• facebook
  • whatsapp
  • telegram

విలక్షణ మార్గంలో.. విలువైన కోర్సులు

కోర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌.. ఇంజినీరింగ్‌లో ఇంతకు మించి డిమాండ్‌ ఉన్న కోర్సులు లేవా? విలక్షణంగా.. విభిన్నంగా డిగ్రీ చేయడానికి ఇంకా ఏం దారులు ఉన్నాయని వెతికేవాళ్లకు కొన్ని కోర్సులను సూచిస్తున్నారు నిపుణులు. సీట్లు తక్కువ, పోటీ తక్కువ, అవకాశాలూ పరిమితమే అయినా... పట్టా చేతికందగానే ఉద్యోగం దొరుకుతుందని చెబుతున్నారు. వైవిధ్యంగా కెరియర్‌ను ప్లాన్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు వీటిని పరిశీలించవచ్చు.

 

విద్యార్థులు కంప్యూటర్‌సైన్స్‌, ఇతర ప్రాచుర్యం పొందిన బ్రాంచిల్లో చేరటానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అరుదైన కోర్సులు ఎంచుకుంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయినా ఆంధ్రవిశ్వవిద్యాలయంలాంటి సంస్థల్లో ప్రతి సంవత్సరం ఇలాంటి కోర్సుల సీట్లు త్వరగానే భర్తీ అవుతుంటాయి.వీటిని పూర్తిచేసిన వారికి పోటీ తక్కువ. మంచి భవిష్యత్తు ఉంటుంది. సంప్రదాయానికి భిన్నంగా కొత్తరంగాల్లో అవకాశాలు వెతుక్కోవాలన్న ఆసక్తి ఉన్నవారికీ, పరిశోధనలు చేసి ఆయా రంగాల ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న తపన ఉన్నవారికీ, సమస్యలను సవాలుగా తీసుకుని పరిష్కరించాలన్న పట్టుదల ఉన్నవారికీ అరుదైన కోర్సులు చక్కటి భవిష్యత్తును అందిస్తాయి. సొంతంగా పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే ఆలోచనలున్నవారు ఈ కోర్సులు చదువుకుంటే ఆయా అంశాల ఆధారంగా వివిధ రంగాలకు ఎలాంటి వినూత్న ఉత్పత్తులను, సేవలను అందించవచ్చో తెలుస్తుంది.

 

కెమికల్‌ ఇంజినీరింగ్‌

రసాయనాలు, ఇంధనాలు, మందులు, ఆహార పదార్థాల ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యలను కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సూత్రాలను ఉపయోగించి పరిష్కరించడాన్ని స్థూలంగా కెమికల్‌ ఇంజినీరింగ్‌ అని చెప్పవచ్చు. ఈ నిపుణులు పెద్ద ఎత్తున ఉత్పత్తులకు డిజైన్లు, పరికరాలు తయారుచేస్తారు. ఉత్పత్తి పద్ధతులను పరిశీలిస్తారు, ప్లాన్‌ చేస్తారు. పర్యావరణంతోపాటు, ఉత్పత్తిలో పనిచేసే కార్మికులు, వినియోగదారుల భద్రతకు సంబంధించి అంశాలను వీరు తనిఖీ చేస్తారు. శక్తి, ఆహారం, వస్త్ర, పేపర్‌ రంగాల్లో వీరికి అవకాశాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఈ విభాగంలో బీటెక్‌ అందిస్తున్నాయి. విభిన్న రంగాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

 

నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌

నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ బీటెక్‌ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. ఈ కోర్సు చేసినవారికి ప్రపంచవ్యాప్త డిమాండు ఉంది. నౌకల తయారీ, చమురు సంస్థలు, నౌకల నిర్వహణ సంస్థలు, నౌకా సేవల సంస్థలు, రక్షణరంగం, పరిశోధన సంస్థలు, నౌకాశ్రయాలు తదితరాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఆంధ్రవిశ్వ విద్యాలయంలో మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రతిభ చూపిన విద్యార్థులకు అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఉపకారవేతనాలు ఇచ్చిమరీ ఉన్నతచదువులు చదివించడానికీ, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించడానికీ ముందుకొస్తుండడం విశేషం. ఏటా విదేశీ విద్యార్థులు ఏయూలో మెరైన్‌ ఇంజినీరింగ్‌ చేయడం కోసం వస్తుంటారు. నాడు విశాఖ పోర్టు అధికారులు నౌకాయానరంగానికి అవసరమైన సాంకేతిక నిపుణుల అవసరాన్ని గుర్తించి వర్సిటీ అధికారులతో మాట్లాడి ప్రపంచ సముద్రయానరంగం అవసరాలకు అనుగుణంగా కోర్సును రూపకల్పన చేయించారు.

 

మెటలర్జికల్‌

మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు కూడా దేశవ్యాప్తంగా తక్కువ కళాశాలల్లో మాత్రమే లభ్యమవుతుంది. ఒకప్పుడు దేశ ఉక్కురంగ అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసినప్పటికీ ప్రస్తుతం పలు రంగాలకు అవసరమైన పదార్థాల రూపకల్పన, ఆవిష్కరణలకు మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు కీలకంగా మారారు. బయోమెటీరియల్స్‌, నానో మెటీరియల్స్‌ తదితర పదార్థాల ఆవిష్కరణ నేపథ్యంలో మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ పేరుతోనూ, ఇతర పేర్లతోనూ వివిధ విశ్వవిద్యాలయాలు కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయంతో పాటు పలు సంస్థల్లో బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సులను ఇందులో అందిస్తున్నారు. ఈ కోర్సు చేసిన విద్యార్థులకు ఉక్కు కర్మాగారాలు, సెయిల్‌ తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మెటలర్జికల్‌ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డిమాండు ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, ఎంజీఐటీ కళాశాలలు, ఏపీలో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ - ఆంధ్రాయూనివర్సిటీ, జేఎన్‌టీయూ - కాకినాడ మెటలర్జీలో బీటెక్‌ అందిస్తున్నాయి.

 

జియోఇన్ఫర్మేటిక్స్‌

భూములకు సంబంధించిన సమగ్ర వివరాలనూ, వాటి భౌతిక స్థితిగతులనూ విశ్లేషించడం సంక్లిష్టమైన సమస్య. భూముల విలువలు నానాటికీ ఆకాశానంటుతున్న ప్రస్తుత తరుణంలో జియోఇన్ఫర్మేటిక్స్‌లో ఇంజినీరింగ్‌ చేసినవారికి భారీ డిమాండు ఉంది. జియో ఇన్ఫర్మేటిక్స్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు కన్సల్టెన్సీ సంస్థల్లోనే కాక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో కూడా గిరాకీ ఉంది. భూరికార్డుల కంప్యూటరీకరణ ద్వారా, జియోఇన్ఫర్మేటిక్స్‌ పరిజ్ఞానాలతో భూసంబంధ అక్రమాలు జరగకుండా కాపాడడంలో కూడా ఈ రంగ నిపుణులు కీలకపాత్ర పోషిస్తుంటారు. దేశంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఈ రంగ నిపుణుల కోసం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రాంగణ నియామకాలు చేపట్టి నిపుణులకు ఉద్యోగాలిస్తుంటుంది. వారికున్న పరిజ్ఞానాల ఆధారంగా కంప్యూటర్‌ ఆధారిత సేవలు అందించేలా పలు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల రూపకల్పనకు, సేవలందించేందుకు ఆయా ఇంజినీర్లను ఉపయోగించుకుంటుంది.

 

సిరామిక్‌ టెక్నాలజీ

తక్కువ ఉష్ణోగ్రత వద్ద నాన్‌మెటాలిక్‌ వస్తువులను సిరామిక్‌ టెక్నాలజీతో తయారు చేస్తారు. విమానాలకు సంబంధించిన కొన్ని విడిభాగాలు, ఇంజిన్లను, స్పేస్‌ షటిల్స్‌ తదితరాల ఉత్పత్తికి ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. సిరామిక్‌ పదార్థాల వినియోగం విభిన్నరంగాల్లో క్రమంగా విస్తృతమవుతున్న నేపథ్యంలో సిరామిక్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. అంతర్జాతీయంగా సిరామిక్‌ వస్తువులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఈ విభాగం గురించి ఆలోచించవచ్చు. ఆంధ్రవిశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాల ఈ కోర్సు అందిస్తోంది.

 

ఇన్‌స్ట్రుమెంటేషన్‌

ఆటోమేషన్‌ ప్రక్రియలు కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రంగ నిపుణులకు గిరాకీ ఊపందుకుంది. తయారీ ప్రక్రియలను సులభతరం చేయడానికీ, వ్యయాన్ని తగ్గించుకోవడానికీ¨, వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడానికీ, విశ్వసనీయతతో ఉత్పత్తుల తయారీకీ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ కీలకంగా మారింది. ఎలాంటి తయారీరంగ సంస్థలకైనా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్లు కీలకంగా మారారు. ఏయూలో ఈ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆంధ్రవిశ్వవిద్యాలయంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

 

పెట్రోలియం ఇంజినీరింగ్‌

చమురు, సహజవాయువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ అందరికీ తెలిసిందే. ఈ రంగాల్లో నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి. భూమిలోని చమురు, సహజ వాయువు నిల్వలను వెలికితీయడం, కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఎక్స్‌ప్లొరేషన్‌ నిర్వహించడం వీరి ప్రధాన విధులు. కోర్సును పూర్తిచేసిన వారు చమురురంగ తయారీ, దాని అనుబంధ సంస్థల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో వీరికి గిరాకీ ఎక్కువ. ఓఎన్‌జీసీ లాంటి ప్రసిద్ధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏపీలో జేఎన్‌టీయూ -కాకినాడ, పెద్దాపురంలోని రెండు కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

 

 

 

- బి.ఎస్‌. రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం

Posted Date : 06-10-2021

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌