• facebook
  • whatsapp
  • telegram

మార్పు మంచిదే!

 


* జేఈఈ మెయిన్‌ - 2020
*కొత్త పద్ధతికి తగ్గట్టుగా ప్రిపరేషన్‌ వ్యూహం

ఏ పోటీపరీక్షకైనా కాలానుగుణంగా మార్పు సహజం. దానికి ఆందోళన పడకుండా దీటుగా ప్రిపరేషన్‌ను మలుచుకోవాలి. తాజాగా జేఈఈ మెయిన్‌-2020 పరీక్షా పద్ధతిలో కీలక మార్పులు జరిగాయి. బీటెక్‌ ప్రవేశం కోసం జరిగే పరీక్షలో ప్రశ్నల సంఖ్య 90కి బదులు 75గా; మార్కుల సంఖ్య 360కి బదులు 300గా నిర్దేశించారు. అయినా 3 గంటల సమయం అలాగే ఉంది. తగ్గించలేదు. ఇవన్నీ విద్యార్థులకు మేలు చేసేవిగానే ఉన్నాయి. కొత్త విధానంలో న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలపై అవగాహన తెచ్చుకోవటం తప్పనిసరి. మార్పుల నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో గరిష్ఠ మార్కుల కోసం ఏయే అంశాలపై ఎలా దృష్టిపెట్టాలో తెలుసుకుందాం!

జేఈఈ పరీక్షలో మార్పులు జరగటం కొత్తేమీ కాదు. ఇప్పటివరకూ ఈ పరీక్షా విధానంలో 7 సార్లు మార్పులు జరిగాయి.

జేఈఈని 2000 సంవత్సరం వరకూ 900 మార్కులకు నిర్వహించారు. 2002 వరకూ ఈ పరీక్షకు 600 మార్కులు. 2003-2007 వరకూ 540 మార్కులు. 2008లో 315 మార్కులకూ, 2009-10లలో 432 మార్కులకూ ఈ పరీక్ష జరిగింది. అక్కడి నుంచి 2019 వరకూ 360 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తూ వచ్చారు. 2011 నుంచి 2019 వరకూ ఈ పరీక్షను ప్రతి సబ్జెక్టు (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) ఒక్కొక్కదానిలో 30 ప్రశ్నల చొప్పున, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు; తప్పు సమాధానానికి ఒక మైనస్‌ మార్కు చొప్పున.. 90 ప్రశ్నలు 360 మార్కులకు నిర్వహించారన్నది తెలిసిందే.

జేఈఈ మెయిన్‌ -2020 ప్రశ్నపత్రం తీరులో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థిలోని సృజనాత్మకతనూ, సమస్యా సాధన నైపుణ్యాన్నీ వెలికి తీసేందుకు ప్రతి సబ్జెక్టులో 5 న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలను ప్రవేశపెట్టారు. అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ తరహా ప్రశ్నలు కొత్తేమీ కాదు. వారికిది అనుకూలించే అంశమే. ఇప్పుడు విద్యార్థులందరూ ఈ ప్రశ్నలను పట్టించుకుని, తగిన సాధన చేయాల్సివుంటుంది.

బీఈ/బీటెక్‌ల కోసం నిర్వహించే, విడిగా బీఆర్క్‌ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష రెండు విడతల్లో పూర్తయిన తర్వాత విద్యార్థులు సాధించిన మొత్తం స్కోరు, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స్కోరు, అలాగే బీఆర్క్‌లో పార్ట్‌ఖి, ఖిఖి, ఖిఖిఖి లపై వచ్చే స్కోరుపై పర్సంటైల్‌ విధానంలో ఆలిండియా ర్యాంకులు ప్రకటిస్తారు. ‘టై’ పరిస్థితి వస్తే మొదట మ్యాథ్స్‌, తర్వాత ఫిజిక్స్‌, ఆపై కెమిస్ట్రీ మార్కులపై సాధించిన పర్సంటైల్‌ ఎక్కువ వచ్చినవారికి మెరుగైన ర్యాంకు ఇస్తారు. అది కూడా ‘టై’ అయితే విద్యార్థి పుట్టిన తేదీని పరిగణనలో తీసుకొని జాతీయర్యాంకులు ప్రకటిస్తారు. బీఆర్క్‌లో కూడా ఇలాగే చేస్తారు.

న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలపై పట్టు ఎలా?
గత మూడు నాలుగు సంవత్సరాల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్లలోని న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నల స్థాయిని అర్థం చేసుకోవాలి. వాటిని సాధన చేయాలి.

 

మ్యాథ్స్‌లో..
ట్రిగొనామెట్రీ నుంచి: 1) Trigonometric Equations 2) Inverse Trigonometry 3) Properties of Triangles 4) Heights and Distances చాప్టర్లపై న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలు నేరుగా, మిశ్రమంగా రావొచ్చు.
ఆల్జీబ్రా నుంచి: 1) Sequences and Series 2) Statistics 3) Permutations & Combinations, Probability 4) Matrices and data management చాప్టర్లపై ఈ తరహా ప్రశ్నలను అడగొచ్చు.
కాల్‌క్యులస్‌ నుంచి: 1) Maxima and Minima 2) Applications of Derivatives 3) Definite Integration 4) Areas of curves చాప్టర్లు ఈ ప్రశ్నలపరంగా ముఖ్యమైనవి.
కోఆర్డినేట్‌ జామెట్రీ, వెక్టార్స్‌ అండ్‌ 3డీ నుంచి: త్రిభుజాలు, వృత్తాలు, చతుర్భుజాలతో కలిసివున్న వైశాల్యాలు, వాటి కనిష్ఠ, గరిష్ఠ విలువలపై న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలు అడగవచ్చు. కనిష్ఠ దూరం, ఘనపరిమాణం లాంటి అంశాలపై కూడా దృష్టిపెట్టాలి.

ఫిజిక్స్‌లో...
1) Experimental Physics 2) Rotational dynamics 3) Heat and thermodynamics 4) Optics 5) Total electricity లాంటి అంశాల్లో పూర్వ అడ్వాన్స్‌డ్‌ పేపర్లలోని న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలన్నింటినీ సాధన చేయాలి.

కెమిస్ట్రీలో...
న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలు ఫిజికల్‌ కెమిస్ట్రీలోని ప్రతి అధ్యాయం నుంచీ రావటానికి చాలా ఆస్కారముంది. ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌లలో మాత్రం ఈ తరహా ప్రశ్నలు చాలావరకు బేసిక్‌ అంశాలపైన మాత్రమే అడుగుతారు. దీనికి కూడా గత నాలుగైదు పాత సంవత్సరాల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్లను తిరగేయండి.

అనుకూల అంశాలే ఎక్కువ
ప్రశ్నల సంఖ్య 90 నుంచి 75కి తగ్గింది. ఇది అనుకూల అంశం.
* పరీక్షా సమయం గతంలో మాదిరి 3 గంటలే. ఇదీ అనుకూలాంశమే.
* మూడు సబ్జెక్టుల్లోనూ 60 ప్రశ్నలకు మాత్రమే రుణాత్మక మార్కులున్నాయి. విద్యార్థులకు ఇదెంతో అనుకూలం.
* 60 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలన్నీ గతంలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ స్థాయిలో ఉంటే మాత్రం ఇది అనుకూలమే. ఎందుకంటే గత సంవత్సరాల్లో ఈ తరహా ప్రశ్నలు ముఖ్యంగా 2019లో నిర్వహించిన 16 పేపర్లలోని ప్రశ్నల స్థాయిని పరిశీలిస్తే అన్నీ విద్యార్థికి సబ్జెక్టులపై ముఖ్యంగా ప్రాథమిక అంశాలపై పట్టును పరీక్షించేలాగానే ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో అతి తక్కువ ప్రశ్నలు మాత్రమే కఠినస్థాయిలో ఉన్నాయి. జేఈఈ- మెయిన్‌ -2020లోని ప్రతి సబ్జెక్టులో మొదటి 20 ప్రశ్నలూ ఇదే విధంగా ఉంటే విద్యార్థులకు చాలా అనుకూలమవుతుంది.
* రుణాత్మక మార్కులు ఇచ్చినప్పటికీ గతంలో అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉండటంతో విద్యార్థి గుడ్డిగా లేదా ఉజ్జాయింపుగా గుర్తించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కరెక్టు అయినపుడు కొంత ప్రయోజనం కలిగేది. 5 చొప్పున ఇచ్చే న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నల మూలంగా ఆ అవకాశం కొంత ఇప్పుడు దూరమైంది.
* అయితే న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేకపోవడం అనుకూలాంశమే.
* గతంలో సాధారణ విద్యార్థికి 90 ప్రశ్నలు 3 గంటల్లో రాయటం మూలంగా ప్రతి సబ్జెక్టుకూ సమయ నిర్వహణ ప్రతికూలాంశంగా ఉండేది. ఆ ఇబ్బంది ఇప్పుడు దాదాపు తొలగిపోయినట్టే.
మొత్తమ్మీద ఈ మార్పులు అనుకూలమైనవే. అయితే అత్యుత్తమ ర్యాంకును సాధించాలంటే మాత్రం పేపర్‌ స్థాయి ఎలా ఉన్నప్పటికీ 300కు కనీసం 120 మార్కులు తెచ్చుకోగలగాలి. లక్ష్యం జాతీయస్థాయిలో 10లోపు, 100లోపు సాధించాలనుకుంటే మాత్రం 300 మార్కులకు 290 మార్కులపైనే సాధించాలి!

పాత- కొత్త విధానాల్లో ఏ తేడాలు?
2011 - 2019 వరకు జేఈఈ మెయిన్‌లో...
1) మ్యాథ్స్‌ ప్రశ్నల సంఖ్య 30
ఫిజిక్స్‌ ప్రశ్నల సంఖ్య 30
కెమిస్ట్రీ ప్రశ్నల సంఖ్య 30
2) మొత్తం ప్రశ్నలు 90
3) అన్ని ప్రశ్నలూ మల్టిపుల్‌ చాయిస్‌- ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే.
4) మొత్తం మార్కులు 360
5) సరైన సమాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు. సమాధానం ఇవ్వని లేదా సమీక్ష కోసం వదిలినవాటికి ‘0’ మార్కులు.
6) 2011- 2018 వరకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాల్లో పరీక్షను సంవత్సరంలో ఒకసారి మాత్రమే జరిపారు. 2019 నుంచి జనవరి, ఏప్రిల్‌లో రోజుకు రెండు షిఫ్టుల్లో మొత్తం 16 విభిన్న ప్రశ్నపత్రాలతో పూర్తిస్థాయి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించారు.
7) ప్రతి సబ్జెక్టులో, ప్రతి విద్యార్థి సాధించిన మార్కులు, వాటి పర్సంటైల్‌ స్కోర్‌ను తీసుకొని... జాతీయస్థాయి ర్యాంకులను ఏప్రిల్‌ 30న విడుదల చేశారు.

జేఈఈ మెయిన్‌ -2020 కొత్త పద్ధతిలో...
1) మ్యాథ్స్‌ ప్రశ్నల సంఖ్య 25
ఫిజిక్స్‌ ప్రశ్నల సంఖ్య 25
కెమిస్ట్రీ ప్రశ్నల సంఖ్య 25
2) మొత్తం ప్రశ్నలు 75
3) ప్రతి సబ్జెక్టులో మొదటి 20 ప్రశ్నలు మాత్రమే మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు. మిగిలిన 5 ప్రశ్నలు సంఖ్యాత్మక విలువున్న (న్యూమరికల్‌ వాల్యూ) ప్రశ్నలు.
4) మొత్తం మార్కులు 300
5) సరైన సమాధానం గుర్తించిన ప్రతి సబ్జెక్టులోని ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల్లో మాత్రమే తప్పు సమాధానానికి -1 మార్కు. సమాధానం గుర్తించని లేదా సమీక్ష కోసం వదిలినవాటికి ‘0’ మార్కులు.
6) 2020లో కూడా జనవరి 6 నుంచి 11 వరకు; ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పూర్తిస్థాయి కంప్యూటర్‌ ఆధారిత (ఆన్‌లైన్‌) పరీక్షను నిర్వహిస్తారు.
7) విద్యార్థి సాధించిన ప్రతి సబ్జెక్టులోని మార్కులు, మొత్తం మార్కులు, వాటి పర్సంటైల్‌ ఆధారంగా జనవరి- ఏప్రిల్‌లలో నిర్వహించనున్న పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఏప్రిల్‌ 30న జాతీయస్థాయి ర్యాంకులను ప్రకటిస్తారు.

మూడు ముక్కల్లో...
సమయం: ప్రశ్నల సంఖ్య తగ్గింది కాబట్టి పరీక్షలో సమయం చాలకపోవటం అనే సమస్య ఉండదు.
క్లిష్టత: న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉండొచ్చు. అయినా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి వాటికి ఏ సమాధానం గుర్తించినా నష్టం ఉండదు.
మార్కులు: కొత్త విధానంలో అత్యధికులకు ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ర్యాంకుల్లో పోటీ పెరుగుతుంది.

- ఎం. ఉమాశంకర్

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌