• facebook
  • whatsapp
  • telegram

ఇందుకే.. ఎంచుకోవాలి ఈసీఈ!

టెలివిజన్‌, రేడియో, శాటిలైట్‌, కంప్యూటర్‌, మొబైల్‌, ఏసీ ఇలా మన జీవితాలతో ప్రతి క్షణం ముడిపడి ఉండే పరికరాలన్నింటినీ రూపకల్పన చేసి, నిర్వహించేది ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్లే. ఆట బొమ్మల నుంచి అంతరిక్షం వరకు అనేక అవకాశాలు కల్పిస్తుంది కాబట్టే, ఎంసెట్‌ తర్వాత ఈసీఈ బ్రాంచిని ఎంచుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో అత్యంత ఆదరణ ఉన్నవాటిల్లో ప్రముఖమైంది ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌). ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న బ్రాంచి ఇది. ప్రధానంగా ఎలక్ట్రానిక్‌, కమ్యూనికేషన్‌ పరికరాలు; సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు; చిప్‌ లెవెల్‌ హార్డ్‌వేర్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీల ఇంటర్‌ఫేస్‌ అధ్యయనం ఈ బ్రాంచిలో ఉంటుంది.
ఈసీఈ బ్రాంచిని ఎంచుకునే ముందు అభ్యర్థి ఆసక్తిని అంచనా వేసుకోవాలి. ఇంటర్‌లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లోని కొన్ని అధ్యాయాలపై అవగాహన ఉంటే ఈసీఈ గురించి అభ్యర్థులు ఆలోచించవచ్చు.
ఉద్యోగావకాశాలు
ఈసీఈ డిగ్రీ పట్టా పొందినవారికి బ్రాడ్‌కాస్టింగ్‌, కన్సల్టింగ్‌, డేటా కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, సిస్టం సపోర్ట్‌ వంటి మ్యానుఫాక్చరింగ్‌ పరిశ్రమలు, సేవా సంస్థల్లో ఉపాధి అవకాశాలుంటాయి. నిజజీవితంలో సమాచారాన్ని చేరవేసే వీడియో కాన్ఫరెన్సింగ్‌, ఇంటర్నెట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ లాంటి ఆధునిక మల్టీమీడియా సర్వీస్‌ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి.భారత టెలిఫోన్‌ పరిశ్రమలు, పౌర విమానయానం, వివిధ రాష్ట్రాల్లోని డెవలప్‌మెంట్‌ సెంటర్లు, రక్షణ, ఎన్‌పీఎల్‌, ఏఐఆర్‌, పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ డిపార్ట్‌మెంట్లు, రైల్వే, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, డీఆర్‌డీఓ, టెలీకమ్యూనికేషన్‌, సాఫ్ట్‌వేర్‌/ఐటీ, విద్యుత్తు రంగం, హార్డ్‌వేర్‌ మ్యానుఫాక్చరింగ్‌, గృహోపకరణాలు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, టెలివిజన్‌, పరిశోధన- అభివృద్ధి రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలుంటాయి.
వర్థమాన టెక్నాలజీ అయిన ఐఓటీ (ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌)లో ఈ బ్రాంచిదే అగ్రస్థానం. విద్యుత్తు సంస్థలు, దాదాపు అన్ని రంగాల కర్మాగారాల్లో నియంత్రణ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో అవకాశాలు దీనికే ఎక్కువగా ఉన్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ నియామకాలు జరిగే నాలుగు బ్రాంచీల్లో ఈసీఈ ఒకటి.
ఉద్యోగాలిస్తున్న ప్రముఖ సంస్థలు: బీఈఎల్‌, ఈసీఐఎల్‌, ఇన్‌టెల్‌, శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, సోనీ, తోషిబా, ఫిలిప్స్‌ సెమీకండక్టర్స్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, నోకియా, ఏఎండీ, సిస్కో, హెచ్‌పీ, ఐబీఎం మొదలైనవి ఈసీఈ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తున్న ప్రముఖ సంస్థల్లో ప్రధానమైనవి.
ఉన్నత విద్య
ఈసీఈ బీటెక్‌ కోర్సు పూర్తి చేసినవారు ఎంఎస్‌/ ఎంటెక్‌, పీజీ డిప్లొమాలు చేయవచ్చు. మాస్టర్స్‌ డిగ్రీని పొందడం ద్వారా కెరియర్‌ అవకాశాలను పెంచుకోవచ్చు. విదేశాల్లో ఎంఎస్‌ చేయవచ్చు. మనదేశంలో ఎంటెక్‌లో చేరటానికి గేట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవాలి. ఈ రంగంలో పరిశోధన- అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి పీహెచ్‌డీ వైపు వెళ్లినా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఎంఎస్‌ లేదా పీహెచ్‌డీ చేయాలంటే జీఆర్‌ఈ, టోఫెల్‌ తదితర పరీక్షలు రాయాల్సివుంటుంది.

Posted Date : 02-09-2021

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌