• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు

భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్వయాన్ని సాధించడం దీని ఉద్దేశం. స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, ఆశయాలు, జాతీయ నాయకుల ఉదాత్త భావనల ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇది అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


ఆర్టికల్‌ 356 దుర్వినియోగం
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమై, పరిపాలన సక్రమంగా నిర్వహించడానికి వీలులేనప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను ఉపయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన/ రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ స్వప్రయోజనాల కోసం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ ఆర్టికల్‌ను ప్రయోగిస్తుంది. ఇలా ఇది దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టికల్‌ 356ను వ్యతిరేకించిన పార్టీలే, అధికారం చేపట్టాక దాని సాయంతోనే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నాయి.
* 1977లో కేంద్రంలో మొరార్జీదేశాయ్‌ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న బి.డి.జెట్టి (తాత్కాలిక రాష్ట్రపతి) ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 9 రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, వాటిని రద్దు చేశారు. ఈ విధంగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, పశ్చిమ్‌ బంగా, ఒడిశా ప్రభుత్వాలు రద్దయ్యాయి.
* 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెస్‌ఏతర రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్‌ ప్రభుత్వాలు అందులో ఉన్నాయి.
* ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపుల కారణంగా రద్దవడం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాల్‌గా పేర్కొనవచ్చు. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది.
* డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆర్టికల్‌ 356ను రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా పేర్కొన్నారు.
* 1969లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజమన్నార్‌ కమిటీ, 1977లో పశ్చిమ్‌ బంగా ప్రభుత్వం రూపొందించిన మెమొరాండం ఆర్టికల్‌ 356ను రాజ్యాంగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి.


సుప్రీంకోర్టు తీర్పులు
ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1994): రాష్ట్రపతి పాలన విధింపును న్యాయస్థానాల్లో సవాల్‌ చేయొచ్చని, ఇది న్యాయ సమీక్షకు అతీతం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భారత సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఆర్టికల్‌ 356ను ప్రయోగించకూడదని, రాష్ట్రపతి పాలన విధింపును న్యాయస్థానం తిరస్కరిస్తే రద్దయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.


గడియారం ముల్లును వెనక్కి తిప్పండి:
* అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని 2016, జులై 13న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో గడియారం ముల్లును వెనక్కి తిప్పాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.
* 2002లో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ తన నివేదికను  ప్రభుత్వానికి సమర్పించింది. అందులో మనదేశంలో ఆర్టికల్‌ 356ను వంద సార్లకు పైగా దుర్వినియోగం చేశారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంది.

 

శాసన - న్యాయ శాఖల మధ్య వివాదం
* శాసన - న్యాయ శాఖల మధ్య తరచూ వివాదాలు రావడం, ఒక శాఖపై మరొకటి ఆధిపత్య ధోరణికి ప్రయత్నించడం, న్యాయ శాఖ అతిక్రియాశీలత మొదలైనవి రాజ్యాంగం కొత్తగా ఎదుర్కొంటున్న సవాళ్లు.


సుప్రీంకోర్టు తీర్పులు
కామేశ్వరి సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు: 
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ‘బిహార్‌లో అమలు చేసిన భూ సంస్కరణలు చెల్లుబాటు కావు’ అని ప్రకటించింది. దీంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. రాజ్యాంగానికి 9వ షెడ్యూల్‌ను చేర్చి, అందులో భూసంస్కరణల చట్టాలను పొందుపరిచింది. ఈ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష అధికారం’ లేకుండా చేశారు. దీని ద్వారా శాసన వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించే ప్రయత్నం చేసింది.


గోలక్‌ నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): 
* ‘‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదు. సాధారణ చట్టాలతో పాటు రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా న్యాయసమీక్ష చేస్తాం. ప్రాథమిక హక్కులను పార్లమెంట్‌ సవరించాలంటే కొత్తగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలి’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులో ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని పేర్కొంది.


ఆర్‌.సి.కూపర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - కీలక అంశాలు:
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969లో 14 ప్రైవేట్‌ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. దీనికోసం రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇస్తున్న రాజభరణాలను రద్దుచేస్తూ అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్‌ 123 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీచేశారు. దీన్ని సుప్రీంకోర్టు రద్దుచేసింది. 
* సుప్రీంకోర్టుపై ఆధిపత్యాన్ని సాధించేందుకు పార్లమెంట్‌ 1971లో 25, 26వ రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది.
* 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రైవేట్‌ ఆస్తుల జాతీయీకరణ కోసం పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయకూడదని నిర్దేశించారు.
* 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘‘రాజభరణాల రద్దు’’ అంశానికి చట్టబద్ధత కల్పించారు.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దీని ద్వారా ఆర్టికల్‌ 368కి 4వ సెక్షన్‌ను చేర్చారు. ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగానికి చేసే సవరణలను ఏ న్యాయస్థానంలోనూ సవాల్‌ చేయకూడదని నిర్దేశించారు.


మినర్వామిల్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1980):
* ఈ కేసులో సుప్రీంకోర్టు  తీర్పు ఇస్తూ పార్లమెంట్‌ ఆర్టికల్‌ 368కి చేర్చిన 4వ సెక్షన్‌ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, అది చెల్లుబాటు కాదు అని పేర్కొంది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ప్రకటించింది.

 

రాష్ట్రపతి పాలన - ప్రభావం
* ఏదైనా రాష్ట్రంలో కేంద్రం ఆర్టికల్‌ 356ను విధిస్తే కింది మార్పులు సంభవిస్తాయి.
* రాష్ట్ర జాబితాలోకి కేంద్ర ప్రభుత్వం చొచ్చుకు వస్తుంది. రాష్ట్ర పాలనకు అవసరమైన శాసనాలను పార్లమెంట్‌ రూపొందిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి రద్దవుతుంది.
* రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారు లేదా సుప్తచేతనావస్థ (సస్పెన్షన్‌)లో ఉంచుతారు. రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. సస్పెన్షన్‌లో ఉంచితే తిరిగి పునరుద్ధరించాలి.
* రాష్ట్ర వాస్తవ కార్యనిర్వహణాధికారిగా గవర్నర్‌ వ్యవహరిస్తారు. ఈయనకు పాలనలో సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌లను నియమిస్తుంది.
* హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.


న్యాయమూర్తుల నియామకం - కొలీజియం వ్యవస్థ

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1993):
* సుప్రీంకోర్టు - హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించే సమయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ప్రధాన న్యాయమూర్తిని ్బదిరిఖ్శి కొలీజియంగా సంప్రదించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1998లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ కొలీజియంపై సుప్రీంకోర్టును న్యాయసలహా కోరారు.
* 1999లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘‘కొలీజియం’’పై తీర్పును వెలువరిస్తూ కింది అంశాలను పేర్కొంది.
* కొలీజియం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన బృందం.
* న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా కొలీజియం సలహాను పాటించాలి.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో 120వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ద్వారా  “Judges Appoiontment Committee - JAC” ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించి విఫలమైంది.


NJAC ఏర్పాటు
* మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 120వ రాజ్యాంగ సవరణ బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించింది. 121వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి  “National Judges Appointment Commission - NJAC” ను ఏర్పాటు చేయాలని భావించింది. దీన్ని పార్లమెంట్‌ 2/3 వంతు సభ్యుల ప్రత్యేక మెజార్టీతో ఆమోదించడంతో పాటు, దేశంలోని 15 రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాయి. దీనికి 2014, డిసెంబరులో రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. దీంతో ఇది 99వ రాజ్యాంగ సవరణ చట్టం - 2014గా మారింది.
* ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు-హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి ‘‘కొలీజియం వ్యవస్థ’’కు బదులుగా NJACని సంప్రదించాలి.


సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌రికార్డ్స్‌ Vs  యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2015):
* ఈ కేసులో సుప్రీంకోర్టు 2015, అక్టోబరు 16న తీర్పు ఇచ్చింది. విరితిది ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని ప్రకటించింది. దీంతో న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ‘‘కొలీజియం’’ వ్యవస్థ సలహాను పాటించాల్సి వచ్చింది. 

 

 

రాజకీయ పార్టీల నుంచి వస్తున్న సవాళ్లు

భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశానికి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని అందించారు. ఇందులో రాజకీయ పార్టీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దురదృష్టవశాత్తు ఈ రాజకీయ పార్టీల నుంచే రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి:

* మన దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి కేంద్రీకృత రాజకీయ పార్టీలే. ఇవి సైద్ధాంతిక పునాదుల కంటే కూడా వ్యక్తి ఆకర్షక అంశాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి.

* ప్రాంతీయవాదమే ప్రధానంగా కొన్ని పార్టీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చేపట్టి, జాతీయ ప్రయోజనాల కంటే ప్రాంతీయ ప్రయోజనాలకే అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి.

* సామాజికవర్గాల ఆధిపత్యం ఆధారంగా కొన్ని పార్టీలు కొనసాగుతున్నాయి. ఈ పార్టీల్లో ‘కులం’ (Caste) ఓటు బ్యాంక్‌గా ఉపకరిస్తుంది.

* అధికారాన్ని పొందేందుకు, నిలబెట్టుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ‘పార్టీ ఫిరాయింపుల’ను ప్రోత్సహిస్తున్నాయి. నైతిక విలువల కంటే రాజకీయ స్వప్రయోజనాలకే కొన్ని పార్టీలు ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి.

* కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మతాన్ని ఓటుబ్యాంక్‌గా వినియోగించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 

నేరమయ రాజకీయాలు 

* రాజకీయ నాయకులకు నేరస్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ‘ఓరా’ కమిటీ నిగ్గుతేల్చింది. 2004 నుంచి 2014 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో గెలిచిన చట్టసభల సభ్యుల్లో ప్రతీ ఇద్దరిలో ఒకరిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

* 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో 28% మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదైన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

* అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) అనే స్వచ్ఛంద సంస్థ ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం 2016, జులైలో కేంద్ర మంత్రివర్గంలోని 78 మంది మంత్రుల్లో 72 మంది ఒక్కొక్కరు రూ.కోటికి పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. 24 మంది మంత్రులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కోగా, 14 మంది మంత్రులు తమ విద్యార్హతలు 12వ తరగతి అంతకంటే తక్కువగా ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.

* 2016, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) సందర్భంగా అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కీలకమైన ప్రసంగం చేశారు.  ఎన్నికల్లో నగదు పంపిణీ, నేరమయ రాజకీయాలు ఆందోళన కలిగించే అంశాలని పేర్కొన్నారు.

* నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (NEW), అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ వెలువరించిన నివేదిక ప్రకారం, 2017లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైనవారిలో 192 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో 36%, ఉత్తరాఖండ్‌లో 31%, గోవాలో 23%, పంజాబ్‌లో 14%, మణిపుర్‌లో 3% మంది కొత్త ఎమ్మెల్యేలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ్బతిదీళ్శి నివేదిక - 2018

* గుజరాత్‌ శాసనసభలో ఉన్న 182 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించగా, 47 మందిపై ్బ26%్శ క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తేలింది.

* కర్ణాటక శాసనసభలోని 221 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించగా 77 మందిపై ్బ35%్శ మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడైంది.

 

కేంద్ర ప్రభుత్వ నివేదిక - 2018

కేంద్రం 2018లో సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపు 1700 మంది సిట్టింగ్‌ పార్లమెంట్‌ సభ్యులు (ఎంపీలు), శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. వీరిపై 3045 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

 

మహిళలపై నేరాలు

* అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషణ ప్రకారం దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యుల్లో 1580 మందిపై (33%) క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 48 మంది సభ్యులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.

 

అవిశ్వాస తీర్మానాలు

* అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమై అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాయి. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో చట్టసభలు రద్దయి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. దీనివల్ల విలువైన సమయం, ఆర్థిక, మానవ వనరులు వృథా అవుతున్నాయి.

ఉదా: 1998లో అటల్‌ బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై 1999లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఎన్డీఏను అధికారం నుంచి తొలగించాయి. కానీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అవి విస్మరించాయి. దీంతో లోక్‌సభకు మళ్లీ ఎన్నికలు జరిగాయి.

* రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి.

 

సుధాకర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ - 2006

జస్టిస్‌ పసాయత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లు కుల, మత, రాజకీయ ప్రయోజనాల కోసం క్షమాభిక్ష అధికారాలను దుర్వినియోగం చేయకూడదని, ఈ అధికారాలను వినియోగించినప్పుడు బాధిత కుటుంబాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

* రాష్ట్రపతి, గవర్నర్లు వినియోగించే క్షమాభిక్ష అధికారాలను ‘న్యాయ సమీక్ష (Judicial Review) చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గౌరు వెంకట్‌రెడ్డి కేసులో అప్పటి గవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండే ప్రతిపాదించిన క్షమాభిక్ష చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తెలిపింది.

క్షమాభిక్ష అధికారాల దుర్వినియోగం

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 ప్రకారం రాష్ట్రపతి, ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్‌లు క్షమాభిక్ష అధికారాలను (న్యాయాధికారాలు) వినియోగించవచ్చు. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి, ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్రమంత్రి మండలి సిఫార్సుల మేరకు గవర్నర్‌ క్షమాభిక్ష అధికారాలను వినియోగించాలి.

* రాష్ట్రపతి, గవర్నర్లు వినియోగించాల్సిన క్షమాభిక్ష అధికారాలపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. దీంతో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు నడుపుతున్న ప్రభుత్వాల ద్వారా క్షమాభిక్ష అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇది రాజ్యాంగానికి సవాలుగా నిలుస్తోంది.

 

పార్టీ ఫిరాయింపులు - ప్రజాభిప్రాయం అపహాస్య

* ఒక రాజకీయ పార్టీ ఎన్నికల మానిఫెస్టోతో చట్టసభలకు ఎన్నికైన సభ్యులు పదవీకాంక్షతో వేరే  రాజకీయ పార్టీలోకి ఫిరాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాభిప్రాయానికి విరుద్ధం. ఇది దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించి, దేశ ప్రగతిని నిరోధించే అంశం.

రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చట్టం - 1985 ద్వారా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ చట్టం చేసింది. ఇందులోని కొన్ని లోపాల వల్ల  చట్టం లక్ష్యం నెరవేరడం లేదు.

* పార్టీని ఫిరాయించిన సభ్యుల అనర్హతలను 

సభాధ్యక్షులు ఎంతకాలం లోపు ప్రకటించాలనే స్పష్టత లోపించింది. దీంతో ఫిరాయింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. 

* పార్టీని ఫిరాయించిన సభ్యులపై సభాధ్యక్షులు ఎలాంటి నిర్ణయం ప్రకటించక ముందే ఫిరాయింపులకు పాల్పడిన వారికి తక్షణం వివిధ పదవులు లభిస్తున్నాయి.

* రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సభ్యులే చట్టసభలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తుండటంతో వారు తమ పార్టీ మనోభావాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

* అరుణాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రితో సహా 43 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. దీంతో  రాజ్యాంగ నిపుణులు, సామాన్య ప్రజలు  విస్తుపోయారు.

* పార్టీ ఫిరాయింపుల వల్లే వివిధ రాష్ట్రాల్లో తరచూ ముఖ్యమంత్రుల మార్పు, మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలు జరుగుతున్నాయి.

* 1967 నుంచి 1971 మధ్యకాలంలో 142 మంది పార్లమెంట్‌ సభ్యులు, 1900 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడారు

* 1980లో హరియాణాలో గయాలాల్‌ అనే శాసన సభ్యుడు ఒకేరోజు మూడు రాజకీయ పార్టీలను మారడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 

రాజకీయ పార్టీలకు అక్రమ నిధులు

* వివిధ రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు, కంపెనీలు అనధికారికంగా విరాళాల రూపంలో నిధులు ఇస్తున్నాయి. ఇది ఎన్నికల్లో ధన ప్రవాహానికి కారణమవుతుంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కమిషన్‌కు చట్టబద్ధంగా వార్షిక విరాళాల నివేదికను సమర్పించాలి. కానీ ఈ విషయంలో రాజకీయ పార్టీలు నైతికంగా వ్యవహరించడం లేదు.

* 2018 వార్షిక బడ్జెట్‌లో కొత్తగా ఎలక్టోరల్‌ బాండ్లను (Electoral Bonds) ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు (Donations) ఇవ్వాలనుకునేవారు  డిజిటల్‌ చెల్లింపులు లేదా చెక్కుల రూపంలో బ్యాంకులో నగదును అందించాలి. అంతే మొత్తాన్ని బాండ్ల రూపంలో తీసుకొని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తే రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో పారదర్శకత ఏర్పడుతుంది. 

Posted Date : 19-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌