• facebook
  • whatsapp
  • telegram

సన్నద్ధతకు ఏది సరైన సమయం?

విద్యార్థి కెరియర్‌ దిశనూ, దశనూ నిర్ధారించేవి ప్రవేశపరీక్షలు. కానీ అకడమిక్‌ పరీక్షల్లో అత్యధికంగా స్కోరు చేసేవారిలో కూడా కొందరు ప్రవేశపరీక్షల్లో సరైన ర్యాంకులు తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే పోటీపరీక్షల ప్రత్యేక స్వభావాన్ని గుర్తించకపోవటం, వాటికి తగ్గట్టుగా మారకపోవటం వల్లనే! ఈ ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో కరెక్ట్‌ జవాబును వేగంగా గుర్తించే నేర్పు అవసరం. అది సాధన వల్లనే వస్తుంది. ఇంత ప్రాముఖ్యమున్న ఎంట్రన్స్‌ పరీక్షలకు ‘సన్నద్ధత ప్రారంభించే సరైన సమయం ఏది?’ అనేది విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో తరచూ తలెత్తే సందేహం! ఈ రంగంలో అనుభవజ్ఞులు దీనిపై ఏం సూచిస్తున్నారో... చూద్దాం! 

ఒకప్పుడు విద్యార్థి పదో తరగతిలోకి అడుగుపెట్టగానే ఆపై‘సైన్స్‌ తీసుకోవాలా? ఆర్ట్స్‌ ఎంచుకోవాలా? సైన్స్‌లో మళ్లీ మేథ్సా? బయాలజీనా?’ లాంటి ప్రశ్నలు వెంటాడేవి. కానీ ఇప్పటి విద్యార్థులు భవిష్యత్తుపై వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ నుంచి ప్రవేశపరీక్షలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సివస్తుంది. వాటి ర్యాంకుల ఆధారంగానే అత్యుత్తమ విద్యాసంస్థల్లో, మెచ్చిన కోర్సులో సీటు వచ్చేది. ఈ ప్రవేశపరీక్షల్లో ఎక్కువగా జాతీయస్థాయిలోనే ఉంటున్నాయి. అందుకే పోటీ తీవ్రస్థాయిలో ఉంటోంది. ఈ పోటీని తట్టుకోవటం సవాలుగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో ఎక్కువమంది పోటీపడేది ఇంజినీరింగ్‌, మెడికల్‌ విద్యల ప్రవేశపరీక్షలకే! జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరగనుంది. ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులైతే ఇప్పటికే ఇటు అకడమిక్‌ సిలబస్‌, ప్రవేశపరీక్షలు రెండింటితోటీ కుస్తీ పడుతున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వచ్చే ఏడాది ప్రవేశపరీక్షలను ఎదుర్కొంటారు. విజయానికి సరైన సంసిద్ధత చాలా అవసరం! దీనికి మంచి మెటీరియల్‌, నిరంతర సాధన, మంచి మార్గదర్శకత్వం తోడైతే విజయం వరిస్తుంది.

కోచింగ్‌ తప్పనిసరా!
ప్రవేశపరీక్షలకు సన్నద్ధత ప్రారంభించడం అంటే.. కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించమని కాదు. నిజానికి కష్టపడే స్వభావం, కాన్సెప్టులను అర్థం చేసుకోగల నైపుణ్యం, అంకితభావం ఉన్న విద్యార్థులు కోచింగ్‌తో ప్రమేయం లేకుండానే తయారుకాగలరు. ఒక్కో విద్యార్థి స్థాయి ఒక్కోలా ఉంటుంది. నేర్చుకునే విధానం కూడా వేర్వేరుగా ఉంటుంది. తరగతి గది బోధన, కోచింగ్‌ అంటే విద్యార్థి ఒత్తిడికి గురయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి, ముందు తరగతిలో బోధించే విషయాలను ఎప్పటికప్పుడు చదవడం, జాగ్రత్తగా నేర్చుకోవడంపై దృష్టిపెట్టటమే సరైనది. ఆపై అదనపు సూచనలు/ బోధన అవసరమనిపిస్తే అప్పుడు కోచింగ్‌ సాయం తీసుకోవచ్చు.

ముందుగానే ఎందుకు?
అకడమిక్‌ పరీక్షలు అయ్యేదాకా ప్రవేశపరీక్షల గురించి పట్టించుకోకుండా, చివర్లో హడావుడి పడితే నష్టపోక తప్పదు. అందుకే సన్నద్ధతను ముందుగా ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రవేశపరీక్షలకు కాన్సెప్టులను లోతుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికాంశాలపై పట్టు ఉంటేనే వాటిపై పూర్తి అవగాహన సాధ్యమవుతుంది. ముందస్తుగా సిద్ధమవటం వల్ల ప్రాథమికాంశాలపై పట్టు ఏర్పడుతుంది.
* ప్రవేశపరీక్ష తీరుపై అవగాహన ముందుగానే ఏర్పరుచుకునే వీలుంటుంది.
* మ్యాథ్స్‌, సైన్స్‌ ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవడానికీ, సైంటిఫిక్‌ కాన్సెప్టులను అభివృద్ధిపరచుకోవడానికీ ఈ సన్నద్ధత తోడ్పడుతుంది.
* కఠినమైన విభాగాలను వివిధ రీతుల్లో ప్రయత్నించడానికి వీలుంటుంది.
* సాధనకూ, పునశ్చరణకూ తగిన సమయం ఉంటుంది.
అయితే ఎప్పటినుంచి సన్నద్ధత ప్రారంభించాలన్న విషయంపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా వ్యక్తమవుతోంది. కొందరు పాఠశాల స్థాయి నుంచే ‘ఫౌండేషన్‌’ ఏర్పరచుకోవటం మంచిదని అంటే.. మరికొందరు ఇంటర్‌ మొదటి ఏడాది నుంచి సరిపోతుంది అంటున్నారు.
జాతీయ స్థాయి పోటీలో నిలవాలంటే.. ఆరో తరగతి నుంచే కోచింగ్‌ తీసుకోవాలన్న అభిప్రాయం చాలామంది తల్లిదండ్రుల్లో కలుగుతోంది. దాదాపుగా 5-6 సంవత్సరాల తరువాత రాయబోయే ప్రవేశపరీక్షలకు ఇప్పటినుంచే సిద్ధం చేయడమూ ఒకరకమైన ఒత్తిడిని పెంచడమే. పరీక్ష రాసే తరుణానికి వారు ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంటర్‌, ఇంజినీరింగ్‌ స్థాయుల్లో కొన్ని పాఠ్యాంశాల విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడుతుండటం మనం గమనిస్తుంటాం. స్కూలు స్థాయిలో దానిపై ఆసక్తి కలగక వదిలేయడమో, అర్థం కాకపోవడమో అందుకు కారణం. అంటే.. పై తరగతులకు అవసరమయ్యే ప్రాథమికాంశాలు తొమ్మిది నుంచే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి, ‘తొమ్మిది’ని ఈ ప్రవేశపరీక్షల సన్నద్ధతకు తగిన సమయంగా పరిగణించవచ్చని కొందరి సూచన.
దీనితో ఏకీభవించని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటర్‌కు చేరుకునేసరికి విద్యార్థి పరిణతి స్థాయులు పాఠశాల దశతో పోలిస్తే మెరుగవుతాయి. కాబట్టి, ఇంటర్‌ నుంచి మొదలుపెట్టినా ప్రవేశపరీక్షల్లో విజయం సాధ్యమే. ఇప్పటికే ప్రముఖ సంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులు దీన్ని నిరూపిస్తూనే ఉన్నారు.

బిట్లు కాదు... కాన్సెప్టులు
జేఈఈ, నీట్‌ సిలబస్‌... ఇంటర్మీడియట్‌ సిలబస్‌ దాదాపుగా సమానమే. ప్రశ్నలు అడిగే తీరులోనే సమస్యంతా. ఈ పరీక్షలు విద్యార్థికి సబ్జెక్టుపై ఉన్న లోతైన పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి, మెటీరియల్‌ పైనో, బిట్‌బ్యాంకుల పైనో ఆధారపడితే ఏమాత్రం సరిపోదు. కాన్సెప్టులను అర్థం చేసుకోవటం తప్పనిసరి. ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. ఇదంతా సుదీర్ఘమైన ప్రక్రియ. కాబట్టి దానికి తగ్గ సమయమూ విద్యార్థి కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ప్రవేశపరీక్షల తయారీ మొదలుపెట్టటానికి ఇంటర్‌ మొదటి సంవత్సరం తగిన సమయమని చెబుతారు.
జేఈఈ, నీట్‌ .. దేనికైనా ఇంటర్‌ రెండు సంవత్సరాల్లోని ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ సబ్జెక్టుల సిలబస్‌ నుంచే ప్రశ్నలుంటాయి. మిగతా పరీక్షలకైనా అకడమిక్‌ సబ్జెక్టుల నుంచే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, రాయాలనుకునే ప్రవేశపరీక్షలను నిర్దేశించుకున్నాక విద్యార్థి సంబంధిత సిలబస్‌ సేకరించి పెట్టుకోవాలి. అకడమిక్‌ సిలబస్‌ను చదువుకునేటప్పుడే ప్రవేశపరీక్షల సిలబస్‌నూ దగ్గరపెట్టుకుంటే.. లోతుగా చదవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.

రెండో ఏడాది విద్యార్థుల సంగతి?
రెండో ఏడాది విద్యార్థులైతే..ఇప్పటికే సన్నద్ధతలో మునిగిపోయి ఉంటారు. వీరు కూడా సిలబస్‌ను పక్కన పెట్టుకుని, రెండు విధాలుగా సరిపోయేలా చదవాలి. ఇక్కడ ఎంతసేపు చదివారన్న దానికంటే ఎంతసేపు శ్రద్ధతో చదివారన్నదే ముఖ్యం. కాబట్టి, క్లిష్టమైన ప్రశ్నలను రోజుకు కొన్ని చొప్పున సాధన చేస్తుండాలి. ఈ సమయంలో మొదటి ఏడాది సిలబస్‌కు చోటివ్వకూడదు. దృష్టంతా రెండో ఏడాది సిలబస్‌పైనే ఉండాలి. అకడమిక్‌ పరీక్షలు పూర్తయ్యాకే మొదటి ఏడాది సిలబస్‌ గురించి ఆలోచించటం మేలు.
ఇంటర్‌ తుది పరీక్షలు పూర్తయ్యాక ప్రవేశపరీక్షల సన్నద్ధతవైపు వెళ్దామనుకునేవారూ లేకపోలేదు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరి 2019లో జరగనుంది. విద్యార్థికి మహా అయితే రెండు నెలల సమయం అందుబాటులో ఉంది. ఇప్పటికే సన్నద్ధత మొదలుపెట్టినవారికి మంచి ర్యాంకుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇప్పుడు సన్నద్ధత మొదలుపెట్టిన వారైతే వారితో పోటీ పడగలిగేలా ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది.

మొదటి ఏడాది నుంచే..!
జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీపరీక్షకు పోటీ పడాలంటే నెలల వ్యవధిలో చేసే తయారీ సరిపోదు. మొదటి సంవత్సరంలో చేరినప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాల్సి ఉంటుంది. దీనిలో ఉపాధ్యాయుడు చెప్పేది 20% అయితే, విద్యార్థి చేయాల్సిన సాధన 80%గా ఉంటుంది. అలాంటప్పుడు పరీక్షల ముందు మాత్రమే ప్రిపరేషన్‌ ప్రారంభించడం.. ర్యాంకుకు దూరమవ్వడంతో సమానమే! జేఈఈ సిలబస్‌ ప్రకారం మొదటి సంవత్సరం సిలబస్‌ను ఆ ఏడాదిలోనే పూర్తిచేసుకుంటే, రెండో ఏడాది టాపిక్‌లను ఈ ఏడాదిలో పూర్తిచేసుకుని, అకడమిక్‌ పరీక్షల తరువాతి సమయాన్ని పునశ్చరణకు వినియోగించుకునే వీలుంటుంది. పరీక్షకు రెండు నెలల ముందు ప్రారంభించే సన్నద్ధతతో మొత్తం సిలబస్‌ను పూర్తిచేయడం కష్టసాధ్యమైన పని. చాలామంది చివర్లో కోచింగ్‌ సెంటర్ల దారి పట్టి ఒత్తిడికి గురవుతారు. ఇంటర్‌ పూర్తిచేశాక ప్రవేశపరీక్షలకు సన్నద్ధత మొదలుపెట్టడం అంటే.. మళ్లీ మొదటి నుంచి చదివిన కాన్సెప్టులను చదువుకుంటూ రావాల్సి వస్తుంది. అది కష్టసాధ్యం కూడా! కాబట్టి, ర్యాంకు సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే.. ఇంటర్‌ మొదటి ఏడాది నుంచే విద్యార్థి సాధన ప్రారంభించడం మేలు. - కె. కమలాకర్‌ రావు, మ్యాథ్స్‌ లెక్చరర్‌

సమగ్ర అవగాహన ఉండాలి
ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలకు చదివినట్టు మార్కులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చదివితే ప్రవేశపరీక్షల్లో విజయం సాధించడం కష్టం. ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉండాలి. ప్రతి కాన్సెప్టునూ తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలను జోడించుకుంటూ చదవాలి. తిరిగి ఎప్పటికప్పుడు వీటిని పునశ్చరణ చేసుకుంటుండాలి. అందుకే జాతీయ ప్రవేశపరీక్షలకు సిద్ధమవాలనుకునేవారు స్కూలు స్థాయి నుంచే సన్నద్ధత మొదలుపెడతారు. అయితే ఇంటర్‌ స్థాయిలో విద్యార్థికి తగిన మెచ్యూరిటీ స్థాయులు వచ్చేస్తాయి. ‘తప్పక సాధించాలి’ అనే లక్ష్యం ఏర్పరచుకోగలిగి, కష్టపడితే ఇంటర్‌ మొదటి ఏడాది నుంచి చదివినా మెడిసిన్‌లోకైనా, ఇంజినీరింగ్‌లోకైనా విద్యార్థి సులువుగా ప్రవేశించొచ్చు. అలాగే ప్రశ్నించుకుంటూ చదవడాన్ని అలవాటు చేసుకోగలగాలి. అకడమిక్‌ పరీక్షలకు సిద్ధమవుతూ రోజుకో గంట సమయాన్ని ప్రవేశపరీక్షల కోసం ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. - డా. ఇ. శ్రీదేవి, బోటనీ లెక్చరర్‌

వీటిని గమనించాలి
* సరైన మెటీరియల్‌ను ఎంచుకోవాలి. సగం గెలుపు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవడం మంచిది.
* పరీక్షకు సంబంధించి అధికారికంగా విడుదల చేసిన సిలబస్‌ను సేకరించి పెట్టుకోవాలి. దానికి అనుగుణంగా సన్నద్ధత ప్రారంభించాలి.
* సన్నద్ధతకు సంబంధించి సరైన టైం టేబుల్‌ ఏర్పాటు చేసుకోవాలి.
* ముఖ్యమైన కాన్సెప్టులపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటిపై పట్టు సాధించాలి.
* బాగా వచ్చిన సబ్జెక్టులను పునశ్చరణ చేస్తూనే అంతగా పట్టులేనివాటినీ విస్మరించకుండా అధ్యయనం చేయాలి.
* ప్రతి చాప్టర్‌లోని ముఖ్యమైన ఫార్ములాలను జాబితాగా రాసుకోవాలి.
* మాదిరి ప్రశ్నపత్రాలు, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాల ద్వారా తరచూ అడుగుతున్న అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌