• facebook
  • whatsapp
  • telegram

విటమిన్లు - ఖనిజ లవణాలు

జీవక్రియలకు జవసత్వాలు!

  తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? అందుకు కారణం వైరస్‌లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు. తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి సూక్ష్మపోషకం కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. అది లోపిస్తే  అనేక రుగ్మతలు కలుగుతాయి. నిత్యజీవితంలో సైన్స్‌ అధ్యయనంలో భాగంగా జీవక్రియలకు జవసత్వాలను అందించే ఆ పోషకాల ప్రత్యేకతలు, అవి లభించే పదార్థాలు, తక్కువైతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

విటమిన్లలో కొన్ని మన శరీరంలో అద్భుతమైన ప్రక్రియలను నిర్వహిస్తాయి. కణాల్లో జరిగే జీవక్రియలకు, కణాల మరమ్మతుకు, వ్యాధుల నిరోధానికి ఉపయోగపడతాయి. వాటిలో విటమిన్‌ సి, డి, ఇ, కె మరీ ముఖ్యమైనవి. ఇంకా ఖనిజ లవణాలూ అవసరమైనవే.

 

విట‌మిన్‌లు

విటమిన్‌-సి: దీని రసాయనిక నామం ఆస్కార్బిక్‌ ఆమ్లం. ఇది గాయాలను మాన్పుతుంది. చర్మంలో కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి సాయపడుతుంది. తీసుకున్న ఆహారంలోని ఇనుము శోషణకు తోడ్పడుతుంది. వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే శరీర కణాల్లో ఏర్పడే స్వేచ్ఛా అయాన్లు కలగజేసే నష్టం నుంచి రక్షణ కల్పిస్తుంది. విటమిన్‌-సి ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు జమకూడటం వల్ల కలిగే అథిరోస్ల్కేరోసిస్‌ తీవ్రత తగ్గుతుంది. దీని లోపం వల్ల   స్కర్వీ వ్యాధి వస్తుంది.

 ఈ విటమిన్‌-సి అత్యధికంగా రోజ్‌హిప్‌ ఫలంలో ఉంటుంది. ఇంకా ఉసిరి, నిమ్మజాతి ఫలాలైన నిమ్మ, దానిమ్మ, బత్తాయిల నుంచి లభిస్తుంది. జామలోనూ ఎక్కువే. ఆహార పదార్థాలను ఎక్కువగా వేడిచేస్తే వాటిలోని విటమిన్‌ సి తగ్గిపోతుంది. దీన్ని యాంటీహిస్టమైన్, యాంటీస్కర్వీ ఫ్యాక్టర్‌ అని కూడా పిలుస్తారు.

 

విటమిన్‌-డి: దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్‌. యాంటీరికెట్స్‌ ఫ్యాక్టర్‌ అని కూడా అంటారు. ఇది డి2, డి3 రూపాల్లో ఉంటుంది. డి1 రూపంలో ఉండదు. విటమిన్‌ డి2ను ఎర్గోకాల్సిఫెరాల్, విటమిన్‌ డి3ను కోల్‌కాల్సిఫెరాల్‌ అంటారు. విటమిన్‌-డి సాధారణ పెరుగుదలకు, చిన్నపేగుల నుంచి కాల్షియం, ఫాస్ఫరస్‌ శోషణకు అవసరమవుతుంది. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోమలేసియా అనే వ్యాధులు వస్తాయి. 

 కాడ్‌ చేప కాలేయ నూనె, వెన్న, పాలు, కాలేయం నుంచి విటమిన్‌-డి లభిస్తుంది. శరీరంపై సూర్యకిరణాలు పడినప్పుడు చర్మంలోని 7-డీహైడ్రో కొలెస్ట్రాల్‌ విటమిన్‌-డిగా మారుతుంది. కాబట్టి ఈ విటమిన్‌ను సన్‌షైన్‌ విటమిన్‌ (సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్‌) అంటారు. 

 

విటమిన్‌-ఇ: దీని రసాయననామం టోకోఫెరాల్‌. దీన్ని ఫెర్టిలిటీ విటమిన్‌ లేదా యాంటీస్టెరిలిటీ విటమిన్‌ అంటారు. ఇది బీజకోశాల పనితీరుకు అవసరం. ఈ విటమిన్‌ వెరికోస్‌వీన్స్, అథిరోస్ల్కేరోసిస్‌ వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్‌-ఇ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, ఆడవారిలో గర్భస్రావం లాంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఈ విటమిన్‌ చాలా అవసరం. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

ఈ విటమిన్‌ పత్తిగింజల నూనె, ఆకుకూరలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగల నుంచి లభిస్తుంది. గోధుమ బీజకవచ నూనెలో ఈ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. చర్మంపై మచ్చలు, గీతలు, ముడతలను పోగొడుతుంది. కాబట్టి దీన్ని బ్యూటీ విటమిన్‌ లేదా సౌందర్య పోషక విటమిన్‌ అంటారు.

 

విటమిన్‌-కె: దీని రసాయన నామం ఫిల్లోక్వినోన్‌. రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడే రసాయనమైన ప్రోత్రాంబిన్‌ తయారీకి ఇది అవసరం. దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టడం ఆలస్యమవుతుంది. పరోక్షంగా ఈ విటమిన్‌ రక్తం గడ్డకట్టడానికి సాయపడుతుంది. కాబట్టి దీన్ని యాంటీహెమరేజిక్‌ ఫ్యాక్టర్‌ లేదా కొయాగ్యులేషన్‌ విటమిన్‌ అంటారు. ఆకుకూరలు, కాలేయం, సోయా, పాలు, గుడ్లలో ఎక్కువగా లభిస్తుంది.

 

ఖ‌నిజ ల‌వ‌ణాలు

ఖనిజ లవణాలు మనశరీరానికి కావాల్సిన సూక్ష్మపోషక పదార్థాలు. శరీరంలో ఇవి కణబాహ్య, కణాంతర్గత ద్రవాల్లో భాగంగా ఉంటాయి. 

 

సోడియం: శరీరంలో నీరు, అయాన్ల సమతాస్థితికి, నాడీ ప్రచోదనాల ప్రసారానికి అవసరం. పైత్యరసం లవణాలు ఏర్పడటానికి సోడియం ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని ముఖ్యమైన కేటయాన్‌. దీని లోపం వల్ల హైపోనేట్రిమియా కలుగుతుంది. ఉప్పు, కూరగాయలు, పండ్ల నుంచి ఇది లభిస్తుంది.

 

పొటాషియం: ఈ లవణం కణద్రవ్యంలో ఉండే ముఖ్యమైన కేటయాన్‌. నాడీప్రచోదనాల ప్రసారానికి, ద్రవాభిసరణ క్రమతకు అవసరం. ఇది మన శరీరంలో తగ్గితే నాడీసంబంధ సమస్యలు, కండర సంకోచం సరిగ్గా జరగకపోవడం, గుండె వేగం తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. పొటాషియం లోపం వల్ల హైపోకాలిమియా స్థితి కలుగుతుంది. ఇది అరటి పండ్లు, కూరగాయలు, ఎండు ఫలాల్లో లభిస్తుంది.  

 

క్లోరిన్‌: ప్లాస్మా, కణబాహ్యద్రవాల్లో ముఖ్య ఆనయాన్‌గా ఉంటుంది. ఇది శరీరంలో ద్రవాభిసరణ క్రమతకు, ఆమ్ల-క్షార సమతౌల్యతకు, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఏర్పడటానికి అవసరం. లాలాజలం, చెమట, కన్నీళ్లలో కూడా క్లోరిన్‌ ఉంటుంది. ఉప్పు, కూరగాయలు, వెన్న నుంచి లభిస్తుంది. 

 

కాల్షియం: దంతాలు, ఎముకలు ఏర్పడటానికి అవసరం. రక్తం గడ్డకట్టడానికి, నాడీ ప్రచోదనాల ప్రసారానికి, కండర సంకోచానికి ఉపయోగపడుతుంది. దీని లోపం వల్ల ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి (ఎముకలు బలహీనంగా ఉండి తొందరగా విరుగుతాయి), ఎముకలు, దంతాలు సరిగ్గా ఏర్పడక పోవడం, పెరుగుదల లేకపోవడం లాంటివి జరుగుతాయి.  పాలు, పాల పదార్థాలు, రాగులు, కూరగాయల నుంచి విరివిగా కాల్షియం లభిస్తుంది. 

 

ఫాస్ఫరస్‌: ఎముకలు, దంతాలు ఏర్పడటానికి ఇది అవసరం. కేంద్రకామ్లాలైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ఏటీపీ (అడినోసైన్‌ ట్రైఫాస్ఫేట్‌)ల్లో అంతర్భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల ఎముకలు, దంతాలు సరిగా ఏర్పడవు. పాలు, ధాన్యాలు, గుడ్లు, చేపల నుంచి లభిస్తుంది.

 

ఇనుము: ఇది ఎర్రరక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌లో భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల రక్తహీనత వస్తుంది. దీన్ని పోషకాహార రక్తహీనత అంటారు. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. ఆకుకూరలు, ఎండు ఫలాలు, గుడ్లు, కాలేయం, యాపిల్స్‌లో దొరుకుతుంది.

 

అయోడిన్‌: ఈ ఖనిజ లవణం గొంతు భాగంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు చాలా అవసరం. థైరాయిడ్‌ గ్రంథి స్రవించే థైరాక్సిన్‌ హార్మోన్‌లో అంతర్భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల సరళ గాయిటర్‌ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధిలో థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బుతుంది. అయోడిన్‌ లోపం వల్ల గర్భిణుల్లో గర్భస్రావం, చిన్నపిల్లల్లో మానసిక వైకల్యం వస్తుంది. సముద్ర ఆహారం, ఆకుకూరలు, పండ్లు, అయోడైజ్‌డ్‌ ఉప్పు వంటి వాటి ద్వారా అయోడిన్‌ లభిస్తుంది. అయోడిన్‌ లోపాన్ని నియంత్రించేందుకు తినే ఉప్పులో అయోడిన్‌ కలపడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

 

జింక్‌: ఈ ఖనిజ లవణం కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణాకు, విటమిన్‌-ఎ జీవక్రియకు, కంటిచూపు కోసం, గాయాలు మానడానికి అవసరం. ఇది ఎంజైమ్‌ల్లో కో-ఫ్యాక్టర్‌గా ఉంటూ వాటి ఉత్తేజానికి సాయపడుతుంది. జింక్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. డయేరియాను నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల శ్వాసక్రియలో తగ్గుదల, శుక్ర కణాలు సరిగా ఏర్పడకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. బీట్‌రూట్, గుడ్డు, వెన్న, కూరగాయల నుంచి ఇది లభిస్తుంది.

 

మెగ్నీషియం: ఇది ఎంజైమ్‌ల ఉత్తేజానికి, నాడీ విద్యుత్‌ ప్రచోదనాలకు అవసరం. ఎముకల్లో ఉంటుంది. దీని లోపం వల్ల కండరాల సమస్యలు, గుండె, రక్తనాళాల పనితీరు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. మెగ్నీషియం పూర్తిగా ధాన్యాలు, ఆకుకూరల నుంచి లభిస్తుంది.

 

మాంగనీస్‌: ఇది ప్రత్యుత్పత్తి సంబంధ జీవక్రియలకు, ఎంజైమ్‌ల ఉత్తేజానికి, జ్ఞాపకశక్తికి అవసరం. దీని లోపం వల్ల ప్రత్యుత్పత్తి సమస్యలు కలుగుతాయి. ఇది కాలేయం, వేరుశనగ, కూరగాయల నుంచి లభిస్తుంది. 

 

రాగి: ఎంజైమ్‌ల ఉత్తేజానికి, హిమోగ్లోబిన్, చర్మంలో మెలనిన్‌ తయారీకి ఉపయోగపడుతుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జీడిమామిడి, పొద్దు తిరుగుడు, వేరుశనగ, కాలేయం లాంటి పదార్థాల నుంచి లభిస్తుంది.

 

సల్ఫర్‌: సిస్టీన్, మిథియోనైన్‌ వంటి అమైనో ఆమ్లాల్లో భాగంగా ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, చిక్కుళ్ల నుంచి లభిస్తుంది.

 

సెలీనియం: ఇది ఎంజైమ్‌ల్లో సహ కారకంగా ఉంటూ వాటిని ఉత్తేజితం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్‌-ఇతో కలిసి చర్యల్లో పాల్గొంటుంది. దీని లోపం వల్ల చైనాలో కెషాన్‌ వ్యాధి బయటపడింది. ఈ వ్యాధిలో హృదయ కండరం దెబ్బతింటుంది. సముద్ర ఉత్పత్తులు, కూరగాయల నుంచి సెలీనియం లభిస్తుంది.

 

ఫ్లోరిన్‌: దంతాలపై ఎనామిల్‌ ఏర్పడటానికి ఇది అవసరం. వాటి పెరుగుదలకు సహకరిస్తుంది. దీని లోపం అరుదుగా ఉంటుంది. లోపం ఎక్కువగా ఉంటే దంతక్షయం కలుగుతుంది. ఇది తాగునీరు, కూరగాయల నుంచి లభిస్తుంది. తాగునీటిలో 1.5 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (ppm) కంటే ఎక్కువ ఫ్లోరిన్‌ ఉంటే ఫ్లోరోసిస్‌ వ్యాధి కలుగుతుంది. భూగర్భ జలాలను తాగునీటిగా వాడే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరోసిస్‌ వ్యాధిలో దంతాలు, ఎముకలు ప్రభావితమవుతాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1.  విటమిన్-సి మన శరీరానికి ఏ విధంగా అవసరం?

1) గాయాలు మానడానికి        2) స్కర్వీ వ్యాధి రాకుండా ఉండటానికి    

3) దగ్గు, జలుబు నుంచి రక్షణకు    4) పైవన్నీ

జ: పైవన్నీ

 

2. రోజ్‌హిప్‌ ఫలాల్లో ఎక్కువగా ఏ విటమిన్‌ ఉంటుంది?

1) విటమిన్‌-సి   2) విటిమిన్‌-డి    3) విటమిన్‌-ఇ    4) విటమిన్‌-కె

జ: విటమిన్‌-సి​​​​​​​

 

3. ఏ ఖనిజలవణం లోపం వల్ల ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి వస్తుంది?

1) సోడియం    2) పొటాషియం    3) కాల్షియం   4) ఫాస్ఫరస్‌

జ: కాల్షియం   ​​​​​​​

 

4. కింది ఏ ఖనిజ లవణం హిమోగ్లోబిన్‌లో అంతర్భాగంగా ఉంటుంది?

1) రాగి   2) ఇనుము    3) మాంగనీస్‌    4) మెగ్నీషియం

జ: ఇనుము    ​​​​​​​

 

5. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్‌-కె కింది ఏ రసాయనం తయారీకి అవసరం?

1) ప్రోత్రాంబిన్‌   2) ఫైబ్రిన్‌ తంతువులు    3) బైలిరూబిన్‌   4) బైలివర్డిన్‌

జ: ప్రోత్రాంబిన్‌   ​​​​​​​

 

6. విటమిన్‌-డి లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి?

1) రికెట్స్‌    2) ఆస్టియోమలేషియా    3) ఆస్టియోపోరోసిస్‌    4) ఫ్లోరోసిస్‌

జ: రికెట్స్‌    ​​​​​​​

 

7. థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అవసరమైన మూలకం?

1) క్లోరిన్‌    2) అయోడిన్‌    3) ఫాస్ఫరస్‌     4) మెగ్నీషియం

జ: అయోడిన్‌    ​​​​​​​

 

8. జింక్‌ మనశరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?

1) విటమిన్‌-ఎ జీవక్రియకు          2) ఎంజైమ్‌ల ఉత్తేజానికి     

3) వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి     4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌