తెలిసింది కాస్తంత.. విన్నది కొంత.. సేకరించింది ఇంకొంత.. ఈ సమాచారంతోనే ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి తీసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. పక్కవాళ్లతో పోలిక లేదా పోటీ, పూర్తిగా తెలియక పోయినా ఫలానా కోర్సు చేసేయాలనే అస్పష్ట లక్ష్యం... ఇవన్నీ ఇంజినీరింగ్ అభ్యర్థులను ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే అనుకున్న బ్రాంచిలో ఏముందో పరిశీలిస్తే వాస్తవానికి దగ్గరగా ఉన్నామా... అవాస్తవ అభిప్రాయాలతో నష్టపోబోతున్నామా అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల అవగాహనకు కొన్ని బ్రాంచీల వివరాలు అందిస్తున్నాం. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇవి సాయపడతాయి.
సివిల్‌మానవ నాగరికత అభివృద్ధి ప్రయాణంలో తన రక్షణ కోసం చేసిన తొలి ప్రయత్నంగా సివిల్ ఇంజినీరింగ్‌ను చెప్పవచ్చు. తలదాచుకోవడానికి అవసరమైన గూటితో మొదలైన ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఆధునిక ప్రపంచంలో మౌలిక వసతులకు ఉన్న అవసరాల కోణం నుంచి చూస్తే సివిల్ ఇంజినీరింగ్ ఒక విశిష్టమైన, తన దారిలో తాను పురోగతిని, అభివృద్ధిని పొందుతున్న బ్రాంచిగానే కనిపిస్తుంది.
అభిరుచి: అర్హతల దృష్ట్యా సివిల్ ఇంజినీరింగ్ చదవాలంటే ఇంటర్ స్థాయిలో ఎంపీసీ చదివి ఉండాలి. అయితే అభిరుచి కోణంలో చూస్తే ఈ సబ్జెక్టుల్లోని కొన్ని అధ్యాయాలపై శ్రద్ధ బాగా ఉండాలి. భౌతికశాస్త్రంలోని స్థితి, గతి శాస్త్రాలు, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ బాగా వచ్చి ఉండాలి. రసాయనిక శాస్త్రంలో కూడా ఒక స్థాయి వరకు ప్రవేశం ఉండాలి. గణితంపై పట్టు ఉండాలి.
బి.టెక్‌లో: సివిల్ ఇంజినీరింగ్‌లో భారీ స్థాయి కట్టడాల గురించి నేర్చుకుంటారు. వివిధ నిర్మాణాలు, కట్టడాల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణ మెలకువల గురించి తెలుసుకుంటారు. ఇవే కాకుండా రవాణా, రహదారులు, ఆనకట్టలు, నీటి వసతి, గృహ నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ వంటి వైవిధ్యమైన పనులకు సంబంధించిన విషయాలను మౌలికంగా అధ్యయనం చేస్తారు. రిమోట్ సెన్సింగ్, జియోటెక్నికల్ ఇంజినీరింగ్, పర్యావరణ పరిరక్షణ, భూగర్భ శాస్త్రాల గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటారు.
కెరియర్ ఎలా?: మనుషుల మనుగడ, అభివృద్ధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ రంగంలో అవకాశాలకు, అభివృద్ధికి కొదవలేదు. ఏటా ప్రపంచవ్యాప్తంగా సగటున పది నుంచి పదిహేను శాతం ఎదుగుదలకు అవకాశం ఉన్న ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
సివిల్ ఇంజినీరింగ్ చేస్తే ఉన్న అవకాశాలు: కొత్త రహదారుల నిర్మాణం, స్మార్ట్ సిటీల నిర్మాణం, వివిధ రాష్ట్రాల్లో మెట్రో పనులు వంటి భారీ నిర్మాణాలే కాకుండా, పేదలకు గృహ వసతి వంటి ప్రభుత్వ ప్రణాళికలు సరిగ్గా అమలు కావాలన్నా, వంతెనలు, చిన్న, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, పాతబడిన వివిధ ప్రజోపయోగ కట్టడాల నవీనీకరణ, మరమ్మతులు, రోడ్లు, భవనాల మరమ్మతులు వంటి భారీ స్థాయి పనులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీరికి ఎన్నో అవకాశాలున్నాయి. స్ట్రక్చరల్ ఇంజినీర్, కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్, సర్వేయింగ్, రవాణా ఇంజినీర్, జియో టెక్నికల్ ఇంజినీర్, నీటి వనరుల ఇంజినీర్, పర్యావరణ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీర్, తీర ప్రాంతాల నిర్మాణ రంగం, ఇంకా బలహీన కట్టడాల పరీక్షలో నిపుణులైన ఫోరెన్సిక్ ఇంజినీర్లుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
ఉన్నత విద్య: ఎం.టెక్ స్థాయిలో మనదేశంలోనూ, విదేశాల్లో కూడా దాదాపు అన్ని యూనివర్సిటీల్లో కోర్సులు ఉన్నాయి. అంతే కాకుండా పర్యావరణ నైపుణ్యాలకు కూడా పీజీలో చేరవచ్చు. స్టాడ్ వంటి ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడం మంచిది.
మెకానికల్

అన్ని ఇంజినీరింగ్ బ్రాంచీలకి మాతృశాఖగా వ్యవహరించే మెకానికల్ ఇంజినీరింగ్ మానవ పురోభివృద్ధికి గతిని నిర్దేశించిన బ్రాంచిగా చెప్పవచ్చు. మనిషి ఊహించగలిగిన ప్రతి రంగంలోనూ, అంశంలోనూ కూడా మెకానికల్ ఇంజినీరింగ్ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. అనునిత్యం ఆవిష్కరణలకు ఆస్కారం, అవకాశం ఉన్న రంగం ఇది. మెకానికల్ ఇంజినీర్లు భారీ యంత్రాలను పనితనం, సామర్థ్యం లోపించకుండా చిన్న ప్రమాణంలో ఉండే యంత్రాలుగా (మినియేచరైజేషన్) తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. భౌతికంగా వస్తువుల అవసరం ఉన్నన్నాళ్లూ మెకానికల్ రంగం అవసరం తప్పకుండా ఉంటుంది.బీటెక్‌లో: నాలుగేళ్ల బీటెక్‌లో మెకానికల్ రంగానికి చెందిన మౌలిక సబ్జెక్టులైన మెకానిక్స్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్‌ఫర్ తోపాటు ఐసీ ఇంజిన్స్, రిఫ్రిజిరేషన్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, పవర్ ఫ్లాంట్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ కంట్రోల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మొదలైన సబ్జెక్టులు నేర్చుకుంటారు.
అభిరుచి: బీటెక్ చేయాలనుకునే వారికి ప్రధానంగా ఎంపీసీలో మంచి మెలకువలు అవసరం. అన్ని ఇంజినీరింగ్ బ్రాంచీల్లోకి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గణిత శాస్త్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గణితంలోని వివిధ అధ్యాయాల అనువర్తనం మెలకువలు బాగా అభ్యాసం చేయగలగాలి. అలాగే భౌతిక శాస్త్రంలో కూడా ముఖ్యమైన అధ్యాయాల పట్ల సమగ్ర అవగాహన చాలా అవసరం.
కెరియర్: మెకానికల్ ఇంజినీరింగ్ ప్రభావం లేని రంగం ఇంచుమించు లేదనే చెప్పాలి. అంటే దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ వీరి అవసరం ఉంటుంది. ప్రస్తుతం కంప్యూటర్ రంగం తర్వాత అంత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉన్న రంగం మెకానికల్ ఇంజినీరింగ్. రాబోయే నాలుగు నుంచి అయిదు సంవత్సరాల కాలంలో ఇందులో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల అవసరం ఉండదని, కొత్త రకం ఉద్యోగాలు ఉంటాయని, వాటికి తగిన, అవసరమైన మెలకువలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని వివిధ నివేదికల సారాంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్, త్రీ-డీ ప్రింటింగ్ వంటి అధునాతన టెక్నాలజీలతో మెకానికల్ రంగం కొత్త తరహాలో ముందుకు రాబోతోంది. కాబట్టి ఉద్యోగాలకు కొదవేమీలేదు. బీటెక్‌తోపాటు అవసరమైన మెలకువలు నేర్చుకుంటే మంచిది.
మెకానికల్ ఇంజినీర్లు ముఖ్యంగా పరిశోధన - అభివృద్ధి, విశ్లేషణ, ఉత్పత్తి, టెస్టింగ్, డిజైన్, యంత్రాల స్థాపన, నిర్వహణ విభాగాల్లో భద్రత, విశ్వసనీయత లక్ష్యంగా యంత్రాల, పరికరాల రచన నిర్మాణం పనిచేస్తూ తమ సేవలందిస్తారు.
కొలువులు ఎక్కడ?: విద్యుచ్ఛక్తి కేంద్రాలు, ఆటోమొబైల్ రంగం, చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు, సహజవాయు సంస్థలు, వాయు, అణు విద్యుత్ కేంద్రాలు, విమానయానం, ఎయిర్ కండిషనర్ రంగం, వ్యవసాయం, రక్షణ, నౌకా రంగం, ఫార్మా, ఎరువుల కర్మాగారం, చక్కెర, సిమెంట్, పేపర్ పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో వీరికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇక ప్రభుత్వ సంస్థల్లో అయితే గేట్ ద్వారా కానీ, సంస్థలు నిర్వహించే నియామక పరీక్షల ద్వారా కానీ అవకాశాలు ఉంటాయి.
ఉన్నత విద్య: అతి పురాతనమైన ఈ బ్రాంచిలో ఎమ్‌టెక్ స్థాయిలో ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ కంట్రోల్, రోబోటిక్స్, థర్మల్ ఇంజినీరింగ్ వంటి సబ్జెక్టుల్లో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో జరిగే గేట్, ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలు లేదా ఉమ్మడి ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. విదేశాల్లో కూడా ఉన్నత విద్యకు అవకాశం ఉంది.
అదనంగా బి.టెక్‌తోపాటు ఆటోక్యాడ్, ప్రొ-ఇ, ఆన్సిస్ వంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీల్లో శిక్షణ, సర్టిఫికేషన్ తీసుకుంటే మంచిది.
కెమికల్ఇంజినీరింగ్లో వివిధ శాస్త్రాల సమ్మిళితంగా ఉండే బ్రాంచి.. కెమికల్ ఇంజినీరింగ్. ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీపై అమితమైన ఆసక్తి ఉండే విద్యార్థులకు ఇది సరైన ఎంపిక. నిత్య జీవితంలో ప్రజలకు నాణ్యమైన జీవితాలను అందించడంలో ఈ బ్రాంచిది ప్రధాన పాత్ర. ఉద్యోగావకాశాలు కూడా అధికంగా ఉండే ఈ ఇంజినీరింగ్ బ్రాంచి విశేషాలు చూద్దాం!
కెమికల్ ఇంజినీరింగ్.. మానవాళికి అవసరమైన వస్తువులను తయారు చేయడానికి కావాల్సిన ప్రక్రియల అభివృద్ధి, డిజైన్, నిర్మాణం, ప్లాంట్‌ల కార్యకలాపాలకు సంబంధించింది. ముడి పదార్థం నుంచి వస్తువులను తయారు చేయడం, తక్కువ ఖర్చుతో సమర్థగా, పర్యావరణ హితంగా వాటిని తీర్చిదిద్దడం వంటివి కెమికల్ ఇంజినీర్ విధులు. ఈ బ్రాంచిలో సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకమైన ఆలోచనా విధానాన్ని బోధించేలా కరిక్యులమ్ ఉంటుంది. ప్రాసెస్ అండ్ ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌ఫర్ ఆపరేషన్స్, డిజైన్-ఆపరేషన్, మోడలింగ్, ఆప్టిమైజేషన్, కంట్రోల్ వంటి అంశాలకు సంబంధించి కోర్ కరిక్యులమ్, కోర్స్ నిర్మాణం ఉంటాయి.
మెడికల్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, రిన్యూవబుల్ ఫ్యూయెల్స్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, సైబర్ ఎనేబుల్డ్ కంప్యూటేషనల్ సిస్టమ్స్, నానోటెక్నాలజీ ఫర్ ఎనర్జీ కన్వర్షన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, బయోకాటలిస్ట్స్, టైలర్డ్ మాలిక్యులర్ ప్రొడక్ట్స్ రంగాల్లోనూ కెమికల్ ఇంజినీరింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది.
కెమికల్ ఇంజినీరింగ్ ఎంచుకోవాలనుకునేవారికి కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులతోపాటు మేథ్స్‌లో ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, కాల్‌క్యులస్‌ల పరిజ్ఞానం తప్పనిసరి.
ఉద్యోగావకాశాలు: కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన విభాగాల్లో అవకాశాలుంటాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, ఫెర్టిలైజర్, స్టీల్, పాలిమర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పల్ప్ అండ్ పేపర్, కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
సంస్థలు వీరిని డిజైన్ ఇంజినీర్లు, ప్రాసెస్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఇంజినీర్, మెయింటెనెన్స్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్, సేఫ్టీ ఇంజినీర్, కన్సల్టెన్సీ పర్సనల్, ఆడిటింగ్ ఇంజినీర్, ఆర్‌అండ్‌డీ సైంటిస్టు, సైంటిఫిక్ ఆఫీసర్లుగా నియమించుకుంటాయి.
ప్రముఖ సంస్థలు: ఎన్‌సీఎల్, ఐఐపీ, ఎన్‌ఎంఎల్, ఐఐసీటీ, సీఈసీఆర్‌ఐ, సీఎల్‌ఆర్‌ఐ, వంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థలూ, డీఎంఆర్‌ఎల్, బీడీఎల్, డీఎల్‌ఆర్‌ఎల్ వంటి డిఫెన్స్ రిసెర్చ్ సంబంధిత, అటామిక్ ఎనర్జీకి చెందిన బార్క్, ఐజీకేఆర్, ఎన్‌ఎఫ్‌సీ, ఇతర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్, రైల్వేస్, జాతీయ బ్యాంకులతోపాటు ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, ఫాక్ట్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఎన్నో పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో కెమికల్ ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలుంటాయి. విదేశాల్లోనూ స్లమ్‌బర్జర్, చెవ్‌రాన్, బీపీ లాంటి సుప్రసిద్ధ కంపెనీల్లో అత్యధిక వేతనాలతో కొలువులు పొందవచ్చు.
ఉన్నతవిద్య: డిగ్రీ పట్టా పొందినవారు దేశంలో ఎంటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్, విదేశాల్లో ఎంఎస్‌ను ఉన్నతవిద్య నిమిత్తం ఎంచుకోవచ్చు. పీహెచ్‌డీ అవకాశాలూ ఉంటాయి. - డా. సీహెచ్. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆర్‌అండ్‌డీ, బీవీఆర్‌ఐటీ
మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్

మాన్యుఫాక్చరింగ్ ఇంజినీరింగ్ ప్రస్తుతం కొత్త మెటీరియళ్లు, అధునాతన మిశ్రమ లోహాలపై ఎక్కువగానే ఆధారపడుతోంది. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ అధునాతన మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మిగతా ఇంజినీరింగ్ విభాగాలకు ఆధారంగా ఉండే కోర్ బ్రాంచిగా ఇది పేరు పొందింది.ఫిజికల్ మెటలర్జీ, మెకానికల్ మెటలర్జీ, నాన్ ఫెర్రస్ ఎక్స్‌ట్రాక్షన్ మెటలర్జీ, ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్, ఫౌండ్రి టెక్నాలజీ, పౌడర్ మెటలర్జీ, వెల్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటేషనల్ మెటలర్జీ, హై టెంపరేచర్ మెటీరియల్స్, నానోటెక్నాలజీ, సెరామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంపోజిట్ మెటీరియల్స్, ప్లాస్టిక్ అండ్ పాలిమరిక్ మెటీరియల్స్, హీట్ ట్రీట్‌మెంట్, ఫ్యూయల్స్ అండ్ రిఫ్రాక్టరీస్, అల్లాయ్ డెవలప్‌మెంట్, మెటలర్జికల్ థర్మోడైనమిక్స్, మెటలర్జికల్ కంప్యూటేషన్స్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ మొదలైనవన్నీ ఈ కోర్ విభాగంలో భాగంగా ఉన్నాయి.ఉద్యోగావకాశాలు: మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ పట్టా పొందినవారికి ఐరన్ అండ్ స్టీల్, నానోఫెర్రస్, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ పరిశ్రమలు, ఎన్నో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీలు, సాఫ్ట్‌వేర్ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆంత్రపెన్యూర్లుగానూ మారొచ్చు. దీంట్లో ఉన్నతవిద్య చదివినవారు పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో మేనేజీరియల్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో ఉన్నత స్థానాన్ని పొందొచ్చు.ఉన్నత విద్య: మెటలర్జికల్ ఇంజినీరింగ్ చేసినవారు ఐఐటీల్లో ఎంటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్)ల్లో ఉన్నతవిద్యను అభ్యసించొచ్చు. ఇతర ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా పీజీ చేయవచ్చు. మిగతా విభాగాలతో పోలిస్తే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల్లో ప్రవేశించడం మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తేలికతో కూడుకున్న విషయం.
ఫార్మా ఇంజినీరింగ్
గత దశాబ్ద కాలంగా ఇంటర్ డిసిప్లినరీ ఇంజినీరింగ్ ప్రోగ్రాముల ప్రాముఖ్యం పెరిగింది. ఇవి ఇంజినీరింగ్, సైన్స్, మెడిసిన్‌లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన వృత్తిపరమైన విస్తృత పరిజ్ఞానాన్ని అందిస్తాయి. కెమికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీల నుంచి ఉద్భవించిన బ్రాంచి ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్. అందుకే ఈ సబ్జెక్టులను దీనిలో ఒక తార్కిక క్రమంలో బోధిస్తారు. వైవిధ్యభరితమైన, పరిశ్రమల అవసరాలను తీర్చే స్పెషలైజ్డ్‌్ బ్రాంచిగా ఇది పేరుపొందింది..బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్, బయో కెమికల్స్, కాస్మటిక్స్, డైరీ, ఫుడ్, హెల్త్‌కేర్ ఉత్పత్తులు, కంజ్యూమర్ గూడ్స్ తయారీకి సంబంధించిన పరిజ్ఞానం, నైపుణ్యాలను ఈ కోర్సులో నేర్చుకుంటారు. మిగతా ఇంజినీరింగ్ కోర్సుల్లాగే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను చదివి, ఎంసెట్ ర్యాంకు తెచ్చుకున్నవారికి ఈ బ్రాంచిలో ప్రవేశం ఉంటుంది.
ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసివారికి ఫార్మా, బల్క్ డ్రగ్, కెమికల్, ఫుడ్, డైరీ, బయోటెక్నాలజీ, కాస్మటిక్స్, కంజ్యూమర్ గూడ్స్ సంబంధిత పరిశ్రమల్లో ఉపాధి పొందగలుగుతారు. ఈ కోర్సులో భాగంగా పొందిన ఇంటర్ డిసిప్లినరీ పరిజ్ఞానం మూలంగా ఫార్మాస్యూటికల్ ఇంజినీర్లు విభిన్న హోదాల్లో పనిచేయగలిగే సామర్థ్యం పొందుతారు. ఉదాహరణకు.. డిజైన్, ప్రాసెస్, ప్రాజెక్ట్లు, ప్రొడక్షన్, మెయిన్‌టెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ ఇంజినీర్లుగా, ఆర్ అండ్ డీ సైంటిస్టులు.
ప్రసిద్ధ సంస్థలు: రాన్‌బాక్సీ, సిప్లా, బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, వసంత్ కెమికల్స్, విర్చో ల్యాబొరేటరీస్, ఎవరెస్ట్ ఆర్గానిక్స్, గ్రాన్యూల్స్ ఇండియా సంస్థలు ఈ ఇంజినీర్లను నియమించుకుంటాయి..
ఉన్నత విద్య: కెమికల్ ఇంజినీరింగ్‌లోనే కాకుండా సంబంధిత రంగాలైన బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, ఎనర్జీ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సేఫ్టీలలో ఎంటెక్/ఎంఎస్ చేయవచ్చు.