• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌-2021 ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఎలా ఉంది?

మొద‌టి రెండు విడుత‌ల ప‌రీక్ష‌ల ప‌రిశీల‌న‌

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రెండు ప‌రీక్ష‌ల స‌న్న‌ద్ధ‌త‌కు సూచ‌న‌లు

వంద మీటర్ల స్ప్రింట్‌లో గెలవాలంటే అత్యంత వేగం అవసరం. కానీ మారథాన్‌లో  గెలవడానికి వేగం సరిపోదు. దృఢ సంకల్పం, సామర్థ్యం కీలకమవుతాయి. జేఈఈ మెయిన్‌ను స్ప్రింట్, మారథాన్‌ల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. అందులో విజయం సాధించాలంటే.. విద్యాపరంగా శ్రేష్ఠతతోపాటు సంకల్పం, కృషి, ఆత్మవిశ్వాసం అవసరం. పోటీ లక్షల్లో ఉంటుందని భయపడకూడదు. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా సన్నద్ధమవ్వాలనేదే లక్ష్యం కావాలి.  మొదటి రెండు విడతల పరీక్షలను బట్టి ప్రాథమిక అంశాలపైనా, ఫార్ములా ఆధారిత ప్రశ్నలపైనా పట్టు సాధించాలి!

చూస్తుండగానే జేఈఈ మెయిన్‌-2021 మొదటి రెండు విడతల పరీక్షలూ పూర్తయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 16 నుంచి 18 వరకు నిర్వహించిన రెండు విడతల నుంచి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఎందుకంటే చివరి రెండు అవకాశాలుగా.. ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు మూడో విడత, మే 24 నుంచి 28 వరకు నాలుగో విడత జేఈఈ మెయిన్స్‌ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. 

కరోనా నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని జేఈఈ మెయిన్‌ 2021ని ఎన్‌టీఏ 4 సార్లు నిర్వహిస్తోంది. తొలిసారి ఈ పరీక్షలో చాయిస్‌ ఇవ్వడం అనుకూలాంశం. కొన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ జేఈఈ మెయిన్‌ పరీక్షను గత రెండు సెషన్లలో కలిపి 6 లక్షల నుంచి 6.2 లక్షల మందే రాశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువనే చెప్పాలి. 

ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పరీక్ష 4 విడతలకూ కలిపి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది వివరాలు నమోదు చేసుకున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. మార్చి సెషన్‌లో రాసినవారిలో సుమారు 90 శాతం మంది ఫిబ్రవరిలో రాసినవారే! ఏప్రిల్, మేలో జరిగే రెండు విడతల్లో పరీక్ష రాయబోయే విద్యార్థులు గతంలో జరిగిన రెండు విడతల నుంచి తెలుసుకోవాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 

విద్యార్థులు 3 అంశాలపై దృష్టి సారించాలి. అవి...

1. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్, పబ్లిక్‌ పరీక్షలు 

2. ఫిబ్రవరి, మార్చిలో అడిగిన జేఈఈ ప్రశ్నల స్థాయి 

3. సమయ పాలన

ఈ పట్టికను గమనిస్తే జనరల్‌ విద్యార్థులు సుమారు 90 పర్సంటైల్‌ స్కోరు సాధిస్తేనే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హులవుతారు. 

కనీసం 98 పర్సంటైల్‌ సాధిస్తే ఆల్‌ ఇండియా 20 వేలలోపు ర్యాంకు వస్తుంది. దీంతో మేటి ఎన్‌ఐటీలో సీటు దక్కుతుంది.

98 పర్సంటైల్‌ స్కోరు సాధించడానికి ప్రశ్నపత్రం స్థాయి ఎలా ఉన్నప్పటికీ 180 మార్కులపైన తెచ్చుకోవాలి. అంటే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 60 మార్కులు. ఇందుకోసం సబ్జెక్టులో వచ్చే 30 ప్రశ్నల్లో కనీసం 15 ప్రశ్నలను జాగ్రత్తగా ఎంచుకుని తప్పులు లేకుండా సమాధానం రాయాలి. 

గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా రాబోయే రెండు సెషన్ల పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. 

చివరి 15 రోజుల్లో...

ఇక్కడ చెప్పిన ప్రణాళిక ప్రకారం చదివినప్పటికీ ఇంకా 15 రోజుల కాలం మిగిలి ఉంటుంది. దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలంటే...

ప్రతి సబ్జెక్టులోనూ ముఖ్య ఫార్ములాలను షార్ట్‌ నోట్సుగా తయారుచేసుకుని వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. 

ఫిబ్రవరి, మార్చిల్లో జరిగిన పరీక్షల్లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో ఫార్ములా బేస్డ్‌ ప్రశ్నలు అడిగారు కాబట్టి అన్ని ఫార్ములాలపైనా పట్టు సాధించాలి. 

అకర్బన రసాయనశాస్త్రంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని ప్రతి వాక్యాన్నీ ప్రశ్నగా ఊహించుకుని సాధన చేయాలి. 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని స్టాండర్డ్‌ డేటా ఇన్ఫర్మేషన్‌ టేబుళ్లను సాధన చేయాలి. 

కర్బన రసాయనశాస్త్రంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో అన్ని నేమ్డ్‌ రియాక్షన్లు ప్రాక్టీస్‌ చేయడం మర్చిపోవద్దు.

జేఈఈ మెయిన్‌ 2020 జనవరి, సెప్టెంబరుల్లో నిర్వహించిన మొత్తం 20 ప్రశ్నపత్రాలు, జేఈఈ మెయిన్‌ 2021 ఫిబ్రవరి, మార్చిల్లో నిర్వహించిన 12 ప్రశ్నపత్రాలు సాధన చేయడం మర్చిపోవద్దు.

40 ఏళ్ల ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాల్లోని సరళాత్మక ప్రశ్నలన్నీ సాధన చేయాలి. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చిల్లో నిర్వహించిన పరీక్షల్లో పాత జేఈఈ ప్రశ్నల సంఖ్య అధికంగానే ఉందని చెప్పవచ్చు.

రోజు విడిచి రోజు లేదా ప్రతిరోజూ ఒక మాక్‌ టెస్టు రాయాలి. సమయపాలనపై పట్టు సాధించాలి.

కాలాన్ని వృథా చేయని సరళాత్మక ప్రశ్నలు ఎన్నుకుని వాటికి తప్పులు లేకుండా జవాబులు గుర్తించడం చాలా ముఖ్యం.

రాబోయే 30 రోజుల్లో...

పరీక్ష జరిగే తేదీలు, ఉన్న అడ్డంకులు అన్నీ పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉన్న రోజులు, చదవాల్సిన సిలబస్‌కు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎందుకంటే ఏపీలో మే 5 నుంచి 18 వరకు, తెలంగాణలో మే 1 నుంచి 13 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే జేఈఈ మెయిన్‌ మూడో దశ ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు, నాలుగో ఫేజ్‌ మే 24 నుంచి 28 వరకు ఉంటుంది. 

ఈ తేదీలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు జేఈఈ సన్నద్ధతకు 30 రోజుల సమయమే ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ప్రధాన సబ్జెక్టులైన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను ఈ 30 రోజుల్లో ఎలా సన్నద్ధం కావచ్చో కింది పట్టికను చూడవచ్చు. అయితే దీన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు మార్పులు చేసుకుని తమ పరిస్థితులకు అనువైన ప్రణాళిక రూపొందించుకోవచ్చు. 

పరీక్ష తయారీకి రోజుల సంఖ్య: 30

మ్యాథ్స్‌లో రివిజన్‌ చేసుకోవాల్సిన అంశాలు: 16

ఫిజిక్స్‌లో రివిజన్‌ చేసుకోవాల్సిన అంశాలు: 21

కెమిస్ట్రీలో రివిజన్‌ చేసుకోవాల్సిన అంశాలు: 28

మొత్తం అంశాలు: 65

అంశాల సంఖ్య, పరీక్షకు సిద్ధం కావాల్సిన రోజుల సంఖ్య కంటే ఎక్కువ. అందువల్ల పరీక్ష ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిలబస్‌ సరైన విభజన అవసరం. 

మెరుగ్గా మ్యాథ్స్‌

మ్యాథ్స్‌లో 16 అంశాల్లో రోజుకు కనీసం ఒక అంశాన్ని సన్నద్ధం కావాలి. ఇందుకోసం కనీసం 3 గంటలు కేటాయించుకోవాలి. 

రివిజన్‌ కోసం ముఖ్యాంశాలు: మ్యాథమేటికల్‌ రీజనింగ్, సెట్స్, రిలేషన్స్‌మ్యాట్రిసెస్‌ బైనామియల్‌ థీరమ్‌ క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ ప్రోగ్రెషన్స్‌ వెక్టార్స్‌ ఫంక్షన్స్‌ మోనోటోనిసిటీ ఇండెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌ డెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌ ఏరియా అండర్‌ కర్వ్‌ 3డీ-ప్లేన్స్, లైన్స్‌ లిమిట్స్‌ కంటిన్యుటీ డిఫరెన్షియేషన్‌ ప్రోబబిలిటీ

పక్కాగా ఫిజిక్స్‌

ఈ సబ్జెక్టులో సన్నద్ధం కావాల్సిన ముఖ్యాంశాల సంఖ్య 21. అందువల్ల కనీసం రోజుకి రెండు చొప్పున చదవాలి. అందుకోసం కనీసం 3 గంటల సమయం కేటాయించుకోవాలి. 

రివిజన్‌ కోసం ముఖ్యాంశాలు: కైనమాటిక్స్‌ ఎన్‌ఎల్‌ఎం వర్క్, పవర్, ఎనర్జీ గ్రావిటేషన్‌ యూనిట్స్‌ అండ్‌ డైమెన్షన్స్‌ ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌ ఎలాస్టిసిటీ థర్మోడైనమిక్స్‌ సౌండ్‌ వేవ్స్‌ రే ఆప్టిక్స్‌ వేవ్‌ ఆప్టిక్స్‌ వెక్టార్స్‌ ఎలక్ట్రో స్టాటిక్స్‌ ఎలక్ట్రో మ్యాగ్నటిజం ఈఎంఐ ఏసీ సర్క్యూట్స్‌ సెమీ కండక్టర్స్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ కరెంట్‌ ఎలాస్టిసిటీ, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మ్యాటర్‌ థర్మల్‌ ఎక్స్‌పాన్షన్‌.

కచ్చితంగా కెమిస్ట్రీ

ఇందులో రివిజన్‌ చేసుకోవాల్సిన అంశాలు 28 ఉన్నాయి. అంటే రోజుకి రెండు చొప్పున సన్నద్ధం కావాలి. ప్రతి రోజూ కనీసం 3 గంటల సమయం కేటాయించుకోవాలి.  

రివిజన్‌ కోసం ముఖ్యాంశాలు: మెటలర్జీ కెమిస్ట్రీ ఇన్‌ ఎవిరీ డే లైఫ్‌ ఆల్కలీ మెటల్స్‌ అండ్‌ హాలైడ్స్‌ అయానిక్‌ ఈక్విలిబ్రియం హైడ్రోజన్‌ అండ్‌ కాంపౌండ్స్‌ సొల్యూషన్స్‌ గ్యాసియస్‌ స్టేట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ కెమికల్‌ కైనెటిక్స్‌ ఎస్,పీ,డీ,ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌ కెమికల్‌ బాండింగ్‌ అటామిక్‌ స్ట్రక్చర్‌ పీరియాడిక్‌ టేబుల్‌ కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌ పాలిమర్స్‌ బయో మాలిక్యూల్స్‌ ప్రాక్టికల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ సర్ఫేస్‌ కెమిస్ట్రీ థర్మో డైనమిక్స్‌ ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్‌ రెడాక్స్‌ రియాక్షన్స్‌ మోల్‌ కాన్సెప్ట్‌ ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్‌ నైట్రో కాంపౌండ్స్‌ ప్రాక్టికల్‌ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ ఆర్గానిక్‌ నేమ్డ్‌ రియాక్షన్స్‌ కెమికల్‌ ఈక్విలిబ్రియం 

పైన తెలిపినట్లు సన్నద్ధమైతే మ్యాథ్స్‌ రివిజన్‌ 16, ఫిజిక్స్‌ 11, కెమిస్ట్రీ 14 రోజుల్లో పూర్తవుతుంది. విద్యార్థులు రోజుకు 9 గంటల చొప్పున కేటాయిస్తే 16 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ రివిజన్‌ పూర్తవుతుంది. అయితే ఇదంతా కేవలం మొన్న జరిగిన ఫిబ్రవరి, మార్చి పరీక్షలకు సిలబస్‌ పూర్తిచేసి, రేపు జరగబోయే ఏప్రిల్, మే పరీక్షలకు సన్నద్ధం పొందే విద్యార్థులకు మాత్రమే. మిగిలినవారికి పై ప్రణాళిక వల్ల ఫలితం ఉండదు. 

ఎక్కువ ప్రాథమికాంశాల నుంచే.. 

తప్పులు చేయడం సహజం. అయితే అది అలవాటుగా మారకూడదు. తప్పు జరిగినప్పుడు నిరుత్సాహపడకుండా వాటిని ప్రయోజనకరంగా మలచుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకున్నాక, దాన్ని మార్చుకోవడమే విజయానికి సంకేతం. సందేహాలను ఎప్పటికప్పుడు లెక్చరర్ల దగ్గర నివృత్తి చేసుకోవడానికి వెనుకాడవద్దు. అవి ఎలాంటివైనా అడగడానికి మొహమాటపడకూడదు. ప్రాథమికాంశాల్లో సందేహాలు అస్సలు వదలవద్దు. ఎందుకంటే అవే చివరకు ప్రమాదంగా మారే అవకాశం ఎక్కువ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఫిబ్రవరి, మార్చి రెండు సెషన్లలోనూ జరిగిన పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాల నుంచే వచ్చాయి. 


 

Posted Date : 31-03-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌