• facebook
  • whatsapp
  • telegram

వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సామాజిక సంస్థలు, సంబంధాలు

సమాజం.. సమాజ నిర్మితిని అర్థం చేసుకోవాలంటే అందులోని ప్రాథమిక భావనలు, అనుబంధ అంశాల గురించి తెలుసుకోవాలి. ప్రాథమిక భావనలైన వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సామాజిక సంస్థలు, సంబంధాలు, ఇతర అనుబంధ విషయాలను అర్థం చేసుకోవాలి. కులం, వివాహం, కుటుంబం, బంధుత్వం, మతం వంటివాటిపై అవగాహన అవసరం. వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
కొద్దిమంది వ్యక్తులు కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు. దీన్నే 'గ్రూప్' అని పిలుస్తారు. కుటుంబం ఒక ప్రాథమిక సమూహం. ఒకే విధమైన అభిరుచులున్నవారు సమూహంగా ఏర్పడితే దాన్ని 'గౌణ సమూహం'గా పిలవొచ్చు. కొన్ని సమూహాలను కలిపి సముదాయంగా పేర్కొంటారు.
ఉదా: గ్రామీణ, నగర, పట్టణ సముదాయాలు. సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కొన్ని ప్రాథమిక భావనలపై అవగాహన ఉండాలి. అవి..
1. వ్యక్తులు (ఇండివిడ్యువల్స్)
2. సమూహం (గ్రూప్)
3. సముదాయం (కమ్యూనిటీ)
4. సామాజిక సంబంధాలు (సోషల్ రిలేషన్స్)
5. సామాజిక సంస్థలు (సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్)


వ్యక్తులు
వ్యక్తి సమాజానికి పునాది. సంఘజీవిగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్పే ఈ వ్యక్తులతోనే సమాజం నిర్మితమవుతుంది.

సమూహం
కొద్దిమంది వ్యక్తుల కలయికే సమూహం. కుటుంబం ఒక ప్రాథమిక సమూహం. ఈ సమూహంలో వ్యక్తుల మధ్య ముఖాముఖి పరిచయాలుంటాయి. వ్యక్తులు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. వీటిని గౌణ / ద్వితీయ సమూహాలుగా పేర్కొంటారు. విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మొదలైనవి వీటికి ఉదాహరణ.

సముదాయం
కొన్ని సమూహాల కలయికను సముదాయంగా పేర్కొంటారు. నగర, గ్రామీణ, పట్టణ సముదాయాలను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాథమిక, గౌణ సమూహాల్లోని సభ్యులు సముదాయంలో భాగంగా ఉంటారు. సముదాయాలు సమూహాల కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. నగరాలు, పట్టణాల్లో ఉండే కమ్యూనిటీ భవనాలను సముదాయాల్లోని సభ్యుల అవసరాల కోసం నిర్మిస్తారు.

సామాజిక సంబంధాలు
సమూహం, సముదాయాల్లో సభ్యులుగా ఉన్న వ్యక్తులు వివిధ పాత్రలను నిర్వర్తిస్తారు. ఉదాహరణకు తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, ఉపాధ్యాయుడు, సంఘ సభ్యుడు ఛైర్మన్. ఒక వ్యక్తి వివిధ పాత్రలను పోషిస్తూ ఇతరులతో సంబంధాలను కలిగి ఉంటాడు. ఈ పరస్పర సంబంధాలను 'సామాజిక సంబంధాలు' అని అంటారు. అందుకే సమాజాన్ని సామాజిక సంబంధాల అల్లికగా నిపుణులు అభివర్ణిస్తారు. ఈ సామాజిక సంబంధాలను కలిపితే ఒక వలలా లేదా సాలెగూడులా కనిపిస్తుంది.

సామాజిక సంస్థలు
ఇవి సమాజంలోని వ్యక్తులు, సమూహాలు, సముదాయాలను కలుపుతూ, క్రమబద్ధీకరిస్తూ, ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఈ సామాజిక సంస్థలు వేల సంవత్సరాలకు పైగా కొనసాగుతుంటాయి.
* కార్మిక లేదా విద్యార్థి సంఘాలు వంటి ఇతర సంస్థలు / సంఘాలు వ్యక్తి మేధోపరమైన లేదా ఇతర అవసరాలను తీరుస్తుంటాయి. వీటి ఉనికి కొద్ది సంవత్సరాలు లేదా సామాజిక సంస్థలతో పోలిస్తే తక్కువ కాలం ఉంటుంది.
* కచ్చితమైన నియమ నిబంధనలతో సామాజిక సంస్థలు తరతరాలుగా కొనసాగుతాయి. ఇతర సంఘాలు / సంస్థల్లో నియమ నిబంధనలున్నప్పటికీ ఎక్కువ కాలం కొనసాగలేవు.


ప్రాతిపదికలు
వివిధ రకాల సామాజిక సంస్థలను కింది అంశాల ప్రాతిపదికన వివరించవచ్చు. అవి..
1. కులం, 2. వివాహం, 3. బంధుత్వం, 4. కుటుంబం, 5. మతం, 6. రాజకీయ వ్యవస్థ, 7. ఆర్థికవ్యస్థాపన 8. సంస్కృతి


కులం
ఇది అంతర్వివాహ సమూహం. ఇందులో క్రమానుగతశ్రేణి, ఆహార, సామాజిక సంబంధాల్లో కట్టుబాట్లు, వృత్తి, వివాహాల్లో నిర్బంధాలు కనిపిస్తాయి.
లక్షణాలు: స్తరీకరణ, క్రమానుగత శ్రేణి, ఆహార నియమాలు, సామాజిక కట్టుబాట్లు, వృత్తి నిర్బంధాలు, వివాహ నిర్బంధాలు - నియమాలు వంటివి.
కుల ఆవిర్భావ సిద్ధాంతాలు: దైవ సిద్ధాంతం, వృత్తి సిద్ధాంతం, జాతి సిద్ధాంతం, భౌగోళిక సిద్ధాంతం, సంస్కార సిద్ధాంతం, బ్రాహ్మణ సిద్ధాంతం, సంఘర్షణ సిద్ధాంతం
కులవ్యవస్థలో మార్పులు: బ్రిటిషర్ల, సంఘ సంస్కర్తల ప్రభావం.. పారిశ్రామికీకరణ.. కులవృత్తులు, ఆధునిక జీవన విధానం, రాజకీయ-ఆర్థిక రంగాలు, వివాహ నియమాలు - వీటిలో మారుతున్న పరిణామాలు.. తదితర కారణాల వల్ల కులవ్యవస్థలో మార్పులొచ్చాయి. సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ, లౌకికీకరణలు కూడా కులవ్యవస్థలో విపరీతమైన మార్పులకు కారణమయ్యాయి.


వివాహం
ప్రపంచంలోని అన్ని సమాజాలు, తెగల్లోనూ వివాహం ఉంది. ఒక్కోచోట ఒక్కోరీతిలో వివాహాలు జరుగుతాయి. వ్యక్తి తన భౌతిక, లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి వివాహ వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు. వివాహాల్లో నియమావళి, ఆర్థిక వ్యవహారాలు, ఆచారాలు కనిపిస్తాయి.

బంధుత్వం
కుటుంబంలోని వ్యక్తికీ వ్యక్తికీ మధ్య, సముదాయంలో వివిధ వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను బంధుత్వం అంటారు. బంధుత్వమనేది వివాహం, ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధం. ఇది రెండు విధాలుగా ఏర్పడుతుంది.
1. వైవాహిక బంధుత్వం: వివాహం ద్వారా ఏర్పడే బంధుత్వాన్ని వైవాహిక బంధుత్వం అంటారు. దీన్ని 'ఎఫినల్ కిన్‌షిప్' అంటారు.
ఉదా: భార్య, భర్త, అత్త, మామ.
2. ఏకరక్త బంధుత్వం: జన్మతహా ఏర్పడే బంధుత్వాన్ని ఏకరక్త బంధుత్వం అంటారు. అంటే ఏక రక్తసంబంధమున్న వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వం.
ఉదా: తండ్రి, కొడుకు, సోదరుడు, సోదరి. ఈ బంధుత్వాన్ని 'కన్‌సాంగ్వినీయల్ కిన్‌షిప్' అంటారు. ఇవే కాకుండా దత్తత తీసుకోవడం ద్వారా దత్త బంధుత్వం ఏర్పడుతుంది.


కుటుంబం
వ్యక్తి సామాజిక జీవనానికి పునాది కుటుంబం. ఈ వ్యవస్థకు పునాది వివాహం. ఇది ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ, ప్రాథమిక సమూహం.
లక్షణాలు: విశ్వజనీనత, శాశ్వతత్వం-మార్పు, పరిమిత పరిమాణం, ఉమ్మడి నివాసం, ఆర్థిక సహకారం
కుటుంబ విధులు: లైంగిక సంబంధాల క్రమబద్ధీకరణ, ప్రత్యుత్పత్తి, సాంఘికీకరణ, ఆర్థిక, సాంస్కతిక విధులు.

మతం
మతం విశ్వజనీనమైన విశ్వాసం. ఇ.బి.టేలర్ దీన్ని 'నిరాకార శక్తులపై విశ్వాసం'గా పేర్కొంటే.. మలినోస్కి 'సామాజిక దృగ్విషయం'గా, వైయక్తిక అనుభవంగా అభివర్ణించాడు.
మతం విధులు: ఇది సామాజిక క్రమాన్ని (సోషల్ ఆర్డర్) కొనసాగిస్తుంది. వ్యక్తి భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. సాంస్కృతిక విలువలను పరిరక్షిస్తుంది. భయాలను తొలగించి, కారణాలను వివరిస్తుంది. సమగ్రతకు తోడ్పడుతుంది. సమాజంలో మతం పుట్టుకకు సంబంధించి వివిధ సిద్ధాంతాలున్నాయి. వాటిలో సర్వాత్మవాదం, జీవాత్మవాదం, ప్రకృతివాదం, టోటెంవాదం, ప్రకార్యవాదం ముఖ్యమైనవి.


రాజకీయ వ్యవస్థ
సమాజంలో నియంత్రణ యంత్రాంగంలో రాజకీయ వ్యవస్థ ప్రధానమైంది. ఆధునిక సమాజంలో ఉన్న పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు, శిక్షలు.. సామాజిక నియంత్రణగా పని చేస్తున్నాయి. ఇవన్నీ వ్యవస్థీకృతమైన నియమనిబంధనల ప్రకారం విధులను నిర్వర్తిస్తాయి. మొత్తం రాజకీయ / రాజ్యవ్యవస్థను సామాజిక సంస్థగా పేర్కొంటారు. జానపద, సామాజిక రీతులు; కట్టుబాట్లు, సామాజిక ఆమోదాలు, ఆచారాలు, విధివిధానాలు, చట్టాలు ఇందులో భాగంగా ఉంటాయి. మొత్తం పరిపాలన, రాజ్య వ్యవస్థలను కలిపి సామాజిక సంస్థగా పేర్కొంటారు.

ఆర్థిక వ్యవస్థాపన
ఆర్థిక సంబంధాలు ఒక సమాజ సముదాయక, సాంస్కృతిక నిర్మాణాన్ని రూపుదిద్దడంలో దోహదపడతాయి. ఒక సమాజ సాంస్కృతిక జీవనాన్ని అధ్యయనం చేయడానికి ఆర్థిక వ్యవస్థాపన ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సామాజిక సంస్థల్లో భాగంగా అధ్యయనం చేస్తారు. ఆదిమ ఆర్థిక వ్యవస్థలో మారకం ప్రధాన పాత్ర పోషిస్తే, ఆధునిక సమాజాల్లో పంపిణీ, వర్తకం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

సంస్కృతి
ఇది సంస్కారమనే పదానికి పర్యాయ పదంగా వాడుకలో ఉంది. సంస్కృతి ఒక సమాజాన్ని ఇతర సమాజాల నుంచి వేరు చేస్తుంది. ఒక్కో సమాజం ఒక్కో రకమైన సంస్కృతిని కలిగి ఉంటుంది.
భాష, ఆహార అలవాట్లు, వేషధారణ, వృత్తులు, కళలు, రవాణా సదుపాయాలు, యుద్ధసామగ్రి, కర్మకాండలు మొదలైన ఇతర సామాజిక సంస్థలు సంస్కృతిలో భాగంగా ఉంటాయి.


ఇతర ముఖ్య భావనలు
సమాజాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు భారతీయ సంప్రదాయ, ఆధునిక సమాజాల్లో కనిపించే ఇతర ముఖ్య భావనలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి..
1. సంస్కృతీకరణ
2. జాజ్‌మానీ వ్యవస్థ
3. స్తరీకరణ
4. పాత్ర
5. అంతస్తు


సంస్కృతీకరణ: ఈ భావనను ప్రవేశపెట్టిన భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్.శ్రీనివాస్. ఆయన తన పుస్తకం 'రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూర్గుస్‌'లో ఈ పదాన్ని వివరించారు. సంస్కృతీకరణ అంటే దిగువ కులాలు, ఆదిమ తెగలకు చెందిన కొందరు తమ మతపరమైన కర్మకాండలు, ఆచార, పద్ధతులను మార్చి అగ్ర కులాల (ఉపనయన సంస్కారం కలిగిన) వారి జీవన విధానాలను అవలంబిస్తూ అగ్ర కులాలవారి దిశగా పయనించే ప్రక్రియ.

జాజ్‌మానీ వ్యవస్థ: 'జాజ్‌మానీ' అంటే యజమాని అని అర్థం. సంప్రదాయ గ్రామీణ సమాజంలో ఈ జాజ్‌మానీ వ్యవస్థ ఉండేది. గ్రామాల్లో ఉండే వ్యవసాయాధారిత ఉమ్మడి కుటుంబం, సంప్రదాయ వృత్తులకు చెందిన ఇతర కులాలవారు పరస్పరం ఆధారపడి జీవించేవారు. కమ్మరి, కుమ్మరి, రజక, క్షురక, స్వర్ణకార, వడ్రంగి, చర్మకార వృత్తి కులాలవారు సేవల రూపంలో వ్యవసాయ ఉమ్మడి కుటుంబానికి సేవలు చేస్తే సంవత్సరాంతాన ధాన్యాన్ని ప్రతిఫలంగా చెల్లించేవారు. ఈ విధమైన పరస్పరాధారిత వ్యవస్థను జాజ్‌మానీ వ్యవస్థ అంటారు.

స్తరీకరణ: సమాజాన్ని ఒక క్రమానుగత శ్రేణిలో పొరల్లా విభజించడాన్ని స్తరీకరణ అంటారు. ఇందులో ఉన్నత, నిమ్న స్థాయులు కనిపిస్తాయి. భారతీయ సమాజంలో కుల వ్యవస్థను స్తరీకరించిన వ్యవస్థగా లేదా స్తరీకరణకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

పాత్ర: సమాజంలో వ్యక్తులు వివిధ పాత్రలను నిర్వర్తిస్తారు. ఒక వ్యక్తి తండ్రి, కుమారుడు, భర్తగా ప్రాథమిక సమూహంలో వ్యవహరిస్తాడు. అదే వ్యక్తి ఉద్యోగస్థుడిగా మరొక పాత్రను, ఒక సంస్థకు సెక్రటరీగా ఇంకో పాత్రను పోషించవచ్చు. ఈవిధంగా ప్రతి వ్యక్తి తన అభిరుచులకు అనుగుణంగా కొన్ని పాత్రలను పోషిస్తాడు. వ్యక్తి నిర్వర్తించే విధులు, ప్రకార్యాలతో కూడుకున్నదే పాత్ర.


అంతస్తు: వ్యక్తుల వయసు, లింగం, వృత్తి, వైవాహిక స్థితి, ఆర్థిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితులను బట్టి అంతస్తును కలిగి ఉంటారు. సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తి పొందిన స్థితిని అంతస్తు (స్టేటస్) అని పిలుస్తారు. వ్యక్తులు అంతస్తును రెండు రకాలుగా సంపాదిస్తారు. అవి.. ఆరోపించిన అంతస్తు (ఎస్క్రైబ్‌డ్ స్టేటస్), సంపాదించిన అంతస్తు (ఎచీవ్డ్ స్టేటస్).
* వ్యక్తి పుట్టుక, జైవిక, సామాజిక స్థితులను బట్టి అప్రయత్నంగా, సంప్రదాయంగా లభించిన దాన్ని 'ఆరోపించిన అంతస్తు'గా పిలుస్తారు.ఉదా: కులం, మతం, వయసు, లింగభేదం వంటివి.
* సాధించిన అంతస్తు అంటే వ్యక్తి అర్హత, గుణగణాలను బట్టి పొందిన అంతస్తు. ఉదా: డాక్టర్, ఇంజినీర్, లెక్చరర్ వంటి వృత్తులు.

మానవుడు సామాజిక జంతువు (సంఘ జీవి) - అరిస్టాటిల్
వారసత్వం, అంతర్వివాహ నియమం, సంప్రదాయ వృత్తి సంబంధాలతో కూడిన.. స్థానిక సముదాయ క్రమశ్రేణిలో ఒక ప్రత్యేకమైన అంతస్తును కలిగిన సమూహమే కులం - ఎం.ఎన్.శ్రీనివాస్
స్త్రీ పురుషుల లైంగిక సంబంధాల పర్యవసానంగా ఏర్పడే సామాజిక, ఆర్థిక సంబంధాల్లో పాల్గొనడానికి మత క్రతువు ద్వారా.. లేదా చట్టాలు రూపొందించిన ఇతర పద్ధతుల్లో.. ఒక్కటై, సమాజ ఆమోదం పొందితే దాన్ని వివాహంగా చెప్పవచ్చు - మజుందార్
ఒకేచోట నివసిస్తూ.. ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి లక్షణాలున్న ప్రాథమిక సమూహమే కుటుంబం - జి.పి.మర్డాక్
విజ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతినియమాలు, చట్టం, ఆచారాలు.. మానవుడు సమాజ సభ్యుడిగా ఉంటూ సముపార్జించుకున్న శక్తి సామర్థ్యాలు, అలవాట్లు.. వీటన్నింటి సంశ్లిష్టతల మొత్తమే సంస్కృతి - ఇ.బి.టేలర్
విజ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతినియమాలు, చట్టం, ఆచారాలు.. మానవుడు సమాజ సభ్యుడిగా ఉంటూ సముపార్జించుకున్న శక్తి సామర్థ్యాలు, అలవాట్లు.. వీటన్నింటి సంశ్లిష్టతల మొత్తమే సంస్కృతి - ఇ.బి.టేలర్
సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం
సామాజిక సంబంధాల అల్లికే సమాజం -మెకైవర్

 

 

Posted Date : 13-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌