• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయానికి ముందస్తు వ్యూహం!

ఒత్తిడిని జ‌యిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు సాధించాలనుకునే విద్యార్థుల జీవితాల్లో జులై3, 2021 చాలా ముఖ్యమైన తేదీ. ఆ రోజే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష జరగబోతోంది. దేశంలో జరిగే అతి కష్టమైన ప్రవేశ పరీక్షల్లో ఇది ఒకటి. కానీ, ప్ర‌ణాళిక ప్ర‌కారం, స‌రైన వ్యూహాల‌ను అనుస‌రించి స‌న్న‌ద్ధ‌మైతే విజ‌యం సాధించ‌వ‌చ్చు. విద్యార్థులు ఇప్ప‌టికే ప్రిప‌రేష‌న్‌లో నిమ‌గ్నమ‌య్యారు. అయితే ఈ స‌మ‌యంలో విద్యార్థుల‌కు త‌ల్లిదండ్రుల మ‌ద్ద‌తు, నిపుణుల స‌ల‌హాలు, సూచ‌న‌లు చాలా అవ‌స‌రం. వీట‌న్నింటిని పాటిస్తూ ముందుకు వెళ్తే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం సులువ‌వుతుంది.‌

ఏప్రిల్ ‌మే నెల‌ల్లో బోర్డు ప‌రీక్ష‌లు షెడ్యూల్ అయ్యాయి. ఆ స‌మ‌యంలో వారిపై అధిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి, మిగిలిన ఈ రెండు నెల‌ల స‌మ‌యాన్ని విద్యార్థులు స‌మ‌ర్థంగా వినియోగించుకోవాలి.  చివరి నిమిషంలో టెన్షన్ ను అధిగమించ‌డానికి అందుబాటులో ఉన్నటైమ్ ను సక్రమంగా ఉపయోగించుకోవాలి. 

నిర్దేశిత సమయాల్లో..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై దృష్టి సారించిన విద్యార్థులు బోర్డు పరీక్షలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతూనే మార్చి, ఏప్రిల్ నెలల స‌మ‌యాన్ని జేఈఈ అడ్వాన్స్ డ్ కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్టుకు కొంత సమయాన్ని నిర్దేశించుకొని టైంటేబుల్ ప్ర‌కారం సిద్ధం కావాలి. మాక్ టెస్ట్‌ల‌నూ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ప్ర‌తిభ‌ను మెరుగుప‌రుచుకుంటూ.. ప్రిపరేషన్ సాగించడంతోపాటు ఎప్పటికప్పుడు అభ్యర్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలి. ఇందుకోసం నమూనా పరీక్షలు రాయాలి. రాసిన తర్వాత సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. అవసరమైన మార్పులను ప్రిపరేషన్ ప్రణాళికలో చేర్చుకోవాలి. జూన్ నెలను జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసమే కేటాయించి క‌ఠిన‌మైన మాక్ టెస్ట్‌లు రాస్తూ విశ్లేష‌ణ చేసుకోవాలి. అదే స‌మ‌యంలో సొంతగా  ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌ను పున‌శ్చ‌ర‌ణ చేయాలి. దేహాలుంటే ఆయా స‌బ్జెక్టుల‌కు సంబంధించిన అధ్యాప‌కుల‌తో చ‌ర్చించాలి. కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే సెషన్స్‌తో టెస్ట్ సిరీస్ రాయ‌డం మంచి ఆలోచన.

ప‌రీక్ష స్వ‌రూపానికి తగినట్లుగా..

జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్ వివిధ రకాల ప్రశ్నల మిశ్రమంగా ఉంటుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఒక‌టి లేదా అంతకంటే ఎక్కువ‌సరైన సమాధానాల‌తో కూడి ఉంటాయి. ఒక‌టి లేదా బహుళ సరైన సమాధానాలతో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్టివ్-టైప్ ప్రశ్నల తర్వాత‌కాంప్రహెన్షన్స్ ఉండవచ్చు. మ్యాట్రిక్స్ మ్యాచ్ రకం ప్రశ్నలకు రెండు నిలువు వరుసలు లేదా మూడు నిలువు వరుసలు సరిపోల్చాల్సి రావచ్చు. ఇలా భిన్న ర‌కాలుగా ప్ర‌శ్న‌లు అడుగుతారు. దీంతో విద్యార్థులు సందిగ్ధంలో ప‌డే అవ‌కాశం ఉంది. చాలా ఆలోచించి నిర్ణ‌యం తీసుకుని స‌మ‌ధానాలు రాయాల్సి ఉంటుంది. ఇక్క‌డ స‌మ‌యపాల‌న చాలా ముఖ్యం.‌ లేదంటే తెలిసి ప్రశ్నలనూ జవాబులు గుర్తించకుండా వదిలేయాల్సి వస్తుంది. 

అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన మెలకువలు

కచ్చితమైన స్టడీ షెడ్యూల్: విద్యార్థులు టైమ్‌టేబుల్‌ను క‌చ్చితంగా పాటించాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడం అంత సులభం కాదు. కానీ కష్టపడి, నిబద్ధతతో ప్రిపేరైతే జీవితంలో ఏదైనా సాధించగవ‌చ్చ‌ని గుర్తించాలి. ప్రతి నిమిషాన్ని విలువగా వాడుకోవాలి. 

మాక్ టెస్ట్ లు: ప్ర‌ధాన ప‌రీక్ష స్వ‌రూపాన్ని విద్యార్థికి ప‌రిచ‌యం చేయ‌డంలో మాక్ టెస్ట్‌లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. విద్యార్థి బలం, బలహీనత‌, వారు ఏ సెక్ష‌న్ల‌లో వెనుక‌బ‌డి ఉన్నారో వీటి ద్వారా ప‌రీక్షించుకోవ‌చ్చు. విద్యార్థుల స‌న్న‌ద్ధ‌త‌ను విశ్లేషించడానికి, వారిలో సరైన పరీక్షా స్వభావాన్ని పెంపొందించడానికి నమూనా పరీక్షలు దోహదం చేస్తాయి. మెరుగుదల కోసం ప్రతి మాక్ టెస్ట్ తర్వాత కచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలి.

తగినంత సమయం కేటాయింపు: ప్ర‌తి విద్యార్థికి రోజులో 24 గంటలు మాత్ర‌మే ఉన్నాయ‌నే విష‌యాన్ని అందరూ త‌ప్ప‌కుండా గుర్తుంచుకోవాలి. చాలా మందికి రోజులో ఎన్ని గంటలు చ‌దివితే ఫ‌లితాన్ని సాధించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న ఉండ‌టం స‌హ‌జం. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఛేదించడానికి ఒక రోజులో 5-6 గంటల తీవ్రమైన అధ్యయనం చాలా అవసరమ‌ని తేలింది. దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ గమనించి ప్ర‌ణాళిక ప్ర‌కారం స‌మ‌యాన్ని కేటాయించుకుని ప్రిపేర్ కావాలి.

వేగంతోపాటు క‌చ్చితత్వం: పరీక్షను పూర్తి చేయడానికి పరిమిత సమయం ఉంటుంది. కేటాయించిన టైమ్ లో అభ్యర్థులు విజయవంతంగా పరీక్షను రాయాలి. స్థిరమైన వేగంతోపాటు క‌చ్చిత‌త్వాన్ని కొనసాగిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే పరీక్షలో రుణాత్మ‌క మార్కులు ఉన్నాయ‌నే విష‌యాన్ని విస్మరించకూడదు. పరిమిత సమయంలో ప్రశ్నలను పరిష్కరించడాన్ని అభ్యసిస్తే కచ్చితత్వం క్రమంగా వస్తుంది. 

ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ పరీక్ష రాయాల‌న్నా మంచి ఆరోగ్యం చాలా ముఖ్యం. రోజులో 6 గంటల సమయాన్ని తప్పకుండా మంచి నిద్రకు కేటాయించాలి. పరీక్షకు నెల ముందు నుంచే శారీర‌క‌, మాన‌సికంగా ఆరోగ్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృఢంగా ఉండే విధంగా శ్రద్ధ వహించాలి. 

Posted Date : 10-03-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌