‣ ఎంసెట్ కౌన్సెలింగ్ గైడెన్స్
సీఎస్‌ఈ.. ఐటీ.. ఈసీఈ.. ఎక్కువమంది ఈ బ్రాంచీల వైపే చూస్తున్నారు. ఎందుకు? అంతా ఆలోచించే నిర్ణయించుకుంటున్నారా.. పక్కవాళ్లని ఫాలో అయిపోతున్నారా? ఏమో! కానీ ఎంచుకున్న బ్రాంచి గురించి ఎంతోకొంత తెలుసుకొని అడుగేయడం అవసరం. కోర్సులో ఏముంటుంది? ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? ఉన్నత విద్యకు ఉన్న మార్గాలేమిటి? ఇవన్నీ తెలుసుకొని.. మనకు తగినదో కాదో తేల్చుకొని తీసుకోవడం మంచిది. సాఫ్ట్‌వేర్ విస్తరించని రంగమూ, ఐటీ చొచ్చుకురాని చోటూ కనిపించడం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగానికీ ఇదే జోరు. ఆర్థికంగా స్థిరపడేకొద్దీ గృహోపకరణాల కొనుగోలు అధికమవుతోంది. గృహోపకరణాలంటే ఇప్పుడు అంతా టీవీ, ఫ్రిజ్, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు...ఇలా లెక్కలేనన్ని వస్తువులు. అవన్నీ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఆధారంగా రూపొందించేవే. వాటి వినియోగం పెరుగుతుందంటే ఆ రంగంలో మానవ వనరుల అవసరం పెరుగుతున్నట్లే లెక్క. ఆటోమేషన్ కూడా మానవ జీవితాల్లోకి వేగంగా వస్తోంది. సమీప భవిష్యత్తులోనే ఊహించని మార్పులు చూస్తామని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే ఈ రెండు రంగాలకూ విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది. ఆ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే పలు అంశాలను తెలుసుకొని అందుకనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సీఎస్‌ఈ ఆచార్యులు ఎం.సురేష్‌బాబు, ఈసీఈలో సహ ఆచార్యులు టి.మాధవికుమారి సూచిస్తున్నారు.
డిమాండ్ తగ్గని సీఎస్‌ఈ

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌ను సీఎస్‌ఈగా పిలుస్తుంటారు. రెండు దశాబ్దాలుగా సీఎస్‌ఈకి మంచి డిమాండ్ ఉంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తిన 2008 ప్రాంతంలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గినా మళ్లీ రెండు మూడు సంవత్సరాల్లోనే బాగా ఈ రంగం పుంజుకుంది. సాఫ్ట్‌వేర్ రంగాన్ని నమ్ముకుంటే మునిగిపోతామన్న భయం కొందరిలో ఉన్నా... బీటెక్‌లో సీఎస్‌ఈకి డిమాండ్ మాత్రం తగ్గలేదు.బీటెక్‌లో సెమిస్టర్ విధానం అమలు చేస్తారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు... ఏడాదికి రెండు సార్లు పరీక్షలుంటాయి. సెమిస్టర్ పరీక్షలతోపాటు ఇంటర్నల్ పరీక్షలకు కూడా 25 శాతం మార్కులుంటాయి. ఇంజినీరింగ్‌లో సాధారణంగా మొదటి సంవత్సరం అన్ని బ్రాంచీల వారికి ఉమ్మడి సబ్జెక్టులే ఉంటాయి. ఏ బ్రాంచీ వారైనా అవి చదవాల్సిందే. ఇంటర్‌మీడియట్‌లో మాదిరిగా ఆంగ్లం, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టులే ఉన్నా ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ తరహాలో ఉంటుంది. అంటే ఇంటర్‌లో చదువుకున్నదాన్ని అప్లై చేయడం ఎలా? అనేది నేర్చుకుంటారు. దాంతోపాటు డేటా స్ట్రక్చర్స్ కూడా ఉంటుంది. రెండో ఏడాది నుంచి ఏ బ్రాంచి పాఠ్యాంశాలు ఆ బ్రాంచికి ఉంటాయి. అంటే ఆ బ్రాంచికి సంబంధించిన ప్రధాన సబ్జెక్టులను చదువుతారు. సీఎస్‌ఈలో కంప్యూటర్ ఆర్గనైజేషన్, సీ ప్రోగ్రామింగ్, ఫైథాన్, జావా, డేటా బేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, కంప్యూటర్ నెట్ వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్, అల్గారిథమ్స్ లాంటివి, కొన్ని ఎలక్ట్రానిక్స్, మేనేజ్‌మెంట్ సబ్జెక్టులు కూడా బోధిస్తారు.
నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి. అంటే మొదటి మూడు సంవత్సరాల్లో మీ ప్రగతిని కూడా కంపెనీలు చూస్తాయి. మూడో సంవత్సరం మొదటి, రెండు సెమిస్టర్ల మధ్య సమయంలో మినీ ప్రాజెక్టు ఉంటుంది. విద్యార్థులు ఏదో ఒక కంపెనీకి వెళ్లి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి. నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌లో తరగతులు ఉండవు. ప్రాజెక్టుతోపాటు రెండు ఎలెక్టివ్ సబ్జెక్టులను ఎంచుకోవాలి. ప్రాజెక్టును సొంతంగా చేస్తే కెరియర్‌లోనూ ప్రయోజనం పొందుతారు.
ఐరోపా, ఐర్లాండ్‌ల్లోనూ ఐటీకి గిరాకీ..
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని ఐటీగా పిలుస్తారు. సీఎస్‌ఈ నుంచి విడిపోయి ఐటీ బ్రాంచీగా మారింది. ఈ బ్రాంచీ ఏర్పాటైన కొత్తలో భారీ డిమాండ్ ఉన్నా 2008-2010 ప్రాంతంలో పలు కళాశాలలు ఈ బ్రాంచీని నిలిపేశాయి. వాస్తవానికి పరిశ్రమలకు దగ్గరగా ఉండేది ఐటీ బ్రాంచీ మాత్రమే. పరిశోధన చేయాలంటే సీఎస్‌ఈ బ్రాంచీ ఉపయోగం. సీఎస్‌ఈ, ఐటీకి మధ్య పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. ప్రధాన సబ్జెక్టులు (కోర్) రెండిట్లో ఒకటే. మొత్తం మీద 20-25 శాతం సిలబస్ మాత్రం తేడా ఉంటుంది. ఐటీలో నెట్ వర్క్ మేనేజ్‌మెంట్, వెబ్ టెక్నాలజీస్, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ లాంటి వాటిపై అధిక దృష్టి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు సైతం అర్థం చేసుకొని సీఎస్‌ఈ బ్రాంచీ దొరకకున్నా.. ఐటీలో చేరుతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే ఐటీ కోర్సును అందిస్తున్నాయి. సీట్లూ తక్కువే.
ఈ బ్రాంచిలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమల్లో కొలువులు లభిస్తున్నాయి. యూరప్‌లోనూ ఐర్లాండ్ లాంటి దేశాలు ఐటీకి పెద్దపీట వేస్తున్నాయి. ఎంటెక్, పీహెచ్‌డీ వైపు ఎక్కువ మంది దృష్టి సారించడం లేదు. అందుకు కారణం బీటెక్‌తోనే ఉద్యోగాలు దొరుకుతుండటమే. కళాశాలలకే కంపెనీలు వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.
ఐటీలోని సర్వీసు కంపెనీలు ఆయా సంస్థలకు అవసరమైన సేవలు అందిస్తాయి. వాటిల్లో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అందుకే ప్రారంభ వేతనం నెలకు రూ.25 వేల నుంచి ఉంటుంది. అదే ప్రొడక్ట్ కంపెనీ అయితే సొంతంగా సాఫ్ట్‌వేర్ తయారు చేస్తాయి. అందుకు ప్రతిభావంతులైన వారు కావాలి. ఈ పరిశ్రమలు తక్కువ మందిని నియమించుకుంటాయి. కాకపోతే ప్రారంభ వేతనం రూ.50 వేలకుపైగానే ఉంటుంది. ప్రొడక్ట్ కంపెనీలకు ఉదాహరణ మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, యాపిల్ లాంటివి. ఎంటెక్, పీహెచ్‌డీ చేసి ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుడిగా చేరవచ్చు. నిత్యం సాంకేతికత మారుతుంటుంది. అందువల్ల పరిశోధనలకూ అవకాశం ఉంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో కొత్త సబ్జెక్టులు తెరపైకి వచ్చాయి. డేటా సైన్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్, కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ, రోబోటిక్స్ లాంటివి. వాటిపై పీహెచ్‌డీ చేయవచ్చు. అలాంటి వారికి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ కంపెనీల్లోని పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగాల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిశోధనశాలల్లో కూడా చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి. బీమా, బ్యాంకింగ్ రంగాల్లో మాత్రం అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రొటెక్షన్‌లో ప్రస్తుతం 16 లక్షల మంది నిపుణుల అవసరం ఉందని అంచనా వేశారు.
అటైనా.. ఇటైనా.. ఈసీఈకి ఈజీయే!
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ను ఈసీఈగా పిలుస్తారు. సీఎస్‌ఈ పూర్తిచేస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగంలోకి రావడానికి వీలుకాదు. అదే ఈసీఈ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ స్థిరపడవచ్చు. నాలుగేళ్ల బీటెక్‌లో ఒక్కో సెమిస్టర్‌లో 6 సబ్జెక్టులు నేర్చుకుంటారు. ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ (ఈడీసీ), పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ (పీడీసీ), లాజిక్ డిజైన్, ఎలక్ట్రో మాగ్నటిక్ థియరీ, మైక్రో వేవ్స్ ఇంజినీరింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్‌తోపాటు వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్‌కు సంబంధించినవి నేర్చుకుంటారు. ఎంటెక్‌లోనూ పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్‌ఎస్‌ఐ), ఎంబెడెడ్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మైక్రో వేవ్ ఇంజినీరింగ్, సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ తదితర స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు. వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌లో ఎంటెక్ చేయడానికి కేవలం ఈసీఈ విద్యార్థులే అర్హులు.
పీహెచ్‌డీ చేస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. బోధనా రంగంతోపాటు పరిశోధనశాలల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువే. రక్షణ రంగానికి చెందిన ప్రయోగశాలలు, రైల్వేశాఖ, కమ్యూనికేషన్‌కు సంబంధించిన సంస్థల్లో కొలువులు పొందవచ్చు. ఇక బీహెచ్‌ఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జెన్‌కో, ట్రాన్స్‌కో లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ) ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో చేరవచ్చు. అందుకు నాలుగు ఇంజినీరింగ్ బ్రాంచీల్లో యూపీఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో ఈసీఈ బ్రాంచి ఒకటి.
- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్