• facebook
  • whatsapp
  • telegram

1952 సిటీ కాలేజీ ఉదంతం

అవకాశాలు కోల్పోయి... అవమానాల పాలై!

  ఉద్యోగాలు స్థానికేతరుల పాలయ్యాయి. స్థానికులకు అవమానాలు, అవహేళనలు మిగిలాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. అది క్రమంగా ఉద్యమంగా మారింది. అందులో విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. హింసాత్మక చర్యలు చెలరేగాయి. నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌లు, కాల్పులు జరిపారు. కొంతమంది చనిపోయారు. ఎందరో గాయాలపాలయ్యారు. 1952లో జరిగిన ఈ సంఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో సిటీకాలేజీ ఉదంతంగా నిలిచిపోయింది.  

  

ఆపరేషన్‌ పోలో (1948) తర్వాత హైదరాబాదు రాజ్యం భారతదేశంలో విలీనమై హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది. నాటి శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1948, సెప్టెంబరు 18న హైదరాబాదు రాష్ట్రంలో మిలిటరీ పాలన విధించి మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరిని మిలిటరీ గవర్నర్‌గా నియమించింది. ఆయన రజాకార్లకు సహకరించిన అధికారులను తొలగించి సుపరిపాలన ఏర్పాటుచేయాలని భావించారు. అందుకోసం పెద్ద సంఖ్యలో అధికారులను మద్రాసు, బొంబాయి, సెంట్రల్‌ ప్రావిన్స్, మైసూరు, కేరళ ప్రాంతాల నుంచి రప్పించి నియామకాలు జరిపారు. ఫలితంగా పరిపాలన మొత్తం స్థానికేతర అధికారుల హస్తగతమైంది. కింది స్థాయి ఉద్యోగాల్లో మాత్రం కొంత వరకు హైదరాబాదు స్థానికులను నియమించారు. దీనివల్ల స్థానికేతర అధికారులు, స్థానిక దిగువస్థాయి ఉద్యోగుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి మిలిటరీ గవర్నర్‌ జె.ఎన్‌.చౌదరి పూర్వపు హైదరాబాదు రాజ్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి 1919లో ఏడో నిజాం జారీ చేసిన ముల్కీ ఫర్మానాను స్వల్పంగా సవరించి 1949, నవంబరు 1న నిజాంతో మరొక ఫర్మానా జారీ చేయించారు. 

 

సవరించిన అంశాలు: 

* హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతస్థాయి లేదా దిగువస్థాయి ఉద్యోగాల్లో నాన్‌-ముల్కీలను నియమించకూడదు.

* ఎవరైనా నాన్‌-ముల్కీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే 1949, నవంబరు 1న వారిని తొలగించినట్లుగా భావించాలి.

 

వెల్లోడి ప్రభుత్వం

  హైదరాబాదు రాష్ట్రంలో మిలిటరీ పాలన 1949, డిసెంబరు 1న ముగిసిపోయి, ఎం.కె.వెల్లోడి నేతృత్వంలో పౌర (సివిల్‌) పాలన ఆరంభమైంది. వెల్లోడి తన పాలనా కాలంలో పాఠశాలల్లో ఉర్దూ మాధ్యమం స్థానంలో మాతృభాషలైన తెలుగు, మరాఠీ, కన్నడ భాషలను ప్రవేశపెట్డాడు. ఫలితంగా తెలుగు బోధించడానికి ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులుగా నాటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారిని నియమించారు. 

  పరిపాలనలో అధికార ఉర్దూ భాష స్థానంలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టడం వల్ల మద్రాసు, కేరళ రాష్ట్రాల నుంచి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉన్నవారిని తీసుకున్నారు. ఈ అధికారులు తమ బంధువులు, తమ ప్రాంతం వారిని దిగువస్థాయి ఉద్యోగాల్లో నియమించుకున్నారు. దీంతో స్థానిక విద్యావంతులు ఉద్యోగావకాశాలను కోల్పోయారు. 

  అధికారులుగా, ఇతర ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా వచ్చిన స్థానికేతరులు హైదరాబాదు రాష్ట్ర స్థానికులను అనాగరికులని అవహేళన చేస్తూ అవమానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున నాన్‌-ముల్కీలు, బోగస్‌-ముల్కీలను నియమించారు. ఉన్నత విద్యా సంస్థల్లో బోగస్‌-ముల్కీ ధ్రువపత్రాలతో సీట్లను పొందారు. దాంతో స్థానిక విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను కూడా కోల్పోయారు.

  ఈ అన్యాయాలను నిరసిస్తూ స్థానిక ముల్కీలు ఉద్యమం బాట పట్టారు. ఈ ముల్కీ ఉద్యమం మొదట వరంగల్‌ పట్టణంలో 1952, జులై 26న విద్యార్థులతో ప్రారంభమైంది. ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థలన్నింటికీ వ్యాపించింది. 

  1952, ఆగస్టు 6న వరంగల్‌ పురపాలక సంస్థ‌ సభ్యుడైన బుచ్చయ్య అధ్యక్షతన విద్యార్థి కార్యాచరణ కమిటీ నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. ‘‘ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న బోగస్‌-ముల్కీలు, నాన్‌-ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో స్థానికులను నియమించడం’’ అనేది ఆ పత్రంలోని సారాంశం.

  కార్యాచరణ కమిటీ 1952, ఆగస్టు 22న సమావేశమై, 27 నాటికి ప్రభుత్వం దీనికి సంబంధించి పత్రికా ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశారు. వరంగల్‌ హైస్కూల్‌ ఆవరణలో 1952, ఆగస్టు 28న నాడు కొంతమంది విద్యార్ధులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీనికి నిరసనగా ఖమ్మం, మహబూబాబాద్, మధిర, ఇల్లందు, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాలకు సమ్మె వ్యాపించింది. 

  నాటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఈ ముల్కీ ఉద్యమం కన్నడ ప్రాంతంలోనూ విస్తరించింది. 1952 ముల్కీ ఉద్యమ కాలంలోనే కన్నడ ప్రాంతమైన గుల్బర్గా జిల్లాలోని చించోలి శాసనసభ నియోజక వర్గ సభ్యుడైన జి.రామాచారి, 1952 ఆగస్టులో ‘హైదరాబాదు హిత రక్షక సమితి’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ముల్కీ నియమాలను పటిష్టంగా అమలు పరచడం, నాన్‌-ముల్కీ, బోగస్‌-ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించడం. 

 

హైదరాబాదులో హర్తాళ్‌ ప్రభావం - పరిస్థితి 

  1952, ఆగస్టు 26 నుంచి 28 వరకు హైదరాబాదులో విద్యార్థులు నాన్‌-ముల్కీలకు వ్యతిరేకంగా జంట నగరాల్లో ‘‘ఇడ్లీ, సాంబార్‌ గో బ్యాక్‌’’, గోంగూర పచ్చడి గో బ్యాక్‌’’, ‘‘విద్యార్థి సంఘం వర్ధిల్లాలి’’ అనే నినాదాలు చేస్తూ నిరసన ఊరేగింపులు చేశారు. 

  1952, ఆగస్టు 29న సమ్మె అన్ని పాఠశాలలూ, కాలేజీలకూ విస్తరించింది. ఆగస్టు 30, 31 తేదీల్లో గోడలపై నినాదాలు రాసి, ర్యాలీలు నిర్వహించారు. సెప్టెంబరు ఒకటిన బక్రీదు కారణంగా సమ్మె నిర్వహించలేదు. 2న విద్యార్థులు జంట నగరాల్లో తిరిగి సమ్మెలో భాగంగా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు, సాధారణ ప్రజలపై రాళ్లు విసరడం వల్ల చాలామందికి గాయాలయ్యాయి. 

  విద్యార్థుల హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా నాటి హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్‌ (కొత్వాల్‌) శివకుమార్‌ లాల్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలను బయటకు పంపకూడదని విజ్ఞప్తి చేశారు. పోలీసు కమిషనర్‌ సెప్టెంబరు 3న జంటనగరాల్లో నిషేధాజ్ఞలు (144 సెక్షన్‌) జారీ చేశారు. నిషేధాజ్ఞ‌లున్నప్పటికీ సుమారు 1500 మంది విద్యార్థులు మూసీ నది దక్షిణ గట్టున ఉన్న సిటీ కాలేజీ ఆవరణ వెలుపలికి వచ్చి ఊరేగింపు చేయాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత కొంతమంది సంఘ విద్రోహశక్తులు విద్యార్థుల్లో చేరి వారిని రెచ్చగొట్టారు. పోలీసులు విద్యార్థులను ఎంత వారించినా హింసను విడనాడక పోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొక వ్యక్తి ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో చనిపోయాడు. మరణించిన వారిని షేక్‌ ముక్తార్, అహ్మద్‌లుగా గుర్తించారు. నిజానికి వీరిద్దరూ విద్యార్థులు కాదని తేలింది. ఈ కాల్పుల్లో చాలామంది గాయపడ్డారు.

  ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 4న మృతుల శవాలతో ఊరేగింపుగా నిరసన తెలియజేయడానికి దాదాపు 30 వేల మంది వరకు విద్యార్థులు, ప్రజలు ఉస్మానియా ఆసుపత్రి వద్దకు చేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, నిరసన తెలియజేయడానికి ముందుగానే శవాలను ప్రభుత్వం ఖననం చేసింది. 

  జనాన్ని నియంత్రించడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి హైదరాబాదు ప్రముఖులు దేశ్‌పాండే, పద్మజా నాయుడు, డాక్టర్‌ జయసూర్య లాంటివారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయిన్పటికీ జనం ఆసుపత్రిలోకి చొచ్చుకొని పోయారు. దాంతో హింసాత్మక చర్యలు జరిగాయి.

  పరిస్థితి విషమించడంతో పోలీసులు మరోసారి లాఠీఛార్జితోపాటు కాల్పులూ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడికే చనిపోగా చాలామంది గాయపడ్డారు. వెంటనే హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో పరిస్థితులను అదుపు చేయడానికి 16 గంటలు నిరంతర కర్ఫ్యూ విధించారు. క్రమంగా పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. 

 

1952 ముల్కీ ఉద్యమ ప్రభావాలు 

  హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ముల్కీ నియమాలు పటిష్టంగా అమలు చేయడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. 

  జస్టిస్‌ పింగళి జగన్‌మోహన్‌రెడ్డి విచారణ కమిషన్‌: సిటీ కాలేజీ ఉదంతానికి సంబంధించి పోలీసు కాల్పులపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుతం నాటి హైదరాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పింగళి జగన్‌మోహన్‌రెడ్డి ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ నాటి ముఖ్యమంత్రిని, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ను, ఇతర అధికారులను విచారించి, ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. 

 

ఈ విచారణ కమిషన్‌ తన నివేదికలో కింది అంశాలను పేర్కొంది. 

* పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య సమన్వయ లోపం. 

* సమ్మె ఉద్రిక్తమై నియంత్రణ కోల్పోవడంతో జరిపిన పోలీసు కాల్పులు న్యాయ సమ్మతమైనవి. 

* నాన్‌-ముల్కీ సమస్యపై స్థానిక విద్యార్థులు అభద్రతా భావానికి లోనవడం. 

* ప్రభుత్వంలో సమయస్ఫూర్తి లోపించడం, త్వరితగతిన స్పందించకపోవడం.

* సమ్మెను రాజకీయ నాయకులు, సంఘవిద్రోహక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకుని లబ్ధి పొందాలనుకోవడం.

ఈ సమ్మె హైదరాబాద్‌ స్థానిక ప్రజలకు నాన్‌-ముల్కీలు, బోగస్‌ ముల్కీలపై ఉన్న అసంతృప్తిని, తీవ్ర వ్యతిరేకతను ప్రతిబింబించింది.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 తెలంగాణ జాతరలు

‣   తెలంగాణ కళలు

  తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌