఢత 6.5 pH కంటే తక్కువగా ఉంటే ఆమ్ల నేలలుగా, అదే 7.5 pH కంటే ఎక్కువగా ఉంటే క్షార నేలలుగా పిలుస్తారు. ఇవి ఉత్తర మైదానంలº అక్కడక్కడ విస్తరించాయి. వీటిని సారవంతం చేయడానికి సున్నం లేదా జిప్సం ఎరువుగా వాడాలి. 


8) ఊబి నేలలు: వీటినే పీటీ నేలలు లేదా సేంద్రియ నేలలు అంటారు. పొటాషియం ఫాస్ఫేట్లు తక్కువగా ఉండి, హ్యూమస్‌ అధికంగా ఉంటుంది. దేశంలో 1.17% ఉన్నాయి.  కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లోనూ, పశ్చిమ బెంగాల్‌లో సుందరబన్స్‌ ప్రాంతంలోనూ, ఒడిశా, తమిళనాడు తీరాలకు దగ్గరలోనూ విస్తరించాయి. నల్లటి ఈ నేలలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. 

 

మృత్తికా క్రమక్షయం

  భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో మృత్తికా క్రమక్షయం ప్రధానమైంది. అధిక నీటి ప్రవాహం, పవనాలు, పశువుల గడ్డిమేత, అడవులు తొలగించడం లాంటి కారణాల వల్ల మృత్తిక కోసుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. దేశంలో 175 మిలియన్‌ హెక్టార్ల భూమిలో మృత్తికా క్రమక్షయం జరుగుతోంది. ఇది ఎక్కువగా ఎర్ర, నల్లనేలల్లో సంభవిస్తుంది. దేశంలో సాలీనా ప్రతి హెక్టారుకు 16.4 టన్నుల మట్టిని కోల్పోతున్నట్లు 1951లోనే ప్రణాళికా సంఘం తెలియజేసింది.

1) పటక్రమక్షయం: నేల పొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని పటక్రమక్షయం అంటారు. ఈ ప్రక్రియ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో జరుగుతోంది.

2) వంక క్రమక్షయం: పట క్రమక్షయం మరింతగా కొనసాగితే దానిపైన చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడతాయి. దీన్నే వంక క్రమక్షయం అంటారు. ఇది ద్వీపకల్పం వెంట జరుగుతోంది.

3) అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం ఇంకా కొనసాగితే లోతైన, వెడల్పైన లోయలు ఏర్పడతాయి. వీటినే అవనాళికలు అంటారు. చంబల్, యమునా నదీ ప్రాంతాల్లో 10 మిలియన్‌ హెక్టార్ల భూమి గల్మీలుగా మారిపోయింది. 

4) రిపారియన్‌ క్రమక్షయం: నదుల గట్లు కోసి తీయడాన్ని రిపారియన్‌ క్రమక్షయం అంటారు. ఇది పశ్చిమ బెంగాల్‌లో గంగానది ప్రాంతంలో జరుగుతుంది.

5) పవన క్రమక్షయం: ఎడారుల్లో వీచే గాలుల వల్ల రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాల్లో క్రమక్షయం జరుగుతుంది.

 

నివారణ చర్యలు: మృత్తికా క్రమక్షయాన్ని నివారించకపోతే నేల సారాన్ని కోల్పోతుంది. రిజర్వాయర్ల అడుగు భాగంలో మట్టి చేరడంతో వాటి నీటి సామర్థ్యం తగ్గి తిరిగి వ్యవసాయంపైన పరోక్షంగా ప్రభావాన్ని చూపుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి.

 

కాంటూర్‌ బండింగ్స్‌: వాలు ప్రాంతాల్లో అడ్డంగా గోడల్లాంటి నిర్మాణాలు చేసి మృత్తికా క్రమక్షయాన్ని ఆపే పద్ధతి. 

 

స్ట్రిప్‌ క్రాపింగ్‌: ఒక పంట పక్కనే మరొక పంటను జతగా వేసి మృత్తికా క్రమక్షయాన్ని ఆపవచ్చు.

 

స్టబుల్‌ మల్చింగ్‌: పంట కోతకొచ్చిన తర్వాత వాటి అడుగు భాగాలను కొంతకాలం నేలలో వదిలేయాలి.

 

టెర్రసింగ్‌: వాలు ప్రాంతాల్లో గట్లు కœట్టి పంటలు పండించాలి.

 

పోడు వ్యవసాయం: పొదలు, చెట్లు నరికి కాల్చి వాటి బూడిదపైన చేసే వ్యవసాయాన్ని నిరోధించాలి.

* మృత్తికా, జలవనరుల సంరక్షణ కోసం 8 ప్రాంతీయ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

1) హిమాలయ ప్రాంత పరిశోధనా కేంద్రం - దెహ్రదూన్‌

2) శివాలిక్‌ ప్రాంత పరిశోధనా కేంద్రం - చండీగఢ్‌  

3) రాజస్థాన్‌ అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - కోట

4) గుజరాత్‌ అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - పసద్‌ 

5) యమునా అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - ఆగ్రా

6) నల్లరేగడి నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం - బళ్లారి 

7) అటవీ నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం - ఉదక మండలం

8) ఎడారి నేలల పరిశోధనా కేంద్రం - జోధ్‌పుర్‌ 

 

రచయిత: జల్లు సద్గుణరావు 


 

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌