• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఎలా సిద్ధం కావాలంటే?

నిబంధనలు ప్రకటించిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి

తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో్ ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో ధ్రువపత్రాల పరిశీలన మినహా మిగిలినవన్నీ ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుక్‌చేయడం, రిజిస్ట్రేషన్‌, అభ్యర్థి లాగిన్‌, కాలేజీ వారీగా ఆప్షన్లను ఇవ్వడం అన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే నమోదు చేసుకోవచ్చు. సంబంధిత నియమ నిబంధనలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కౌన్సెలింగ్‌కు సిద్ధమైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో చేరేందుకు ఉన్న అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్‌

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్‌09 వరకు జరుగుతుంది.  అభ్యర్థులు ముందుగా అభ్యర్థిత్వాన్ని  https://tseamcet.nic.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం కావాల్సిన వివరాలను రెడీ చేసి పెట్టుకొని ప్రక్రియ ప్రారంభించాలి. ఎంసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, అభ్యర్థి పుట్టిన తేదీ, ఇంటర్‌/ తత్సమాన పరీక్ష హాల్‌ టికెట్‌ నంబర్‌లను సంబంధిత కాలమ్‌ల్లో నింపాలి. అనంతరం మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ సంఖ్య, కుల ధ్రువీకరణ పత్రం నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి మొబైల్‌ నంబర్‌ను ప్రక్రియ చివరి వరకు మార్చడం కుదరదు. 

అభ్యర్థి ప్రాథమిక సమాచారం నమోదు చేసిన తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1200 ఆన్‌లైన్‌ ద్వారా పే చేయాలి. అనంతరం లాగిన్‌ అకౌంట్‌ క్రియేట్ అవుతుంది. దాని ద్వారా సర్టిఫికెట్‌ పరిశీలన తేదీ, దగ్గర్లోని కేంద్రాన్ని, సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సహాయకేంద్రానికి వెళ్లేప్పుడు ఎంసెట్‌ ర్యాంక్‌ కార్డు, హాల్‌టికెట్‌, ఆధార్‌కార్డు, 10వ తరగతి/ తత్సమాన పరీక్ష మార్కుల మెమో, ఇంటర్‌ మెమో, ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఒరిజినల్స్‌తో పాటు మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రసీదు ఇస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సెప్టెంబర్‌ 11 వరకు కొనసాగుతుంది.

ఆప్షన్ల ఎంపిక

వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి నమోదు చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అనంతరం వెబ్‌సైట్‌లో యూజర్‌ఐడీ ద్వారా లాగిన్‌అయి ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల వివరాలు పోర్టల్‌లో ఉంటాయి. కాలేజీ ఫీజు, కాలేజీ కోడ్‌, జిల్లాల వారీగా వివరాలు, అందుబాటులో ఉన్న కోర్సుల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లను ఇవ్వాలి. అనంతరం డేటా సేవ్‌చేసి సబ్మిట్‌ చేయాలి. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను సెప్టెంబర్‌16 వరకు ఎన్నిసార్లయినా మార్చుకునే వెసులుబాటు ఉంది. 

సీటు ఖరారు.. అలాట్‌మెంట్ ఆర్డర్‌

అభ్యర్థులు ఆప్షన్లను ఇచ్చిన అనంతరం కాలేజీ, కోర్సు, అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా సెప్టెంబర్‌ 18న మొదటి దశ సీట్లు కేటాయింపు జరుగుతుంది. అనంతరం ఐడీ ద్వారా లాగిన్‌ అయి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అభ్యర్థికి కేటాయించిన కాలేజీ ఫీజును సెప్టెంబర్‌20వ లోపు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలో సీటు రాకపోతే రెండో దశ వెబ్‌ఆప్షన్‌కు వెళ్లవచ్చు. తుది అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చిన తర్వాత సంబంధిత కాలేజీలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి. 

స్లాట్‌బుకింగ్‌ తేదీలు: సెప్టెంబర్‌09, 2021 వరకు.

ధ్రువపత్రాలు పరిశీలన: సెప్టెంబర్‌04 నుంచి 11 వరకు.

వెబ్‌ ఆప్షన్లు: సెప్టెంబర్‌11 నుంచి సెప్టెంబర్‌16 వరకు.

తొలి దశ సీట్ల కేటాయింపు: సెప్టెంబర్‌18, 2021.

రిపోర్టింగ్‌: సెప్టెంబర్‌20, 2021.

వివరాల నమోదులో అప్రమత్తత అవసరం

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అంతా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంది. కేవలం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు మాత్రమే దగ్గర్లోని సహాయ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అందులోనూ అభ్యర్థులు కేంద్రాన్ని ఎంచుకునే వీలు ఉంది. కౌన్సెలింగ్‌ సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసేపుడు అప్రమత్తంగా ఉండాలి. వెబ్‌ఆప్షన్లు ఇచ్చేపుడు కాలేజీ, ఫీజు, కోర్సువారీ ప్రాధాన్య క్రమాన్ని సరిచూసుకోవాలి. తొలిదశ కౌన్సెలింగ్‌లో సీటు పొందని విద్యార్థులు నిరాశపడకూడదు. కోరుకున్న కాలేజీ, కోర్సులో సీటు లభించని వారికి బోర్డు రెండో దశ కౌన్సెలింగ్‌ ద్వారా అవకాశం కల్పిస్తుంది.

- నీలామేఘశ్యామ్‌దేశాయ్‌

వెబ్‌సైట్: https://tseamcet.nic.in/Default.aspx 

ఎంసెట్ -2021 మాక్ కౌన్సెలింగ్

తెలంగాణ
 
ఆంధ్రప్రదేశ్‌
ఇంజినీరింగ్ అగ్రికల్చర్ & ఫార్మసీ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ & మెడికల్‌

Posted Date : 04-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌