• facebook
  • whatsapp
  • telegram

పేదరికం - కారణాలు - అంచనాలు - కమిటీలు

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. భారతదేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలకు నిరుద్యోగం, జనాభా పెరుగుదలనే ముఖ్య కారణాలుగా పేర్కొంటారు. పేదరికం అనేది ఒక సాంఘిక, ఆర్థిక లక్షణం.

 

రకాలు 

పేదరికాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. 

1) నిరపేక్ష పేదరికం (Absolute poverty)

2) సాపేక్ష పేదరికం (Relative poverty)

నిరపేక్ష పేదరికం: ఒక వ్యక్తి కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, దుస్తులు పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ఇది మన దేశంలో ఉంది. దీన్ని తలల లెక్కింపు పద్ధతి (Head Count Ratio - HCR) ద్వారా లెక్కిస్తారు.

సాపేక్ష పేదరికం/ ఆర్థిక అసమానతలు: ఇది ఆర్థిక అసమానతలకు సంబంధించిన భావన. ఇతరుల కంటే తక్కువ ఆదాయం పొందేవారిని పేదవారిగా పేర్కొంటారు. సాపేక్ష పేదరికం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది.దీన్ని లోరెంజ్‌ వక్రరేఖ (Lorenz curve) లేదా ‘గిని గుణకం’ ద్వారా లెక్కిస్తారు.

 

పేదరిక భావనలు

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు (Below Poverty Line - BPL): ఒక వ్యక్తి రోజుకు 2300  కేలరీల కంటే తక్కువ ఆహారం పొందితే, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లుగా పరిగణిస్తారు.

దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు (Above Poverty Line - APL): ఒక వ్యక్తి రోజుకు 2300  కేలరీల కంటే ఎక్కువ ఆహారం పొందితే, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నట్లు చెప్పొచ్చు.

* పేదరికాన్ని నిర్వచించడానికి ప్రణాళికా సంఘం 1979లో  వైకే అలఘ్‌ నేతృత్వంలో ఒక టాస్క్‌ ఫోర్స్‌ను నియమించింది. ఒక వ్యక్తికి రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల ఆహారం అవసరమని ఈ కమిటీ పేర్కొంది. సగటు భారతీయుడికి 2300 కేలరీల ఆహారం కావాల్సి ఉంటుందని నివేదించింది.

* సగటున 2300  కేలరీల స్థానాన్ని దారిద్య్ర/ పేదరిక రేఖగా (poverty line) పేర్కొంటారు. ఇది ఆదాయం - వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఒక వయోజన వ్యక్తి రోజుకు కనీసం ఎన్ని కేలరీల ఆహారాన్ని తీసుకోవాలనే స్థాయిని తెలుపుతుంది.

ప్రాథమిక పేదరికం: కనీస జీవిత అవసరాలు కూడా సంపాదించలేని స్థితిని ‘ప్రాథమిక పేదరికం’ అంటారు.

ద్వితీయ పేదరికం: కనీస అవసరాలు తీర్చే ఆదాయాన్ని సంపాదించినప్పటికీ, రాబడి కేటాయింపులు సక్రమంగా పంపిణీ చేయలేని స్థితిని ‘ద్వితీయ పేదరికం’ అంటారు.

కటిక/ నిరుపేదరికం (Absolute or Extreme poverty): మొత్తం జనాభా లేదా జనాభాలోని ఒక వర్గం కనీస అవసరాలైన తిండి, దుస్తులు, గూడు పొందలేని స్థితిని ‘కటిక పేదరికం’ అంటారు.

 

జీవన ప్రమాణాలు (Standards of living)

* ఆరోగ్యం/ వైద్యం    * ఇల్లు   * తాగునీరు 

* పారిశుద్ధ్యం 

* వంట ఇంధనం (cooking fuel)

* విద్యుత్‌     * ఆస్తులు


పేదరిక వ్యత్యాసపు సూచీ (Poverty gap index)

పేదరికం ఎంత తీవ్రంగా ఉందనే భావనను దీంతో కొలుస్తారు. పేదరికం గీతకు కింద ఉన్న సగటు దూరం, ఆ గీతకు అనుపాతంగా ఉంటే దాన్ని పేదరిక వ్యత్యాస సూచీగా నిర్వచిస్తారు. శూన్య పేదరిక వ్యత్యాసం పొందేవరకు పేదలు కానివారిని లెక్కించాలి. అలా కొనసాగిస్తే మొత్తం జనాభా దృష్ట్యా సగటు రూపొందుతుంది 

* ప్రతి పేదవ్యక్తి ఆదాయానికి, దారిద్య్ర రేఖ సూచించే ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బదిలీ చేయడం ద్వారా దారిద్య్ర రేఖ సూచించే ఆదాయానికి వారి రాబడి సమానం అవుతుంది. దీని ద్వారా నిరపేక్ష పేదరికాన్ని అధిగమించవచ్చు. కింది సూత్రం ఆధారంగా పేదరిక వ్యత్యాస సూచీని లెక్కించవచ్చు. 

* 1997లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డీఆర్‌) నివేదికలో మానవ పేదరిక సూచిక (Human Poverty Index)ను ప్రవేశ పెట్టింది. ఇది సమాజంలో పేదరిక తీవ్రతపై సమష్టి అభిప్రాయం కోసం వివిధ లక్షణాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంయుక్త సూచీని ఏర్పాటు చేసింది. 

* యూఎన్‌డీపీ 2010లో డాక్టర్‌ సి.రంగరాజన్‌ నేతృత్వంలో మానవ పేదరిక సూచీ స్థానంలో బహు పార్శ్వపు పేదరిక సూచీ (Multidimensional Poverty Index - MDPI)ని ప్రవేశపెట్టింది. బహు పార్శ్వపు పేదరిక సూచీలో వైద్యం, విద్య, జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. పది వేర్వేరు సూచీల ద్వారా ఈ మూడు అంశాలను క్రోడీకరిస్తారు. ప్రతి అంశానికీ ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా భారితాలను ఉపయోగించి ఒక సమష్టి సూచికను రూపొందించి, దారిద్య్ర రేఖ తీవ్రతను లెక్కిస్తున్నారు.

 

కారణాలు

* ఆర్థిక శక్తి కేంద్రీకరణ

వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత

* సహజ వనరుల అల్ప వినియోగం 

* అధిక జనాభా ఒత్తిడి

* నిరుద్యోగిత    * నిరక్షరాస్యత

* నిత్యావసర వస్తువుల లభ్యత తక్కువగా ఉండటం

* ద్రవ్యోల్బణం    * తక్కువ సాంకేతికత

మూలధన సమస్య

* పంచవర్ష ప్రణాళికల వైఫల్యం

* సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అభివృద్ధి (LPG) నమూనా

* రాజకీయ, సాంఘిక, వ్యవస్థాపక కారణాలు

* ఆర్థిక వృద్ధిరేటు తక్కువగా ఉండటం

* ఆర్థిక అసమానతలు

 

వివిధ పంచవర్ష ప్రణాళికలు -  పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం

నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969--74): దేశంలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1971లో ‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని ఇచ్చారు. దీని అర్థం ‘పేదరికాన్ని తరిమికొట్టడం’.

అయిదో పంచవర్ష ప్రణాళిక (1974-79):  దీన్ని ‘పేదరిక నిర్మూలన ప్రణాళిక’ అని కూడా పిలుస్తారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో 20 సూత్రాల పథకాన్ని (Twenty Points Programme - TPP) ప్రవేశపెట్టింది.

* బ్రిటిష్‌వారు భారత్‌ నుంచి సంపదను తరలించుకుపోయి, ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై దాబాభాయ్‌ నౌరోజీ పరిశోధనలు చేసి ‘పావర్టీ అండ్‌ అన్‌-బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని రాశారు. అందులో మనదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలించడమే భారతదేశ పేదరికానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

 

పేదరిక గణాంకాలను అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలు

* యోగిందర్‌ కె.అలఘ్‌ కమిటీ (1979)

* డా.లక్డావాలా కమిటీ (1993)

ప్రొఫెసర్‌ సురేష్‌ డి.తెందూల్కర్‌ కమిటీ: 

* మనదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రణాళికా సంఘం డిసెంబరు 2005లో ప్రొఫెషర్‌ సురేష్‌  డి.తెందూల్కర్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. 

* ఈ కమిటీ 2009లో తన నివేదికను సమర్పించింది. దీని ప్రకారం మనదేశంలో మొత్తం పేదరికం  200405లో 37.2% ఉండగా, గ్రామాల్లో 41.8%, పట్టణాల్లో 25.7%గా ఉంది.

డాక్టర్‌ సి.రంగరాజన్‌ కమిటీ:  భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం 2012లో డాక్టర్‌ సి.రంగరాజన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది 200910, 201112 పేదరిక స్థితిని అంచనా వేసి,  2014లో తన నివేదికను సమర్పించింది.

ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా కమిటీ:

పేదరికాన్ని అంచనా వేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రొఫెసర్‌ అరవింద్‌ పనగరియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

* వివేక్‌ దెబ్రాయ్, సుర్జీత్‌బల్లా, రతిన్‌రాయ్, అనంత్‌ మొదలైన వారు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

 

భారతదేశంలో పేదరికం అంచనాలు

* మనదేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని 1950లో ప్రారంభించారు. పంపిణీ కంటే ఆర్థికాభివృద్ధిని ప్రోత్స హించారు. దీని ద్వారా జాతీయాదాయం పెరిగి పేదరికం తగ్గుతుందని భావించారు. దీన్ని ‘ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం’ (Trickle - down theory) అంటారు.

* 1970 దశాబ్ద ప్రారంభంలో ఓజా, ప్రణబ్‌ బర్దాన్, దండేకర్, బగిచా సింగ్, మిన్‌హాస్, అహ్లువాలియా మొదలైన ఆర్థికవేత్తలు ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతంపై అధ్యయనాలు చేశారు. పేదరికాన్ని నిర్మూలించడంలో ఈ సిద్ధాంతం పూర్తిగా విఫలమైందని వీరు వెల్లడించారు.

* మనదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి 1950లో జాతీయ నమూనా సర్వే సంస్థ (National Sample Survey Office - NSSO); 1951లో కేంద్ర గణాంక సంస్థ  (Central Statistics Office - CSO)లను ఏర్పాటు చేశారు. వీటి ప్రధాన కార్యాలయాలు న్యూదిల్లీలో ఉన్నాయి. 

* ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 1950 నుంచి 197273 వరకు ఏటా పేదరిక లెక్కలను సేకరించేది. 197374 నుంచి అయిదేళ్లకోసారి పేదరిక గణాంకాలను సేకరించింది.

* 2019లో ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, సీఎస్‌ఓలను జాతీయ గణాంక సంస్థ (National Statistical Organisation-NSO)లో విలీనం చేసింది. ఎన్‌ఎస్‌ఓ దేశంలో పేదరిక గణాంకాలను అంచనా వేస్తోంది.


రచయిత: బండారి ధనుంజయ, విషయ నిపుణులు 

Posted Date : 26-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌