ఇంజినీరింగ్‌కు ఆయువుపట్టు మెకానికల్, సివిల్, ఈఈఈ బ్రాంచీలు. వాటిల్లో నుంచి పుట్టుకొచ్చినవే మిగిలిన బ్రాంచీలు. వీటిల్లో ఉద్యోగావకాశాలు సాఫ్ట్‌వేర్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకే ఈ బ్రాంచీలతో ప్రైవేట్ కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసినవారిలో ఎక్కువమంది ఏదో ఒక సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకొని ఐటీ వైపు వెళ్తున్నారు. ప్రాంగణ నియామకాలకు కోర్ కంపెనీలు రావని కాదు. వచ్చినా తక్కువ ఉద్యోగాలు అవసరం కాబట్టి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్ర వర్సిటీలు, మరికొన్ని ప్రముఖ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తాయి. అందుకే జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఏ బ్రాంచి తీసుకున్నా ఇబ్బంది లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడాలనుకున్నవారు కోర్ బ్రాంచీల వైపు వెళ్లటం సముచితమని సూచిస్తున్నారు.
బీటెక్ లేదా బీఈ పూర్తిచేస్తే చాలు, పిల్లలకు కనీసం కుటుంబాన్ని పోషించుకునే స్థాయి కొలువు దక్కుతుందన్నది ఎక్కువమంది తల్లిదండ్రుల ఆలోచన. అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. ఒకటీ రెండు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం దొరకబుచ్చుకుంటున్న బీటెక్ విద్యార్థులే ఎక్కువమంది కనిపిస్తారు. కాకపోతే కొందరికి నెల వేతనం రూ.లక్షల్లో ఉంటే...మరికొందరికి రూ.వేలల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా బీటెక్ సీట్లు ఎక్కువగా ఉండటంతో ప్రవేశాలు సులభంగా లభిస్తాయి. ఎంబీబీఎస్, అగ్రికల్చర్ బీఎస్‌సీ లాంటివి అందుకు భిన్నం. అందుకే దేశవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా కేవలం ఒక్క బీటెక్‌లో చేరుతున్నారు. అందులో దాదాపు 45-50 శాతం మంది ప్రాంగణ నియామకాల్లోనే కొలువులు దక్కించుకుంటున్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఏఐసీటీఈ 30కిపైగా బ్రాంచీలను ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చినా ప్రధానంగా 70-80 శాతం వరకు కేవలం ఆరు బ్రాంచీల్లోనే చేరుతున్నారు. అందులో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన మూడు (సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ), కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలైన (మెకానికల్, సివిల్, ఈఈఈ) మరో మూడు ఉన్నాయి. ఈసీఈకి అటు సాఫ్ట్‌వేర్, ఇటు కోర్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి.
కంప్యూటర్స్‌కు ఎందుకు క్రేజ్?

ఎంసెట్‌లోనే కాదు...జేఈఈ అడ్వాన్సుడ్‌లో మొదటి ర్యాంకర్ తొలి ఆప్షన్...కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ). అదే సమయంలో చివరి ర్యాంకర్ సైతం సీఎస్‌ఈ బ్రాంచీ వస్తే చేరతానంటాడు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సీఎస్‌ఈకి ఇదే డిమాండ్. సాఫ్ట్‌వేర్ రంగం ఏటేటా విస్తరిస్తుండటమే కారణం. అంటే అన్ని రంగాల్లో సాఫ్ట్‌వేర్ చొచ్చుకొస్తోంది. ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో సులభంగా కొలువు దొరుకుతుంది. వార్షిక వేతనాలు సైతం ఆకర్షణీయంగా ఉండటం...ముఖ్యంగా అమెరికా లాంటి దశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మంచి గిరాకీ ఉండటంతో విదేశాలు వెళ్లే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు...క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే వీలుండటం మరో కారణం. అందుకే సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచిలపై అంత మోజు.
బలాలు:
* ఉద్యోగావకాశాలు అపారం. రాష్ట్రంలో, దేశంలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఉద్యోగాలు లభిస్తాయి.
* విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలన్నా సీఎస్‌ఈకి అవకాశాలు అధికం. పీజీ కోసం విదేశాలకు వెళ్లేవారిలో 70 శాతానికిపైగా కంప్యూటర్ సైన్స్‌లోనే ప్రవేశాలు పొందుతున్నారు.
* ఒక ఉద్యోగం మానేసినా...యాజమాన్యం తొలగించినా నెల లోపు మరో కొలువు దక్కించుకునే వీలు. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలకు ఆ వెసులుబాటు, అవకాశాలు తక్కువ.
* అన్ని రంగాల్లో సాఫ్ట్‌వేర్‌కు ప్రాధాన్యం పెరుగుతుండటంతో భవిష్యత్తులోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా పుట్టుకొస్తాయి.
* ఉద్యోగావకాశాలు అధికం కాబట్టి ప్రాంగణ నియామకాల కోసం కళాశాలకు కంపెనీలు అధికంగా వస్తాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వెళ్లినా అవసరమైనంత మంది అక్కడ లభించరు. కాబట్టి ఇతర మెరుగైన కళాశాలలకు కూడా ఐటీ కంపెనీలు వస్తాయి.
* ప్రారంభ వేతనం అధికంగా ఉంటుంది.
* సాఫ్ట్‌వేర్‌లో అధిక అవకాశాలు ఉండటంతో సాధారణ తెలివితేటలూ, పరిజ్ఞానం ఉన్నవారికి కూడా కొలువులు దొరుకుతాయి.
బలహీనతలు:
* ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు తక్కువ. అయితే బ్యాంకింగ్, ఎల్‌ఐసీ లాంటి వాటిల్లో మాత్రం సీఎస్‌ఈ అభ్యర్థులకు ప్రత్యేక కొలువులున్నాయి.
* ఎప్పటికప్పుడు సాంకేతికత మెరుగుపడుతూ, మారుతూ ఉంటుంది. ఫలితంగా ఈ రంగంలోని వారు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి.
* చేరిన కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో బ్రాంచీలు ఉండే అవకాశం ఉంది. దాంతో బదిలీలుంటాయి.
ప్రభుత్వ కొలువులకు కోర్ అనుకూలం
భారత్‌లో మౌలిక వసతులైన రోడ్డు, రవాణా, గృహ నిర్మాణం తదితరాలు ఇంకా విస్తరించాల్సి ఉన్నందున సివిల్ ఇంజినీరింగ్ వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్తు రంగంలో కూడా పవన, సౌర విద్యుత్తుకి ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో ట్రిపుల్‌ఈ చదివిన వారికీ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కొలువుల్లో చేరాలనుకునే వారికీ కోర్ బ్రాంచిలే అనుకూలం. ఎన్‌ఐటీ వరంగల్‌లో కోర్ బ్రాంచీల్లో చదివినవారు దాదాపు 90 శాతం మంది కోర్ రంగాల్లోనే ఉపాధి పొందుతున్నారు.
- ఆచార్య శ్రీనివాసరావు, మెకానికల్ విభాగం, ఎన్‌ఐటీ వరంగల్
వ్యామోహం, పట్టుదల ఉంటే...
ఎలాగైనా అదే బ్రాంచీ చదవాలనీ...ఆ రంగంలోనే ఎదగాలనీ పట్టుదల ఉన్నవారు...ఆసక్తిని మించి వ్యామోహం ఉన్నవారు కోర్ బ్రాంచీలను ఎంచుకుంటే మంచిది. అదీ సాధారణ కళాశాలల్లో చదివేవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి.
- ఆచార్య కామాక్షి ప్రసాద్, జేఎన్‌టీయూహెచ్
ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం ముఖ్యం
కోర్ బ్రాంచీల్లో చేరినవారు కావాలంటే సాఫ్ట్‌వేర్ వైపూ వెళ్లొచ్చు! లేదంటే తమ కోర్‌లోనైనా కొనసాగవచ్చు! అదే సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీల వారికి ఆ అవకాశం ఉండదు. కోర్ సబ్జెక్టుల్లో ఉన్నత విద్య అవకాశాలు చాలానే ఉన్నాయి. విద్యార్థులు కోర్, నాన్ కోర్ ఏ బ్రాంచీ తీసుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడం ముఖ్యం.
- డాక్టర్ రవిచంద్ర, ప్రిన్సిపల్, మల్లారెడ్డి కళాశాల
కోర్ బ్రాంచీలు ఎంచుకుంటే?
బలాలు:
* జీవితాంతం కెరియర్ ఉంటుంది. పదవీ విరమణ తర్వాత కూడా కన్సల్టెంట్‌గా, సలహాదారుగా పనిచేయవచ్చు.
* ప్రారంభ వేతనం తక్కువగా ఉన్నా మధ్య వయసు నుంచి అసలు కెరియర్ ప్రారంభమవుతుంది. చివరికి వచ్చేసరికి అన్ని విధాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
* ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. గేట్ ద్వారా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో, డీఆర్‌డీఓ, రైల్వే, పీడబ్ల్యూడీ లాంటి శాఖల్లో చేరవచ్చు.బీ కోర్ సబ్జెక్టు తీసుకున్న చాలామంది మళ్లీ సాఫ్ట్‌వేర్ వైపే వస్తున్నారనేది నిజమే! కానీ దీన్ని కోర్ సబ్జెక్టుల బలహీనత కంటే బలంగానే తీసుకోవచ్చు! ఎందుకంటే... ఇంజినీరింగ్‌లో తన కోర్‌పై పట్టు పెంచుకుని.. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టును కూడా నేర్చుకుని సీఎస్‌ఈ వారితో పోటీగా ఉద్యోగాలకు ప్రయత్నించటమంటే అదనపు పరిజ్ఞానం సంపాదిస్తున్నట్లే! ఈ సదుపాయం సీఎస్‌ఈ చేసిన వారికి ఉండదు.
బలహీనతలు:
* సాఫ్ట్‌వేర్ రంగం మాదిరిగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉండవు.
* ప్రారంభ వేతనం తక్కువగా ఉంటుంది.
- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్