• facebook
  • whatsapp
  • telegram

ఐసెట్‌ కావాలంటే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ నగారా మోగింది. ఎంబీఏ చేయాలనుకునేవారికి ఇదో చక్కని అవకాశం. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఏప్రిల్‌/ మేలో నిర్వహించనున్నారు. ఒకే సిలబస్‌ ఉండే ఈ రెండు పరీక్షలూ తక్కువ వ్యవధిలో జరగబోతున్నాయి. ప్రణాళిక ప్రకారం తయారైతే మంచి స్కోరుతోపాటు మంచి కళాశాలలో సీటు సంపాదించొచ్చు.
ఐసెట్‌ రాయడానికి ఈ ఏడాది డిగ్రీ పూర్తిచేసుకున్న వారితోపాటు ఇతర గ్రాడ్యుయేట్లు అర్హులు. సాధారణంగా గ్రాడ్యుయేషన్‌ పరీక్షల్లో సమయపాలన అంత కీలకం కాదు. ఆలోచించి సమాధానం రాయొచ్చు. కానీ పోటీపరీక్షల తీరు విభిన్నం. ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం కూడా లభించదు.

ఐసెట్‌లో మూడు సెక్షన్లు ఉంటాయి. 200 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం గుర్తించాలి. కాబట్టి వేగంగా సమాధానం గుర్తించేలా సిద్ధం కావాలి.
సెక్షన్‌-ఎ: డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ - 75 ప్రశ్నలు
సెక్షన్‌-బి: మేథమేటికల్‌ ఎబిలిటీ - 75 ప్రశ్నలు
సెక్షన్‌-సి: కమ్యూనికేషన్‌ ఎబిలిటీ - 50 ప్రశ్నలు
సెక్షన్‌ ఎ, బి అంశాల్లో సమయపాలన చాలా ముఖ్యం. కాబట్టి కాన్సెప్టులను నేర్చుకోవడంతోపాటు వేగంగా చేసేలా షార్ట్‌కట్స్‌ ఏవైనా ఉంటే నేర్చుకోవాలి. అయితే నేరుగా షార్ట్‌కట్స్‌ నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు.

సెక్షన్‌- ఎ
డేటా సఫిషియన్సీ (20 ప్రశ్నలు), ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (55 ప్రశ్నలు) వస్తాయి. డేటా సఫిషియన్సీలో ఒక సమస్యనిచ్చి, దానికి సంబంధించిన సమాచారంతో రెండు వాక్యాలను ఇస్తారు. వాటి ఆధారంగా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చా లేదా అన్న అంశాన్ని నిర్ణయించాలి.
రెండో సెక్షన్‌లో భాగంగా మేథమేటికల్‌ ఎబిలిటీలో అరిథ్‌మెటిక్‌ అంశాలను నేర్చుకుంటారు. ఆ సన్నద్ధతే ఇక్కడా ఉపయోగపడుతుంది. ప్రశ్నలు అడిగే తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. కాబట్టి, విద్యార్థులు ముందుగా సెక్షన్‌-2 ప్రారంభించి, సెక్షన్‌-ఎలోని డేటా సఫిషియన్సీ అంశంలో నేరుగా పాత లేదా నమూనా ప్రశ్నలను సాధన చేస్తే సరిపోతుంది.
గణిత ఆధారంగానే ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగం కూడా ఉంటుంది. వర్గాలు, ఘనాలు, వర్గమూలాలపై ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, వాటికి సమాధానం కనుక్కుంటూ సాధన చేస్తే సరిపోతుంది. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. అలాగే ఈ విభాగంలో ఆల్ఫబెట్‌ (ఆంగ్ల అక్షరమాల) ఆధార ప్రశ్నలూ ఉంటాయి. వాటినీ సాధ్యమైనన్ని ఎక్కువ సాధన చేయాలి.

సెక్షన్‌-బి

అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ - 35 ప్రశ్నలు, జామెట్రికల్‌, ఆల్జీబ్రా ఎబిలిటీ - 30 ప్రశ్నలు, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ - 10 ప్రశ్నలు
అభ్యర్థులు తమ సన్నద్ధతను ఈ విభాగంతోనే ప్రారంభించాలి. ఆయా అంశాలకు సంబంధించి పాఠశాల స్థాయి పుస్తకాల నుంచి ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) ముందుగా సిద్ధం కావాలి. అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీలో సింప్లిఫికేషన్‌ (సూక్ష్మీకరణాలు), సరాసరి, శాతాలు, వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, పని-కాలం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముందుగా కాన్సెప్టులు నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఎక్కువ సమయం కేటాయించడం తగదు. వారం నుంచి పది రోజుల్లో ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి. ఆ తరువాత గత ప్రశ్నపత్రాల సాధనతోపాటు సాధ్యమైనన్ని ఎక్కువ మాదిరి పరీక్షలు రాయాలి. ఈ విభాగంలో సన్నద్ధతే సెక్షన్‌-ఎకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పక్కాగా సిద్ధం కావాలి.
జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని జామెట్రికల్‌ అంశాలే ఇక్కడా బేసిక్స్‌గా ఉపయోగపడతాయి. అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీకి సంబంధించి 2018 తెలంగాణ ఐసెట్‌లో వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే...‌్ర ఒక అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కావడానికి 40% మార్కులు సాధించాలి. అయితే అతనికి 75 మార్కులే వచ్చాయి. 25 మార్కులు తక్కువ రావడం వల్ల అతను ఉత్తీర్ణత సాధించలేదు. పరీక్షలో గరిష్ఠ మార్కులు ఎన్ని?
అకడమిక్‌ అలవాటు ప్రకారం స్టెప్పులవారీగా లెక్కలు చేసుకుంటూ వెళితే దీనికి ఎక్కువ సమయం పడుతుంది. చూడగానే సమాధానం రాబట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇచ్చిన సమాచారం మేరకు అభ్యర్థికి 75 మార్కులు వచ్చాయి. మరో 25 మార్కులు వచ్చుంటే ఉత్తీర్ణుడయ్యేవాడు. అంటే కనీసంగా ఉత్తీర్ణుడు కావడానికి 100 మార్కులు రావాలి. ఇది 40%కు సమానం. అంటే 40% = 100. కాబట్టి గరిష్ఠ మార్కులు- 100% = 250.
కేవలం ఒక స్టెప్‌లోనే సమాధానం గుర్తించే నేర్పును అలవరచుకోవాలి. కాన్సెప్టులపై పట్టు, సాధన ద్వారానే ఇది సాధ్యమవుతుంది. జామెట్రికల్‌ ఎబిలిటీలో భాగంగా బీజీయ గణితానికి సంబంధించిన అంశాలపైనా ప్రశ్నలు వస్తాయి. ఇలాగే పాఠశాల స్థాయిలో చదివే సంఖ్యాశాస్త్ర అంశాలనూ చదివి, సాధన చేయాల్సి ఉంటుంది.

సెక్షన్‌- సి
ఒకాబులరీ - 10 ప్రశ్నలు, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టర్మినాలజీ - 10 ప్రశ్నలు, ఫంక్షనల్‌ గ్రామర్‌ - 15 ప్రశ్నలు, కాంప్రహెన్షన్‌- 15 ప్రశ్నలు.
కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అని పేర్కొన్న ఈ విభాగంలో ఒకాబులరీ (సమాన, వ్యతిరేక అర్థాలు), బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టర్మినాలజీ, ఫంక్షనల్‌ గ్రామర్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ తదితర అంశాలుంటాయి. ఒకాబులరీలో భాగంగా కేవలం పదాలకు నానార్థాలు, వ్యతిరేక అర్థాలు మాత్రమే తెలుసుకోకుండా సామెతలు, పదబంధాలు, నుడికారాలు తదితర అంశాలనూ నేర్చుకోవాలి. వివిధ సందర్భాల్లో ఉపయోగించే పదాలను తెలుసుకోవాలంటే నిత్యం ఆంగ్ల దినపత్రికలను చదవాలి. తెలియని పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
ఉదా: On important festival days, there is
huge _______ of worshipers at the temples
a) Syndicate b) Constellation c) Swarm d) Congregation (2018 తెలంగాణ ఐసెట్‌)
పండగ వేళల్లో ఎక్కువ మొత్తంలో భక్తులు గుడికి వస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే పదం కాంగ్రిగేషన్‌. ఇవి ఆంగ్ల దినపత్రికలు చదివితే తెలుస్తాయి. అలాగే సరైన ఆప్షన్లు చదివి ముందుకు వెళ్లకుండా సిండికేట్‌, కాన్‌స్టిల్లేషన్‌ తదితర పదాలు ఎక్కడ ఉపయోగిస్తారు, వీటి సమాన, వ్యతిరేక అర్థాలు, అలాగే వీటికి సంబంధించి పదబంధాలు, నుడికారాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. బిజినెస్‌, కంప్యూటర్‌ టర్మినాలజీకి సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా అవగాహన వస్తుంది. ప్రాథమిక అంశాలను అడుగుతున్నందున వీటిపై అభ్యర్థులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఇంగ్లిష్‌ దినపత్రికల్లోని సంపాదకీయాల్లో ప్రశ్నలు అడుగుతూ వెళ్లాలి. అయితే అవి కఠినంగా ఉంటాయి. కాబట్టి, చిన్న చిన్న ఆంగ్ల కథల పుస్తకాలను చదువుతూ వాటిలో ప్రశ్నలు వేసుకుంటూ వెళ్లాలి. తెలియని కొత్త పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకోవడంతోపాటు వాటి నుంచి పదబంధాలు, సామెతలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించుకుంటే సమగ్రత వస్తుంది.ఒకసారి ప్రాథమికాంశాలను చదివి, గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సమాధానాలను తేలికగా గుర్తించవచ్చు.

సమయం విలువైంది..
* సమయం ఎంతో ప్రధానం. ఏదైనా ప్రశ్నకు సమాధానం రాకపోతే అక్కడే ఉండిపోకూడదు. దాన్ని వదిలేసి మరోదానికి వెళ్లాలి.
* సెక్షన్‌ బి నుంచి సన్నద్ధత ప్రారంభించి సెక్షన్‌ ఎ కు వెళ్లాలి.
* ప్రాథమికాంశాలు నేర్చుకోవడం, అధ్యాయాలవారీగా ప్రశ్నలను సాధించడం, పూర్తిస్థాయి మాక్‌ పరీక్షలు రాయడం చాలా కీలకం.
* ప్రాథమిక అంశాలను నేర్చుకోవడాన్ని వారం, పది రోజుల్లోనే పూర్తిచేయాలి. రెండో అంశానికి 10 నుంచి 15 రోజులు, పూర్తిస్థాయి మాక్‌ పరీక్షలకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల గరిష్ఠ స్థాయిలో లబ్ధి పొందవచ్చు.
* కేవలం సూక్ష్మీకరణాల ఆధారిత ప్రశ్నలు (బాడ్‌మాస్‌) రోజుకు కనీసంగా 100 వరకూ సాధన చేయడం వల్ల సెక్షన్‌ ఎ, బిల్లో సమాధానం రాబట్టే సమయం తగ్గిపోతుంది.
* పరీక్ష కొనసాగేవరకూ కూడా కాంప్రహెన్షన్‌ నిత్యం సాధన చేయాలి. ఒక ప్యాసేజీ చదివాక రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ అంశాన్ని ఎలా చెప్పాడు, తన వాదనకు బలం చేకూర్చే అంశాలు ఏవైనా ఇచ్చాడా లేదా? ఈ తరహాలో ప్రశ్నలు వేసుకుని, సమాధానం రాబట్టుకోవాలి.
* పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో, తెలంగాణలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.
* సెక్షన్‌ సి మాత్రమే పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంటుంది. మిగతా రెండు సెక్షన్లు ఇంగ్లిష్‌, తెలుగు రెండు భాషల్లోనూ ఉంటాయి.

- పి. గోపాలకృష్ణ, కౌటిల్యా కెరియర్స్‌

Posted Date : 06-11-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌