• facebook
  • whatsapp
  • telegram

నీట్‌గా పట్టు.. సీటు కొట్టు!

 

‣ తుది సన్నద్ధతకు సూత్రాలు

‘నీట్‌’ రాయడానికి కొద్ది రోజుల వ్యవధే ఉంది. దేశంలో వైద్యవిద్య అభ్యసించడానికి ఈ స్కోరే ప్రామాణికం కావడంతో పరీక్షకు ప్రాధాన్యం పెరిగింది. మంచి ర్యాంకు లక్ష్యంగా అందరూ కృషి చేస్తున్నారు. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని, తెలివిగా అడుగులేసినవారే కోరుకున్నరీతిలో పరీక్షను ముగించి, మేటి సంస్థలో మెడికల్‌ సీటు సాధించగలరు. ఇప్పుడున్న తక్కువ వ్యవధిలో పాటించాల్సిన మెలకువలు తెలుసుకుందాం!

జాతీయ స్థాయి మెడికల్‌ పరీక్షలలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మంచి ప్రగతి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్‌తో సహా, అన్ని విద్యాసంస్థలకూ నీట్‌ స్కోర్‌ తప్పనిసరి కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అలాగే కొవిడ్‌ కారణంగా ఏర్పడిన విరామాన్ని ఎక్కువ శాతం విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. పోటీ అధికంగా ఉండబోతోంది. అందువల్ల ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వకుండా పరీక్షకు సన్నద్ధమవ్వాలి.

కొన్నిటికే ప్రాధాన్యం ఇవ్వొద్దు
‣ సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన సమాచారం, వివరాలు, పట్టికలు, బొమ్మలు లేదా షార్ట్‌ కట్‌ పద్ధతుల ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో సమయం ఆదా అవుతుంది. ఆత్మ విశ్వాసమూ పెరుగుతుంది. 
‣ సబ్జెక్టు చదువుతున్నప్పుడే దానిలోని ప్రతి అధ్యాయానికీ సంబంధించిన వివిధ కాన్సెప్టులు, అంశాలకు సంబంధించిన షార్ట్‌ నోట్సు తయారుచేసుకోవాలి. ఈ షార్ట్‌ నోట్సు పునశ్చరణకు ఉపయోగించుకుంటే, అది నీట్‌ పరీక్షకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 
‣ వ్యవధి మరీ ఎక్కువ లేదు కనుక సబ్జెక్టులను చదవడానికి కేటాయించే బదులుగా, వాటిలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలను సాధన చేయడానికి సమయం వినియోగించుకోవాలి. 
‣ ప్రతి సబ్జెక్టులోనూ బలహీనంగా ఉన్న విభాగాలు, అంశాలు గుర్తించి, వాటిలో పట్టు సాధించే దిశగా సమయాన్ని కేటాయించాలి. 
‣ చాలామంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జెక్టులకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ ఎక్కువ సమయం ఆ ప్రిపరేషన్‌ కోసమే వెచ్చిస్తుంటారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అన్ని సబ్జెక్టులనూ శక్తి మేరకు సమ ప్రాధాన్యమిస్తూ సన్నద్ధమవడం మంచిది. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్లోనూ ఇచ్చే ప్రశ్నలు తేలికగా ఉండకపోవచ్చు అలాగే కష్టంగా ఉండకపోవచ్చు. ప్రశ్నపత్రం ఏ స్థాయిలో ఉన్నా సమ ప్రాధాన్యమిస్తూ సన్నద్ధమైతే, మార్కుల సంఖ్య పెరిగి, మెరుగైన ర్యాంకు పొందవచ్చు. 
‣ సబ్జెక్టుల్లో తేలికైన అధ్యాయాలన్నీ ముందుగా చదివేసి క్లిష్టమైనవాటిని చివరలో చదవడానికి ప్రయత్నించకూడదు. దీనికి బదులుగా ఒక సబ్జెక్టులో తేలిక అధ్యాయాన్ని, మరొక సబ్జెక్టులో కష్టతరమైన అధ్యాయాన్ని ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల ఒత్తిడి లేకుండా పరీక్షకు తయారుకావచ్చు. 
‣ వీలైనన్ని మాక్‌ టెస్టులు సాధ]న చేయాలి. ఎన్‌టీఏ వారు నేషనల్‌ టెస్టు అభ్యాస్‌లో ఉంచిన అన్ని మాక్‌ టెస్టులనూ ఒకసారి చూసుకోవడం మరవవద్దు. వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఏయే సబ్జెక్టుల్లో ఏయే అంశాల్లో వ్యక్తిగత పొరపాట్ల ద్వారా మార్కులు తగ్గాయో గమనించాలి; వాటిపై ఈ తక్కువ సమయంలో దృష్టి పెట్టాలి. 
‣ ప్రతి ప్రశ్నకూ ఇచ్చిన 4 సమాధానాలనూ పూర్తిగా చదివిన తర్వాతే, సరైన సమాధానాన్ని గుర్తించే నేర్పు అవసరం. దీన్ని  ప్రాక్టీస్‌ టెస్టుల ద్వారా సాధించాలి. 
‣ ప్రాక్టీస్‌ టెస్టులు రాస్తున్నప్పుడే ఎంత సమయం పడుతుందో వాచ్‌తో అంచనా వేస్తూ తగిన వేగం, కచ్చితత్వాలను పెంపొందించుకోవాలి. సమయపాలనపై పట్టు సాధించాలి. 
‣ పాత ప్రశ్నపత్రాలు సాధన చేయడం మరవవద్దు.

ర్యాంకు నిర్ణయించే పద్ధతి
నీట్‌లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్టు రూపొందిస్తారు. ఆ లిస్ట్‌ ఆధారంగా అభ్యర్థికి రెండు రకాల ర్యాంకులు ఇస్తారు. ఇందులో జాతీయ స్థాయి ర్యాంకుతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకు కూడా ఉంటుంది. మొదటి ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి సీట్లు భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి ర్యాంకు ఆధారంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న 85 శాతం ప్రాంతీయ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ర్యాంకులతోపాటు రిజర్వేషన్‌ అర్హత కలిగిన అభ్యర్థులకు కేటగిరీ ర్యాంకులు కూడా ఇస్తారు. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా అర్హత పరీక్షలో తగిన మార్కులు కలిగి ఉండాలి. నీట్‌ను దేశవ్యాప్తంగా ఒక్కరోజే నిర్వహిస్తున్నందున అభ్యర్థులు అందరూ ఒకే ప్రశ్నపత్రాన్ని ఆన్సర్‌ చేస్తారు.


నెగిటివ్‌ సంగతి మరవొద్దు
‣ నీట్‌లో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయని మర్చిపోవద్దు. దానికి అనుగుణంగా సన్నద్ధత వ్యూహం, పరీక్ష రాసేటప్పుడు మానసిక స్థితిని మార్చుకోవాలి.
‣ ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోతే లాటరీ విధానంలో ఆన్సర్‌ గుర్తించకూడదు. తప్పయితే...రుణాత్మక మార్కుల వల్ల మార్కులు పోగొట్టుకోవాల్సివస్తుంది.
‣ మార్కుల పరంగా విభజనను గమనించి తుది పరీక్షల్లో సమయాన్ని అదేరకంగా విభజిస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే బయాలజీ తేలికైన సబ్జెక్టు కాబట్టి తుది పరీక్షల్లో సగం సమయాన్ని కాకుండా, వీలైనంతవరకు అంతకంటే తక్కువ సమయాన్ని వినియోగించుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అనుకూలం. ఈ రెండు సబ్జెక్టుల్లో  లెక్కలుంటాయి కాబట్టి కొంత అధిక సమయం అవసరం.
‣ సబ్జెక్టును ఎంచుకునే క్రమం ఎలా ఉన్నా తుది పరీక్షలో బయాలజీతో ఆరంభిస్తే మేలు. సబ్జెక్టులవారీగా ప్రశ్నలు సాధించి, సమాధానాలు గుర్తించడం మంచిదే అయినా ‘డ్రాప్‌ అండ్‌ డ్రాగ్‌’ పద్ధతి ఉత్తమం. ఈ పద్ధతిలో బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, కష్టమైనవి, అననుకూలంగా ఉన్నవి, ఎక్కువ సమయం అవసరమైనవి...వీటిని రెండో రౌండ్‌లో ఆన్సర్‌ చేయడం మంచిది. లేదంటే సమయం సరిపోదు.
‣ ప్రశ్నకు ఇచ్చిన 4 ఆప్షన్లూ జాగ్రత్తగా చదివిన తర్వాతే సరైన సమాధానాన్ని గుర్తించాలి.


 

పరీక్ష రోజు... ముందు రోజు
‣ పరీక్ష ముందురోజు రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం మంచిది. మరుసటి రోజు పరీక్ష బాగా రాయాలని ఊహించుకుంటూ నిద్రపోవటం మంచిది.
‣ విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌ కార్డులో ఉన్న కొవిడ్‌-19 సెల్ఫ్‌ డిక్లరేషన్‌ (అండర్‌ టేకింగ్‌)లో వివరాలు నమోదు చేయాలి. దానిపై ఫొటో అతికించి, సంతకంతోపాటు బొటనవేలి ముద్ర కూడా వేయాలి. 
‣ గత 14 రోజులుగా తనకు జ్వరం, గొంతు సమస్యలు, దగ్గు, శ్వాస సమస్యలు, శరీర నొప్పులు లేవని ఆ డిక్లరేషన్‌లో పేర్కొనాలి. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులతో కాంటాక్ట్‌లో ఉన్నారా? లేదా?.. వివరాలు నమోదుచేయాలి.
‣ నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యమైతే అనుమతించరు. గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలి.
‣ అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్‌ ఇస్తారు. అప్పటి వరకు ధరించిన మాస్క్‌ తీసేసి, కొత్తది వేసుకోవాలి.
‣ శరీర ఉష్ణోగ్రతలను థర్మో గన్స్‌తో పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి ముందే మీ సీటింగ్‌ ఏరియాను శుభ్రపరుస్తారు.
‣ పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్‌ చెప్పేవరకూ సీటు నుంచి లేవకూడదు. 
‣ అడ్మిట్‌ కార్డుతోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి.
‣ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా, వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. 
‣ రఫ్‌వర్క్‌ కోసం ప్రతి సీటు వద్దా ఎ4 సైజు తెల్ల కాగితాలు అందుబాటులో ఉంటాయి. ఇంకా అదనంగా కావాలన్నా ఇస్తారు.  
‣ ఈ పరీక్ష మీ కెరియర్‌కు ఎంతో ముఖ్యం. పరీక్షకు నిర్దేశించిన మూడు గంటల సమయాన్నీ పూర్తిగా, చక్కగా ఉపయోగించుకోండి.
‣ అభ్యర్థులు తమ పేరు, రోల్‌ నంబర్‌ వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లే ముందు నిర్ణీత డ్రాప్‌ బాక్సులో వాటిని వేయాలి. 
‣ సరిగా నింపిన అడ్మిట్‌ కార్డుని కూడా డ్రాప్‌ బాక్సులో వేయాలి.
‣ ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.

- డా. ఎంఎస్‌వీ చందన

 

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌