• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ 2020 విశ్లేషణ

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం.. జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షను జనవరి 7 నుంచి 9 వరకు రోజుకు రెండు స్లాట్లలో నిర్వహించారు. ఫలితాలూ వెలువడ్డాయి. ఇక రెండోవిడత పరీక్ష ఏప్రిల్‌లో ఉంటుంది. తొలి పరీక్ష తీరుతెన్నులు గమనించి, విశ్లేషించుకుని.. వాటి ఆధారంగా రెండో విడత పరీక్షలో మెరుగైన స్కోరుకు మార్గాలు వేసుకోవాలి. సన్నద్ధతలో తగిన మార్పులు చేసుకోవాలి. రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి.. ఎన్ని ప్రశ్నలు సాధించామన్నది కాకుండా ఎన్నిటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించారన్నదే ముఖ్యమని మర్చిపోకూడదు!

గత జేఈఈతో పోలిస్తే ఈసారి మెయిన్‌లో ప్రశ్నలు తగ్గాయి. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్తగా పరిమితమైన సంఖ్యాత్మక విలువ సమాధానాల ప్రశ్నలను ఈసారి పరీక్షలో ప్రవేశపెట్టారు. దీంతో ప్రశ్నల స్థాయిలో గణనీయ మార్పును అందరూ ఆశించారు. అనుకున్నట్టుగానే ఈసారి జనవరిలో జరిగిన ఆరు స్లాట్లలోనూ ఎక్కువ శాతం ప్రశ్నలు మధ్యమ స్థాయిలోనే ఉన్నాయి. ఒకటి లేదా రెండు పేపర్స్‌లోని కొన్ని ప్రశ్నలు మినహా మిగిలినవన్నీ మన రాష్ట్రాల ఇంటర్‌బోర్డు/ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కి లోబడే ఉన్నాయి. ప్రాథమిక అంశాలు, వాటి సమీకరణాలు, అప్లికేషన్స్, విద్యార్థుల గ్రహణ, సృజనాత్మకతలను వెలికితీసేలా అడిగారు.

పాత ప్రశ్నపత్రాల పరిశీలన
ఏప్రిల్‌ పరీక్షను ఎదుర్కోబోయేవారు జనవరిలో నిర్వహించిన ఆరు ప్రశ్నపత్రాలనూ దగ్గర ఉంచుకుని, వాటి ప్రశ్నలస్థాయి, తరహాలను అర్థం చేసుకొని ఆ దిశగా సన్నద్ధమవ్వాలి. ఆరింటిలోనూ ప్రశ్నలు అడిగిన చాప్టర్లలో సారూప్యం ఉన్నప్పటికీ స్థాయి మాత్రం భిన్నంగానే ఉంది. కాబట్టి, ప్రతి విద్యార్థీ ఎంత పర్సంటైల్‌ స్కోరు, దానికి అనుగుణంగా ఎంత ర్యాంకు వస్తే ఏ కాలేజీలో ఏ బ్రాంచిలో సీటు వస్తుందో తెలుసుకుని సాధన చేయాలి. ఎందుకంటే అంత పర్సంటైల్‌ స్కోరు రావాలంటే, ఎన్ని మార్కులు సాధించాలో తెలుసుకుని, ఆ ప్రకారం ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు.

పరీక్ష అనంతరం చాలామంది విద్యార్థులు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో ఏదో ఒక పేపర్‌ను బాగా రాశామనే చెప్పారు. దాని ప్రకారం.. ప్రతి పేపర్‌లోనూ ప్రతి సబ్జెక్టు నుంచి సుమారు 7 నుంచి 10 ప్రశ్నలు చాలా తేలికస్థాయిలో ఉన్నాయి. అంటే ప్రతి విద్యార్థికీ 100-120 మార్కులు సులభంగా రావాలి కదా! చాలామందికి రాకపోవటానికి కారణం- వాటితోపాటు రుణాత్మక మార్కులనూ ఎక్కువగా తెచ్చుకోవటమే. కాబట్టి, ఎన్ని ప్రశ్నలు సాధించారన్నది కాదు.. ఎన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాన్ని గుర్తించారన్నది ముఖ్యం.

ముందుగా ఏప్రిల్‌లో పరీక్ష రాయబోయే విద్యార్థులను రెండు భాగాలుగా విభజిస్తే.. మొదటి విడతలో రాసి స్కోరును మెరుగుపరచుకోవాలనుకునేవారిని కేటగిరీ- ఎగానూ, ఏప్రిల్‌లో కొత్తగా రాయబోయేవారిని కేటగిరీ- బిగానూ అనుకుంటే..

కేటగిరీ ఎ: వీళ్లు సాధించిన పర్సంటైల్‌ స్కోర్‌తో సుమారుగా వారి ర్యాంకును కింది ఫార్ములా సాయంతో లెక్కించుకోవాలి.
విద్యార్థి అఖిల భారత ర్యాంకు = (100 - Q) × P / 100
ఇక్కడ P = పరీక్షకు హాజరైన విద్యార్థులు (8,60,010)
Q = విద్యార్థి సాధించిన పర్సంటైల్‌
దీని ఆధారంగా విద్యార్థులు రెండోసారి మెయిన్‌లో తమ ర్యాంకును మెరుగుపరచుకునేలా సిద్ధమవ్వాలి. 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల మనోగతాన్ని, ప్రిపరేషన్‌ విధానాలను గమనిస్తే పాటించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి-
* ప్రతి సబ్జెక్టులో భావనలపై ఎక్కువగా దృష్టిసారించటం
* థియరీ చదివిన తర్వాత సంబంధిత ప్రాబ్లమ్స్‌ సాధన చేయటం
* మూడు సబ్జెక్టులకూ సమ ప్రాధాన్యం
* చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవటం. తప్పు దొర్లితే కాలిక్యులేషన్‌లో జరిగిందో, కాన్సెప్టు అర్థం కాక జరిగిందో చూసుకుని, సరిచేసుకోవడం
* కాన్సెప్టు పరంగా ఎక్కువ తప్పులు చేస్తుంటే దానిపై మరింత దృష్టిపెట్టడం
* ఎప్పటికప్పుడు సందేహ నివృత్తి చేసుకోవటం
* ఒత్తిడిని జయించటం, ఎక్కువ మాదిరి ప్రశ్నపత్రాల సాధన.

కేటగిరీ బి: వీరి సంఖ్య తక్కువగానే ఉంటుందని అంచనా. కేటగిరీ-ఎ వారికి సూచించిన అంశాలు వీరికీ చాలావరకూ వర్తిస్తాయి. ఇవే కాకుండా సబ్జెక్టులపరంగా కింది అంశాలపైనా దృష్టిపెట్టాలి.
మ్యాథ్స్‌:
* సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌
* బైనామియల్‌ థీరమ్‌
* కాంప్లెక్స్‌ నంబర్స్‌
* మాట్రిసెస్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌
* ప్రాబబిలిటీ
* అప్లికేషన్స్‌ ఆఫ్‌ డెరివేటివ్స్‌
* డెఫినిట్‌ ఇంటిగ్రేషన్‌
* ఏరియాస్‌ ఆఫ్‌ కర్వ్స్‌
* డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌
* కానిక్‌ సెక్షన్స్‌ బీ స్టాటిస్టిక్స్‌
* క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌

 

ఫిజిక్స్‌:
* మోషన్‌ ఇన్‌ టూ డైమెన్షన్‌ అండ్‌ ప్రాజెక్టిల్‌ మోషన్‌
* సెంటర్‌ ఆఫ్‌ మాస్‌ అండ్‌ కొలిజన్‌
* రొటేషనల్‌ మోషన్‌
* గ్రావిటేషన్‌
* లాస్‌ ఆఫ్‌ థర్మోడైనమిక్స్‌
* టోటల్‌ ఎలక్ట్రిసిటీ
* రే ఆప్టిక్స్‌
* మోడర్న్‌ ఫిజిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్‌ డివైజెస్‌

కెమిస్ట్రీ:
* కెమికల్‌ బాండింగ్‌ అండ్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్‌
* థర్మోడైనమిక్స్‌
* కెమికల్‌ ఈక్విలిబ్రియమ్స్‌
* హైడ్రోజన్‌ అండ్‌ ఇట్స్‌ కాంపౌండ్స్‌
* జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ
* ఎలక్ట్రోకెమిస్ట్రీ
* d, f బ్లాక్‌ అండ్‌ 15, 16, 17, 18 గ్రూప్‌లు
* P-బ్లాక్‌ & బయోమాలిక్యుల్స్‌
* ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కంటైనింగ్‌ H, O, N

ఈ చాప్టర్లలో ఎక్కువ భాగం తెలుగు రాష్ట్రాల బోర్డులకు సంబంధించిన ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోనివే. కాబట్టి, ఈ రెండు నెలల వ్యవధిలో కేటగిరీ-బి వారు కేవలం మన రాష్ట్రాల ద్వితీయ సంవత్సర సిలబస్‌లోని అధ్యాయాలపైనే దృష్టిపెట్టడం మంచిది.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు సరిపోతాయా?
జేఈఈ విషయంలో చాలా సందర్భాలలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివితే చాలు. ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల నుంచే వస్తాయని చెబుతారు. నిజానికి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని జేఈఈ మెయిన్‌ అధ్యాయాల్లోని సమాచారం పరీక్ష సిలబస్‌ హద్దులను మాత్రమే సూచిస్తుంది. ప్రతి అంశంలోని భావనలపై పూర్తి పట్టు రావాలంటే విభిన్న తరహా ప్రశ్నలను సాధన చేయాలి. కేవలం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల అభ్యాసాలకే పరిమితమైతే సరిపోదు. భావవ్యక్తీకరణ అంశాలపైనా దృష్టిసారించాలి. గత ఏడాది జేఈఈ 16 పేపర్లు, ఈ ఏడాది 6 పేపర్లలోని ప్రాథమిక, ప్రామాణిక, విశ్లేషణ పరమైన అంశాల మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. ప్రస్తుతం సంఖ్యాత్మక విలువున్న ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. కాబట్టి, గత పదేళ్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్లలోని ప్రశ్నలనూ చూసుకోవాలి.

దేశవ్యాప్తంగా మొత్తం 8,69,010 మంది జేఈఈ మెయిన్‌ పరీక్ష రాశారు. అందులో 9 మంది 300 పైగా మార్కులు పొంది 100 పర్సంటైల్‌ సాధించారు. వారిలో నలుగురు మన తెలుగురాష్ట్ర విద్యార్థులే. గతంతో పోలిస్తే ప్రశ్నల సంఖ్య తగ్గినప్పటికీ వాటి స్థాయి, నాణ్యత, దేశవ్యాప్తంగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో సరిచూస్తే ఎక్కువశాతం మధ్యమంగానే ఉన్నాయి.

జనవరిలో జరిగిన ఆరు ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం కఠినమైన ప్రశ్నలు కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్‌ల నుంచి వచ్చాయి. విద్యార్థి తనకు ప్రతికూలంగా ఉన్న సబ్జెక్టు అంశాలపై దృష్టిపెట్టాలి. సంఖ్యాత్మక విలువ ఉన్న ప్రశ్నల స్థాయి కన్నా సరళ బహుళైచ్ఛిక ప్రశ్నల స్థాయి కొన్ని పేపర్లలో ఎక్కువగా ఉందని గమనించాలి.

పర్సంటైజ్‌ Vs ర్యాంకింగ్‌
2019లో ప్రవేశపెట్టిన పర్సంటైల్‌ విధానంలో ఆల్‌ ఇండియా ర్యాంకుల విశ్లేషణ..

 

ర్యాంకు పర్సంటైల్‌
10 లోపు - 100
100లోపు - 99.9944983
500లోపు - 99.9630188
1000లోపు - 99.9266439
2000లోపు - 99.8402008
5000లోపు - 99.5847192
10000లోపు - 99.1421009
15000లోపు - 98.6973703
20000లోపు - 98.2435564
50000లోపు - 95.5568871

కటాఫ్‌ మార్కులు
కేటగిరీ - పర్సంటైల్‌
జనరల్‌ - 89.7548849
ఓబీసీ - 74.3166557
ఎస్‌సీ - 54.0128155
ఎస్‌టీ - 44.3345172
పీడబ్ల్యూడీ - 0.1137173

చివరిగా....
* ఇంటర్‌ పరీక్షలకు సిద్ధమవుతూనే రోజుకు కనీసం గంట జేఈఈ మెయిన్‌కు కేటాయించాలి.
* ఎన్‌సీఈఆర్‌టీ అధ్యాయాల అంశాల హద్దులనే పరిగణనలోకి తీసుకొని కాస్త లోతుగా చదవాలి.
* గత అడ్వాన్స్‌డ్‌ పరీక్షల సంజ్ఞాత్మక/ విశ్లేషణాత్మక/ సిద్ధాంత/ఫార్ములా ప్రశ్నలను సాధన చేయాలి.
* మాదిరి పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, తప్పులు జరుగుతున్న అంశాలపై మళ్లీ దృష్టిపెట్టాలి.
* మార్చి 17 వరకు రెండో ఏడాది సిలబస్‌కు ప్రాధాన్యమిచ్చి, ఆపై పరీక్ష వరకున్న సమయంలో మొదటి ఏడాది సిలబస్‌ను చదవాలి.

- ఎం. ఉమాశంకర్

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌