• facebook
  • whatsapp
  • telegram

మళ్లీ మళ్లీ చదివితే మంచి మార్కులు!

ఎంసెట్‌-2022 బయాలజీ ప్రిపరేషన్‌ విధానం

ఎంసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌)లో ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు కీలకమైన సబ్జెక్టు జీవశాస్త్రం. దీనిలో గరిష్ఠ మార్కులు తెచ్చుకోవడానికి వేటిపై దృష్టి సారించాలో నిపుణుల సూచనలు ఇవిగో! 

         వృక్షశాస్త్రం         

ఎంసెట్‌లో వృక్షశాస్త్రానికి సంబంధించి తెలుగు అకాడమీ ప్రచురించిన ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర బోటనీ పాఠ్యపుస్తకాలు ప్రామాణికం. ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో ఈ సబ్జెక్టుకు కేటాయించిన 40 ప్రశ్నలను ఈ పాఠ్య పుస్తకాల నుంచి ఇస్తారు. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలకు ప్రతి రూపాలు. అయితే కొన్ని పాఠ్యాంశాలు, పాఠ్యాంశాల్లోని సమాచారాన్ని అదనంగా ఇచ్చారు. అవి స్థూలంగా.. 

మొక్కలు - పరిజ్ఞానం (సైన్స్‌ ఆఫ్‌ ప్లాంట్స్‌) 

ఆవరణశాస్త్రం  (జువాలజీ)లోని మొక్కల సంఘాలు (ప్లాంట్‌ కమ్యూనిటీస్‌) 

సూక్ష్మజీవశాస్త్రం (మైక్రోబయాలజీ) 

స్వరూపశాస్త్రం (మార్ఫాలజీ) 

కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్‌), శ్వాసక్రియల్లో జీవచర్యల పూర్తి సమాచారం

9 రకాల ప్రశ్నలు. 

1.బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూలు) 

2. ఒకటికంటే ఎక్కువ సరైన ఐచ్ఛికాలున్న ప్రశ్నలు 

3. రెండు పట్టికలు, మూడు పట్టికలు జతపరచడం 

4. తప్పుగా, ఒప్పుగా ఉన్న వ్యాఖ్యలను గుర్తించడం 

5. అసర్షన్, రీజన్‌  తరహావి 

6. సంఖ్యా సంబంధితమైనవి 

7. జీవప్రక్రియల్లోని వరుసక్రమ అంశాలు 

8. శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలు 

9. ఆరోహణ, అవరోహణ క్రమాలు 

వీటిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎక్కువ. వీటికి చాలావరకు సరైన సమాధానాలను గుర్తించవచ్చు. వీటి తర్వాత స్థానంలో జతపరచడం తరహా ప్రశ్నలుంటాయి. ఇవీ సులభమే. వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాలి. సంఖ్యాపరమైన ప్రశ్నలకు జాగ్రత్తగా వాటి సమాచారాన్ని మననం చేసుకుంటూ సమాధానం గుర్తించాలి.

ఎక్కువ ప్రశ్నలు వీటిలో...

జీవవైవిధ్యం (డైవర్సిటీ), ప్రత్యుత్పత్తి (రీప్రొడక్షన్‌), స్వరూపశాస్త్రం (మార్ఫాలజీ), మొక్కల శరీరధర్మశాస్త్రం (ప్లాంట్‌ ఫిజియాలజీ), జన్యుశాస్త్రం (జెనెటిక్స్‌), అణుజీవశాస్త్రం (మాలిక్యులర్‌ బయాలజీ), జీవసాంకేతికశాస్త్రం (బయోటెక్నాలజీ)ల నుంచి అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. 

జీవశాస్త్రంలో ఏ అంశం మీదనైనా పట్టు సాధించాలంటే తరచుగా పునశ్చరణ చాలా అవసరం. అంతర పాఠ్యాంశ సంబంధిత (ఇంటర్‌చాప్టర్‌ రిలేటెడ్‌) అంశాల మీద దృష్టి సారించాలి. పాత ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. ఈ సూచనలను గ్రహించి సమయపాలన పాటిస్తే ఎక్కువ మార్కులు లభిస్తాయి.

అన్ని రకాలుగా ప్రశ్నలకూ.. 

మొక్కల అంతర్నిర్మాణశాస్త్రం (ప్లాంట్‌ ఎనాటమీ)

కణజీవశాస్త్రం (సెల్‌ బయాలజీ) 

జీవ అణువులు (బయోమాలిక్యూల్స్‌), ఎంజైమ్‌లు 

కణచక్రం - కణవిభజన (సెల్‌ సైకిల్‌- సెల్‌ డివిజన్‌) 

అనువంశిక సూత్రాలు, వైవిధ్యాలు (ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెన్స్‌ అండ్‌ వేరియేషన్స్‌) 

అణుజీవశాస్త్రం (మాలిక్యులర్‌ బయాలజీ) 

జీవ సాంకేతికశాస్త్రం (బయోటెక్నాలజీ)

ఈ పాఠ్యాంశాల్లో కాన్సెప్ట్‌పరమైన, విశ్లేషణాత్మక, సంఖ్యాపరమైన అంశాల మీద పట్టు సాధించాలి. ఇవి అన్ని రకాలుగా ప్రశ్నలకు ఉపయోగపడతాయి. ఆయా పాఠ్యాంశాల్లో ఇచ్చిన చిత్రాలు, పట్టికల్లో ఉన్న పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. 

పాఠ్యాంశాలవారీగా ప్రధానాంశాలు

జీవప్రపంచం (లివింగ్‌ వరల్డ్‌) 

జీవరాశుల వర్గీకరణం (బయొలాజికల్‌ క్లాసిఫికేషన్‌) 

వృక్షరాజ్యం (ప్లాంట్‌ కింగ్‌డమ్‌) 

మొక్కల పరిజ్ఞానం (సైన్స్‌ ఆఫ్‌ ప్లాంట్స్‌) 

స్వరూపశాస్త్రం (మార్ఫాలజీ) 

వర్గీకరణశాస్త్రం (టాక్సానమీ) 

జీవుల్లో ప్రత్యుత్పత్తి విధానాలు 

పుష్పించు మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి 

వృక్ష ప్రజననం (ప్లాంట్‌ బ్రీడింగ్‌) 

సూక్ష్మజీవులు - మానవ సంక్షేమం 

సూక్ష్మజీవశాస్త్రం (మైక్రోబయాలజీ) 

ఆవరణశాస్త్రం (ఎకాలజీ)

ఈ పాఠ్యాంశాల్లో ప్రత్యేకించి ఎక్కువగా సంఖ్యా సంబంధిత అంశాలు, ఉదాహరణలు ఉంటాయి. వాటిని తరచుగా పునశ్చరణ చేయాలి. ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నలు, సంఖ్యా సంబంధిత, జతపరచడం లాంటి ప్రశ్నలకు సమయం వృథా కాకుండా ఉపయోగపడతాయి. వీటిలో కాన్సెప్చువల్‌ అంశాలూ ఉంటాయి. ఇవి అసర్షన్, రీజన్‌ ప్రశ్నలకు కూడా చాలా ఉపయోగం.

         జంతుశాస్త్రం         

జంతుశాస్త్రంలో ప్రశ్నలు మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌ల నుంచి దాదాపు సమానంగా వస్తాయి. కాబట్టి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రెండో సంవత్సరంలో మొదటి సంవత్సరం నేర్చుకున్న పాఠ్యాంశాలు కొంత మరిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై పట్టు సాధించడానికి తప్పనిసరిగా తగినంత సమయాన్ని కేటాయించాలి. 

వృక్షశాస్త్రమైనా, జంతుశాస్త్రమైనా పాఠ్యాంశాలను ముందు సరిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి.

జంతు వైవిధ్యాలకు సంబంధించిన యూనిట్‌ 3, యూనిట్‌-4 అధ్యాయాల్లో శాస్త్రీయ నామాలు, సాధారణ నామాలు ఎక్కువ. వీటిని గుర్తుపెట్టుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ అధ్యాయాల్లో ఇచ్చిన ఉదాహరణల్లో ప్రత్యేక లక్షణాలు ఉన్నవాటినీ, తక్కిన వాటికి భిన్నమైన లక్షణాలు ఉన్నవాటినీ సాధారణంగా ప్రశ్నల్లో అడుగుతుంటారు. ఉదాహరణకు మలస్కా జీవులకు వివృత రక్తప్రసరణ వ్యవస్థ లక్షణం. సెఫలోపొడ విభాగపు జీవుల్లో మాత్రం (సెపియా, ఆక్టోపస్‌) సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. ఇకైనోడెర్మేట వర్గంలో పెడిసిల్లేరియమ్‌లు, అరిస్టాటిల్‌ లాంతరు, మలస్కాలో రాడ్యులా లోపించిన విభాగం (జీవులు), ఆర్ద్రోపొడ వర్గంలో లిమ్యులస్‌ ప్రత్యేకతలు, నిడేరియా వర్గంలో ఆంతోజావా లక్షణాలు, ఉదాహరణలు, స్పంజికల్లో కుల్యావ్యవస్థ, ఇకైనోడెర్మేటలో జల ప్రసరణ వ్యవస్థ ప్రధానమైనవి. కార్డేటలో సైక్లోస్టొమేట లక్షణాలు, మృదులాస్థి, అస్థిచేపల తేడాలు, మొదటి భౌమిక జీవులైన ఉభయ చరాల్లో మొట్టమొదటిసారి ఏర్పడ్డ నిర్మాణాలు, పక్షుల అస్థిపంజరం ప్రత్యేకతలు, శ్వాసవ్యవస్థలపై ప్రశ్నలు అడగవచ్చు. 

మొదటి అధ్యాయం (యూనిట్‌ 1)లో జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లు, జీవావరణ నిల్వలు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతి భావన, నిర్వచనాలు, దానికి సంబంధించిన గ్రంథాలు-రచయితల పేర్లు అడగడానికి అవకాశముంది. జంతువుల చలనం, ప్రత్యుత్పత్తికి సంబంధించిన అధ్యాయాల్లో ప్రోటోజోవాలో వివిధ రకాలు, కశాభాలు, మిథ్యాపాదాలు, అవి కలిగిన జీవుల ఉదాహరణలు చాలాసార్లు ఇచ్చారు.

తర్వాత అధ్యాయంలో పరాన్నజీవుల నిర్మాణం, జీవిత చరిత్రల్లో ప్రధానాంశాలను గుర్తుంచుకోవాలి. మత్తుమందుల ఉత్పత్తి వాటి ప్రభావాల మీద ప్రశ్న తప్పకుండా ఇస్తున్నారు. వానపాము దేహంపై ఉన్న రంధ్రాల అమరిక, వృక్కాలు- రకాలు, వాటి నిర్మాణం, విధుల్లో తేడాలు గమనించాలి. బొద్దింకలో దృష్టి, పక్షాకార కండరాల సంఖ్య, అమరిక, రక్త ప్రసరణలో వాటి పాత్రలపైన ప్రశ్నలు అడగొచ్చు.

మొదటి సంవత్సర జంతుశాస్త్రంలో అతిపెద్దదీ, ఎక్కువ ప్రశ్నలు వచ్చేదీ... జీవావరణశాస్త్రం - పర్యావరణంలో. జనాభాల మధ్య పరస్పర చర్యలు, గాసే, కాన్నెల్, మెకార్ధర్‌ శాస్త్రవేత్తల అభిప్రాయాలు, జనాభా లక్షణాలు, ఆహారపు గొలుసులు, శక్తి ప్రవాహం, జీవావరణ వ్యవస్థలో ప్రెడేటర్స్‌ పాత్ర ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణ సమస్యలు, నివారణోపాయాల మీద ప్రశ్నలు తప్పనిసరి. మొత్తంమీద మొదటి సంవత్సరపు సిలబస్‌ ఎంత ఎక్కువ రివిజన్‌ చేస్తే అంత మంచిది. 

రెండో సంవత్సరపు సిలబస్‌లో మొదటి అయిదు అధ్యాయాలు మానవదేహ నిర్మాణం, జీవక్రియల అంశాలకు సంబంధించినవి. నీట్‌లోగానీ, ఈఏపీసెట్, టీఎస్‌ ఎంసెట్‌లోగానీ ఎక్కువ ప్రశ్నలు ఈ భాగం నుంచే వస్తున్నాయి. జీర్ణవ్యవస్థ- జీర్ణక్రియ, శ్వాసవ్యవస్థ-శ్వాసక్రియ... ఈ విధంగా ప్రతి వ్యవస్థ నిర్మాణంలో ప్రధాన అంశాలు, రసాయనిక చర్యల గురించి జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు జీర్ణాశయ కుడ్యంలోని పొరలు- వాటి కణజాలాలు, జీర్ణక్రియలో వివిధ దశలు, ఎంజైమ్‌ల పనితీరుపై ప్రశ్నలు అడగొచ్చు.  

నాడీ వ్యవస్థలో హైపోథలామస్‌ విధులు, విసర్జనలో వృక్క ప్రమాణం భాగాలు- వాటి కణజాలాలు, మూత్రం గాఢత చెందడంలో హార్మోన్ల పాత్ర, శ్వాసవ్యవస్థలో ఉచ్ఛ్వాసక్రియ జరిగే విధానం, కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణా, ఊపిరితిత్తుల ఘన పరిమాణాల నిర్వచనాలు, విలువలు, సామర్థ్యాలు... శ్రద్ధపెట్టాల్సిన అంశాలు. హార్మోన్ల మీద సాధారణంగా రెండు ప్రశ్నలుంటాయి. కాబట్టి అంతస్స్రావక వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రుతుచక్రపు వివిధ దశల్లో అండాశయ పుటికలో వచ్చే మార్పులు, హార్మోన్లలో వచ్చే మార్పులు, జరాయువు లాంటి అంశాలు ముఖ్యమైనవి.

జీవపరిణామశాస్త్రం మీద రెండు మూడు ప్రశ్నలు తప్పనిసరి. అందులో ఒకటి జీవ పరిణామానికి నిదర్శనాల మీద ఉంటుంది. క్రియాసామ్య, నిర్మాణ సామ్య నిర్మాణాలు, ఉపయుక్త వికిరణం, పురాజీవ మహాయుగంలోని వివిధ కాలాల సరైన క్రమం, మార్సుపియల్‌ - యూథీరియా క్షీరదాల మధ్య పోలికలు, మానవ పరిణామంలో వివిధ దశలు, ఉత్పరివర్తన సిద్ధాంతంలో ముఖ్య అంశాలు, డార్విన్‌ సిద్ధాంతంలో లోపాలు, పునరావర్తన సిద్ధాంతం, సంధాయక జీవులుగా శిలాజాలు మొదలైనవి ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అంశాలు. 

అనువర్తిత జీవశాస్త్రంలో అంతఃప్రజననం వల్ల లాభ నష్టాలు, బాహ్య ప్రజననం వల్ల లాభనష్టాలు, బాహ్య ప్రజననం రకాలు- నిర్వచనం, ఉదాహరణలు, గుడ్డు పోషక విలువలు, కోళ్లలో వచ్చే వ్యాధులు, ఆహారానికి ఉపయోగపడే మంచినీటి, సముద్రపు నీటి చేపలు, తేనెటీగల్లో రాణి, కూలి, మగ ఈగల మధ్య ఉన్న జన్యుపరమైన, నిర్మాణపరమైన తేడాలు, జన్యు చికిత్స గురించి ప్రాథమిక అంశాలు అవగాహన చేసుకోవాలి.

జన్యుశాస్త్రంలో లింగ నిర్ధారణ, బహుళయుగ్మ వికల్పాలపై ప్రశ్నలుంటాయి. రక్తవర్గాల అనువంశికత మీద శ్రద్ధ పెట్టండి. జన్యు సంబంధిత, క్రోమోజోమ్‌ల అపసవ్యత వల్ల వచ్చే వ్యాధుల మీద ప్రశ్నలు సాధారణం. ముఖ్యంగా థలసీమియా, హీమోఫిలియా, వర్ణాంధత్వం లాంటి వాటి మీద ప్రశ్నలు అడుగుతారు.


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-05-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌