• facebook
  • whatsapp
  • telegram

బ్రాంచి ... కళాశాల... ఏది చూడాలి?

ఇది ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తరుణం. విద్యార్థులూ, తల్లిదండ్రులూ ప్రాధాన్యం ఇవ్వాల్సింది... కళాశాలకా? బ్రాంచికా? దీనిపై స్పష్టత అవసరం.
కళాశాల Vs బ్రాంచి... ఈ విషయంలో కచ్చితమైన సమాధానం దొరకడం కష్టమే. కాకపోతే విద్యార్థులు అవసరం, అవకాశాలు, అర్హత, ఆసక్తులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఐఐటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా ఐఐటీలు/ ఎన్‌ఐటీలు/ ఐఐఐటీ/ బిట్స్‌ల్లో వేటిలో చేరాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఎంచుకోబోయే బ్రాంచిపైనే భవిష్యత్తు మొత్తం ముడిపడి ఉంటుంది కాబట్టి దీని గురించి తగినవిధంగా కసరత్తు చేయటం ముఖ్యం.
పై చదువులకు వెళ్లాలన్నా, పరిశోధన చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ఎంచుకున్న బ్రాంచిలోనే పురోగమించాలి. ఆసక్తిలేని బ్రాంచిలో చేరితే జీవితాంతం ఉద్యోగం విషయంలో సర్దుకుపోవాల్సి వస్తుంది. సమయం వ్యర్థం చేశామనే భావన ఉండిపోతుంది.
* అందుకని ఒక నిర్దేశిత రంగంలో ఆసక్తి ఉండి, ఇలాంటి ఉద్యోగమే చేయాలని అనుకునేవారూ; భవిష్యత్తులో తాము సాధించవలసిన అంశాలపై కచ్చితమైన అవగాహన ఉన్న విద్యార్థులూ కళాశాల కంటే బ్రాంచికే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఇలాంటివారు ఆసక్తిలేని బ్రాంచిలో ఇమడలేరు.
గత సంవత్సరం ఐఐటీ ప్రవేశపరీక్షలో టాపర్‌గా నిలిచిన చిత్రాంగ్‌ ముర్దియా అనే విద్యార్థి అందరిలాగే ప్రాధాన్యమున్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిని ఐఐటీ ముంబయిలో ఎంచుకున్నాడు. కానీ తనకు క్వాంటమ్‌ ఫిజిక్స్‌పై ఆసక్తి. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇమడలేకపోయాడు. తిరిగి ప్రయత్నించి ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటీలో ఫిజిక్స్‌లో సీటు సాధించి, ఐఐటీ వదిలి ఈ ఏడాది అక్కడ చేరాలనుకుంటున్నాడు. అంటే ఒక సంవత్సరం వృథా చేసుకున్నాడు.
భవిష్యత్తు గురించి కచ్చితమైన అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నవాళ్లు బ్రాంచి విషయంలో రాజీపడకుండా కళాశాల విషయంలో రాజీ పడడమే మంచిది.
* కొన్ని కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ప్రయోగశాలలు బాగుంటాయి. అలాగే కొన్ని కళాశాలలకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు- అంటే బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంటుంది. అలాంటి కళాశాలల్లో ప్రాంగణ నియామకాల కోసం మంచి పేరున్న సంస్థలు వస్తుంటాయి. అందుకని అలాంటి సంస్థల్లో చేరితే ఏ బ్రాంచి విద్యార్థులకైనా ఉద్యోగావకాశాలుంటాయి. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు బాగుండడం వల్ల ఏ బ్రాంచి ఎంచుకున్నా దానిలో ఎక్కువ నేర్చుకుని రాణించడానికి అవకాశముంటుంది. మంచి ఉపాధ్యాయుల బోధనలో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశముంటుంది. అందుకని కేవలం ఒక రంగంపైనే ఆసక్తి కాకుండా ఏ రంగాన్ని ఎంచుకున్నా దానిలో రాణించాలి అనుకునే విద్యార్థులూ, తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారూ బ్రాంచి కంటే కళాశాలకే ప్రాధాన్యమివ్వడం మంచి నిర్ణయం.
సేవా రంగానికి మొగ్గు
చైనా, కొరియా లాంటి దేశాలు ప్రొడక్షన్‌ (పారిశ్రామిక ఉత్పాదక) రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. మనదేశం సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. అందుకని మనదేశంలోనే మంచి ఉద్యోగం సాధించాలనుకునేవారు సేవలపై ఆధారితమైన సాఫ్ట్‌వేర్‌ వైపుకు వెళ్లడం మంచిది. అంటే వీరు కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ బ్రాంచి ఎంచుకోవడం మంచిది.
ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ లాంటి రంగాల్లో ఉద్యోగాలు మనదేశంలో లేవని కాదు కానీ, సాఫ్ట్‌వేర్‌ రంగంతో పోల్చితే అవకాశాలు తక్కువే. అందుకనే ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ లాంటి బ్రాంచిల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులు కూడా ఆసక్తి లేకపోయినా విధి లేక సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగం చేయాల్సి వస్తోంది.
అన్ని బ్రాంచిల్లో ఎదగడానికీ, ఉన్నత స్థాయి చేరుకోవడానికీ అవకాశాలున్నాయి. తమ ప్రాధమ్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు నిర్ణయం తీసుకోవాలి. ఆసక్తిలేని బ్రాంచిలోగానీ, ఫీజు రాయితీ ప్రలోభానికి గురై వసతులు సరిగాలేని కళాశాలల్లోగానీ చేరితే భవిష్యత్తు దెబ్బతినే అవకాశముంది.

Posted Date : 02-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌