‣ జేఈఈ అడ్వాన్స్‌డ్ 92 ర్యాంకర్ చేతన్ మనోజ్ఞసాయి
వివిధ స్థాయుల్లో ఉండే ప్రవేశపరీక్షలకు హాజరై, అన్నిటిలోనూ అగ్రశ్రేణి ర్యాంకులు సాధించటం అందరికీ సాధ్యం కాదు. చిత్తూరు జిల్లా పీలేరు విద్యార్థి పోతంశెట్టి చేతన్ మనోజ్ఞ సాయి ఇలాంటి అరుదైన ప్రతిభ చూపాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయస్థాయిలో 92వ ర్యాంకు సాధించిన ఇతడు తెలంగాణ ఎంసెట్‌లో ఆరో ర్యాంకునూ, ఏపీ ఎంసెట్‌లో 38వ ర్యాంకునూ కైవసం చేసుకున్నాడు. జేఈఈ మెయిన్ తొలి సెషన్‌లో ఏపీ టాపర్ ఇతడే. జేఈఈ మెయిన్ తుది ఫలితాల్లో అఖిల భారత స్థాయి 28వ ర్యాంకు తెచ్చుకున్నాడు. తన ప్రిపరేషన్ పంథా, మెలకువలూ తెలుసుకుందాం!
ప్రణాళికాబద్ధంగా చదవడం, శిక్షణలతో పాటు అంతర్జాలంలో శోధించి గ్రహించిన పరిజ్ఞానం తన విజయాలకు కారణమని మనోజ్ఞ సాయి చెపుతున్నాడు. ‘ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఉత్సాహంగా రాయగలుగుతాం’ అన్నాడు. ఒక విజయం అందించిన ఆత్మవిశ్వాసం మరో విజయం సాధించటానికి ప్రేరణగా నిలుస్తుందనేది ఇతడి అభిప్రాయం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవ్వడం వల్ల ఎంసెట్‌కు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేకపోయిందని చెప్పాడు.
మనోజ్ఞసాయి పీలేరులో ఏడో తరగతి వరకు, ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో చదివాడు.
మొదటి నుంచీ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపిస్తూ వచ్చాడు.
‣ ఏఎస్ రావు ట్యాలెంట్ 2018 అవార్డు
‣ హోమీ బాబా సెంటర్ ఆధ్వర్యంలో రీజినల్ మ్యాథమేటికల్ ఒలింపియాడ్ 2018, 2019లలో విజయం
‣ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ 2019 అవార్డు
‣ కేవీపీవై 2019 ఫెలోషిప్
‣ 2020-21లో ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో జాతీయస్థాయి ఒలింపియాడ్‌లో అర్హత
‣ అంతర్జాతీయ ఒలింపియాడ్ 2021 ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇండియన్ ఓరియంటేషన్ వర్చువల్ క్యాంప్‌లో పాల్గొనే అవకాశం సాధించగలిగాడు.
దేశంలో అత్యుత్తమ ఐఐటీలైన ముంబయి, దిల్లీ, చెన్నైల్లో ఏదో ఒకదానిలో ప్రవేశం పొందాలన్న పట్టుదలతో చదివాడు. ‘రోజుకు 12 గంటలకు పైగా చదివాను. ప్రతి వారం క్రమం తప్పకుండా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ నమూనా పరీక్షలు రాయడం, నేను చదివిన శ్రీ చైతన్య విద్యాసంస్థల అధ్యాపకుల సూచనలను పాటించటం చేశాను. కఠినమైన అంశాల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో శోధించి తెలుసుకున్నా. నవోదయ ప్రవేశపరీక్ష కోసం పీలేరు ఎస్‌వీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందడం బేసిక్ కాన్సెప్టులకు గట్టి పునాది వేసింది. ఒలింపియాడ్స్‌లో విజయాలు స్ఫూర్తినిచ్చాయి’ అని చెప్పాడు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు ఎప్పటినుంచి సిద్ధమవ్వాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. 9వ తరగతి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టటం మేలు అని అభిజ్ఞసాయి సూచిస్తున్నాడు.
ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో పూర్తి స్థాయి నైపుణ్యాన్ని సాధించాలనేది ఇతడి లక్ష్యం. పది మందికీ ఉపయోగపడే రీతిలో ఎదగాలనీ, సివిల్స్ పరీక్షలోనూ రాణించాలనీ భావిస్తున్నాడు.
‣ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. ఆ పుస్తకాలు బాగా చదవాలి.
‣ గణితం, ఫిజిక్స్‌ల్లో ఏదో ఒక దానిపై పూర్తి పట్టుసాధించాలి.
‣ ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇందులో ప్రశ్నలు చదువుతుండగానే జవాబులు కచ్చితంగా తెలియవు. తరచూ ప్రశ్నలు చదివి తప్పులు లేకుండా జవాబు రాయాలి.
‣ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
‣ పేపర్-1, పేపర్-2 లలోని ప్రతి ప్రశ్నకూ ప్రాధాన్యం ఇవ్వాలి.
‣ చదవడంతో పాటు ఎక్కువ సమయం ప్రాక్టీసు చేయాలి.
‣ నమూనా పరీక్షలు ఎక్కువ రాయాలి. ఇందులో వచ్చిన తప్పులు సరిచేసుకుని మళ్లీ అలాంటివి చేయకుండా చూసుకోవాలి.
‣ నమూనా పరీక్షల సమయంలో జవాబులు తప్పుగా రాస్తే అధ్యాపకుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పట్టాతో పాటు పదిలమైన ఉద్యోగం