• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ పరిణామ క్రమం 

ఈస్టిండియా కంపెనీ 

బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబరు 31 న 'చార్టర్' ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.

*  కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) బక్సార్ యుద్ధం (1765) లో విజయం సాధించి, 'బెంగాల్ దివానీ అధికారాన్ని' పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.

*  భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీపాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.

*  భారత రాజ్యాంగ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:

    1) ఈస్టిండియా కంపెనీ పాలన (1773 - 1858)

    2) బ్రిటిష్ ప్రభుత్వ పాలన (1858 - 1947)
 

ఈస్టిండియా కంపెనీ పాలన 

కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి / చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.
 

రెగ్యులేటింగ్ చట్టం 1773

 దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దీన్ని బ్రిటిష్ పార్లమెంటులో అప్పటి ప్రధాని 'లార్డ్ నార్త్' ప్రవేశపెట్టాడు. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే భారత రాజ్యాంగానికి పునాదైంది. 

ముఖ్యాంశాలు: ఈ చట్టం ఇంగ్లండ్, భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేసింది.

ఇంగ్లండ్‌లో వచ్చిన మార్పులు:

* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పాలక వర్గం) పదవీకాలాన్ని ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వ వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.

* కంపెనీ ప్రొప్రైటర్లు (యజమానులు) ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సర కాలం పాటు, 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలున్న వారికి పరిమితం చేశారు.

భారతదేశంలో వచ్చిన మార్పులు:

* బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు. 

* 'గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి'ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్‌కు విధి నిర్వహణలో సాయపడటం దీని ప్రధాన విధి. కౌన్సిల్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు. గవర్నర్ జనరల్‌కు నిర్ణాయక ఓటు (Casting Vote) ను కల్పించారు.

* కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774 లో ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టు తీర్పులపై 'కింగ్ కౌన్సిల్' (రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలను పాటించడం) కు అప్పీల్ చేసుకోవచ్చు.

* గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, స్థానికుల (భారతీయులు) నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించింది.

* కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి (పొడిగిస్తూ) చార్టర్ జారీ చేశారు.
 

పిట్స్ ఇండియా చట్టం 1784 

 రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడమే ఈ చట్టం ఉద్దేశమని అప్పటి ఇంగ్లండ్ ప్రధాని 'విలియం పిట్' తెలియజేశారు. అతడి పేరు మీద ఈ చట్టం 'పిట్స్ ఇండియా' చట్టంగా ప్రాచుర్యం పొందింది. 

ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 'బోర్డ్ ఆఫ్ కమిషనర్స్' ఏర్పాటైంది. దీన్నే 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అని కూడా అంటారు. దీనికి 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' అధ్యక్షుడు. ఇతడికి నిర్ణాయక ఓటును కల్పించారు. సభ్యుల కాల పరిమితి 4 సంవత్సరాలు.

* ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌'కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలు, ఆదాయంపై ఈ బోర్డుకు సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.

* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఆదేశాలను పాటించని గవర్నర్లను, ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.

* 1786 లో జరిగిన సవరణ ఫలితంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ జనరల్‌కు వచ్చింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్‌నే సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. ఈ సవరణ చట్టంతో గవర్నర్ జనరల్‌కు తన కౌన్సిల్ నిర్ణయాలను 'వీటో' చేసే అధికారం వచ్చింది. గవర్నర్ జనరల్ పదవి, అధికారాలు సుస్థిరం, విస్తృతమయ్యాయి.

* గవర్నర్ జనరల్, గవర్నర్ల కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు.

 

చార్టర్ చట్టం 1793 

ఫ్రాన్స్ పరిణామాలు (ఫ్రెంచి విప్లవం) ఇంగ్లండ్ వాణిజ్యంపై వ్యతిరేక ప్రభావం చూపడంతో విదేశీ వ్యాపారాన్ని, సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ సహకారం అవసరమైంది.

ముఖ్యాంశాలు: కంపెనీ అధీనంలోని ప్రాంతాలు, వాటిపై వచ్చే ఆదాయాన్ని మరో 20 సంవత్సరాలపాటు కంపెనీకే అప్పగించారు.

¤ స్వదేశీ ఖర్చుల పేరుతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను కంపెనీ ప్రభుత్వం (భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ) భరించే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఇది 1793 నుంచి భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చేవరకు కొనసాగింది.

¤ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ లేని సమయంలో 'వైస్ ప్రెసిడెంట్' అధ్యక్షత వహిస్తాడు. వైస్ ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.

¤ భారతదేశంలో ఆంతరంగిక పాలనకు తగిన నిబంధనలను తయారు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు ఇచ్చారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీచేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. దీని ఆధారంగానే 'కారన్ వాలీస్ కోడ్' రూపొందింది. దీంతో భారతదేశంలో రాతపూర్వక శాసన నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.

¤ కంపెనీ ఉద్యోగులకు 'సీనియారిటీ' ప్రాతిపదికపై ప్రమోషన్లను కల్పిస్తారు.
 

చార్టర్ చట్టం 1813 

భారత రాజ్యాంగ క్రమపరిణామంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు.

ముఖ్యాంశాలు: భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి / చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.

* కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.

* భారతీయులను సంస్కరించడం, విజ్ఞానవంతులను చేయడం కోసం మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చ్‌లు, ఆసుపత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.

* భారతీయులకు విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేయడం, ప్రోత్సహించడం కోసం రూ.1,00,000 తో ఒక నిధిని భారతదేశంలో ఏర్పాటు చేశారు.

* పన్నులను విధించడానికి, వాటిని చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.

* కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. పౌర ఉద్యోగులకు హేలీబ్యూరి కాలేజ్‌లోను (ఇంగ్లండ్), సైనికోద్యోగులకు ఎడిస్ కోంబ్‌లోని మిలిటరీ సెమినరీలోను శిక్షణను ఏర్పాటు చేశారు. * ఈ రెండింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అధీనంలో ఉంచారు.
 

చార్టర్ చట్టం 1833 

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. కంపెనీ భూభాగాలు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి వారసులకు చెందుతాయని ప్రకటించింది.  
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అయితే తేయాకు, చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' నిర్మాణంలో మార్పు తెచ్చారు. అనేక మంది మంత్రులు పదవిరీత్యా సభ్యులయ్యారు. ఉదాహరణకు - లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మొదలైనవారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'విలియం బెంటింక్'.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కు పెంచారు. నాలుగో సభ్యుడిగా 'లా మెంబరు'ను చేర్చారు. కౌన్సిల్‌లో మొదటి లా మెంబరు లార్డ్ మెకాలే.
* బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను రద్దు చేశారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కే పూర్తి శాసనాధికారం లభించింది. గవర్నర్ జనరల్ అధ్యక్షతనున్న కౌన్సిల్ శాసనాలు 'బ్రిటిష్ - ఇండియా' మొత్తానికి, అందరు వ్యక్తులకు, న్యాయస్థానాలకు వర్తిస్తాయి.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా కమిషన్‌'ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతి (open competition) ని ప్రతిపాదించారు. కానీ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
* భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేశారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌పై ఉంచింది.
* యూరోపియన్లకు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించారు.
 

చార్టర్ చట్టం 1853 

బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా జారీ చేసిన చట్టం ఇది.

ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి 'ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులు ఉంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఉంటుంది. 'సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (కేంద్ర శాసన మండలి)లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 12 మందిలో గవర్నర్ జనరల్, సర్వసైన్యాధ్యక్షుడు, కౌన్సిల్‌లోని నలుగురు సాధారణ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సాధారణ న్యాయమూర్తి, నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు.
* బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' నియమించేవారు.
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను 24 నుంచి 18 కి తగ్గించారు. వీరిలో ఆరుగురిని నియమించే అధికారం రాణి లేదా చక్రవర్తికి ఇచ్చారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు ఉన్న 'గవర్నర్ ఆఫ్ బెంగాల్' అనే హోదాను రద్దు చేశారు.
* భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబరు 1 న ఒక ప్రకటన జారీ చేసింది.  
 * భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినప్పటికీ ఇది ఒక సుదీర్ఘ చారిత్రక క్రమపరిణామ ఫలితమని చెప్పొచ్చు.
 *  బ్రిటిష్ - ఇండియా ప్రాంతాల పాలన కోసం 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
 * ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్‌కు ఆధారంగా నిలిచాయి. 

చార్టర్‌ చట్టం, 1813

* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీకి భారత్‌లో 20 ఏళ్ల పాటు వర్తక, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు అనుమతి లభించింది.

* భారత్‌లో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ ‘స్వేచ్ఛా వాణిజ్యాన్ని’ (చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహా) ప్రవేశపెట్టారు.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు.

* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి  అవకాశం కల్పించారు. ఇది తర్వాతి కాలంలో మనదేశంలో మతమార్పిడులకు దారితీసింది.

* భారత్‌లో విద్యాభివృద్ధి కోసం సంవత్సరానికి లక్షరూపాయలు కేటాయించారు.

* ‘బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ పర్యవేక్షణ అధికారాలను, విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. దీని పరిధిని విస్తృతం చేశారు.

* ప్రైవేట్‌ వ్యక్తులు భూములు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.

* ఈ చట్టం చేసే సమయంలో ‘మార్క్వస్‌ హేస్టింగ్స్‌’ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నారు.

చార్టర్‌ చట్టం, 1833

* ఈ చట్టం ద్వరా ‘ఈస్టిండియా కంపెనీ’కి మరో 20 ఏళ్ల పాటు భారత్‌లో వర్తక, వాణిజ్య నిర్వహణకు అవకాశం కల్పించారు. దీన్నే ‘సెయింట్‌ హెలీనా’ చట్టంగా పేర్కొంటారు.

* బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవి పేరును ‘భారతదేశ గవర్నర్‌ జనరల్‌’గా మార్చారు. మొట్టమొదటి భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా ‘విలియం బెంటింక్‌’ వ్యవహరించారు. ఇతడికి ఆర్థిక, సివిల్, మిలటరీ అధికారాలు అప్పగించారు.

* భారతదేశంలో ‘బానిసత్వాన్ని’ రద్దు చేయాలని తీర్మానించారు. దీన్ని లార్డ్‌ ఎలిన్‌ బరో వ్యతిరేకించడంతో అమల్లోకి రాలేదు.

* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి లార్డ్‌ మెకాలే అధ్యక్షతన ‘మొదటి లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు.

* బొంబాయి, మద్రాస్‌ ప్రభుత్వాల శాసనాధికారాలను తొలగించారు. కార్యనిర్వాహక మండలితో కూడిన గవర్నర్‌ జనరల్‌కు పూర్తి శాసనాధికారం లభించింది.

* గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను నాలుగుకు పెంచారు. అందులో ఒక న్యాయ సభ్యుడిగా లార్డ్‌ మెకాలేకు ప్రాతినిధ్యం కల్పించారు.

* ‘ఈస్టిండియా కంపెనీ’ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి, దాన్ని పరిపాలనా సంస్థగా మార్చారు. తేయాకు, చైనాతో వ్యాపారాన్ని ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యం నుంచి తొలగించారు.

* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు, ఇక్కడ భూమి, ఆస్తులను సంపాదించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. దీంతో బ్రిటిష్‌ వలస రాజ్యస్థాపనకు చట్టబద్ధత కలిగింది. భారతదేశంలో ‘కేంద్రీకృత పాలన’కు తుదిమెట్టుగా ఈ చట్టాన్ని పేర్కొన్నారు.

* సివిల్‌ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. భారతీయులకు ఉద్యోగకల్పనలో వివక్ష చూపకూడదని తీర్మానించారు. దీన్ని ‘కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’ వ్యతిరేకించడంతో పూర్తిగా అమల్లోకి రాలేదు.

* భారతదేశంలో ముగ్గురు ‘బిషప్‌’లను  నియమించారు. కలకత్తాలోని ‘బిషప్‌’ను  భారతదేశం మొత్తానికీ క్రైస్తవ మతాధిపతిగా ప్రకటించారు.

చార్టర్‌ చట్టం, 1853

* ఇది ‘ఈస్టిండియా కంపెనీ’ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్‌ చట్టం. ఇందులో భారత్‌లో ఈస్టిండియా కంపెనీ హక్కులను పొడిగించే అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో కంపెనీ పాలన త్వరలో అంతమవుతుందని స్పష్టమైంది.

* గవర్నర్‌ జనరల్‌ అధికార విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాల రూపకల్పనకు ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది.

* కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. బెంగాల్, బొంబాయి, మద్రాస్, ఆగ్రాల నుంచి నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు.

* సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా బహిరంగ పోటీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 

* 1854లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలపై అధ్యయనం కోసం లార్డ్‌ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

మూడో దశ (1858-1909)

* 1857లో భారత్‌లో చెలరేగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 నుంచి భారతదేశ పరిపాలన బ్రిటిష్‌ రాజు/ రాణి నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి రూపొందిన చట్టాలను ‘కౌన్సిల్‌ చట్టాలు’ లేదా ‘భారత ప్రభుత్వ చట్టాలు’గా పేర్కొంటారు.

భారత ప్రభుత్వ చట్టం, 1858:

* 1858, నవంబరు 1న విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రం, సంక్షేమం తమ లక్ష్యమని ఆమె ప్రకటించారు.

* ఈ చట్టం ద్వారా భారత్‌లో ‘ఈస్టిండియా కంపెనీ పాలన’ రద్దయ్యి, దేశం బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.

* భారతదేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందిస్తుంది.

* లండన్‌లో ‘భారతరాజ్య కార్యదర్శి’ ్బళీ’‘౯’్మ్చ౯్వ ్న÷ ళ్మ్చ్మీ’్శ అనే పదవిని ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ కేబినెట్‌లో అంతర్భాగంగా ఉంటూ, మనదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్‌ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

* భారతరాజ్య కార్యదర్శికి పరిపాలనలో సహకరించడానికి 15 మంది సభ్యులతో కూడిన ‘కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు.

* ‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ హోదాను ‘వైస్రాయ్‌ ఆఫ్‌ ఇండియా’గానూ వ్యవహరించారు. ఈ వ్యక్తిని బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు గవర్నర్‌ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించేటపుడు ‘వైస్రాయ్‌’గా పేర్కొన్నారు.

* మొట్టమొదటి గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌ పదవిని ‘లార్డ్‌ కానింగ్‌’ నిర్వహించారు.

* వైస్రాయ్‌ దేశంలో బ్రిటిష్‌ రాణి మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి. వీరు భారతదేశ పాలనను బ్రిటిష్‌ రాణి పేరుతో నిర్వహిస్తారు. వీరి పదవీకాలం అయిదేళ్లు. పాలనలో సహకరించేందుకు ఒక కార్యనిర్వాహక మండలి ఉంటుంది.

* ఈ చట్టాన్ని ‘గుడ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియా’గా పేర్కొంటారు.

* ఈ చట్టం ద్వారా బ్రిటిష్‌ రాణి ‘భారత సామ్రాజ్ఞి’ అనే బిరుదు పొందారు.

* దీని ద్వారానే భారత రాజ్యాంగ చరిత్ర ప్రాంభమైందని డి.డి.బసు పేర్కొన్నారు.

* బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్, కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అనే ద్వంద్వపాలన రద్దయ్యింది.

* 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలోని యూరోపియన్‌ వడ్డీ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. దీన్నే ‘వైట్‌ మ్యుటినీ’ (జ్తూi్మ’ ల్య్మీi-్వ) లేదా  ‘యూరోపియన్‌ తిరుగుబాటు’గా చెప్తారు.

* ఈ చట్టం ప్రకారం భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం కింది విధానాన్ని అనుసరించి, అమలు చేసింది.

రాజ్యాంగ పరిణామ క్రమం - మూడోదశ

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు

భారతదేశంపై తమ పట్టును కొనసాగించడానికి బ్రిటిష్‌వారు అనేక చట్టాలను రూపొందించారు. ఇవి భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో అంతర్భాగంగా ఉపకరిస్తూ, మన రాజ్యాంగ రూపకల్పనకు తోడ్పడ్డాయి. వీటిలో కౌన్సిల్‌ చట్టాలు ముఖ్యమైనవి. భారత రాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్‌ సభ్యుల పేరు మీదుగా వీటిని రూపొందించారు. అందుకే వీటిని కౌన్సిల్‌ చట్టాలుగా పేర్కొంటారు. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు, వాటిలోని ముఖ్యాంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

* లార్డ్‌ కానింగ్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా ఉన్న కాలంలో ‘ఇండియన్‌  కౌన్సిల్‌ చట్టం, 1861’ని రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా భారతీయులకు మొదటిసారి శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. గవర్నర్‌ జనరల్‌కు ‘ఆర్డినెన్స్‌’ను జారీచేసే అధికారాన్ని కల్పించారు.

* మంత్రులకు మంత్రిత్వశాఖలను కేటాయించే ‘పోర్ట్‌ఫోలియో’ విధానానికి చట్టబద్ధత కల్పించారు.

* రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన బాంబే, మద్రాస్‌ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. 

* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను వివరించే ‘వార్షిక బడ్జెట్‌’ను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు.

* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సుల్లో నూతన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.

* లార్డ్‌ కానింగ్‌ ‘లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’కు అనధికార సభ్యులుగా కొంతమంది భారతీయులను నామినేట్‌ చేశారు. వీరిలో పటియాలా మహారాజు నరేంద్రసింగ్, బెనారస్‌ మహారాజు దేవ్‌నారాయణ్‌ సింగ్, సర్‌ దినకర్‌రావు మొదలైనవారు ఉన్నారు.

* భారతదేశంలో మొదటి హైకోర్టును 1862లో కలకత్తాలో నెలకొల్పారు. అదే ఏడాది మద్రాస్, బాంబే హైకోర్టులను ఏర్పాటు చేశారు. 

* వివిధ లా కమిషన్ల సిఫార్సుల మేరకు 1859లో ‘సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు. 1860లో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’, 1861లో ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’లను రూపొందించారు.

విభజించు- పాలించు విధానం

* భారత్‌లో అతివాద - మితవాద నాయకుల మధ్య తీవ్రమైన ఘర్షణ ఉండేది. దీన్ని గుర్తించిన ఆంగ్లేయులు అతివాదులను వేరుచేసి, మితవాదులను తమకు అనుకూలంగా తిప్పుకోవాలని ప్రయత్నించారు. 

* ఇందులో భాగంగానే ‘మింటో - మార్లే సంస్కరణల చట్టం’ ద్వారా విభజించు- పాలించు అనే విధానాన్ని బ్రిటిష్‌వారు అనుసరించారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892

* 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఏర్పడింది. విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్‌ పాలనలోని లోపాలను తెలియజేస్తూ భారతీయుల్లో చైతన్యాన్ని తీసుకురావడం ప్రారంభించారు. దీంతో ఆంగ్లేయులు ఆందోళన చెంది, ఇక్కడి ప్రజలను సంతృప్తిపరచడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1982ను రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు చెందిన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.

* కేంద్ర శాసనసభలో భారతీయ సభ్యుల ప్రాతినిధ్యం ఆరుకు పెరిగింది. వారు: గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, రాస్‌బిహారి ఘోష్,  ఫిరోజ్‌షా మెహతా, దాదాబాయ్‌ నౌరోజీ, బిల్‌గ్రామి.

* మనదేశంలో మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

* కౌన్సిల్‌ సభ్యులకు బడ్జెట్‌పై చర్చించే అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు అడిగే అధికారాన్ని కల్పించారు.

* కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 10 మందికి తగ్గకుండా, 16 మందికి మించకుండా ఉండాలని నిర్దేశించారు.

* రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య 8 మందికి తగ్గకుండా 20 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు.

నాలుగో దశ (1909-35)

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909 

* దీన్నే మింటో - మార్లే సంస్కరణల చట్టం 1909 అని కూడా అంటారు.

* 1909లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మార్లే, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మింటో ఈ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు. 

* మద్రాస్, బెంగాల్, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, ఒడిశా రాష్ట్రాల శాసన వ్యవస్థల్లో సభ్యుల సంఖ్యను 50కి పెంచారు.

* కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పేరును ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు.

* గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఈవిధంగా కౌన్సిల్‌కు వెళ్లిన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్‌ సిన్హా. ఈయన్ను న్యాయసభ్యుడిగా నియమించారు.

* కేంద్ర, రాష్ట్ర శాసనసభ్యులకు అనుబంధ ప్రశ్నలు వేయడానికి, బడ్జెట్‌పై తీర్మానాలు ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించారు.

* మొదటిసారిగా ‘ఎన్నికల పద్ధతి’ని ప్రవేశపెట్టారు. శాసనసమండలిలో అనధికార సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతి వర్తిస్తుంది. ఓటర్లను మతాలు, వర్గాలవారీగా విభజించారు.

* ముస్లింలు, వ్యాపార సంఘాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రాతినిధ్యం కల్పించారు. వీరిని ముస్లిం ఓటర్లే ఎన్నుకునేలా వీలు కల్పించారు. ఇందుకోసం ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏర్పాటు చేశారు.

* ఈ చట్టం ద్వారా మతతత్వానికి చట్టబద్దత కల్పించారు. అందుకే లార్డ్‌ మింటోను భారత్‌లో ‘మత నియోజకవర్గాల పితామహుడి’గా పేర్కొంటారు.

* 1911లో లార్డ్‌ హార్డింజ్‌ - ఖిఖి కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు. 

* ఈ చట్టం హిందువులు - ముస్లింల మధ్య వేర్పాటువాదానికి దారితీసి, భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

* 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం‘కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించిందని, ఇది చంద్రకాంతితో సమానం’’ అని అనేకమంది రాజనీతిజ్ఞులు పేర్కొన్నారు.

* ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలని భావించారు. ప్రాథమిక విద్య బాధ్యతను మున్సిపల్‌ వ్యవస్థలకు అప్పగించాలని ప్రయత్నించారు.

* 1913లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో లాలా హరదయాళ్‌ ‘గదర్‌’ పార్టీని స్థాపించారు. ఈ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ‘దర్శి చెంచయ్య’.

* ‘‘ఈ సంస్కరణలు భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సంబంధించినవి కావు’’ అని లార్డ్‌ మార్లే వ్యాఖ్యానించారు.

* భారతీయుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని, స్వాతంత్య్ర కాంక్షను నిలువరించే ఉద్దేశంతో ఆంగ్లేయులు అనేక చర్యలు చేపట్టారు. వాటిలో ‘మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919’ కీలకమైంది. ఇందులోని అనేక మౌలికాంశాలు భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి. వీటిపై పరీక్షార్థులకు అవగాహన అవసరం.

మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919

1919లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌ కలిసి ఈ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను అందించడం దీని ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు: భారతదేశంలో తొలిసారి పార్లమెంటరీ విధానానికి పునాదులు పడ్డాయి. కేంద్ర శాసనసభలో ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌:

* దీన్ని ‘ఎగువ సభ’గా పేర్కొంటారు. ఇందులోని సభ్యుల పదవీకాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్దేశించారు.

* ఈ సభలో ఉన్న సభ్యుల సంఖ్య 60. వీరిలో 34 మంది ఎన్నికైనవారు కాగా, మిగిలిన 26 మందిని గవర్నర్‌ జనరల్‌ నామినేట్‌ చేస్తారు. 

* ఈ సభకు గవర్నర్‌ జనరల్‌ ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీని స్ఫూర్తితోనే మన రాజ్యసభను ఏర్పాటు చేశారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ:

* దీన్ని ‘దిగువసభ’గా పేర్కొంటారు. దీనిలోని సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. 

* ఇందులోని మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 104 మంది ఎన్నికైనవారు కాగా, 40 మంది నామినేట్‌డ్‌ సభ్యులు.

* 1925 ఫిబ్రవరిలో ఈ సభకు మొదటి అధ్యక్షుడిగా సర్‌ ఫెడరిక్‌ వైట్‌ను, ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను నియమించారు.

* భారతీయుడైన విఠల్‌భాయ్‌ పటేల్‌ 1925, ఆగస్టులో ఈ సభకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

అధికారాల విభజన: 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. అవి: 

కేంద్ర జాబితా: ఇందులో 47 అంశాలు ఉన్నాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, దేశరక్షణ, పోస్టల్, కరెన్సీ, రైల్వే మొదలైన అంశాలు కేంద్ర జాబితా కిందకి వస్తాయి.

రాష్ట్ర జాబితా: ఇందులో 51 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన వ్యవసాయం, నీటి పారుదల, ప్రజారోగ్యం, రోడ్డురవాణా, స్థానిక స్వపరిపాలన మొదలైన అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి.

ద్వంద్వపాలన (Dyarchy): 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రాల్లో ‘ద్వంద్వపాలన’ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

రిజర్వ్‌డ్‌ అంశాలు: వీటిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న 28 అంశాలు ఉన్నాయి. భూమి శిస్తు, పరిశ్రమలు, ఆర్థిక, న్యాయ, నీటిపారుదల మొదలైనవి ఇందులో ఉన్నాయి. 

* వీటికి సంబంధించిన వ్యవహారాలను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. వీరికి  ‘కార్య నిర్వాహక మండలి’ సహాయం చేస్తుంది. 

* కార్య నిర్వాహక మండలి సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అంటే వీరికి అధికారాలు మాత్రమే ఉంటాయి, విధులు ఉండవు.

ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: వీటిలో ప్రాధాన్యం, అధికారాలు లేని 22 అంశాలు ఉన్నాయి. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మొదలైన వాటిని భారతీయ మంత్రుల సహాయంతో సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. 

* ఈ మంత్రులు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో సభ్యులుగా ఉండి, తమ విధి నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ద్వారా బ్రిటిష్‌ ఇండియా పరిపాలన కింది విధంగా రూపాంతరం చెందింది.

పాలనా విభాగం కార్య నిర్వాహక వర్గం  శాసన  వ్యవస్థ  న్యాయ వ్యవస్థ   
ఇంగ్లండ్‌ భారత  వ్యవహారాల మంత్రి, భారత  కౌన్సిల్, భారత  హైకమిషనర్‌ పార్లమెంట్‌ ప్రీవి కౌన్సిల్‌
ఇండియా గవర్నర్‌ జనరల్, గవర్నర్‌ జనరల్ కౌన్సిల్ కేంద్ర  శాసనసభ  సుప్రీంకోర్టు
రాష్ట్రం   గవర్నర్‌ రాష్ట్ర  శాసనసభ హైకోర్టు

ఇతర ముఖ్యాంశాలు

* భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ‘భారత హైకమిషనర్‌’ అనే పదవిని సృష్టించి, లండన్‌లో  కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

* భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా, బ్రిటిష్‌ ఆదాయం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.

* సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. దీని ద్వారా మనదేశంలో మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

* పరిమితమైన ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టి, భారతీయులు ప్రత్యక్షంగా పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించారు.

* కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య; వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్‌కి కల్పించారు.

* మొదటిసారిగా కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రాల బడ్జెట్‌ను వేరు చేశారు. రాష్ట్రాల శాసనసభకు తమ బడ్జెట్‌ను తామే రూపొందించుకునే అధికారాన్ని కల్పించారు.

* ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ‘లీ’ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 1926లో తన నివేదికను సమర్పించగా కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లను ఏర్పాటు చేశారు.

* సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు.

* 1921లో ‘ప్రభుత్వ ఖాతాల సంఘం’(Public Accounts Committee)ని ఏర్పాటు చేశారు.

* ఆస్తి పన్ను చెల్లింపు, విద్య ప్రాతిపదికన పరిమిత ఓటు హక్కును కల్పించారు. దీంతో మన దేశంలో కేవలం 2.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు లభించింది.

మహిళలకు ఓటు హక్కు - మార్గదర్శకాలు

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ప్రకారం మహిళలకు ఓటు హక్కును ఎప్పుడు, ఎలా కల్పించాలనే అధికారాన్ని ‘ప్రొవిన్షియల్‌ శాసనసభల’కు అప్పగించారు.

* 1920లో ట్రావెన్‌కోర్‌ సంస్థానం మొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించింది.

* 1921లో మద్రాస్, బాంబే రాష్ట్రాలు మహిళలకు ఓటు హక్కు కల్పించాయి.

* 1927లో ‘మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’కు డాక్టర్‌ ముత్తులక్ష్మిరెడ్డి ఎన్నికయ్యారు.

విమర్శలు

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టాన్ని బాలగంగాధర్‌ తిలక్‌ ‘సూర్యుడు లేని ఉదయంగా’ విమర్శించారు.

* ‘‘భారతదేశంలో ద్వంద్వపాలన అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ‘నీవు డైయార్కివి’ అని అరవడం నేను విన్నాను’’ అని సర్‌ బట్లర్‌ పేర్కొన్నారు.

మడ్డీమాన్‌ కమిటీ, 1924

చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలోని ‘స్వరాజ్య పార్టీ’ కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించి, బ్రిటిష్‌ వారి ముందు అనేక డిమాండ్లను ఉంచింది. అవి: 

* ద్వంద్వపాలనా విధానాన్ని రద్దు చేయడం.

* రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.

* సివిల్, డిఫెన్స్‌ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించి, స్వపరిపాలన అందించడం.

* భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం.

* స్వరాజ్య పార్టీ, ఇతర జాతీయ నాయకుల ఒత్తిడి కారణంగా బ్రిటిష్‌ వారు 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అమలు తీరును సమీక్షించాలని నిర్ణయించారు. దీని కోసం 1924లో అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

* ఈ కమిటీలో శివస్వామి అయ్యర్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, ఆర్‌.పి.పరంజపే, మహ్మద్‌ ఆలీ జిన్నా మొదలైన భారతీయులు కూడా ఉన్నారు.

* ఏకాభిప్రాయంతో నివేదికను ఇవ్వడంలో ఈ కమిటీ విఫలమైంది. ఆంగ్లేయుల ప్రాబల్యం ఉన్న ఈ కమిటీ ద్వంద్వపాలనను సమర్థించింది.

సైమన్‌ కమిషన్‌ 1927

* 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అమలు తీరును సమీక్షించేందుకు అప్పటి బ్రిటన్‌ ప్రధాని బాల్డ్విన్‌ 1927లో సర్‌ జాన్‌ సైమన్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమించారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

* ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో దేశ పౌరులంతా ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదంతో దీన్ని వ్యతిరేకించారు.

* సైమన్‌ కమిషన్‌ భారత్‌లో రెండుసార్లు పర్యటించింది. మొదటిసారి 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు; రెండోసారి 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్‌ 6 వరకు పర్యటించింది. ఈ కమిషన్‌ 1930లో తన నివేదికను సమర్పించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:

* భారతదేశంలో సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేయడం.

* 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం.

* చట్ట సభల్లో భారతీయులకు ప్రవేశం కల్పించి, వారిని పరిపాలనలో భాగస్వాములను చేయడం.

* భాష ప్రాతిపదికన ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం.

* హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణ ఉండేలా చూడటం

* భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కును, ప్రాథమిక హక్కులను నిరాకరించడం సమంజసమే అని నివేదికలో పేర్కొంది.

* కులాలవారీగా (కమ్యూనల్‌) ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం కానప్పటికీ, దీనికి ప్రత్యామ్నాయం లేని కారణంగా కొనసాగించాలని సూచించింది.

బట్లర్‌ కమిటీ, 1927

* బ్రిటిష్‌ వారు 1927లో సైమన్‌ కమిషన్‌తో పాటు హర్‌కోర్ట్‌ బట్లర్‌ అధ్యక్షతన ‘భారత రాజ్యాల కమిటీ’ని ఏర్పాటు చేశారు.

* బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడం దీని లక్ష్యం.

* ఈ కమిటీలో డబ్ల్యూ.ఎస్‌.హాల్‌వర్త్, ఎస్‌.సి.పీల్స్‌ సభ్యులుగా ఉన్నారు. ఇది 16 రాజ్యాల్లో అమల్లో ఉన్న ఆర్థిక సంబంధాలను పరిశీలించి, 1929లో తన నివేదికను సమర్పించింది.

నెహ్రూ రిపోర్ట్, 1928

* సైమన్‌ కమిషన్‌ను బహిష్కరిస్తున్నట్లు 1927, నవంబరు 14న అప్పటి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అయ్యంగార్‌ ప్రకటించారు. దీంతో అసహనానికి గురైన అప్పటి భారత వ్యవహారాల మంత్రి లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌ 1927, నవంబరు 24న బ్రిటిష్‌ ఎగువ సభలో మాట్లాడుతూ ‘‘భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసుకోగలరా?’’ అని సవాలు చేశారు.

* భారత జాతీయ నాయకులు ఈ సవాలును స్వీకరించి, 1928, మే 19న బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగ రచనకు ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 9 మంది సభ్యులున్న ఈ సంఘానికి మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షత వహించారు.

* ఈ ఉపసంఘం ఇచ్చిన నివేదికనే నెహ్రూ రిపోర్ట్, 1928గా పేర్కొంటారు.

దీపావళి ప్రకటన, 1929

భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపై చర్చించేందుకు లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతుందని, త్వరలోనే భారతదేశానికి స్వయంప్రతిపత్తి కల్పిస్తామని, 1929, అక్టోబరు 31న లార్డ్‌ ఇర్విన్‌ ప్రకటించారు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

* సైమన్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికలోని అంశాలపై భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చించేందుకు బ్రిటిష్‌ వారు లండన్‌లో మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. 

* భారత్‌లో పరిపాలన, భవిష్యత్తులో ప్రవేశపెట్టే పాలనా సంస్కరణల కోసం భారతీయుల అభిప్రాయాలను సేకరించటం ఈ సమావేశాల ఉద్దేశం. 

* బ్రిటన్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌తో చర్చించి ఈ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.

మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1930

* ఈ సమావేశం 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. ఇందులో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు. 

* ‘సంపూర్ణ బాధ్యతాయుత పాలన’పై చర్చిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేక హామీని ఇవ్వకపోవటంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1931

* ఇది 1931, సెప్టెంబరు 7 నుంచి 1937, డిసెంబరు 1 వరకు జరిగింది.

* 1931, మార్చి 5న గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక జరగడంతో ఈ సమావేశానికి ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ తరఫున గాంధీజీ ప్రాతినిధ్యం వహించారు. 

* ఇందులో 107 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అల్ప సంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ, మహ్మద్‌ అలీ జిన్నా మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 

* బ్రిటిష్‌ వారు అనుసరిస్తున్న ‘విభజించు, పాలించు’ విధానానికి వ్యతిరేకంగా గాంధీజీ ఈ సమావేశాన్ని బహిష్కరించి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆయన్ను ఆంగ్లేయులు అరెస్ట్‌ చేసి ఎరవాడ జైలుకు తరలించారు.

కమ్యూనల్‌ అవార్డ్, 1932: చట్టసభల్లో మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని 1932, ఆగస్టు 16న ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ప్రతిపాదించారు. దీన్నే కమ్యూనల్‌ అవార్డ్‌ అంటారు.

* దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్‌లకే కాకుండా షెడ్యూల్డ్‌ కులాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1932, సెప్టెంబరు 20న పుణెలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

* 1932, సెప్టెంబరులో గాంధీజీ - అంబేడ్కర్‌ మధ్య పుణె ఒడంబడిక జరిగింది. ఈ కారణంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. 

* కమ్యూనల్‌ అవార్డ్‌ కంటే ఎక్కువగా షెడ్యూల్డ్‌ కులాల వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు.

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1932

* ఈ సమావేశం 1932, నవంబరు 17 నుంచి 1932, డిసెంబరు 24 వరకు జరిగింది. దీనికి 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

* ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేదు.

* లండన్‌లో జరిగిన ఈ మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు డా. బి.ఆర్‌. అంబేడ్కర్, మహ్మద్‌ అలీ జిన్నా హాజరయ్యారు. రెండో సమావేశంలో సరోజినీ నాయుడు పాల్గొన్నారు.

శ్వేత పత్రం, 1933: రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో చర్చించిన అంశాలతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్‌ లిన్‌లిత్‌గో అధ్యక్షతన గల బ్రిటిష్‌ పార్లమెంట్‌కు చెందిన జాయింట్‌ సెలక్ట్‌ కమిటీ పరిశీలించింది. ఇది 1934, నవంబరు 11న తన నివేదికను సమర్పించింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.

రాజ్యాంగ పరిణామ క్రమం (అయిదో దశ)

భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజ్యాంగ రూపకల్పనకు అనేక అంశాలు తోడ్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’, ‘ఆగస్టు ప్రతిపాదనలు, 1940’, ‘క్రిప్స్‌ ప్రతిపాదనలు 1942’.


క్రిప్స్‌ ప్రతిపాదనలు, 1942

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతీయుల సహకారాన్ని పొందేందుకు బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ను 1942, మార్చి 22న భారతదేశానికి పంపాడు. అతడు కింద పేర్కొన్న అంశాలను ప్రతిపాదించాడు:

* భారతీయులకు అవసరమైన నూతన రాజ్యాంగ రూపకల్పనకు ‘రాజ్యాంగ పరిషత్‌’ ఏర్పాటు.

* రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం.

* రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.

* క్రిప్స్‌ ప్రతిపాదనలను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఇవన్నీ దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేదీ వేసిన చెక్కు లాంటివి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వీటికి నిరసనగా గాంధీజీ 1942, ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తూ, ప్రజలకు 'Do or Die' అనే నినాదాన్ని ఇచ్చారు.


భారత ప్రభుత్వ చట్టం 1935


* భారత్‌లో పరిపాలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం తయారు చేసిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లోకెల్లా ఇది సమగ్రమైంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన అతిపెద్ద చట్టం ఇది. లండన్‌లో జరిగిన మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల చర్చలు, తీర్మానాలు ఈ చట్టానికి ఆధారం. భారత రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా రాజ్యాంగ నిర్మాతలు సుమారు 70% పైగా అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించారు. అందుకే దీన్ని భారత రాజ్యాంగానికి ‘మాతృక’, ‘జిరాక్స్‌ కాపీ’గా పేర్కొంటారు. ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 
10 షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఈ చట్టం 1937, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు


అఖిలభారత సమాఖ్య ఏర్పాటు: 

      ఈ చట్టం ద్వారా మనదేశంలో ‘అఖిలభారత సమాఖ్య’ను ప్రతిపాదించారు. ఇందులో 11 రాష్ట్రాలు, 6 చీఫ్‌కమిషనర్‌ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.

అధికారాల విభజన:

      ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. అవి:


ఫెడరల్‌ జాబితా: దీనిలో 59 అంశాలు ఉన్నాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న దేశ రక్షణ, కరెన్సీ, రైల్వే, విదేశీ వ్యవహారాలు మొదలైన కీలకాంశాలను ఇందులో పేర్కొన్నారు.

రాష్ట్ర జాబితా: దీనిలో 54 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న వ్యవసాయం, నీటిపారుదల, స్థానిక స్వపరిపాలన, విద్య మొదలైన అంశాలను ఈ జాబితాలో చేర్చారు.

ఉమ్మడి జాబితా: దీనిలో 36 అంశాలు ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు మొదలైన అంశాలను ఇందులో పొందుపరిచారు.

కేంద్ర శాసన వ్యవస్థలో సభ్యుల సంఖ్య పెంపు:

      ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ, వాటిలో సభ్యుల సంఖ్యను పెంచారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ (Council of states): దీన్ని ఎగువ సభగా పేర్కొంటారు. ఇందులో సభ్యుల సంఖ్యను 260గా నిర్ణయించారు. వీరిలో 1/3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ (Legislative Assembly): దీన్ని దిగువ సభగా పేర్కొంటారు. ఇందులో సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించారు. వీరిలో 1/3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు.

రాష్ట్రాల్లో ద్విసభా విధానం:

* భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా రాష్ట్రాల్లో ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు. భారత్‌లో 11 బ్రిటిష్‌పాలిత రాష్ట్రాలు ఉండగా, వాటిలోని 6 రాష్ట్రాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అవి: అసోం, బెంగాల్, బిహార్, మద్రాస్, ఉత్తర్‌ ప్రదేశ్, బొంబాయి.

*  రాష్ట్రాల్లో ‘లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఎగువసభగా, ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ని దిగువసభగా పేర్కొన్నారు.

రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానం రద్దు:

      1919లో ప్రవేశపెట్టిన ‘ద్వంద్వ పాలనా’ విధానాన్ని భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా రద్దుచేసి, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. రాష్ట్రాల్లోని రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్‌ జాబితాలను రద్దుచేసి, రాష్ట్ర జాబితాలో ఉన్న 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానం ఏర్పాటు:

     భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా పాలనాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి:

రిజర్వ్‌డ్‌ అంశాలు: ఇందులో అధికారాలు, ఆదాయవనరులు కలిగిన కీలకాంశాలు ఉన్నాయి. వీటిని గవర్నర్‌ జనరల్‌ నియమించిన ముగ్గురు సభ్యుల కౌన్సిల్‌ సహాయంతో నిర్వహిస్తారు.

ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: ఇందులో అంతగా ప్రాధాన్యంలేని అధికారాలు, ఆదాయ వనరులు లేని అంశాలున్నాయి. వీటిని 10 మందికి మించకుండా భారతీయులతో ఏర్పాటు చేసిన మంత్రిమండలి సహాయంతో గవర్నర్‌ జనరల్‌ నిర్వహిస్తారు.

ఫెడరల్‌ కోర్టు ఏర్పాటు:

కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దిల్లీలో ఫెడరల్‌ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ మారిస్‌ గ్వేయర్‌ వ్యవహరించారు. ఈ కోర్టు వెలువరించిన తీర్పులను ఇంగ్లండ్‌లోని ‘‘ప్రీవి’’ (Privy) కౌన్సిల్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఇతర అంశాలు

* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ‘ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేశారు.

* భారతదేశం నుంచి ‘బర్మా’ను వేరు చేశారు.

* కొత్తగా ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

* శాసన వ్యవస్థలో షెడ్యూల్డ్‌ కులాలు, మహిళలు, ఇండియన్‌ క్రిస్టియన్లు, యూరోపియన్లు, కార్మికులు, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేసి, కమ్యూనల్‌ ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

* ‘‘అడ్వకేట్‌ జనరల్‌’’ పదవిని ఏర్పాటు చేశారు. వీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయసలహాదారులుగా ఉంటారు.

* స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం కల్పించి, ప్రాంతీయ పరిపాలనాంశాలను భారతీయ మంత్రుల అధికార పరిధిలోకి తెచ్చారు.

* గవర్నర్‌ జనరల్‌కు విశేషమైన అధికారాలను కల్పించారు. దీని ద్వారా ‘కేంద్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ చేసిన తీర్మానాలపై ‘వీటో’ (Veto) అధికారాన్ని కల్పించారు. అవసరమైతే గవర్నర్‌ జనరల్‌ సంబంధిత తీర్మానాలను బ్రిటిష్‌ రాణి పరిశీలన కోసం ఇంగ్లండ్‌కు పంపొచ్చు.

* రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను తగ్గించారు. గవర్నర్లనే రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ అధిపతులుగా పరిగణించారు.

* భారత ప్రభుత్వం చట్టం, 1935 ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించగా, మిగిలిన 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

* ఆర్థికపరమైన అంశాలను క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)ను ఏర్పాటు చేశారు.

ప్రముఖుల విమర్శలు

* ‘‘ఇది కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది’’   - మహ్మద్‌ అలీ జిన్నా

* ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మర్చిపోయారు’’     - జవహర్‌లాల్‌ నెహ్రూ

ఆగస్టు ప్రతిపాదనలు

1940, ఆగస్టు 8న అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ లిన్‌లిత్‌గో రాజ్యాంగ సంస్కరణలపై భారతీయులకు ప్రతిపాదనలు చేశారు. వీటినే  ‘ఆగస్టు ప్రతిపాదనలు’ అంటారు. అవి: 

* అన్ని రాజకీయ పార్టీలు, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహామండలిని ఏర్పాటు చేయడం.

* రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (Dominion status)తో కూడిన పాక్షిక స్వాతంత్య్రాన్ని కల్పించడం.

* రాజ్యాంగ పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాలవారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం.

Posted Date : 11-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌