• facebook
  • whatsapp
  • telegram

పునశ్చరణ సూత్రం

శిఖరారోహణలో చివరి దశకు చేరుకున్నపుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం తడబడినా, పొరబడినా అప్పటివరకూ చేసిన శ్రమంతా వృథా అవుతుంది. జేఈఈ మెయిన్‌ పరీక్ష విషయం కూడా అంతే! రెండు సంవత్సరాల కృషిని మదింపు చేసుకుని, నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాల్సిన విలువైన తరుణమిది. పునశ్చరణ సరిగా చేయటానికీ, చేయకపోవటానికీ తేడా... మంచి ర్యాంకుకూ, సగటు ర్యాంకుకూ ఉన్నంత!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనూ, దేశవ్యాప్తంగా పేరున్న మరికొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ సీటు కోసం ఇంటర్‌ విద్యార్థులు రాయబోయే తొలి ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్‌. తొలి విడత జరిగే పరీక్షకు సమయం సమీపిస్తోంది. విద్యార్థులు రెండేళ్లుగా కష్టపడి ఈ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం సాధించేలా పరీక్ష రాయడమనేది ప్రస్తుతం వారి ముందున్న సవాలు. ఈ చివరి కొద్ది రోజులూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఒత్తిడికి గురికాకుండా పరీక్ష రాస్తే విజయం తథ్యం!
జేఈఈ మెయిన్‌ పరీక్షలో ప్రశ్నల స్థాయి ఎంసెట్‌ కంటే ఎక్కువగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కంటే తక్కువగా ఉంటుంది. ప్రశ్నలు సబ్జెక్టులోని భావనలపై ఆధారపడివుంటాయి.
ఒకటి కంటే ఎక్కువ పాఠ్యాంశాలను కలిపి ప్రశ్నలను రూపొందిస్తారు. అందుకని విద్యార్థి మొత్తం సిలబస్‌ను క్షుణ్ణంగా చదివితేనే పరీక్షలో విజయం సాధించగలడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తో పోలిస్తే జేఈఈ మెయిన్‌లో ఎక్కువశాతం తేలికైన ప్రశ్నలే ఉంటాయి. కానీ ప్రతి సబ్జెక్టులో 8 నుంచి 10 ప్రశ్నలు చిక్కుముడితో కఠినంగా ఉంటాయి. ఈ ప్రశ్నలే ర్యాంకును నిర్ణయించేవి (డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌) అవుతాయి.
ఈ పరీక్షలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే ముఖ్యమైన అంశం- నెగిటివ్‌ మార్కింగ్‌. ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాలూ దాదాపు ఒకేలాగుంటాయి. కాబట్టి ఊహించి జవాబు రాయటం కష్టం, ప్రమాదకరం.

ఏం చేయాలి?
* అసలేమీ చదవని కొత్త అధ్యాయాలూ, విషయాల జోలికి పోకూడదు. ఇలా చేయడం వల్ల సమయపు ఒత్తిడిలో మానసిక స్థైర్యం దెబ్బతినడం తప్ప ఉపయోగం ఉండదు.
* పునశ్చరణలోనూ ముఖ్యమైన పాఠ్యాంశాలనే ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో మొత్తం సిలబస్‌ పునశ్చరణ సాధ్యపడదు.
జేఈఈ వంటి పరీక్షలో ప్రతి పాఠం ముఖ్యమైనదే. కానీ కొన్ని పాఠ్యాంశాల్లోని భావనలు, సూత్రాలు, సమీకరణాలు మరెన్నో పాఠ్యాంశాల్లో ఉపయోగపడతాయి. కాబట్టి, అలాంటివాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
ఉదాహరణకు- గణితశాస్త్రంలో త్రికోణమితి సూత్రాలు, లిమిట్స్‌, డెరివేటివ్స్‌, ఇంటిగ్రల్స్‌ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అలాగే కంటిన్యుటీ, డిఫరెన్షియబిలిటీ, అప్లికేషన్స్‌ ఆఫ్‌ డెరివేటివ్స్‌, డెఫినిట్‌ ఇంటిగ్రల్స్‌ లాంటి పాఠ్యాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. కాబట్టి, వీటిపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి.
* చదివేటప్పుడు ప్రతి రెండు గంటలకోసారి పది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటుండాలి. కాసేపు చదవడం, ఆపై కొంచెంసేపు సాధన చేయడం మంచిది. సాధించిన ప్రశ్నల జవాబులు సరిచూసుకుని, తప్పులు దొర్లిన సాఠాల ప్రశ్నలను పునశ్చరణ చేసుకోవాలి.
* మాదిరి పరీక్షలు రాయడం చాలా ఉపయోగకరం. రాసిన ప్రతి పరీక్షనూ విశ్లేషించుకున్న తరువాతే తరువాతి పరీక్షను రాయాలి. ప్రతి పరీక్షలో మార్కులు పెరుగుతూ ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలూ కొన్ని రాయాలి.
* సాధారణంగా విద్యార్థులకు రాత్రి ఎక్కువసేపు చదివి, ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు ఉంటుంది. కానీ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి ఈ అలవాటు మార్చుకోవాలి. రాత్రి తొందరగా పడుకుని ఉదయం త్వరగా లేవాలి. లేదంటే పరీక్ష హాల్లో నిద్రొచ్చి, మొదలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఈ చివరి కొద్ది రోజుల్లో ప్రణాళికబద్ధంగా సంసిద్ధమై... పరీక్ష రోజు ఒత్తిడికి గురికాకుండా ఉంటే విజయం నిస్సందేహం!

పరీక్ష రోజు..
* పరీక్ష సమయాని కంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. స్నేహితులతో ఎక్కువగా చర్చించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
* రెండేళ్లుగా చదివిన సిలబస్‌లోని ప్రశ్నలే పరీక్షలో ఉంటాయనుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. 75 శాతం ప్రశ్నలు సాధించినా మంచి ర్యాంకు వస్తుందని మనసుకు చెప్పుకోవాలి.
* ముందుగా తెలిసిన, తేలికైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రశ్న తెలియనిదో కఠినమైనదనో అనిపిస్తే పక్కన పెట్టి, తరువాతి ప్రశ్నకు వెళ్లాలి. సమయం మిగిలితే తిరిగి ఆ ప్రశ్నను ప్రయత్నించవచ్చు.
* ప్రశ్నలను తొందరపడి గబగబా సాధించడం గానీ, అతిగా ఆలోచించి సమయం వృథా చేసుకోవడం గానీ సరి కాదు. సమయపాలన చాలా ముఖ్యం.
* రుణాత్మక మార్కులుంటాయి. కాబట్టి జవాబులను ఊహించి పెట్టకూడదు. ఇచ్చిన ఆప్షన్లలో కనీసం రెండు తప్పు అని కచ్చితంగా తెలిస్తేనే ‘గెస్‌’ చేయడం గురించి ఆలోచించాలి.

Posted Date : 17-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు