• facebook
  • whatsapp
  • telegram

యూఎన్‌ఓ - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 

సహస్రాబ్ది లక్ష్యాల కాల పరిధి 2015, డిసెంబరు 31తో ముగిసింది. అదే ఏడాది సెప్టెంబరు 15న యూఎన్‌ఓ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. అందులో అన్ని సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొని ప్రపంచ పేదరికం, ఆకలిని నిర్మూలించడం; భూగోళాన్ని పరిరక్షించడం; మానవజాతి శ్రేయస్సును పెంపొందించడం అనే అంశాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు ఉన్నాయి. ఇది 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 

2030 నాటికి సహస్రాబ్ది లక్ష్యాల్లో అసంపూర్ణంగా ఉన్న వాటిని పూర్తి చేసి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని అందరూ అంగీకరించారు. అందుకు అనుగుణంగా తీర్మానంపై సంతకాలు చేశారు. 

ఈ 17 లక్ష్యాల్లో మొదటిది పేదరిక నిర్మూలన (No Poverty) లేదా పేదరిక రహిత సమాజం.

యూఎన్‌ఓ - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నివేదిక 2021

 కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ను విధించాయి. దీని వల్ల తొలిసారిగా ప్రపంచంలో కటిక పేదరికం లేదా నిరుపేదరికం (Extreme Poverty) ఏర్పడిందని యూఎన్‌ఓ తన నివేదికలో పేర్కొంది.

 2020లో ప్రపంచవ్యాప్తంగా అదనంగా 119 నుంచి 124 మిలియన్ల ప్రజలు కటిక పేదరికంలోకి వెళ్లారు. 2030 నాటికి ప్రపంచ పేదరిక రేటు 7 శాతంగా ఉంటుందని యూఎన్‌ఓ అంచనా వేసింది. పేదరిక నిర్మూలన అనే లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యాం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు 1600 స్వల్పకాలిక సామాజిక పరిరక్షణ చర్యలు ప్రవేశపెట్టాయి. అయితే 4 బిలియన్ల ప్రజలకు ఇంకా ఇవి లభించలేదు.

పేదరిక సూచికలు - భావనలు

మానవ పేదరిక సూచిక (Human Poverty Index - HPI):

మానవ పేదరిక సూచిక అనే భావనను 1997లో మానవ అభివృద్ధి సూచిక (HDR) ప్రవేశపెట్టింది. ఇది మానవ జీవనానికి అవసరమైన దీర్ఘాయువు (Longevity), పరిజ్ఞానం (Knowledge), ఉన్నత జీవన ప్రమాణాలు (Decent living Standards), మానవులు కోల్పోయినవి లేదా పొందలేకపోయినవి (Deprivation) అనే అంశాలను ఆధారంగా చేసుకుని సూచీని తయారు చేస్తుంది. 

మానవ పేదరిక సూచీని లెక్కించడానికి మానవ అభివృద్ధి రిపోర్టు 2009లో కింది చలన రాశులను ఉపయోగించారు.

    1) 40 ఏళ్ల వయసుకంటే ముందే చనిపోయేవారి శాతం

    2) వయోజనుల్లో నిరక్షరాస్యుల శాతం

    3) ఆరోగ్య సేవలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉన్న ప్రజల శాతం

    4) పౌష్టికాహారలోపం ఉన్న అయిదేళ్లలోపు పిల్లల శాతం

బహుపార్శ్వ పేదరిక సూచిక (Multidimensional Poverty Index MPI):

 అత్యంత అణగారిన వర్గాలు కోల్పోయిన అంశాలను పరిశీలించడానికి మానవ పేదరిక సూచీ స్థానంలో ‘బహుపార్శ్వ పేదరిక సూచీని ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో అనేక కారకాలను కోల్పోయిన కుటుంబాల అధ్యయనానికి ఈ సూచిక అవసరం. 

భారిత సూచికలో కనీసం 33 శాతం కోల్పోయినవారిని బహుపార్శ్వ పేదలుగా భావిస్తారు.

బహుపార్శ్వ పేదరిక సూచికలో ఆరోగ్యం, చదువు, జీవన ప్రమాణాలు అనే మూడు విభాగాలు ఉన్నాయి. ఇవి పది సూచికలను కలిగి ఉన్నాయి. అవి:

     1. పౌష్టికాహారలోపం     

     2. శిశుమరణాలు రేటు

     3. ఇయర్స్‌ ఆఫ్‌ స్కూలింగ్‌

     4. పాఠశాల హాజరు (School attendance)

     5. వంట ఇంధనం       6. పారిశుద్ధ్యం       7. తాగునీరు 

     8. విద్యుత్‌     9. అంతస్తు   10. ఆస్తులు

కనీస సార్వత్రిక ఆదాయం లేదా సార్వత్రిక మూల ఆదాయం 

(Universal Basic Income-UBI)

 కనీస సార్వత్రిక ఆదాయం అనే భావనను 16వ శతాబ్దంలో రాజకీయ తత్వవేత్త థామస్‌ మోర్‌ మొదటిసారి ఉపయోగించారు. ఆయన రచించిన ‘ఉటోపియా’ అనే పుస్తకంలో దీని అవసరాన్ని వివరించారు.

 1796లో మరో రాజకీయ తత్వవేత్త థామస్‌ పెయిన్‌ దీని ఆవశ్యకత గురించి తెలియజేశారు.

 1969లో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ ఆ దేశంలో కనీస సార్వత్రిక ఆదాయాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు.

 మనదేశంలో 2016 - 17 ఆర్థిక సర్వేలో యూబీఐ భావన గురించి ప్రతిపాదనలు చేశారు.

యూబీఐ అంటే..?:

ప్రభుత్వమే తన పౌరులందరికీ బేషరతుగా కనీస ఆదాయాన్ని సమకూరిస్తే దాన్ని కనీస సార్వత్రిక ఆదాయంగా పేర్కొంటారు. ఇది ఒక రకమైన సామాజిక భద్రత.

పేదలందరికీ నేరుగా ప్రయోజనాలను అందించడం; రాయితీలు, నిరుద్యోగ భృతి మొదలైనవాటిని లబ్ధిదారుల ఖాతాల్లోకే బదలాయించడం ఈ పథకం ఉద్దేశం. ఫిన్లాండ్‌ లాంటి దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది.

సార్వత్రిక అంటే ఎలాంటి వ్యత్యాసం లేకుండా కనీస వేతనాన్ని అందరికీ సమానంగా అందించడం.

భారత్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తే పేదరికం 0.5 శాతానికి తగ్గిపోతుందని, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దీని కోసం 45% శాతం ఖర్చు చేయాలని 2016-17 ఆర్థిక సర్వే వెల్లడించింది. 

ప్రస్తుతం ఆహారం, పెట్రోలియం, ఎరువుల రాయితీల కోసం జీడీపీలో 3 శాతాన్ని వెచ్చిస్తున్నారని ఆర్థిక సర్వే పేర్కొంది. 

స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనదేశంలో పేదరికం 70 శాతం ఉండగా, 2011-12లో అది 22 శాతానికి తగ్గిందని ఆర్థిక సర్వే (2016-17) వెల్లడించింది.

యూబీఐ పథకం పేదరికాన్ని తగ్గించడంతో పాటు సమ్మిళిత ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అనేకమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

నీతి ఆయోగ్‌ సుస్థిరాభివృద్ధి సూచిక 2020-21

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి సూచికల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతిని వెల్లడిస్తూ 2018 నుంచి నీతి ఆయోగ్‌ నివేదికలు విడుదల చేస్తోంది. 

2018లో 13 లక్ష్యాలు, 62 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును వెల్లడించగా; ఇప్పుడు 16 లక్ష్యాలు, 115 సూచికల ఆధారంగా నివేదిక విడుదల చేశారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రాల పనితీరును ప్రామాణికంగా తీసుకుని 0-100 మార్కులు ఇస్తారు. 100 మార్కులు సాధిస్తే 2030 లక్ష్యాన్ని ముందే సాధించిన కార్యసాధక రాష్ట్రంగా ప్రకటిస్తున్నారు. 

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, సీఈఓ అమితాబ్‌కాంత్‌లు 2020-21 సుస్థిరాభివృద్ధి నివేదికను 2021, జూన్‌ 3న విడుదల చేశారు.

ఈ సూచీలో 75 మార్కులతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, 74 మార్కులతో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రెండో ర్యాంక్‌లో, 72 మార్కులతో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. 69 మార్కులతో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.

సూచీలో 65-99 మార్కులు సాధించిన రాష్ట్రాన్ని ఫ్రంట్‌ రన్నర్‌గా, 50-64 పొందిన దాన్ని పెర్ఫార్మర్‌ అని, 0-49 వస్తే ఆస్పిరెంట్‌గా విభజించారు.

నీతి ఆయోగ్‌ సుస్థిరాభివృద్ధి సూచీ-2021 ప్రకారం ‘పేదరిక నిర్మూలన’ లక్ష్య సాధనలో ఆయా రాష్ట్రాల ప్రగతి ఆధారంగా 0-100 మార్కులు ప్రకటించింది. అందులో తమిళనాడు (86 మార్కులు) మొదటి స్థానంలో ఉండగా, బిహార్‌ (32 మార్కులు) చివరి స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ (81) అగ్రస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ (61) చివరి ర్యాంకు పొందింది.

పేదరిక నిర్మూలనలో భారత్‌ సాధించిన ఫలితాలు

270 మిలియన్ల ప్రజలు బహుపార్శ్వ పేదరికం (Multidimensional poverty) నుంచి బయటపడ్డారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), 2005 ద్వారా 2019-20లో 84.44 శాతం కుటుంబాలు ఉపాధి పొందాయి.

ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య పథకాల ద్వారా ప్రతి కుటుంబంలో ఒకరు చొప్పున 28.7 శాతం లబ్ధి పొందారు.

మనదేశంలో గ్రామాలు, పట్టణాల్లో కేవలం 4.2% కుటుంబాలు పూరి ఇళ్లల్లో (kutcha houses) నివసిస్తున్నారు.

ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా  సుమారు 91.38% లబ్ధిదారులు సామాజిక రక్షణను పొందారు.

సుస్థిరాభివృద్ది/ నిలకడగల అభివృద్ది

పర్యావరణ అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి 1983లో నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లెం బ్రంట్‌లాండ్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమటీ 1987లో ‘మన ఉమ్మడి భవిష్యత్‌’ (Our Common Future)’ పేరుతో తన నివేదికను సమర్పించింది. అందులో సుస్థిరాభివృద్ధి అంటే ‘‘భవిష్యత్తు తరాలవారు తమ అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రస్తుత తరాల వారి అవసరాలను తీర్చే అభివృద్ధి’’గా నిర్వచించారు.

సుస్థిరాభివృద్ధి అంటే అభివృద్ధి నిర్విరామంగా కొనసాగడం (Keep goind).

జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) -  సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక నివేదిక 2021

ఎన్‌ఎస్‌ఓ 2021, జూన్‌ 29న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు- 2021 నివేదికను విడుదల చేసింది. అందులో పేదరిక నిర్మూలనలో సాధించిన ఫలితాలను కింది విధంగా పేర్కొంది.

స్వయం సహాయక బృందాలు - బ్యాంకుల పరపతి అనుసంధానం (ఏటా లక్షల్లో)

సంవత్సరం  స్వయం సహాయక బృందాలు (లక్షల్లో)

2015-16 18.32
2016 - 17            18.98
2017 - 18            22.61
2018 - 19            26.98
2019 - 20            31.46

ఆధారం: ఎన్‌ఎస్‌ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక - 2021

2015 - 16లో నూతన పింఛన్‌ పథకం ద్వారా లబ్ధిపొందిన వారు 97,50,406 ఉండగా, 2020 - 21 నాటికి వీరి సంఖ్య 1,43,90,543కి పెరిగింది.

వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా వయోవృద్ధులు ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు. 2015 - 16లో వీటి సంఖ్య 23,095 ఉండగా, 2020 - 21 నాటికి 50,860కి చేరింది.

రచయిత

బండారి ధనుంజయ

విషయ నిపుణులు 

Posted Date : 23-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌