• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌, జేఈఈ మెలకువలు

జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలైన జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, రాష్ట్రస్థాయి ఎంసెట్‌ల కోసం పునశ్చరణ, ప్రశ్నల సాధనల కృషిని కొనసాగించాలి! ఇందుకు ఆచరణయోగ్యమైన ప్రణాళిక.. ఇదిగో!

జేఈఈ మెయిన్‌ పరీక్ష జరిగాక, అందులో అర్హత సాధించే సుమారు 2.5 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తారు. ఇక యూనివర్సిటీ, గవర్నమెంట్‌, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశానికి ఏపీ, టీఎస్‌ ఎంసెట్‌లను నిర్వహిస్తున్నారన్నది తెలిసిందే. ఇవన్నీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలే. ఎ.పి./టి.ఎస్‌ ఎంసెట్‌ల నుంచి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వరకు సిలబస్‌ దాదాపు ఒక్కటే. కేవలం ప్రశ్నలను అడిగే విధానంలోనే తేడా.

జేఈఈ మెయిన్‌తో పాటు ఎంసెట్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌...మూడు పరీక్షలు ఉన్నాయని తడబడి తికమకపడినా, మూడింటిలో కనీసం ఒక్కటైనా రాకపోతుందా అనే ధీమాతో నిర్లక్ష్యం చేసినా ఫలితం తారుమారు అవుతుంది. సాధారణ విద్యార్థి అసాధారణ ఫలితం సాధించాలన్నా, మెయిన్స్‌ తొలివిడతలో తక్కువ స్కోరు సాధించిన విద్యార్థి ఈసారి ఎక్కువ స్కోరు సాధించాలన్నా సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలి.

రెండో సంవత్సర పాఠ్యాంశాలు..
ఇప్పుడు ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోని మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అంశాలపై దృష్టి సారించండి. మార్చి బోర్డు పరీక్షల వరకూ ఈ రెండో సంవత్సరం సిలబస్‌ చదివారు; అందులో జేఈఈ మెయిన్‌కు ఎక్కువ వెయిటేజి ఉంటుంది. ఈ కారణం వల్ల ఇప్పటికే ప్రతి విద్యార్థికీ సబ్జెక్టుల్లోని అంశాలపై స్పష్టత ఉంటుంది. అందుకే దీని ప్రిపరేషన్‌కి ఎక్కువ సమయం పట్టదు. పరీక్ష తేదీ తెలిశాక.. దానికి నాలుగైదు రోజుల ముందు 4 నుంచి 7 పూర్తిస్థాయి నమూనా పరీక్షలు రాసేలా చూసుకోవాలి. అందులో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ఏపీ ఎంసెట్‌కి ఇంటర్‌ ప్రథమ సంవత్సరములోని ప్రాధాన్య చాప్టర్లు ఎక్కువ సాధన చేస్తూ ఆ వ్యవధిలోనే ఎక్కువ నమూనా పరీక్షలను రాయటం మేలు. ఇలా చేస్తే ప్రశ్నలను సాధించే విషయంలో వేగం, కచ్చితత్వం పెంచుకోవచ్ఛు ఇప్పటికున్న షెడ్యూల్‌ ప్రకారం ఏపీ ఎంసెట్‌తో పోలిస్తే టీఎస్‌ ఎంసెట్‌కి కాస్త ఎక్కువ సమయమే వచ్చింది కాబట్టి పైన చెప్పిన ప్రిపరేషన్‌తోపాటు కంప్యూటర్‌ సంబంధిత నమూనా పరీక్షలను ఎక్కువ రాస్తే మంచి ర్యాంకుకు అవకాశాలుంటాయి. ఆపై జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉండనే ఉంది. జేఈఈ మెయిన్‌, ఏపీ/టీఎస్‌ ఎంసెట్‌లలో సరిగా చేయలేకపోయిన అంశాలపై ఒక్కసారి దృష్టిపెట్టి, కంప్యూటర్‌ ఆధారిత నమూనా ప్రశ్నపత్రాలను కనీసం రోజుకు ఒకటి తప్పకుండా రాయాలి. అందులో తమకు ప్రతికూలంగా ఉన్న అంశాలపై పట్టు సాధించాలి.

ఎంసెట్‌ మాత్రమే మీ లక్ష్యమైతే...
ఈ పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో వేర్వేరు రోజుల్లో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహిస్తారని తెలిసిందే. ప్రశ్నపత్రాలు విభిన్నమైనా అందులోని ప్రశ్నల స్థాయి ఒకే విధంగా ఉంటుంది. కోరుకున్న ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆశించిన బ్రాంచి కావాలంటే మంచి ర్యాంకు తెచ్చుకోవలసిందే. ఏ సబ్జెక్టులోనైనా వివాదాస్పద ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఒకవేళ పరీక్షలో ఇటువంటి ప్రశ్న ఉన్నా, తుది ‘కీ’లో అటువంటివి తప్పకుండా తొలగిస్తారు.
* కనీసం రోజులో 3 గంటలు మ్యాథమేటిక్స్‌, 2 గంటలు ఫిజిక్స్‌, 2 గంటలు కెమిస్ట్రీకి కేటాయించాలి.
* రెండు మూడు రోజులకొకసారి మొత్తం సిలబస్‌పై అన్ని సబ్జెక్టులూ కలిపి మూడు గంటల నమూనా పరీక్షను ఆన్‌లైన్‌లో రాయాలి.
* కఠినమైన ఫార్ములాలను, సులభమైన ఫార్ములాలను విడివిడిగా నోట్సు రాసుకొని పెట్టుకోవాలి. పునశ్చరణకిది ఉపయోగం
* వెయిటేజి ఎక్కువవున్న అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తరువాత మాత్రమే సమయాన్ని బట్టి మిగిలినవాటిపై దృష్టి సారించాలి.

రసాయనశాస్త్రం: దీని ప్రిపరేషన్‌ సులువే గానీ, నిర్లక్ష్యం వద్ధు పరీక్షలో కనీస సమయం కూడా దీనికి కేటాయించకపోతే మార్కులు నష్టపోవలసి ఉంటుంది. తక్కువ సమయాన్ని కేటాయించటం వల్ల ఎక్కువ తప్పులకు అవకాశం ఉంటుంది. కాబట్టి రసాయనశాస్త్రంలోని 40 ప్రశ్నలకు కనీసం 35 ని. సమయం కేటాయించుకోవాలి. సాధారణ, భౌతిక, కర్బన, అకర్బన రసాయన శాస్త్రాల్లో ఒక్కొక్క విభాగం నుంచి సుమారు 10 ప్రశ్నలు వస్తాయి. ఇందులో సగటున 25 నుంచి 30 ప్రశ్నలు సులువు. 5 ప్రశ్నలు మాత్రం కొంచెం ఆలోచించేవిధంగా, మిగిలిన ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉండి సమయం తీసుకునేలా ఉంటాయి. కేవలం రసాయన శాస్త్రం వరకు తెలుగు అకాడమీ పుస్తకాలపై పట్టు ఉంటే సులభంగా 30 మార్కులపైన సాధించటం ఏమాత్రం కష్టం కాదు. కర్బన రసాయన శాస్త్రంలోని నేమ్డ్‌ చర్యలపై ప్రశ్నల పునశ్చరణ, అకర్బన రసాయన శాస్త్రంలోని అంశాల విషయంలో అకాడమీ పుస్తకంలోని ప్రతి వాక్యాన్నీ ప్రశ్నరూపంలో మార్చుకొని అధ్యయనం చేయటం మంచిది. భౌతిక రసాయనశాస్త్రంలో 6 ప్రశ్నలకు పైగా లెక్కలపై రావొచ్ఛు అందులోని ముఖ్య అధ్యాయాలపై అవగాహన పెంచుకోవాలి.

గణితశాస్త్రం: సాధన ఎక్కువసార్లు ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. కీలకమైన అధ్యాయాల్లోని ఫార్ములాలనూ, సమీకరణాలనూ ఎక్కువ మననం చేసుకోవటం ఉత్తమం. ఈ సబ్జెక్టులో కొన్ని నిర్ణీత అధ్యాయాల్లో మాత్రమే, కొన్ని ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. ప్రశ్నల నిడివి ఎక్కువే కాని, సాధారణ విద్యార్థులు చేసే రీతిలోనే ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్‌ సిలబస్‌లోని లెక్కలను ఎక్కువసార్లు సాధన చేయటం ఎంతో అవసరం. ఇలా చేస్తే 69 శాతానికి పైగా మార్కులు పొందవచ్చు.

భౌతికశాస్త్రం: మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లోని అంశాలకంటే, రెండో సంవత్సరం అంశాలకు కొద్దిగా ప్రాధాన్యం ఉంటుంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావాలంటే నిడివి తక్కువున్న అభ్యాసాలను ఎంచుకోవాలి. అంటే ఉదాహరణకు ‘ప్రమాణాలు- మితులు’ నుంచి 1 ప్రశ్న వస్తుంది. ‘కైనమాటిక్స్‌’ నుంచి 1 ప్రశ్న వస్తుంది. అయితే మొదటిదానికంటే రెండోది చాలా పెద్ద చాప్టర్‌. పైగా మనం ఎన్ని ప్రశ్నలను సాధన చేసినా ఏదో ఒక ఊహించని ప్రశ్నతో ఇబ్బంది రావొచ్ఛు అందుకని ‘కైనమాటిక్స్‌’ చాప్టర్‌ కంటే ‘ప్రమాణాలు-మితులు’ మిన్న. ఇలాంటి మెలకువలు పాటించాలి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని వాక్యాలపై నేరుగా ప్రశ్నలను అడుగుతున్నారు కాబట్టి, వాక్యాలను ప్రశ్నల రూపంలోకి మార్చుకొని అభ్యాసం చేయటం మంచిది. ఈ విధమైన ప్రణాళికతో భౌతికశాస్త్రంలో 40 మార్కులకు కనీసం 20 మార్కులపైన సాధించటానికి అవకాశం ఉంటుంది.

లక్ష్యం జేఈఈ మెయిన్‌ అయితే...
జేఈఈ మెయిన్‌ రెండో దఫాలో 80%పైగా విద్యార్థులు మొదటి విడత పరీక్షలో ప్రతిభను కనపరచినవారే. ఎక్కువమంది ర్యాంకును మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఫలించాలంటే న్యూమరికల్‌ వాల్యూ (సంఖ్యాత్మక) ప్రశ్నలపై అవగాహన తెచ్చుకోవాల్సిందే. గతంలో మాదిరి ప్రశ్న స్థాయి తక్కువగా ఉంటుందని గానీ, జనవరిలో నిర్వహించిన ప్రశ్నలస్థాయి మాదిరిగా ఉంటుందని గానీ ఓ అభిప్రాయానికి రాకూడదు. ఎటువంటి ప్రశ్నపత్రాన్నైనా ఎదుర్కొనేలా ప్రిపరేషన్‌ స్థాయిని పెంచుకోవాలి. ఎన్ని ప్రశ్నలు సాధించారన్నది కాదు, ఎన్నిటికి కచ్చితంగా గుర్తించారన్నదే ముఖ్యం.
1) జేఈఈ మెయిన్‌  పాత ప్రశ్నపత్రాలు, వాటి విశ్లేషణ, సాధన చాలా ముఖ్యం.
2) పేపరుస్థాయి ఎలా ఉన్నా, కచ్చితంగా ప్రతి సబ్జెక్టులో సుమారు 10 ప్రశ్నలను ముందుగా ఎంచుకొని, తప్పులు లేకుండా సమాధానాలు గుర్తించాలి. ఇలా చేశాక వచ్చిన ఆత్మవిశ్వాసంతో మిగిలిన ప్రశ్నలపై ముందడుగు వేయాలి.
3) రోజు విడిచి రోజు 3 గంటలు నమూనా ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో సాధన చేయాలి.
4) సంఖ్యాత్మక విలువల ప్రశ్నలపై అవగాహన పెంచుకుంటే, అది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకూ ఉపయోగపడుతుంది.

Posted Date : 17-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు