• facebook
  • whatsapp
  • telegram

మొద‌టి పట్టు హిట్టు కొట్టు!

ఈ ప‌‌రీక్ష రెండు విడ‌త‌ల్లో ఉంటుంది. తొలివిడత ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) నిర్వహిస్తుంది. గతంలో ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాల్లో ఉండేది. ప్ర‌స్తుతం పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది. మొదటి పట్టే గట్టిగా పట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. గతంలో మాదిరిగా పరీక్షలో గరిష్ఠ మార్కులు సాధిస్తే సరిపోదు. సబ్జెక్టులవారీగా పర్సంటైల్‌ను లెక్కగట్టి ర్యాంకులు నిర్ణయిస్తారు. అంటే సబ్జెక్టుల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ప్రిపరేషన్‌ విధానాన్ని మార్చుకోవాలి. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలి. జాతీయ విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐఐటీ ఇంజినీరింగ్‌ ప్రవేశానికి జరిగే దేశవ్యాప్త పరీక్ష జేఈఈ మెయిన్‌.

మ్యాథ్స్‌: ఏం చదవకూడదో తెలియాలి
జేఈఈ మెయిన్‌లో మ్యాథ్స్‌ది కీలకపాత్ర. ఇదంతా కాలిక్యులేషన్‌ ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ఇంటర్‌బోర్డు సిలబస్‌ జేఈఈ మెయిన్‌ పరీక్షకు ఉన్నా, అందులో ఏయే అధ్యాయాలను చదవాలో, వేటిని చదవకూడదో స్పష్టత ఉండాలి.
కాలిక్యులస్‌: జేఈఈ మెయిన్‌లో దీని నుంచి సుమారుగా 30 శాతానికి పైగా ప్రశ్నలు రావచ్చు. ఎక్కువ శాతం ప్రశ్నలు చాలావరకు నేరుగా, స్టాండర్డ్‌ ఫార్ములా బేస్‌డ్‌గా ఇస్తున్నారు. అయితే ఒకటి, రెండు అప్లికేషన్‌ ఆధారిత ప్రశ్నలు కూడా వచ్చే వీలుంది. కొద్దిగా ట్విస్ట్‌ చేసి అడిగే ప్రశ్నలు మాత్రం మాగ్జిమా, మినిమా, డెఫినిట్‌ ఇంటిగ్రేషన్‌, ఏరియాస్‌ వంటి అధ్యాయాల నుంచి రావడానికి ఆస్కారం ఉంది.
ఆల్జీబ్రా: దీనిలో సుమారుగా 35 శాతం ప్రశ్నలు వస్తాయి. ప్రాబబిలిటీ, కాంప్లెక్స్‌ నంబర్స్‌ వంటి అధ్యాయాల నుంచి ఒక మాదిరి ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది. ఇందులోని బేసిక్‌ అంశాలపై పట్టు సాధించడం అవసరం. మాట్రిసెస్‌, డిటర్మినెంట్స్‌పై చాలా సులువైన ప్రశ్నలు వచ్చేటప్పటికీ లీనియర్‌ ఈక్వేషన్స్‌లో అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ ప్రశ్నలు రావచ్చు. అలాగే క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, పర్మ్యూటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌పై వచ్చే ప్రశ్నలను ఊహించొచ్చు. ప్రోగ్రెషన్స్‌ నుంచి అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ.
త్రికోణమితి (ట్రిగనామెట్రీ), వెక్టార్స్‌, 3డి: వీటినుంచి 25% ప్రశ్నలు రావొచ్చు. అందులో ముఖ్యంగా హైట్స్‌, డిస్టెన్స్‌, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ట్రయాంగిల్స్‌, ట్రిగనామెట్రిక్‌ ఈక్వేషన్స్‌, ఇన్‌వర్స్‌ ట్రిగనామెట్రీ అంశాల్లో ఫార్ములాలపై పట్టు, తత్సంబంధిత సమస్యపై అవగాహన పెంచుకోవడం మంచిది. వెక్టార్స్‌, 3డి రెండింటికీ అనుసంధానం చేయగలిగిన ప్రశ్నలపై ఎక్కువ దృష్టి సారించాలి.
కోఆర్డినేట్‌ జామెట్రీ: దీని నుంచి మిగతా శాతం ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా టాంజెంట్‌, నార్మల్స్‌ అప్లికేషన్స్‌ అన్ని అంశాలపై, స్టాండర్డ్‌ ఫార్ములాలపై ఎక్కువ దృష్టి సారించాలి. కానిక్‌ సెక్షన్ల నుంచి కనీసం 2 ప్రశ్నలుంటాయి. కాబట్టి ప్రతి అంశాన్నీ చూసుకోవాలి.

ముఖ్యమైన అధ్యాయాలు
గత ఏడాది జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్రశ్నపత్రాలు, అందులోని ప్రశ్నల సరళిని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ప్రశ్నలు వచ్చే ఆస్కారమున్న అధ్యాయాలు..
* బైనామియల్‌ థీరమ్‌
* మ్యాట్రిసెస్‌, డిటర్మినెంట్స్‌, లీనియర్‌ ఈక్వేషన్స్‌
* క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌
* సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌
* సెట్స్‌, రిలేషన్స్‌
* సర్కిల్స్‌
* కానిక్‌ సెక్షన్స్‌
* త్రీ డైమెన్షియల్‌ జామెట్రీ
* లిమిట్స్‌, కంటిన్యుటీ, డిఫరెన్షియబిలిటీ
* మాగ్జిమా, మినిమా, మొనోటానిసిటీ, మీన్‌ వాల్యూ థీరమ్స్‌
* ఇన్‌డెఫినిట్‌, డెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌
* ఏరియాస్‌, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌
* ట్రిగనామెట్రిక్‌ ఈక్వేషన్స్‌
* హైట్స్‌, డిస్టెన్స్‌
* పర్మ్యూటేషన్స్‌, కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ
ఇందులో అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డు రెండో సంవత్సరంలోని అధ్యాయాలే ఉన్నాయి. కాబట్టి, ఇంటర్‌ రెండో ఏడాదిలోని అకాడమీ పాఠ్యపుస్తకాలపై గట్టి పట్టు సాధిస్తే చాలు మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ అధ్యాయాలపై సుమారు 120 మార్కులకుపైగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మార్కులతో మ్యాథ్స్‌లో మంచి పర్సంటైల్‌ వస్తుంది. అది మంచి ర్యాంకును పొందడానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.

ఫిజిక్స్‌: అన్నిటికీ ప్రాధాన్యం
ఫిజిక్స్‌లో అనువర్తన ప్రధానంగా చదవాల్సినవాటిని కంఠస్థం చేసి గట్టెక్కాలనుకుంటే అది సాహసమే. ముఖ్యంగా జేఈఈకి విరుద్ధమైన పద్ధతి. అనువైన ప్రణాళికతోనే మంచి మార్కులు సాధించడం సాధ్యమవుతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా భౌతిక శాస్త్రంలో 44% తేలిక, 33% మధ్యస్థంగా, 23% కఠిన ప్రశ్నలు ఉన్నాయి. ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే అన్ని చాప్టర్లకూ ప్రాధాన్యమివ్వాలి. కానీ తక్కువ సమయంలో ఉత్తమ ఫలితం సాధించడానికి ముఖ్యమైన అధ్యాయాలపై పట్టు తప్పనిసరి.
* అప్లికేషన్స్‌, వేవ్స్‌లో డామ్డ్‌, ఫోర్స్‌డ్‌ వైబ్రేషన్స్‌, రెజనెన్స్‌ వంటి అంశాలను వాటి సంబంధిత ఫలితాలు, ఫార్ములాలను గుర్తుంచుకోవడం శ్రేయస్కరం.
* ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఉమ్మడిగా ఉన్న మోడర్న్‌ ఫిజిక్స్‌ చాప్టర్లు, ముఖ్యంగా అటామిక్‌ ఫిజిక్స్‌, రేడియో యాక్టివిటీ, సెమీ కండక్టర్‌ డివైజర్స్‌, లాజిక్‌ గేట్స్‌ వంటి వాటిని తక్కువ సమయంలోనే సులువుగా అధ్యయనం చేయవచ్చు.
* ప్రాక్టికల్‌ ఫిజిక్స్‌లో దాదాపుగా 10 నుంచి 20% ప్రశ్నలు ప్రాక్టికల్‌ అంశాల ఆధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఎర్రర్‌ అనాలిసిస్‌, వెర్నియర్‌ కాలిపర్స్‌, స్క్రూగేజ్‌, మల్టీమీటర్‌ సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి.
* కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రో మాగ్నటిక్‌ వేవ్స్‌, ఆప్టిక్స్‌లో డైఫ్రాక్షన్‌, ఇంటర్‌ఫరెన్స్‌ వంటి అంశాలపై సంక్లిష్ట ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం అవసరం.
* కేవలం ప్రాథమిక భావనలపై పట్టు మాత్రమే కాకుండా సంబంధిత ప్రాబ్లమ్స్‌నూ సాధన చేస్తేనే ఉపయోగకరం.

ముఖ్యమైన అధ్యాయాలు
* కైనమాటిక్స్‌
* లాస్‌ ఆఫ్‌ మోషన్‌
* వర్క్‌, పవర్‌, ఎనర్జీ
* రొటేషనల్‌ మోషన్‌
* థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మ్యాటర్‌
* థర్మోడైనమిక్స్‌
* ఆప్టిక్స్‌
* ఎలక్ట్రోస్టాటిక్స్‌
‌* కెపాసిటెన్స్‌
* కరెంట్‌ ఎలక్ట్రిసిటీ
‌* ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఇండక్షన్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ కరెంట్‌
* అటామిక్‌ ఫిజిక్స్‌
ఇంటర్‌ రెండో సంవత్సర సిలబస్‌ నుంచే ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. సాధారణంగా వచ్చే రెండు నెలల కాలవ్యవధిలో ప్రతి విద్యార్థీ ఇంటర్‌ సిలబస్‌పై కచ్చితంగా దృష్టిపెడతారు. కాబట్టి దానిని కొంతమేరకు ఈ ఆబ్జెక్టివ్‌ విధానంలోకి మార్చుకోగలిగితే ఫిజిక్స్‌లో మంచి మార్కులతోపాటు మంచి పర్సంటైల్‌ను కూడా సాధించవచ్చు.

కెమిస్ట్రీ: ఒకటే తీరు పనికి రాదు
ఫిజికల్‌, ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ విభాగాలకు ఒకేరకమైన సన్నద్ధత పాటించడం సరికాదు. స్వల్ప మార్పు ఉండాలి. ప్రతి ప్రశ్నకూ సగటున 2 నిమిషాలు ఉంటుంది. దాదాపుగా సగం ప్రశ్నలు తేలికగా ఉండొచ్చు. కాబట్టి, చాలావరకు కెమిస్ట్రీ పరీక్షకు కేటాయించే సమయం విషయంలో సంక్లిష్టత ఉండదు.
వెయిటేజీ కొంచెం తక్కువని ఇనార్గానిక్‌ కెమిస్ట్రీని అశ్రద్ధ చేయొద్దు. ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలపై భయం ఉన్నవారు ఎక్కువ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీపై దృష్టిసారిస్తే మంచి ఫలితం పొందొచ్చు. దీనికి ఇప్పుడున్న వ్యవధిలో ఒక గంట భావనలను మననం చేసుకోవడానికీ, తద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికీ కేటాయించుకోవాలి.
ఫిజికల్‌ కెమిస్ట్రీ దాదాపుగా ఫిజిక్స్‌ను పోలి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైన సూత్రాలు, ముఖ్యమైన ఫార్ములాలతో కూడిన ప్రత్యేకమైన నోట్స్‌ తయారు చేసుకుని సంబంధిత న్యూమరికల్స్‌ను సాధన చేయడం మంచిది. ఇందులో స్టైకోమెట్రీ గణనాలు, అయానిక్‌ సమతాస్థితి అంశాలపై కఠినమైన అనువర్తనాలు ఉంటాయి. ప్రయోగశాల విధానాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటిపై దృష్టిసారించడం మరచిపోవద్దు.
కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించి వారంలో కనీసం 4 రోజులు, రోజుకు గంట చొప్పున మననం చేసుకోవాల్సిన అంశాలు..
* నేమ్‌డ్‌ రియాక్షన్స్‌
* సంకలన చర్యలు-వాటి రకాలు
* ప్రతిక్షేపణ చర్యలు, రకాలు
* చర్యా మాధ్యమికాలు, వాటి రకాలు. వీటిని ఉదాహరణలతో సాధన చేయాలి.
చైన్డ్‌ రియాక్షన్‌ ఇచ్చినపుడు వాటిని విశ్లేషించి, పదార్థాలు కనుక్కోవడం, చర్యలు రాయగలగడం వంటి అంశాలపై మరింత అవగాహన పెంచుకోవడం మంచిది.

ముఖ్యమైన అధ్యాయాలు
* అయానిక్‌ ఈక్వలిబ్రియమ్‌
* కాలిగేటివ్‌ ప్రాపర్టీస్‌
* ఎలక్ట్రో కెమిస్ట్రీ ‌
* కెమికల్‌ బాండింగ్‌
* పి-బ్లాక్‌ ఎలిమెంట్స్‌
* కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌
* జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ
‌* హైడ్రో కార్బన్స్‌
* ఫినాల్స్‌
‌* బయోమాలిక్యూల్స్‌
* కెమికల్‌ ఈక్విలిబ్రియమ్‌ ‌
* థర్మోడైనమిక్స్‌
‌* కెమికల్‌ కైనెటిక్స్‌ ‌
* ప్రాక్టికల్‌ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ

ఆన్‌లైన్‌ సాధన ముఖ్యం
* మెయిన్స్‌ పరీక్షకు ముందు, రాబోయే కొద్దిరోజుల్లో కొత్తవాటిని నేర్చుకోవాలనే ప్రయత్నం వద్దు.
* వారంలో కనీసం రెండు, మూడు ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. దానివల్ల కంప్యూటర్‌ వినియోగంలో మెలకువలు, సమయపాలనపై అవగాహన వస్తుంది.
* విద్యార్థి తనకు వచ్చే అనుమానాలు, జవాబులు రాబట్టే విధానంలో జరిగే తప్పులను ఒకచోట పొందుపరచుకుని సబ్జెక్టులవారీగా అధ్యాపకులతో సందేహ నివృత్తి చేసుకోవాలి.
* ఎంత ఎక్కువసేపు సన్నద్ధమయ్యారు అనేదానికంటే ఎంత కచ్చితంగా సన్నద్ధ మయ్యారనేదానికే ప్రాధాన్యమివ్వాలి.

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌