• facebook
  • whatsapp
  • telegram

కుతుబ్‌షాహీలు (1512 - 1687)

      కుతుబ్‌షాహీలు 'ఆంధ్ర సుల్తానులు'గా పేరుపొందారు. ఆంధ్ర దేశాన్ని సుమారు 175 సంవత్సరాలు పాలించారు. పర్షియన్ రాజభాషగా ఉండేది. సుల్తాన్ కులీకుతుబ్‌షా గోల్కొండ రాజధానిగా 1512లో కుతుబ్‌షాహీ వంశపాలన ప్రారంభించాడు.  1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని మొగలు సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 

 

సుల్తాన్ కులీ (1512 - 43):
      సుల్తాన్ కులీ 'కారాకునీల్' తెగకు చెందినవాడు. బహమనీ రాజ్యంలోని మూడో మహమూద్ వద్ద ఆస్థాన ఉద్యోగిగా పనిచేశాడు. ఖవాస్‌ఖాన్, కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదులు పొందాడు. గోల్కొండ జాగీర్దారుగా నియమితుడయ్యాడు. చాళుక్య యుగంలో గోల్కొండను 'మంగళవరం' అని పిలిచేవారు. బీజాపూర్, బీదర్, ఒరిస్సా పాలకులను ఓడించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కోవిల్‌కొండ, మెదక్, బెజవాడ, ఏలూరు, కొండవీడు, బెల్లంకొండ లాంటి అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. గజపతుల సామంతుడు చితాబ్‌ఖాన్‌ను ఓడించాడు. ఆరవీటి రామరాయలు కొంతకాలం ఇతడి వద్ద పనిచేశాడు. కులీని 'బడేమాలిక్' అని ప్రజలు పిలిచేవారు. 1543లో ఇతడి కుమారుడు జంషీద్ కులీని వధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. హందం వంశస్థుడు.

 

జంషీద్ (1543 - 1550):    
కులీ ఇతడిని దేవరకొండలో రాజప్రతినిధిగా నియమించాడు. మీర్ మహ్మద్ హందనీ ద్వారా తండ్రిని చంపించాడు. చిన్న నేరాలకు సైతం క్రూర శిక్షలు విధించేవాడని 'పెరిస్టా' తన రచనల్లో తెలిపాడు. జంషీద్ సేనాని జగదేవరావు. సోదరుడు ఇబ్రహీం కుతుబ్‌షా బీదర్ పారిపోయి మాలిక్ బరీద్ సాయంతో జంషీద్‌పై తిరుగుబాటు చేశాడు. జంషీద్ క్యాన్సర్ (రాజ క్షయ వ్యాధి)తో మరణించాడు. కవిగా, ఆసుకవితా పండితుడిగా పేరొందాడు.

 

ఇబ్రహీం కులీ కుతుబ్‌షా (మల్కిభరాముడు) (1550 - 1580): 
      జంషీద్ మరణానంతరం రాణి బిల్‌కీస్ జమాన్ తన కుమారుడు సుభాన్ కులీని పాలకుడిని చేసింది. ఇబ్రహీం అతడిని జయించి సుల్తాన్ అయ్యాడు. రామరాయల సాయంతో రాజయ్యాడు. గూఢచారి దళాన్ని (ఖాసాఖైల్) ఏర్పాటు చేశాడు. న్యాయశాఖను పునర్ వ్యవస్థీకరించాడు. తళ్లికోట యుద్ధంలో (1565) ముఖ్యపాత్ర పోషించాడు. అనేక మంది తెలుగు కవులను పోషించి 'మల్కిభరాముడు' అనే బిరుదు పొందాడు. పొన్నగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవులను పోషించాడు. అద్దంకి గంగాధర కవి ఆ కాలం నాటివాడే. హుస్సేన్‌సాగర్, మూసీనదిపై వంతెన; పూల్‌బాగ్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీం ఉద్యానవనాలు, గోల్కొండ కోట ప్రాకారాలను నిర్మించాడు. హిందూ వనిత భగీరథిని వివాహం చేసుకుని గోల్కొండకు 'భగీరథీ' నగరం అని పేరుపెట్టాడు. ఇతడి సేనాని మురహరిరావు 'అహోబిలం' దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. 'లంగరులు' అనే భిక్షా గృహాలను నిర్మించాడు.

* అహ్మద్‌నగర్ సుల్తాన్ మొదటి హుస్సేన్ నిజాంషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
* విజయనగర రాజ్యంలో తలదాచుకున్నాడు.
* గోల్కొండ రాజ్యం రెండో ఈజిప్ట్‌గా పేరొందింది.
* జగదేకరావు (గోల్కొండ)కు రామరాయలు ఆశ్రయం కల్పించడంతో తళ్లికోట యుద్దం జరిగింది.
* వరంగల్లు శాశ్వతంగా గోల్కొండ రాజ్యంలో విలీనం.
* గోల్కొండ దుర్గ ప్రాకారం తిరిగి నిర్మించాడు.
* దక్కనీ ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేశాడు.
* సుగ్రీవ విజయం - తెలుగులో తొలి యక్షగానం, యయాతి చరిత్ర - తొలి అచ్చతెలుగు కావ్యం ఇతడి కాలంలోనివే.
* ''పెట్టెడు బంగారంతో వృద్దురాలైన గోల్కొండ నుంచి బెంగాల్, బీజపూర్‌లకు నిర్భయంగా వెళ్లగలిగేది" - పెరిస్టా.


మహ్మద్ కులీ కుతుబ్‌షా (1580 - 1612):
      ఇతడి కాలాన్ని గోల్కొండ చరిత్రలో 'స్వర్ణయుగం'గా పిలుస్తారు. తెలుగులో కవిత్వం చెప్పిన తొలి ముస్లిం సుల్తాన్ ఇతడే. కులియాత్ - కులి పేరుతో ఉర్దూ భాషలో కవితలు రాశాడు. 'భాగ్యమతి' పేరిట మూసీనది ఒడ్డున భాగ్య నగరాన్ని నిర్మించాడు. తన కుమారుడు హైదర్ పేరుతో 1591లో 'హైదరాబాద్‌'ను నిర్మించాడు. దీని ముఖ్య రూపశిల్పి 'మీర్‌మునీమ్'. ప్లేగు నిర్మూలనకు గుర్తుగా 1591లో 'చార్మినార్' నిర్మాణాన్ని ప్రారంభించాడు.

    జామా మసీదు (ఫలక్‌నుమా ప్యాలస్), దారుల్ పిఫా (ప్రజా వైద్యశాల), దాఢ్ మహల్ (న్యాయస్థానం) నిర్మించాడు. 1611లో ఆంగ్లేయులకు మచిలీపట్నం వద్ద వర్తక కేంద్ర స్థాపనకు అనుమతి ఇచ్చాడు. అక్బర్ ఇతడి ఆస్థానానికి 'మసూద్‌బేగ్‌'ను రాయబారిగా పంపాడు. ట్రావెర్నియర్ (యాత్రికుడు), థేవ్‌నాట్ (వ్యాపారి) అనే ఫ్రెంచి వ్యక్తులు ఇతడి రాజ్యాన్ని సందర్శించారు. 'వైజయంతీ విలాసం' గ్రంథ రచయిత సారంగు తమ్మయ్య ఇతడి ఆస్థానంలోనివాడే. వజీ మహ్మద్ అనే ఉర్దూ కవిని పోషించాడు.
 

సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612 - 1626): 
      మహ్మద్ కులీకుతుబ్‌షాకి కుమారులు లేనందున తన అల్లుడు మహ్మద్ కుతుబ్‌షాను వారసుడిగా ప్రకటించాడు. మొగలు సేనాని మహబత్‌ఖాన్ చేతిలో ఓటమి చెందాడు. హైదరాబాద్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాడు. ఖైరతాబాద్ మసీదును, మక్కా మసీదును నిర్మించాడు. 'భారతదేశ ప్రసిద్ధ నిర్మాణాల్లో మక్కా మసీదు ఒకటి' అని ట్రావెర్నియర్ (నగల వ్యాపారి) పేర్కొన్నాడు. ఇతడి కాలంలో మీర్ మహ్మద్ ముమీన్ తూనికలు, కొలతలపై 'రిసాల మిక్థరీయ' గ్రంథాన్ని, హకీం తకయుద్దీన్ వైద్యశాస్త్రంపై 'మిజానుత్ తబాయీ కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని రచించారు. 'తారిక్ ఇ మహ్మద్ కుతుబ్‌షా' అనే చారిత్రక గ్రంథాన్ని కూడా ఇతడి కాలంలోనే రచించారు. 1614లో పారశీక రాయబారి 'మీర్ జయనూర్ అబిదీన్' హైదరాబాద్ సందర్శించాడు.

 

అబ్దుల్లా కుతుబ్‌షా (1626 - 1672): 
      ఇతడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా కుమారుడు. ఇతడి తల్లి హయత్ బక్షీ బేగం. ఈ కాలంలో గోల్కొండ రాజ్య క్షీణదశ ప్రారంభమైంది. షాజహాన్‌తో సంధి చేసుకున్నాడు. తర్వాత 1655లో ఔరంగజేబు దాడి చేసి గోల్కొండను దోచుకున్నాడు. 1636లో మొగలు రాయబారి అబ్దుల్ లతీఫ్‌తో సంధి చేసుకున్నాడు. శుక్రవారం ప్రార్థనలో పారశీక చక్రవర్తి పేరు బదులు మొగలు చక్రవర్తి పేరు నమోదు చేయడానికి అంగీకరించాడు. 'అబ్దుల్లా కుతుబ్‌షా మీర్‌జుమ్లా'గా పనిచేసిన 'మహ్మద్ సయ్యద్', ఔరంగజేబుతో రహస్య సంధి చేసుకుని మోసం చేశాడు. 1634లో ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా జారీ చేశాడు. నెక్నంఖాన్‌ను కర్ణాటక రాష్ట్ర పాలకుడిగా నియమించాడు. అబ్దుల్లా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగంగా పేరొందింది. క్షేత్రయ్య ఇతడి స్థానాన్ని సందర్శించాడు. గోల్కొండ వజ్రం ఇతడి కాలంలోనే దొరికింది. మహ్మద్ సయీద్ అనే అధికారిదాన్ని షాజహాన్‌కు సమర్పించాడు.

 

అబుల్ హసన్ తానీషా (1672 - 1687): 
      అబ్దుల్లా అల్లుడు భోగ విలాస పురుషుడు. అందుకే ఇతడిని 'తానీషా'గా పిలిచేవారు. 'తానీషా' అంటే 'బాలయోగి' అనే అర్థంలో గురువు షారజు కట్టాల్ ఆయనకు బిరుదు ఇచ్చినట్లు పేర్కొంటారు. సయ్యద్ ముజఫర్ స్థానంలో మాదన్నను మీర్‌జుమ్లాగా నియమించుకున్నాడు. 1674లో సూర్యప్రకాశరావు బిరుదుతో మాదన్నను నియమించాడు. అక్కన్న సర్వసైన్యాధ్యక్షుడు (సర్ లష్కర్)గా నియమితులయ్యారు. మాదన్న మేనల్లుడు పొదిలి లింగన్న కర్ణాటక పాలకుడిగా, కంచర్ల గోపన్న భద్రాచలం తరఫ్‌దార్‌గా నియమితులయ్యారు. మరో సోదరుడు వెంకన్న రస్తుంరావు బిరుదుతో సైనికోద్యోగిగా నియమితుడయ్యాడు.

      మాదన్న ప్రోత్సాహంతో 1676లో శివాజీ గోల్కొండను సందర్శించి తానీషాతో సంధి చేసుకున్నాడు. మొగల్ రాకుమారుడు మౌజం (షా ఆలం) చేతిలో ఓడి తానీషా సంధి చేసుకున్నాడు. 1686 మార్చి 24న అక్కన్న, మాదన్న హత్యకు గురయ్యారు (షేక్ మిన్హజ్ కుట్ర). 1687లో ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై దాడిచేసి 'అబ్దుల్లా ఫాణి' అనే సేనానికి లంచమిచ్చి కోట తలుపులు తెరిపించాడు. అబ్దుల్ రజాక్, లారీ వంటి సేనానులు కోట రక్షణకు పోరాడినా ఫలితం లేకపోయింది. తానీషాను గ్వాలియర్ (దౌలతాబాద్)కు బందీగా పంపించారు. 1687 అక్టోబరులో గోల్కొండ మొగలుల వశమైంది.
 

పాలనా విధానం
బహమనీ పాలనా విధానాలను అనుసరించారు. సుల్తాన్ అత్యున్నత అధికారి. 'మజ్లిస్ దివాన్‌దరి' అనే మంత్రి పరిషత్తు పాలనలో సహాయపడేది. వారిలో పీష్వా (ప్రధాని) ముఖ్యమైనవాడు. ప్రధానినే దివాన్ అనేవారు. ఆర్థికశాఖ మంత్రిని మీర్‌జుమ్లా అనీ, సైనికశాఖ మంత్రిని ఐనుల్‌ముల్క్ అనీ, గణాంక అధ్యక్షుడిని ముజుందర్ అనీ, రక్షణ అధికారిని కొత్వాల్ అని పిలిచేవారు. పీష్వా కింద దబీర్ అనే ఇద్దరు కార్యదర్శులు ఉండేవారు. రక్షకభట శాఖ సమర్థవంతంగా పనిచేసేదని ట్రావెర్నియర్ రాశాడు. మహ్మద్ కులీ 'దాఢ్ మహల్' అబ్దుల్లా కుతుబ్‌షా' 'అమన్ మహల్' అనే న్యాయస్థానాలను నిర్మించారు. మీర్జా ఇబ్రహీం జుబేరి 'బసాటిన్ సలాతిన్' గ్రంథంలో న్యాయనిర్వహణ ఆదర్శప్రాయంగా ఉండేదని రాశాడు. రాజ్యాన్ని 6 రాష్ట్రాలు లేదా తరఫ్‌లుగా విభజించారు. రాష్ట్ర అధిపతి తరఫ్‌దార్. ఇతడికి దివాన్, ఖాజీ, పండిట్ సహాయపడేవారు. సర్కారుకు అధిపతి 'ఫౌజ్‌దార్'. అబుల్‌హసన్ కాలంలో 37 సర్కారులు 517 పరగణాలు ఉండేవి. ఫర్మానాల అమలు బాధ్యతను ఖలీల్ అనే ఉద్యోగి చూసేవాడు. రేవు పట్టణాల్లో హవర్‌దార్, షా బందర్ అనే ఉద్యోగులు ఉండేవారు.

      వేలం పద్ధతి ద్వారా శిస్తు వసూలు అధికారం పొందిన వారిని 'ముస్తజీర్లు' అనేవారు. కుతుబ్‌షాహీలకు అయిదు లక్షల సైన్యం ఉన్నట్లు థేవ్‌నట్ పేర్కొన్నాడు. అంగరక్షక దళాన్ని 'ఖానాఖైల్' అనేవారు. అశ్వికదళం 'నర్‌ఖైల్'. వీరు ఎర్రప్యాంట్లు, నల్ల తలపాగాలు ధరించేవారు. దళాధిపతులను 'నాయక్' అనేవారు. అబుల్‌హసన్ తానీషా కాలం నాటి సైనిక శక్తి గురించి 'తారీఖీ జప్రా (గిరిధర్‌లాల్)' అనే గ్రంథం తెలుపుతోంది.
 

ఆర్థిక పరిస్థితులు
      వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ ఆదాయం 5 కోట్ల హొన్నులనీ, అందులో 19 లక్షల నికరాదాయం ఖజానాలో చేరేదని మెధోల్డ్ రాశాడు. వజ్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, దారు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కోహినూర్ వజ్రం కొల్లూరు (గుంటూరు) గనుల్లో దొరికింది. ఈ గనిలో 30 వేల మంది పనిచేస్తున్నట్లు మెధోల్డ్ పేర్కొన్నాడు. నిర్మల్, ఇందూర్, ఇందల్‌వాయ్ ఆయుధ పరిశ్రమకు కేంద్రాలు. కొండపల్లి, నర్సాపురం, దారు పరిశ్రమకు కేంద్రాలు. మచిలీపట్నంలో కలంకారీ, తెరచాప గుడ్డ ఎగుమతులు జరిగేవి. ఎగుమతి, దిగుమతుల సుంకం 3 1/2 శాతం ఉండేది. కానీ పులికాట్ రేవులో 2% మాత్రమే ఉండేది. ప్రధాన బంగారు నాణెం హొన్ను (ప్రగోడా). హొన్నులో 16వ వంతు ఫణం. ఫణంలో 32వ వంతు తార్. తార్‌కు రెండు కాసులు. రూపాయి (వెండి) విలువ పన్నులో నాలుగో వంతు.

 

సాంఘిక, మత పరిస్థితులు
      సుల్తానులు షియాలైనప్పటికీ మత సామరస్యాన్ని పాటించారు. వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ సుస్థిరతను కోల్పోయింది. పరదా పద్ధతి, వేశ్యా వృత్తి, మూఢనమ్మకాలు లాంటి దురాచారాలు ఉండేవి. అనేక కులాలున్నట్లు 'హంసవింశతి' గ్రంథం తెలుపుతోంది. హైదరాబాద్ నగరంలో 2 వేలమంది వేశ్యలున్నట్లు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు. సతీసహగమన ఆచారం ఉన్నట్లు రాశాడు. నౌరోజ్, వసంతోత్సవాలు, హోలీ, దీపావళి లాంటి పండగల్లో పాల్గొనేవారు. పరమత సహనం పాటించేవారు. మసీదులు నిర్మించడమే కాకుండా హిందూ దేవాలయాలకు, బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చి ఆదరించారు. తానీషా భద్రాచలం రామాలయానికి భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ గ్రామాలను; మల్లేశ్వరస్వామి ఆలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్న పట్టణాలను దానం చేశాడు. మహ్మద్ కులీకుతుబ్ షా ఉద్యోగి అయిన లాల్‌ఖాన్ ఉప్పునూతల గ్రామాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. చిష్టీ శాఖకు చెందిన గురువులు దక్షిణ భారతదేశంలో అనేక మఠాలు స్థాపించారు. షేక్ ఫక్రుద్దీన్ పెనుగొండలో ఒక కంఖాను స్థాపించాడు. బహమనీ కాలంనాటి సూఫీ యోగుల్లో బందెనవాబ్ గెసూధరాజ్ చాలా గొప్పవాడు. సూఫీ గురువులు మత సామరస్యానికి కృషిచేశారు.

 

సాహిత్యం, లలిత కళా వికాసం (సంస్కృతి)
      భాషా సాహిత్యాలను, లలితకళలను బాగా అభివృద్ధి చేశారు. పారశీకం అధికార భాష. సైనిక శిబిర భాషగా ఉర్దూ అభివృద్ధి చెందింది. తెలుగు భాషకు కూడా సముచిత స్థానం ఇచ్చారు. ఖుర్వా అనే పారశీక కవి తన గ్రంథం 'తారిఖ్ ఎల్చి నిజాంషా'ను ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు. ఆలీవుర్సీ ఉర్దూ భాషలో 'నసబ్‌నామా కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని రచించాడు. మీర్జా మహ్మద్ అమీన్ 'లైలా మజ్ను' గ్రంథాన్ని రచించాడు.

సుల్తాన్ కులీ గజల్ రచనలో సిద్ధహస్తుడు. ఉర్దూ భాషకు కులీ ఛాసర్ లాంటివాడని షేర్వాణీ పండితుడు పేర్కొన్నాడు. అబ్దుల్లా కుతుబ్‌షా పీష్వా అయిన మహ్మద్ ఇబన్ ఖాటూన్ 'ఖుర్వాన్ భాటూన్' అనే పారశీక నిఘంటువును రూపొందించాడు. 'సైపుల్‌ముల్క్ నాబదియుల్ జమాల్' గ్రంథాన్ని రచించిన గవాసీని అబ్దుల్లా కుతుబ్‌షా ఆదరించాడు. 'తూత్‌నామాను' పర్షియన్ భాషలోకి అనువదించాడు. అబ్దుల్లా కూడా స్వయంగా ఉర్దూ భాషలో ద్విపదలు రచించాడు. తానీషా ఆస్థానంలో ఉన్న అలీచిన్ తైపూర్ 'హదైఖుల్ సలాతిన్' గ్రంథాన్ని రచించాడు. మాలిక్ మహ్మద్ జయసి గ్రంథం 'పద్మావత్‌'ని గులాం అలీ ఉర్దూ భాషలోకి అనువదించాడు.
      తెలుగులో శంకర కవి 'హరిశ్చంద్రోపాఖ్యానం' రచించి కోర్కాలను జాగీర్దార్ ఈడూరు ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. అద్దంకి గంగాధరుడు 'తపతీ సంవరణోపాఖ్యానం' గ్రంథాన్ని మల్కిభరాముడికి అంకితమిచ్చాడు. కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం చింతలపాలెం అగ్రహారాన్ని ఇచ్చాడు (నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం - కందుకూరి). పొన్నగంటి తెలగనార్యుడు తన 'యయాతి చరిత్ర'ను అమీన్‌ఖాన్ (పటాన్ చెరువు పాలకుడు)కు అంకితం ఇచ్చాడు. అమీన్‌ఖాన్ భార్య బడే బీబీ దయాగుణంలో గొప్ప స్త్రీ. మహ్మద్ కులీ ఆస్థాన విద్వాంసుడు గణేష పండితుడు. మహ్మద్ కులీ ఆస్థానంలో ఉన్న సారంగు తమ్మయ్య 'వైజయంతీ విలాసం' గ్రంథాన్ని రచించాడు. బిక్కనవోలు సంస్థానంలో తెలుగు భాషను బాగా ఆదరించారు. షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తం, పద్మపురాణం లాంటి గ్రంథాలను మల్లారెడ్డి రచించారు. అబ్దుల్లా ఆస్థానాన్ని సందర్శించిన క్షేత్రయ్య 'మువ్వగోపాల' పదాలను రచించాడు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. తానీషా కాలంలో జటప్రోలు, గద్వాల సంస్థానాలు తెలుగు భాషాభివృద్ధికి కృషిచేశాయి. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) దాశరథి శతకాన్ని రచించాడు. వేమన ఈ కాలానికి చెందినవాడే. క్షేత్రయ్యలో పచ్చి శృంగారం, రామదాసులో భక్తి పారవశ్యం, వేమనలో నీతిబోధనకు, సంఘ సంస్కార ప్రభోధానికి సాధనాలయ్యాయి. ఆటవెలది వృత్తంలో వేమన పద్యాలను రచించాడు. వేమన పద్యాల్లో కబీర్, నానక్‌ల భోదనల ఛాయలు కనిపిస్తాయి. వేదాలు వేశ్యలు లాంటివని, ఎంగిలి విద్యలని వేమన పేర్కొన్నాడు.

      కుతుబ్‌షాహీల నిర్మాణాల్లో పారశీక, పఠాన్, హిందూ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. గుమ్మటాలు, కమానులు, మీనార్లు లాంటి విదేశీ లక్షణాలతోపాటు పక్షి, పుష్పలతాది అలంకారాలు లాంటి భారతీయ లక్షణాలను తమ నిర్మాణాల్లో పొందుపరిచారు. సుల్తాన్ కులీ 'జామా మసీదు'ను నిర్మించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా హుస్సేన్ సాగర్, మూసీ నదిపై వంతెన (పూల్‌బాగ్)లను నిర్మించాడు. మహ్మద్ కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని, చార్‌మినార్‌ను నిర్మించాడు. ఉద్యానవనాలు, పండ్లతోటలతో పరివేష్ఠితమైనందున హైదరాబాద్‌ను బాగ్‌నగర్ (ఉద్యానవన నగరం) అన్నారని థేవనట్ పేర్కొన్నాడు. చార్‌మినార్ సమీపంలోనే చార్ కమాన్‌ను నిర్మించారు. మక్కా మసీదు (కచాబా ఆలయంలా)ను మహ్మద్ కుతుబ్‌షా నిర్మించాడు. మక్కా మసీదును దిల్లీలోని 'జామా మసీదు'తో పోల్చవచ్చని షేర్వాణీ పండితుడు పేర్కొన్నాడు. చిత్రలేఖనంలో పారశీక, హిందూ పద్ధతులతోపాటు పాశ్చాత్య సంప్రదాయాలు కూడా ప్రవేశించాయి. దీన్ని 'దక్కనీ వర్ణ చిత్రకళ' అంటారు. దక్షిణాపథంలో సూక్ష్మ వర్ణచిత్రాలకు ఉదాహరణగా పేర్కొనే 'తారిఫ్ హుస్సేన్ షా పాద్‌షాహీ దక్కన్' గ్రంథం నైజాషా ఆస్థానంలో రూపొందింది. దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడిగా పేరొందిన మీర్‌హసీంను మొగలు చక్రవర్తులు తమ ఆస్థానంలో నియమించుకున్నారు.  తానీషా కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌