• facebook
  • whatsapp
  • telegram

4.. 7.. 8.. ర్యాంకులు మనోళ్లవే..

‣ జేఈఈ జాతీయస్థాయి 10 ర్యాంకర్లలో ముగ్గురు తెలుగు విద్యార్థులే
‣ జితేంద్ర అగ్రగణ్యుడు, శశాంక్‌కు 7... శివకృష్ణకు 8వ ర్యాంకు
‣ అమ్మాయిల్లో టాపర్ తనూజకు 20వ ర్యాంకు
‣ ఈసారి జనరల్‌ విభాగం తప్ప మిగిలిన కేటగిరీల్లో తగ్గిన కటాఫ్‌

 

జేఈఈ మెయిన్‌లో తొలి 10 స్థానాల్లో మూడింటిని తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ మూడు ర్యాంకులు దక్కాయి. పోయిన సంవత్సరం ఏపీ, తెలంగాణలో ఉత్తమ ర్యాంకు అయిదుకాగా...ఈసారి నాలుగు. ఏపీకి చెందిన జితేంద్ర 4వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన శశాంక్‌ అనిరుధ్‌ 7, సాగి శివకృష్ణ 8వ ర్యాంకు సాధించారు. మొత్తం 20 ర్యాంకులలోపు ఏడుగురు తెలుగు విద్యార్థులకు చోటు దక్కింది. దేశంలో 100 పర్సంటైల్‌ సాధించిన 24 మందిలో చుక్కా తనూజ ఒక్కరే అమ్మాయి కాగా...ఆమె 20వ ర్యాంకు పొందారు. జనరల్‌ విభాగంలో కటాఫ్‌ పర్సంటైల్‌ స్వల్పంగా పెరిగినా మిగిలిన కేటగిరీల్లో బాగా తగ్గడం చర్చనీయాంశమైంది. ఈసారి ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీపై అవగాహన పెరుగుతుందని, దానివల్ల గత ఏడాది కంటే కటాఫ్‌ పర్సంటైల్‌ పెరుగుతుందని భావించారు. అయితే ఈసారి ఈడబ్ల్యూఎస్‌తో పాటు ఇతర కేటగిరీల్లో కూడా కటాఫ్‌ బాగా తగ్గింది. ఈ కటాఫ్‌ సాధించిన వారికి మాత్రమే సెప్టెంబ‌రు 27వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత ఉంటుంది. జేఈఈ శిక్షణా నిపుణుడు ఉమాశంకర్‌ మాట్లాడుతూ పరీక్షలు వాయిదా పడుతూ రావడం.. బాగా ఆలస్యం కావడంతో విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిందని, ఫలితంగా పరీక్షలు రాసేవారి సంఖ్య కూడా తగ్గడంతో కటాఫ్‌ తగ్గిందని చెప్పారు. మరో నిపుణుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈసారి కరోనా వల్ల ఆన్‌లైన్‌ శిక్షణతో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారు, పేద వర్గాల పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారని చెప్పారు.
 

గమనిక: పర్సంటైల్‌ ఒకటే అయినా ర్యాంకు కేటాయించేటప్పుడు మొదట గణితంలో వచ్చిన మార్కులు, ఆ తర్వాత భౌతిక, రసాయనశాస్త్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి కూడా సమానమైతే వయసును లెక్కలోకి తీసుకుంటారు. అంటే గణితంలో అధిక మార్కులు సాధించిన వారు ర్యాంకుల్లో ముందుంటారు.

విజేతల మనోగతాలు
 

బొంబాయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్సు చదువుతాం
జేఈఈ మెయిన్స్‌ టాపర్ల మనోగతం

ఎక్కువ మంది ర్యాంకర్లు ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్సు చదవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఇంజినీరింగ్‌ తర్వాత వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నారు. మరికొందరు మంచి ఉద్యోగాలు సాధిస్తామంటున్నారు. 20లోపు ర్యాంకు సాధించిన తెలుగు విద్యార్థుల మనోగతాలివి.
 

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేస్తా.. (ర్యాంకు 4)
ఐఐటీ బొంబాయిలో సీటు సాధించేందుకు కష్టపడుతున్నా. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించాలన్నదే లక్ష్యం. అనుకున్న అధ్యాయాల్లో నుంచి ప్రశ్నలు రాకపోవడంతో సెప్టెంబరులో మార్కులు కొద్దిగా తగ్గాయి. - లండా జితేంద్ర, గరివిడి, విజయనగరం.
 

ఐఐటీ మద్రాస్‌లో చదువుతా.. (ర్యాంకు7)
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి మార్కులు సాధించి ఐఐటీ మద్రాస్‌లో సీఎస్‌ఈ చదవాలనుకుంటున్నా. మెయిన్‌లో ఏడో ర్యాంకు రావడం సంతోషదాయకం. జనవరితో పోల్చితే సెప్టెంబరులో 60 మార్కులు పెరగడంతో ర్యాంకు మెరుగుపడింది. - రాచపల్లె శశాంక్‌ అనిరుధ్‌, కడప.
 

అడ్వాన్సుడ్‌లోనూ ర్యాంకు సాధిస్తా.. (ర్యాంకు 8)
‘ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్సు చదవాలన్నది కల. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నా. - సాగి శివకృష్ణ, ఉప్పల్‌, హైదరాబాద్‌.
 

ఐఐటీ బొంబాయిలో సీటు సాధిస్తా.. (ర్యాంకు 15)
ఐఐటీ బొంబాయిలో సీటు సంపాదించాలన్న పట్టుదలతో అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నది లక్ష్యం. మెయిన్‌లో 292 మార్కులు పొందినప్పటికీ గణితం, భౌతిక శాస్త్రంలో రెండు ప్రశ్నలకు చేసిన తప్పుల వల్ల ర్యాంకు 15 వచ్చింది. - తడవర్తి విష్ణు శ్రీసాయిశంకర్‌, బాపట్ల, గుంటూరు.
 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తనవుతా.. (ర్యాంకు19)
ఐఐటీ బొంబాయిలో ఇంజినీరింగ్‌ చదివి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటున్నా. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించే లక్ష్యంతో చదువుతున్నా. - రంగోల అరుణ్‌ సిద్ధార్థ, గొల్లప్రోలు, తూర్పుగోదావరి జిల్లా
 

అడ్వాన్సుడ్‌లో 60వ ర్యాంకు సాధిస్తా (మహిళా విభాగంలో 1వ ర్యాంకు)
చిన్నప్పటినుంచి గణితమంటే ఇష్టం. ఐఐటీ బొంబాయిలో సీఎస్‌ఈ చదవాలనుకుంటున్నా. అడ్వాన్సుడ్‌లో 60లోపు ర్యాంకు సాధిస్తా. మెయిన్‌లో 100 పర్సంటైల్‌ వస్తుందని ఊహించలేదు. - తనూజ, విజయనగరం.
 

ఐఏఎస్‌నవుతా..
సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకు వస్తుందనే భావించా. మధురవాడ నుంచి ప్రతి రోజూ విశాఖ వచ్చి డేస్కాలర్‌గా చదువుకున్నా. చదువుతోపాటు నిత్యం ఆటలు కూడా ఆడేవాణ్ని. ప్రణాళికాబద్ధంగా చదవడంతో మంచి ర్యాంకు వచ్చింది. - వై.ఎస్‌.ఎస్‌.నరసింహనాయుడు, ప్రథమర్యాంకర్‌ (ఈడబ్ల్యూఎస్‌ విభాగం), విశాఖపట్నం
 

అడ్వాన్స్‌డ్‌కు మనోళ్లు కనీసం 40 వేల మంది!..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు 2.50 లక్షల మంది అర్హత సాధించగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 40 వేల మంది ఉంటారని నిపుణుల అంచనా. ప్రతిసారి అర్హత సాధించిన వారందరూ అడ్వాన్స్‌డ్‌ రాయరని, ఈసారి ఆ సంఖ్య మరింత తగ్గుతుందని చెబుతున్నారు. మొదటి 100 ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ నుంచి కనీసం 25-30 మంది ఉంటారని ప్రాథమిక సమాచారం.

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌