• facebook
  • whatsapp
  • telegram

మౌలికంపై పట్టు.. ఆపై ‘మాక్‌’ పనిపట్టు!


* ఐసెట్‌ మెలకువలు

* తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశపరీక్ష ప్రకటనల విడుదల

 

తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ కళాశాలల్లో ఎంబీఏ/ ఎంసీఏ చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (ఐసెట్‌) రాయాల్సి ఉంటుంది. దీనిలో మంచి మార్కులు సాధిస్తే ఉత్తమ కళాశాలల్లో సీటు సంపాదించవచ్ఛు విజయవంతంగా కోర్సును పూర్తిచేసి పట్టా పొందితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన ఐసెట్‌కు ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం!

 

 


ఐసెట్‌ సిలబస్‌తో పాటు ఇతర విధానాలు రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. రాతపరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.

సెక్షన్‌ ఎ - ఎనలిటికల్‌ ఎబిలిటీ, సెక్షన్‌ బి - మ్యాథమేటికల్‌ ఎబిలిటీ, సెక్షన్‌ సి - కమ్యూనికేషన్‌ ఎబిలిటీ.

ప్రణాళిక ప్రకారం చదివితే తేలికగా మార్కులు సాధించొచ్ఛు మౌలిక అంశాలపై సిద్ధం కావడం, మాక్‌ పరీక్షలు రాయడం అనే రెండు అంచెల్లో సన్నద్ధతను రూపొందించుకోవాలి. మొదటి అంచెకు ఎక్కువ సమయం తీసుకోరాదు. కేవలం 10 నుంచి 15 రోజుల సమయం చాలు. అయితే గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్‌ పరీక్షల షెడ్యూల్‌కు ఇబ్బంది లేకుండా సిద్ధం కావాలి.

 

 


ఎలా చదవాలి?
సెక్షన్‌-బి నుంచి పరీక్షకు సిద్ధం కావడం మంచిది. సెక్షన్‌-బిలో నేర్చుకున్న అరిథ్‌మెటిక్‌ సెక్షన్‌-ఎకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే ముందుగా అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ చూడాలి. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటే తేలికగా సమాధానాలు గుర్తించొచ్ఛు ఉదాహరణకు 2019లో తెలంగాణ ఐసెట్‌లో అడిగిన ప్రశ్నలను పరిశీలించండి.
* ఒక వ్యక్తి ఒక వస్తువును రూ. 18,000 కు కొని సంవత్సరం తర్వాత కొన్న వెలలో 25% తక్కువకు అమ్మాడు. అది అమ్మిన ధర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానాన్ని రెండు పద్ధతుల్లో కనుగొనవచ్ఛు రూ. పద్దెనిమిది వేలకు 25% కనుగొని, ఆ తర్వాత దానిని రూ. 18,000 నుంచి తీసివేయడం ఒక పద్ధతి. లేదంటే రూ. 18,000 మొత్తానికి 75% కనుగొనడం. రెండో పద్ధ్దతిలో చేస్తే సమాధానం నేరుగా వస్తుంది. కాన్సెప్ట్‌ నేర్చుకుంటే ఇలాంటివి వాటంతట అవే వస్తాయి. పాఠశాల స్థాయి పుస్తకాలు చదవడం ద్వారా ఈ కాన్సెప్ట్‌ను తేలిగా నేర్చుకోవచ్ఛు
ఇదే విధంగా ఆల్‌జీబ్రా, జామెట్రికల్‌ ఎబిలిటీ అంశాలకు సిద్ధం కావాలి. వీటికి పాఠశాల స్థాయి పుస్తకాలు సరిపోతాయి. ముందుగా మౌలిక అంశాలను చదివిన తర్వాత మాక్‌ పరీక్షలను రాయాలి.
సెక్షన్‌-ఎలో డాటా సఫిషియెన్సీ, ప్రాబ్లం సాల్వింగ్‌ అంశాలుంటాయి. సెక్షన్‌-బిలోని అరిథ్‌మెటిక్‌ చదివినప్పుడు ప్రాథమిక అంశాలు ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం కావాల్సిన అవసరం లేదు. రెండు స్టేట్‌మెంట్లను ఇచ్చి, సమాధానం కనుగొనేందుకు ఒకటే అవసరమా? లేక రెండు అవసరమా? రెండింటిని కూడా ఉపయోగించి కనుక్కోలేమా? అన్న అంశాన్ని పరిశీలిస్తే సరిపోతుంది.
ఉదాహరణకు 2019 తెలంగాణ ఐసెట్‌లో ఇచ్చిన ప్రశ్నను పరిశీలించండి.
* ఒక కుర్చీ ఖరీదు ఎంత?
1. ఒక కుర్చీ, ఒక మేజా బల్ల ఖరీదు రూ. 12,000
2. మేజా బల్ల ఖరీదు, కుర్చీ ఖరీదుకు రెట్టింపు
ఈ ప్రశ్నలో రెండు స్టేట్‌మెంట్లు ఉన్నాయి. రెండింటిని వినియోగించి సమాధానాన్ని కనుగొనవొచ్ఛు నిశితంగా పరిశీలిస్తే, సెక్షన్‌-బిలో భాగంగా సిద్ధం అయిన అరిథ్‌మెటిక్‌ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. అక్కడ లాభ- నష్టాలు (ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌) అనే అధ్యాయంలో ఇవి నేర్చుకొని ఉంటాం. ప్రశ్న అడిగిన తీరు మాత్రమే ఇక్కడ మారింది. కాబట్టి, సెక్షన్‌-ఎకు సంబంధించి నేరుగా మాక్‌ పరీక్షలను అభ్యర్థులు రాయవచ్ఛు
ఇదే సెక్షన్‌లో రీజనింగ్‌ అంశంపై కూడా ప్రశ్నలు అడుగుతారు. కోడింగ్‌- డీికోడింగ్‌, డైరక్షన్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, బ్లడ్‌ రిలేషన్సు తదితర అంశాలు ఇందులో భాగం.
2019 ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌లో అడిగిన ఒక ప్రశ్న-
* అరుణకు కరుణ ఏ దిక్కులో ఉన్నది?
1. అరుణకు దక్షిణంగా యమున, పద్మకు తూర్పుగా కరుణ, యమునకు ఉత్తరంగా పద్మ ఉన్నారు.
2. అరుణకు దక్షిణంగా పద్మ ఉంది.
ఈ ప్రశ్నలో రెండు స్టేట్‌మెంట్లను ఉపయోగించి సమాధానం కనుగొనవచ్ఛు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ముందుగా ప్రాథమిక అంశాలు సిద్ధం కావాలి. ఇందుకు ఎక్కువ సమయం తీసుకోరాదు. అధ్యాయాల వారీగా అంశాలను చదివి కనీసంగా 50 ప్రశ్నలకు సమాధానం కనుగొంటే పట్టు లభిస్తుంది.

వేగంగా ఎక్కువ ప్రశ్నలు...
అకడమిక్‌ పరీక్షలతో పోలిస్తే పోటీ పరీక్షలు భిన్నమైనవి. ఈ సంవత్సరమే డిగ్రీ చివరి సంవత్సరం రాసిన అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించాలి.
* ఐసెట్‌లో సమయపాలన చాలా కీలకం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి. సమాధానం కష్టమైన ప్రశ్నల దగ్గర తాత్సారం వదిలివేసి కొత్తవాటికి వెళ్లాలి.
* ప్రస్తుతం అకడమిక్‌ పరీక్షలు లేని అభ్యర్థులు, 10 నుంచి 15 రోజుల్లో ప్రాథమిక అంశాలను పూర్తి చేసేలా సన్నద్ధమై మాక్‌ పరీక్షలు రాయాలి.
* మాక్‌ పరీక్షలు వీలైనన్ని రాయాలి. తక్కువ మార్కులు వస్తున్న అంశాలను సంబంధించి అధ్యాయాల వారీగా చదవాలి.

 

 

సెక్షన్‌ సి సంగతి?
నిత్యం ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీనిపై పట్టు పెంచుకోవచ్ఛు కొత్తగా వచ్చే ఆంగ్ల పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. వాటికి నానార్ధాలు, వ్యతిరేక అర్థాలను కూడా తెలుసుకోవాలి.
ఉదాహరణకు 2019 ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌లో Clairvoyance అర్థం ఏంటి? అంటూ అడిగారు. వొకాబులరీపైన పట్టు కావాలంటే పదాలకు అర్థం తెలుసుకొని ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తారో చూడాలి. ఆయా పదాలతో ఏవైనా నుడికారాలు, సామెతలు ఉపయోగిస్తారో లేదా కూడా నేర్చుకోవాలి. ఇందుకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్‌ కూడా భాగంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు ఉద్దేశించి రాసిన పుస్తకాల్లో ఇవన్నీ ఉంటాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించొచ్ఛు
ఫంక్షనల్‌ గ్రామర్‌లో వ్యాకరణానికి సంబంధించిన అంశాలు కీలకం. వివిధ భాగాల వాడకం, ఒక వాక్యంలో సబ్జెక్ట్‌, వర్బ్‌ అగ్రిమెంట్‌, టెన్సెస్‌ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. డిగ్రీ రెండో సంవత్సరం వరకు ఎలాగూ గ్రామర్‌ చదివి ఉంటారు కాబట్టి, పాత ప్రశ్నలను ఒకసారి పరిశీలించాలి. కొన్ని మాక్‌ పరీక్షలు రాస్తే సరిపోతుంది.
కాంప్రహెన్షన్‌లో మంచి మార్కులు సాధించడానికి సాధనే ఏకైక మార్గం. నిత్యం ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను చదివి, అందులో అడగదగ్గ ప్రశ్నలను పరిశీలించుకోవాలి. అందులో వచ్చే కొత్త పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకొనే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. దీని ద్వారా వొకాబులరీలో కూడా పట్టు లభిస్తుంది.
బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీ అన్నది కొత్త అంశం. కేవలం పదాలు తెలుసుకుంటే సరిపోతుంది. బిజినెస్‌ టెర్మినాలజీ కోసం దినపత్రికలలో బిజినెస్‌ పేజీలో వచ్చే పదాలను చదవడం మంచిది. 2019 ఏపీ ఐసెట్‌లో ‘స్టార్టప్‌’ అంటే ఏంటంటూ అడిగారు. కొత్తగా ప్రారంభించబోయే వ్యాపార సంస్థను స్టార్టప్‌ అంటారు. కనీసంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు దినపత్రికలలో వచ్చే వ్యాపార సంబంధ పదాలను చదివితే సరిపోతుంది. నిత్యం వాడుకలో ఉండే వ్యాపార సంబంధిత పదాలను కూడా తెలుసుకోవాలి (ఉదాహరణకు ‘ఇన్‌వాయిస్‌ అంటే ఏమిటి’).

Posted Date : 23-05-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌