• facebook
  • whatsapp
  • telegram

అస్థిపంజర వ్యవస్థ

కదలడానికి.. కాపాడటానికి!

  అందరం అటూ ఇటూ కదులుతూ, పరిగెత్తుతూ, గెంతుతూ ఉంటాం. శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుతుంటాం. అయినా లోపల ఉండే ఏ భాగానికీ ఏమీ కాదు. అన్నీ సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక దృఢమైన ఎముకల వ్యవస్థ వాటిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఎటు కావాలంటే అటు కదలడానికి కూడా అదే సాయపడుతుంది. శరీరానికి ఒక రూపాన్ని ఇస్తూ, దాని నిర్మాణంలో అత్యంత కీలకంగా నిలిచిన ఆ అస్థిపంజర వ్యవస్థ గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.  

 

 

  జంతువుల శరీరంలో మిగతా భాగాల కంటే నెమ్మదిగా విచ్ఛిన్నమై భూమిలో కలిసిపోయేది, అన్నింటికంటే గట్టిగా ఉండేది అస్థిపంజరం. ఇది శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది. అంతర్భాగాలను కాపాడుతుంది. శరీరం లోపల లేదా బయట గట్టిగా ఉండి రక్షణ కల్పించే ఈ వ్యవస్థనే అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.

 

1) బాహ్య అస్థిపంజరం: ఇది శరీరం బయట ఉంటుంది. నిమ్నస్థాయి జంతువుల్లో బాహ్య అస్థిపంజరం మాత్రమే ఉంటుంది. 

ఉదా: కీటకాలపై ఉండే ఖైటిన్‌ పొర, మొలస్కా వర్గ జీవులైన నత్త, ఆల్చిప్ప, ముత్యపు చిప్ప లాంటి వాటిపై ఉండే కాల్షియం కార్బొనేట్‌తో నిర్మితమైన కర్పరం. 

 

2) అంతర అస్థిపంజరం: ఇది జంతువుల శరీరం లోపల ఉంటుంది. సకశేరుకాల్లో ఎముకలతో నిర్మితమైన వ్యవస్థను అంతర అస్థిపంజరం అని పిలుస్తారు.

 

మానవ అస్థిపంజర వ్యవస్థ

మానవుడిలో అంతర అస్థిపంజర వ్యవస్థ ఉంటుంది. పుట్టినప్పుడు మొత్తం 300 ఎముకలు ఉంటాయి. యుక్తవయసు వచ్చేసరికి వాటి సంఖ్య 206కు తగ్గుతుంది. మనిషిలో ఉండే మెత్తని ఎముకను మృదులాస్థి అంటారు. ఇది ముక్కు చివర, కీళ్ల మధ్య ఉంటుంది. బాహ్య చెవి, ఉప జిహ్విక, వాయునాళం మృదులాస్థితో నిర్మితమవుతాయి. మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజి అంటారు. 

 

ఎముకలో ఉండే పదార్థాలు:  ఎముకలో ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటివి ఉంటాయి. అయితే ఇవి కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం ఫాస్ఫేట్, మెగ్నీషియం కార్బొనేట్‌ రూపంలో ఉంటాయి. ఇవే కాకుండా పొటాషియం, క్లోరిన్, సోడియం, ఇనుము, ఫ్లోరిన్‌ లాంటివి కూడా స్వల్పంగా ఉంటాయి. 

 

విధులు:

* మానవ అస్థిపంజరం శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. 

* మెదడు, గుండె ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు రక్షణ కల్పిస్తుంది. 

* కీళ్ల సహాయంతో శరీర భాగాల కదలికలకు తోడ్పడుతుంది. 

* పెద్ద ఎముకల ఎముక మజ్జలో హీమోపాయిటిక్‌ కణజాలం ఉండి రక్తం ఉత్పత్తికి తోడ్పడుతుంది.

* ఎముకలు కాల్షియం, మెగ్నీషియం మూలకాలకు నిల్వ స్థావరాలుగా పనిచేస్తాయి. 

* పక్కటెముకలు శ్వాసక్రియకు సహాయపడతాయి. 

* మధ్యచెవిలోని అస్థులు వినడంలో ఉపయోగపడతాయి.

* కొన్ని ఎముకల మధ్య అడిపోజ్‌ కణజాల రూపంలో కొవ్వు నిల్వ ఉంటుంది.

 

కీళ్లు

 

ఎముకలు ఒకదాంతో మరొకటి కలిసి ఉండే దాన్ని కీలు అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి.

1) కదలని కీళ్లు: ఇవి పుర్రెలో ఉంటాయి. 

2) పార్శ్వంగా (కొద్దిగా) కదిలే కీళ్లు: ఇవి జఘన సంధానం, వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య ఉంటాయి. 

3) కదిలే కీళ్లు: మన శరీరంలో ఎక్కువగా ఉండేవి కదిలే కీళ్లు. ఇవి కదిలే విధానాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. 

 

బంతిగిన్నె కీలు: దీనిలో ఒక ఎముక చివర బంతిలా ఉండి ఇంకొక ఎముక గిన్నె లాంటి భాగంలో ఇమిడి ఉంటుంది. ఇది గుండ్రంగా, అన్ని వైపులా కదలడానికి సహాయపడుతుంది. 

ఉదా: భుజవలయ కీలు, తుంటి కీలు.

 

మడత కీళ్లు: ఇవి ఒకే వైపు లేదా ఒకే కోణంలో కదలడానికి ఉపయోగపడతాయి. మోకాలు, మోచేయి, చీలమండ కీళ్లు, వేలి ఎముకల కీళ్లు వీటికి ఉదాహరణ.

 

ఇరుసు కీలు/బొంగరపు కీలు: దీనిలో ఆధారానికి అతికి ఉన్న ఒక ఎముకపై ఇంకొక ఎముక తిరుగుతుంది. ఉదాహరణకు వెన్నెముకలో శీర్షధరం ఎముకకు, అక్షం ఎముకకు మధ్య ఉన్న కీలు. అంటే ఈ కీలు మెడలో ఉంటుంది. 

 

జారుడు కీళ్లు: వీటిలో ఒక ఎముక మరొక ఎముకపై జారుతుంది. 

ఉదా: మణికట్టులో ఉన్న మణిబంధాస్థికల మధ్య ఉన్న కీళ్లు,  చీలమండ ఎముకల మధ్య ఉన్న కీళ్లు. 

 

కోణియాస్థి కీళ్లు: ఒక ఎముక మరొక ఎముకపై ముందుకు వెనక్కు, పక్కలకు రెండు వైపులా కదులుతుంది. 

ఉదా: మణికట్టు కీళ్లు, కరభాస్థిక అంగుళ్యాస్థుల కీళ్లు. 

కీళ్ల గురించిన అధ్యయనాన్ని ఆర్ద్రాలజి అంటారు. వాటికి కలిగే వ్యాధిని ఆర్ద్రరైటిస్‌ అంటారు. ఆర్ద్రరైటిస్‌ మూడు రకాలుగా ఉంటుంది.

 

1) ఆస్టియో ఆర్ద్రరైటిస్‌: వృద్ధాప్యంలో కీళ్ల మధ్య సైనోవియల్‌ ద్రవం స్రవించడం తగ్గిపోవడం వల్ల మృదులాస్థి తగ్గి కీళ్లు అరిగిపోయే వ్యాధి. 

 

2) రూమటాయిడ్‌ ఆర్ద్రరైటిస్‌: కీళ్ల మధ్య ఉండే సైనోవియల్‌ పొర వాపు వల్ల కలిగే నొప్పి. ఇది ఆటో ఇమ్యునో వ్యాధి. 

 

3) గౌట్‌: దీన్నే గౌటి ఆర్ద్రరైటిస్‌ అంటారు. కీళ్ల మధ్య యూరికామ్ల స్ఫటికాలు జమకూడటం వల్ల కీళ్లలో కలిగే నొప్పి. 

  మన శరీరంలో ఉండే కొన్ని ఎముకల సంఖ్య, వాటి పేర్లు:  తలలో 29 ఎముకలు ఉంటాయి. వాటిలో కపాలంలో 8, ముఖంలో 14, చెవుల్లో 6, నాలుక కింద కాంఠిక ఒకటి ఉంటాయి.

 

చెవిలో ఉండే ఎముకలు: చెవిలో 3 ఎముకలు (కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి) ఉంటాయి. ఇవి వినడానికి ఉపయోగపడతాయి. వీటిలో కర్ణాంతరాస్థి అతి చిన్న ఎముక. 

 

వెన్నెముకలో ఉండే ఎముకలు: చిన్న పిల్లల వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. వీటిలో మెడ భాగంలో 7 గ్రీవ కశేరుకాలు, ఛాతి వెనుక 12 ఉరఃకశేరుకాలు, ఉదరం వెనుక 5 కటి కశేరుకాలు, కటి భాగంలో 5 త్రిక కశేరుకాలు, చివరగా 4 అనుత్రిక కశేరుకాలు ఉంటాయి. పెద్దవారిలో త్రిక కశేరుకాలు 5 కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడుతుంది. అనుత్రిక కశేరుకాలు 4 కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడుతుంది. కాబట్టి పెద్దవారి వెన్నెముకÛలోని వెన్నుపూసల సంఖ్య 26 (7 + 12 + 5 + 1 + 1). వెన్నెముక వెన్నుపాముకు రక్షణ కల్పిస్తుంది. తల కదలడానికి, పక్కటెముకలు అతకడానికి ఉపయోగపడుతుంది.

 

పక్కటెముకలు: 12 జతల పక్కటెముకలు (24) వెన్నెముకలోని ఉరఃకశేరుకాలకు అతికి ఉంటాయి. వీటిలో మొదటి 7 జతలు ఛాతి భాగంలోని ఉరోస్థికి అతికి ఉంటాయి. కాబట్టి వీటిని నిజమైన పక్కటెముకలు అని అంటారు. తరువాత 3 (8, 9, 10వ) జతలు నేరుగా ఉరోస్థికి అతకకుండా అన్నీ కలిసి 7వ జతకు అతికి ఉంటాయి. వీటిని మిథ్యా పక్కటెముకలు అంటారు. చివరి 2 పక్కటెముకలు అంటే 11, 12 జతలు వెనుకగా వెన్నెముకకు అతికినా ముందుభాగంలో దేనికి అతికి ఉండవు. వీటిని తేలియాడే పక్కటెముకలు అంటారు. 

 

చేతిలో ఉండే ఎముకలు: మన శరీరంలో ఒక్కొక్క చేతిలో 30 ఎముకలు ఉంటాయి. అవి భుజాస్థి - 1. ఇది దండచేయిలో ఉంటుంది. రత్ని, అరత్ని అనే రెండు ఎముకలు ముంజేతిలో ఉంటాయి. మణి బంధాస్థికలు 8 మణికట్టులో ఉంటాయి. కరభాస్థులు 5 అరచేతిలో ఉంటాయి. అంగుళ్యాస్థులు 14 చేతి వేళ్లలో ఉంటాయి. చేతిలో ఎముకల అమరిక 1 + 2 + 8 + 5 + 14 = 30గా ఉంటుంది.

 

కాలిలో ఉండే ఎముకలు: మన శరీరంలో ఒక్కో కాలిలో 30 ఎముకలు ఉంటాయి. అందులో తొడ ఎముక ఒకటి. ఇది శరీరంలో పొడవైన ఎముక. అంతర్జంఘిక, బహిర్జంఘిక/జానుక అనే రెండు ఎముకలు మోకాలులో ఉంటాయి. మోకాలిచిప్పలో 1 ఉంటుంది. చీలమండలో 7 చీలమండ ఎముకలు ఉంటాయి. పాదంలో 5 పాదాస్థికలు, కాలివేళ్లలో 14 అంగుళ్యాస్థులు ఉంటాయి. కాలిలో ఎముకల అమరిక 1 + 2 + 1 + 7 + 5 + 14 = 30గా ఉంటుంది.

 

మాదిరి ప్రశ్నలు


1. కింది ఏ జీవుల్లో బాహ్య అస్థిపంజరం కాల్షియం కార్బొనేట్‌తో ఉంటుంది?   

a) మొలస్కా జీవులు     b) ఆర్ధ్రోపొడా జీవులు

c) చేపలు           d) అనెలిడా జీవులు


2. మానవుడిలో యుక్త వయస్సులో ఉండే ఎముకల సంఖ్య 

a) 300      b) 206     c)  202     d) 330

 

3. మన శరీరంలో అతిచిన్న ఎముక స్టేపస్‌ ఎక్కడ ఉంటుంది?

a) తల    b) కాలు    c) చెవి    d) చేయి  

 

4. మానవ అస్థిపంజర వ్యవస్థ విధులు 

a) శరీరానికి ఆకారాన్నిస్తుంది. 

b) గమనానికి, శరీర భాగాల కదలికకు తోడ్పడుతుంది. 

c) ముఖ్య భాగాలకు రక్షణ కల్పిస్తుంది. 

d) పైవన్నీ


5. కీళ్ల మధ్య యూరికామ్ల స్ఫటికాలు జమకూడటం వల్ల కలిగే వ్యాధి-

a) ఆస్టియో ఆర్ద్రరైటిస్‌     b) రూమటాయిడ్‌ ఆర్ద్రరైటిస్‌  

c) గౌట్‌                d) సైనోవైటిస్‌ 


6. మెత్తని ఎముక మృదులాస్థి మన శరీరంలో ఏ భాగాల్లో ఉంటుంది?

a) ముక్కు చివర     b) కీళ్ల మధ్య     c) బాహ్య చెవిలో  d) పై అన్ని భాగాల్లో 


7. మన శరీరంలో హీమోపాయిటిక్‌ కణజాలం ఉండే ప్రదేశం?

a) మూత్రపిండం       b) గుండె 

c) ఎముక మజ్జ      d) మెదడు 


8. మానవ అస్థిపంజరంలో కదలని కీళ్లు ఏ భాగంలో ఉంటాయి?

a)  ముఖం    b) ఛాతి భాగం    c) వెన్నెముక   d) పుర్రె  


9. ఒకే కోణంలో లేదా ఒకే వైపు కదలడానికి ఉపయోగపడే కీళ్లు 

a) మడత కీళ్లు  b) ఇరుసు కీలు     c) బంతిగిన్నె కీలు  d) బొంగరపు కీలు  


10. ఇరుసు కీలు లేదా బొంగరపు కీలు మన శరీరంలో ఎక్కడ ఉంటుంది?

a) వేలి ఎముకలు  b) భుజ వలయం    c) శీర్షధరం, అక్షం ఎముక మధ్య    d) కాలి వేళ్ల ఎముకలు 

 

జవాబులు

1 - a,  2 - b, 3 - c, 4 - d, 5 - c, 6 - d, 7 - c, 8 - d, 9 - a, 10 - c.

 

రచయిత: డాక్టర్‌ బి. నరేష్‌ 

Posted Date : 28-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌