• facebook
  • whatsapp
  • telegram

మేటి భవితకు చిరునామా బయోటెక్నాలజీ

జీవశాస్త్రం, ఇంజనీరింగ్‌ టెక్నాలజి రంగాల సంయోజన శాఖగా, అధిక అంతర సబ్జెక్టు సంబంధిత శాఖగా బయో టెక్నాలజీ ఇంజినీరింగ్‌కి పేరు. ప్రాణి, జీవ వ్యవస్థలను ప్రయోగాత్మక మార్పులకు గురిచేసి ఆరోగ్య పరిరక్షణ, వైద్యం, వ్యవసాయం, ఆహారం, ఔషధీయ, పర్యావరణ నియంత్రణలలో పురోగతి సాధించడం ఈ శాఖ ముఖ్య లక్ష్యం.

జీవశాస్త్ర ప్రక్రియ, పారిశ్రామిక ప్రక్రియ అనే రెండు ప్రధాన వర్గాలుగా ఈ శాఖను విభజించవచ్చు. మొదటిదైన జీవశాస్త్ర ప్రక్రియ విభాగంలో వివిధ రుగ్మతల చికిత్స, వ్యవసాయరంగంలో అభివృద్ధి, నాణ్యమైన ఆహార ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ ఇత్యాది లక్ష్యాలుంటాయి. వీటిని సాధించేందుకు సూక్ష్మజీవ, కణ, జన్యు, అణుజీవ శాస్త్ర రంగాల్లో అవసరమైన పరిశోధన, అభివృద్ధుల అధ్యయనం జరుగుతుంది. అధిక శాతం ఈ ప్రక్రియ ప్రయోగశాలలో జరుగుతుంది.ఇక రెండోదైన పారిశ్రామిక ప్రక్రియ జీవ రసాయన ప్రక్రియలు, సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించి మందులు, టీకాలు, జీవ ఇంధనాలు, ఔషధీయాల పరిశ్రమల స్థాయిలో ఉత్పత్తి పద్ధతుల అధ్యయనానికి ఉపయోగపడుతుంది. జన్యు పరంపర సాంకేతిక శాస్త్రం (genome technology), రసాయన క్రిమిసంహారకాలకు ప్రాకృతిక, సహజ ప్రత్యామ్నాయాలు, జీవ ఇంధనవనరుల ఆవిష్కరణ, మూలకణ సాంకేతిక శాస్త్రం... ఈ రంగంలో జరిగిన నవ్య పరిశోధనల ఫలితంగా మానవుడు సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు.

బయోటెక్‌ ఇంజినీరింగ్‌ చదవాలంటే...

బయోటెక్‌ ఇంజినీరింగ్‌ శాఖలో ప్రవేశం కోసం ఇంటర్‌ స్థాయిలో భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రంతో పాటు గణితం చదివినవారూ; లేదా ఈ రెండింటితో జీవశాస్త్రం చదివినవారూ అర్హులు. రెండు గ్రూపులకూ సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లోనూ మౌలికాంశాలలో ఒక స్థాయి వరకు ప్రవేశం ఉండాలి. ప్రత్యేకించి గణితంలో కలన గణితం, సరళ బీజగణితం సునాయాసంగా చెయ్యగలగాలి. జీవశాస్త్రం వారికి మౌలికాంశాలపై మంచి నైపుణ్యం సంపాదించాలి. ఎం.పి.సి. స్రవంతితో బయోటెక్‌ ఇంజినీరింగ్‌ చేరే విద్యార్థులు ప్రధానంగా పారిశ్రామిక ప్రక్రియలకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు. బై.పి.సి. చదివినవారు జీవశాస్త్ర సంబంధితమైన ఔషధాల సూత్రీకరణ, అనుకరణ, నిర్మాణం, నమూనీకరణ, చిన్న మోతాదులో ఉత్పత్తి పరీక్ష వంటి ప్రక్రియలకు సంబంధించిన పాఠ్యాంశాలు చదువుతారు.

బయో టెక్నాలజిలో బీటెక్‌ చదివే విద్యార్థులు జీవశాస్త్రానికి, ఇంజినీరింగ్‌ మెలకువలకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు. జీవశాస్త్రానికి సంబంధించిన అణు జీవశాస్త్రం, జన్యు శాస్త్రం, కణ జీవ శాస్త్రం వంటి సబ్జెక్టులతో పాటు ఇంజినీరింగ్‌ మెలకువలకు సంబంధించిన జీవప్రక్రియ ఇంజనీరింగ్‌ (బయో ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌), జీవరసాయన ఇంజినీరింగ్‌ (బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌), ఉష్టగతిక శాస్త్ర నిర్ణయం (థర్మో డైనమిక్స్‌), ద్రవ్య స్థానాంతరణం (మాస్‌ ట్రాన్స్‌ఫర్‌) మొదలైన సబ్బెక్టులు చదవాల్సి ఉంటుంది.

ఉద్యోగావకాశాలు

ఈ రంగం మనదేశంలో ఇంకా బాల్యదశలోనే ఉందని తెలుసుకోవాలి. కాబట్టి ఇతర రంగాలతో పోలిస్తే ఉద్యోగాల సంఖ్య, పారితోషికాలు కూడా ప్రారంభంలో తక్కువగానే ఉండే అవకాశాలుంటాయి. ఐతే కాలక్రమేణా దీర్ఘకాల వ్యవధిలో పారితోషికం గణనీయంగా పెరుగుతుంది. బయోటెక్నాలజిలో బీటెక్‌ చేసినవారికి ఔషధీయ రంగంలో, పరిశోధన సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో పరిశోధనకు ఎంతో ఆస్కారం ఉన్నందున ఎక్కువమంది రీసెర్చ్‌ చెయ్యడానికి ఉన్నత విద్యలకు విదేశాలు వెళుతుంటారు. ఆసక్తి ఉన్న కొందరు ఎం.బి.ఎ. కూడా చేసుకోవచ్చు. మరికొందరు సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్నారు.
ప్రాంగణ నియామకాల కోసం ఈ రంగానికి సంబంధించిన సంస్థలు రావడం కొంత తక్కువే. కానీ సమీప భవిష్యత్తులో బయోటెక్నాలజీ... అత్యధిక ఉద్యోగావకాశాలకు వీలుకల్పించే రంగంగా ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Posted Date : 28-10-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌