• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ బాటలో తుది పరీక్ష!

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ విజయ సూత్రాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2021 షెడ్యూల్‌ విడుదలైంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించే పరీక్ష ఇది. గత సంవత్సరం ఐఐటీ-దిల్లీ ఈ పరీక్షను సెప్టెంబరు 27న నిర్వహిస్తే.. ఈ ఏడాది ఐఐటీ-ఖరగ్‌పూర్‌ అక్టోబరు 3న నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించే ప్రణాళికను తెలుసుకుందాం!  

జేఈఈ-మెయిన్‌-2021 చివరి షెడ్యూల్‌ ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 2 వరకు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. నాలుగో విడత జేఈఈ-మెయిన్‌ పరీక్షను పూర్తిచేసిన విద్యార్థులకు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు నెల రోజుల వ్యవధి ఉంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్ష విధానంలో మార్పులు లేకపోయినప్పటికీ రాబోయే జేఈఈ-మెయిన్స్‌ నాలుగో విడతను దృష్టిలో ఉంచుకుని, జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో గరిష్ఠ మార్కులు సాధించే దిశగా పునశ్చరణకు పదునుపెట్టాలి. 

ఐఐటీ-ఖరగ్‌పూర్‌ గతంలో 2006, 2014లో కూడా ఈ పరీక్షను నిర్వహించింది. ఈ విషయాన్ని గుర్తుచేయడానికి కారణం.. 2006, 2014 ప్రశ్నపత్రాల శైలిని అర్థం చేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవానికి వీలవుతుందనే! ఆచరణీయమైన ప్రణాళిక ద్వారా ఇచ్చే సూచనలను పాటిస్తే తప్పకుండా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2021లో అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చు.

40 రోజుల ప్రణాళిక

ఎంసెట్‌ లాంటి పరీక్షలకు కేటాయించే సమయం తీసివేస్తే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోసం 40 రోజులు మిగులుతాయి. ఈ వ్యవధిని 4 భాగాలు చేసి, ఒక్కొక్క భాగానికి 10 రోజుల కాలవ్యవధిని నిర్ణయించండి. పార్ట్‌-ఎ,బి,సి,డి... ఇలా ఒక్కో భాగానికి పది రోజుల చొప్పున సమయాన్ని కేటాయించండి. 

పార్ట్‌-ఎలో...

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ప్రతి సబ్జెక్టుకూ కనీసం 3 గంటల సమయం కేటాయించండి. అంటే పార్ట్‌-ఎలో ప్రతి సబ్జెక్టుకీ కనీసం 30 గంటల సమయం వస్తుంది.

3 గంటల మ్యాథ్స్‌ ప్రిపరేషన్‌లో మొదటి 7 రోజులు అంటే 21 గంటలలో ఆల్జీబ్రా విత్‌ పెర్‌మ్యుటేషన్‌ అండ్‌ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అండ్‌ కాంప్లెక్స్‌ నంబర్స్, వెక్టార్స్, 3డిలపై దృష్టి సారించండి. 

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో పై మూడు అధ్యాయాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. కనీసం 50 శాతం ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. చివరి మూడు రోజుల్లో ఒకసారి పునశ్చరణ (రివిజన్‌) చేసుకుని ఒక మాక్‌ టెస్ట్‌ రాయాలి. చివరి మూడు రోజులు పై అధ్యాయాల నుంచి గత 40 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను సాధించడంపై దృష్టి పెట్టండి.

ఫిజిక్స్‌ ప్రిపరేషన్‌లో మొదటి 7 రోజులు అంటే 21 గంటలలో ఆప్టిక్స్, వేవ్స్, హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్‌పై దృష్టి సారించండి. వీటి నుంచి 25 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చివరి మూడు రోజులు అంటే 9 గంటలలో 40 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను సాధన చేసి, మాక్‌ టెస్ట్‌ రాయండి. 

కెమిస్ట్రీ ప్రిపరేషన్‌లో మొదటి 7 రోజులు అంటే 21 గంటలలో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ (అకర్బన రసాయన శాస్త్రం) అంశాలను పోల్చిచూసే పద్ధతి (కంపారిజన్‌ మెథడ్‌) సాధన చేయాలి. చివరి మూడు రోజులు పాత ప్రశ్నపత్రాల నుంచి ప్రశ్నలపై అవగాహన పెంచుకోండి. సుమారు 30 శాతం ప్రశ్నలు వీటి నుంచి రావడానికి ఆస్కారం ఉంది. మాక్‌ టెస్టు రాయడం మరవకండి. 

పార్ట్‌-బి ఇలా..

పార్ట్‌-ఎలో మాదిరే పార్ట్‌-బిలో మ్యాథ్స్‌లో ఈసారి కాల్‌క్యులస్‌పై దృష్టి పెట్టండి. కనీసం 40% ప్రశ్నలు వచ్చే అవకాశముంది. దీని కోసం పైన చెప్పినట్లుగానే మొదటి 21 గంటలు కేటాయించి చివరి 9 గంటలు పాత 

ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను సాధించడంపై దృష్టిపెట్టండి. చివరి మూడు రోజులలో మాక్‌ టెస్టు రాయడం తప్పనిసరి.

ఫిజిక్స్‌లో అయితే మొదటి 12 గంటలు మెకానిక్స్‌లో రొటేషనల్‌ డైనమిక్స్‌ వరకు, తర్వాత 12 గంటలు మిగిలిన మెకానిక్స్‌పై దృష్టి పెట్టండి. మిగతా సమయం 40 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాల సాధనపై మక్కువ చూపండి. ఎప్పటిలాగానే మాక్‌టెస్ట్‌ రాయడం మరిచిపోవద్దు. వీటి నుంచి 30% ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

కెమిస్ట్రీ విషయంలో ఈసారి ఫిజికల్‌ కెమిస్ట్రీపై మొదటి 7 రోజులు అంటే 21 గంటలు కేటాయించండి. దీని నుంచి 35% ప్రశ్నలు రావడానికి ఆస్కారముంది. చివరి మూడు రోజులు అంటే 9 గంటలు మాత్రం పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను సాధన చేస్తూ, మాక్‌ టెస్టు రాయండి. 

పార్ట్‌-సి సంగతి 

పార్ట్‌-ఎ, పార్ట్‌-బిలలో మాదిరే పార్ట్‌-సిలో కూడా ప్రతి సబ్జెక్టులో మొదటి 7 రోజులు అంటే.. 21 గంటలు కేటాయించాలి. మాథ్స్‌లో అయితే కో-ఆర్డినేట్‌ జామెట్రీ, ట్రిగనోమెట్రీ (త్రికోణమితి)లపై దృష్టి పెట్టండి. వీటి నుంచి 20% ప్రశ్నలు రావడానికి ఆస్కారముంది. అలాగే ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ చాప్టర్‌ మొత్తం, ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఇన్‌డక్షన్, ఏసీ సర్క్యూట్స్‌తో కలిపి మొదటి 21 గంటల్లో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్‌ అవ్వండి. దీంతోపాటు మోడరన్‌ ఫిజిక్స్‌ ముఖ్యం. ఎందుకంటే 45% ప్రశ్నలు రావడానికి చాలా అవకాశం ఉంది. కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (కర్బన రసాయన శాస్త్రం)పై దృష్టి పెట్డండి. దీన్నుంచి 35% ప్రశ్నలు రావొచ్చు. చివరి 9 గంటలు అంటే 3 రోజలు మాత్రం ప్రతి సబ్జెక్టులో పాత 40 సంవత్సరాల ప్రశ్నలను సాధన చేయడం, మాక్‌ టెస్ట్‌ రాయడం తప్పనిసరి. 

అసలైంది పార్ట్‌-డి 

ఇదివరకటితో పోల్చుకుంటే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు కావాల్సిన దానికంటే ఎక్కువ సమయం వచ్చిందనే చెప్పాలి. ఇకనుంచి మీ ప్రిపరేషన్‌ మొత్తం కూడా ప్రశ్నల రూపంలోనే సాధన చేయండి. కనీసం ఒక గంటలో 20 నుంచి 25 విభిన్న ప్రశ్నలను సమాధానాలు వచ్చేవరకు పేపర్‌ మీద సాధన చేయడం మంచిది. 

పోటీ పరీక్షలలో విజయానికి మొదటి సూత్రం ‘తెలిసినది తప్పు చేయకుండా రాయడమే’! సన్నద్ధతలో నిబద్ధత, స్పష్టత ఉన్నట్లయితే ఒక ప్రశ్న మీకు రావడంలేదనుకుంటే..అది మీకు మాత్రమే కాదు.. అందరికీ అలాగే ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఆ ప్రశ్నను వదిలి వేరే దానిపై దృష్టి పెట్టాలి. సమయాన్ని ఎంత మాత్రం వృథా చేయొద్దు.

చివరి పది రోజుల్లో... 

పార్ట్‌-డిలోని చివరి 10 రోజులూ చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ వ్యక్తిగత బలహీనతల ప్రభావం సాధనపై పడకుండా జాగ్రత్తపడండి.

1. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ముఖ్యమైన విషయాలపై అవగాహన పెంచుకోవాలి. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారో పాత ప్రశ్నపత్రాల ద్వారా గమనించి ఆ స్థాయి ప్రశ్నలపై దృష్టి పెట్టండి.

2. రోజు విడిచిరోజు అసలైన జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ టైమ్‌ షెడ్యూల్‌ మాదిరిగానే ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 సమయంలో పూర్తి సిలబస్‌పై గ్రాండ్‌ టెస్ట్‌లు సాధన చేయండి. 

3. ఇంటీజర్‌ టైపు (సంఖ్యాత్మక విలువ) ఉన్న ప్రశ్నలను సాధన చేయండి. 

4. మ్యాథమేటిక్స్‌లోని ప్రాథమిక సమీకరణాలు, ఫార్ములాలపై దృష్టి పెట్టండి.

5. ప్రతి సబ్జెక్టులో కూడా మిక్స్‌డ్‌ కాన్సెప్చువల్‌ (బహుళ భావనల సంబంధిత) ప్రశ్నల సాధన మరవొద్దు.

6. గ్రాండ్‌ టెస్టు తర్వాత ఏయే విష  యాల్లో తప్పులు దొర్లాయో చూసుకుని వాటిని మళ్లీ ప్రాక్టీస్‌ చేయడం ముఖ్యం.

7. చిన్న, చిన్న తప్పులు దొర్లడం సహజం. కానీ దాన్నే  అలవాటుగా మార్చుకోకండి.

8. ఎన్ని ప్రశ్నలు చేశామన్నది ముఖ్యం కాదు. ఎన్ని కచ్చితంగా చేశామన్నదే ముఖ్యం. 

9. ప్రతి ప్రశ్నకూ అందులోని సమాధానాలను పూర్తిగా చదివాకే కచ్చితమైన సమాధానాన్ని ఎంచుకుని గుర్తించండి.

10. ఫలితాలను రెండు పేపర్ల మొత్తం మార్కులు నిర్దేశిస్తాయి. ఒక పేపర్‌ ప్రభావం రెండోదానిపై పడకుండా చూసుకోండి. 


 

Posted Date : 02-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌