• facebook
  • whatsapp
  • telegram

ఒక‌టే ప్రిప‌రేష‌న్‌.. నాలుగు అవ‌కాశాలు

జేఈఈ మెయిన్ 2021 - స‌రైన ప్ర‌ణాళిక‌తో స‌క్సెస్‌

ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం రాసే జేఈఈ మెయిన్‌ పోటీకి తెరలేచింది! కరోనా నేపథ్యంలో సిలబస్‌ను పూర్తిచేసిన/ ఇంకా పూర్తి చేయలేకపోయిన వివిధ రాష్ట్ర విద్యార్థుల స్థితిని పరిగణనలోకి తీసుకుని జేఈఈ- 2021 మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దరఖాస్తు గడువు జనవరి 16. కొత్త సంవత్సరంలో   ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షను నిర్వహించబోతున్నారనే సంగతి  తెలిసిందే. దీనికి ఆచరణాత్మక ప్రణాళిక   ఎలా వేసుకోవాలి? నిపుణుల సూచనలివిగో! 

కంప్యూటర్‌ ఆధారితంగా జరిగే జేఈఈ మెయిన్‌ రాతపరీక్షలో కీలక మార్పులు చేశారు. ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సంఖ్యను పెంచడంతోపాటు మొట్టమొదటిసారిగా ఒక జాతీయస్థాయి ప్రవేశపరీక్షలో చాయిస్‌నూ ఇస్తున్నారు. అంతేకాదు, మాతృభాషలోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు కలిగించారు.

కేవలం రాష్ట్రాల అంతర్గత ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో మాత్రమే ఇప్పటివరకూ మాతృభాషలో రాసే అవకాశం ఉండేది. మొదటిసారిగా జేఈఈని ఇంగ్లిష్, హిందీలతోపాటు  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, పంజాబీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడిశా, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. అయితే విద్యార్థి పరీక్ష రాసేందుకు ఎంచుకున్న భాషను దరఖాస్తు పూర్తిచేసే సమయంలో ముందుగానే పేర్కొనాలి. తరువాత దాన్ని మార్చుకోవడం కుదరదు. ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యే విద్యార్థులు అక్కడి రాష్ట్రంలోనే పరీక్ష రాయాలి.

అంటే.. తెలుగులో పరీక్ష రాయదలచుకునేవారు ఆంధ్రప్రదేశ్‌/ తెలంగాణల్లోనే రాయాలి. ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో రాయాలనుకునేవారు ఎక్కడి నుంచైనా రాయొచ్చు. జాతీయస్థాయి పోటీపరీక్షలకు ప్రాంతీయ భాషల్లో అవకాశం ఇస్తుండటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నిజంగా ఇదొక మంచి అవకాశంగానే భావించవచ్చు.

ప్రశ్నల, మార్కుల తీరు

ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు- ఎ, బి ఉంటాయి. సెక్షన్‌-ఎ ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కులుంటాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించాలి. సెక్షన్‌-బిలోవి న్యూమరికల్‌ ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు. ఇచ్చిన పది ప్రశ్నల్లో ఏవైనా ఐదింటికి సమాధానాలు గుర్తించాలి. తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులు లేవు.

సమాధానం ఇవ్వనీ, పునఃపరిశీలన కోసం పెట్టినవాటికీ సున్నా మార్కులు.

మొత్తం మీద ప్రతి సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలు, 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పేపర్‌ 2ఎ (బీఆర్క్‌) పరీక్షలో గమనించాల్సినవి

పేపర్‌-1లో మాదిరిగానే మ్యాథ్స్‌లో ఇచ్చే మొదటి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు. అన్నింటినీ రాయాల్సిందే. మిగిలిన పది న్యూమరికల్‌ ప్రశ్నలు. వాటిలో ఏవైనా అయిదింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది.

ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో వేటికైనా తప్పు సమాధానం రాసినవాటికి -1 మార్కు. న్యూమరికల్‌ వాటికి నెగెటివ్‌ మార్కు లేదు. పార్ట్‌-2లోని బహుళైచ్ఛిక ప్రశ్నలకూ సరైన సమాధానం గుర్తించినవాటికి 4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు ఉంది. వీటికి చాయిస్‌ లేదు. పార్ట్‌-3లోని రెండు ప్రశ్నలకూ కలిపి 100 మార్కులు. ఇక్కడా రుణాత్మక మార్కులు లేవు.

పేపర్‌ 2బి (బి. ప్లానింగ్‌)లో.. 

ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు. పార్ట్‌-1లోని మొదటి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు. మిగిలిన 10 న్యూమరికల్‌. ఈ పది ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. వీటిలో ఏవైనా అయిదింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది.

పార్ట్‌-2, 3 ల్లో తప్పు సమాధానం రాసిన ప్రతి ప్రశ్నకూ -1 మార్కు ఉంటుంది. సమాధానం గుర్తించని, పునఃపరిశీలన నిమిత్తం ఉంచినవాటికి సున్నా మార్కు ఉంటుంది.

మొదటి దఫా ప్రణాళిక ఎలా ఉండాలి?

రాబోయే 50 రోజుల కాలవ్యవధిలో ఈ కింది మార్గదర్శకాలను పాటిస్తే మొదటి విడతలోనే అద్భుత ఫలితాలను పొందవచ్చు.

గణితంలో ముఖ్యాంశాలు: 

సెట్స్, రిలేషన్స్, రీజనింగ్‌ 

స్టాటిస్టిక్స్‌ 

మాట్రిసెస్, డిటర్మినెంట్స్, లీనియర్‌ ఈక్వేషన్స్‌ 

క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ 

ప్రోగ్రెషన్స్‌ 

బైనామినల్‌ థీరమ్‌ 

లిమిట్స్, కంటిన్యుటీ అండ్‌ డిఫరెన్షియబిలిటీ 

డెఫినెట్‌ ఇంటిగ్రేషన్స్‌ 

డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌ 

మోనాటానిసిటీ అండ్‌ మీన్‌ వాల్యూ థీరమ్స్‌ 

కానిక్‌ సెక్షన్స్‌ 

డాట్‌ అండ్‌ క్రాస్‌ ప్రొడక్ట్‌ 

ప్లేన్స్‌ అండ్‌ లైన్స్‌

ఫిజిక్స్‌లో ముఖ్యాంశాలు: 

ఫ్లూయిడ్స్‌ 

ఎలాస్టిసిటీ, విస్కాసిటీ అండ్‌ సర్ఫేస్‌ టెన్షన్‌ 

న్యూటన్‌ లాస్‌ ఆఫ్‌ మోషన్‌ 

హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌ 

స్టాటిక్‌ అండ్‌ కరెంట్‌ ఎలక్ట్రిసిటీ 

మోడర్న్‌ ఫిజిక్స్‌ 

ఎక్స్‌పరిమెంటల్‌ ఫిజిక్స్‌ 

గ్రావిటేషన్‌ 

సర్క్యులర్‌ మోషన్‌ అండ్‌ రొటేషనల్‌ డైనమిక్స్‌

కెమిస్ట్రీలో ముఖ్యాంశాలు: 

కెమికల్‌ బాండింగ్‌ అండ్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్స్‌ 

థర్మోడైనమిక్స్‌ 

కెమికల్‌ ఈక్విలిబ్రియమ్‌ 

హైడ్రోజన్‌ అండ్‌ ఇట్స్‌ కాంపౌండ్స్‌ 

జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ 

ఎలక్ట్రో కెమిస్ట్రీ 

పి బ్లాక్‌ గ్రూప్‌ 15, 16, 17, 18 

డి, ఎఫ్‌ బ్లాక్‌ 

బయోమాలిక్యూల్స్‌ 

కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీ డే లైఫ్‌ 

ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కంటెయినింగ్‌ హెచ్, ఓ, ఎన్‌.

ఒక్కో సబ్జెక్టులో పై అధ్యాయాల నుంచి టాపిక్‌లవారీ పరీక్షలు రాయడం మేలు.

రోజులో సబ్జెక్టుకు కనీసం 3 గంటలు కేటాయించి చదివినా రాబోయే 50 రోజుల్లో రెండుసార్లు పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవచ్చు.

వారాంతంలో సన్నద్ధమైన మూడు సబ్జెక్టుల్లోని అధ్యాయాలపై ఒక మాక్‌ టెస్ట్‌ రాయాలి.

2019, 2020 జేఈఈ మెయిన్‌ ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలన్నీ సాధన చేయాలి.

పైన పేర్కొన్న అధ్యాయాల్లో కష్టమైన, గుర్తుంచుకోవాల్సిన అంశాలపై స్పెషల్‌ పాయింట్లతో కూడిన నోట్స్‌ తయారు చేసుకోవాలి.

పరీక్షలో సబ్జెక్టులపై ఉంచాల్సిన సమయపాలనపై పట్టు సాధించాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధన చేసేలా సిద్ధం కావాలి. 

ఎక్కువ మాక్‌టెస్ట్‌లు రాస్తే మంచిది. రుణాత్మక మార్కుల సంగతి మరవద్దు.

సెక్షన్‌ బిలోని న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. చాయిస్‌ ఉంది కాబట్టి సాధ్యమైనంతవరకు అన్నింటికీ సమాధానం గుర్తించడానికి ప్రయత్నించాలి.

ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా సాధన చేసి మొదటి విడత ఫిబ్రవరి 2021లో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ను బాగా రాయాలి.  ఒకవేళ సరిగా రాయలేకపోయినా కుంగిపోవద్దు. మరో 3 అవకాశాలు ఉంటాయి కదా? పరీక్షలను ఆషామాషీ‡గా తీసుకోకుండా అప్పటి స్థితిగతులను బేరీజు వేసుకుంటూ నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు వెళితే గరిష్ఠ మార్కులు తథ్యం!

తెలుగు మాధ్యమ విద్యార్థులూ.. ఇవిగో సూచనలు!

తెలుగు అకాడమీ పుస్తకంలోని ప్రతి లైనునూ బహుళైచ్ఛిక ప్రశ్నగా ఊహించుకుంటూ సాధన చేయాలి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలను చూసుకోవాలి.

దీనికి ఒక ప్రత్యేకమైన నోట్సు తయారు చేసుకోవాలి. ప్రతి అధ్యాయంలో ఉండే పుస్తకంలోని ప్రతి పేరాగ్రాఫ్‌ నుంచి ఎందుకు, ఏమిటి, ఎలాగంటే, అయితే, ఇటువంటివి.. లాంటి పదాలతో ఉన్న వాక్యాలను బహుళైచ్ఛిక ప్రశ్నగా లేదా ఖాళీలను పూరించే ప్రశ్నగా మలచుకోవాలి.

ప్రయోగ దీపికలో ఉన్న రసాయన, భౌతిక శాస్త్రాల అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.

తెలుగు మాధ్యమంలో ఉన్న పాత 15 ఏళ్ల ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీలైతే అందులోని బహుళైచ్ఛిక ప్రశ్నలను న్యూమరికల్‌ ప్రశ్నలుగా మార్చుకుని సాధన చేయాలి.

ఎన్‌టీఏ బోర్డు వారు వెబ్‌సైట్‌లో ఉంచిన మాదిరి ప్రశ్నపత్రాలను తప్పకుండా సాధన చేయాలి.

300కి 300 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ కనీసం 120 మార్కులకు మించి వచ్చేలా మీ సాధన ఉండాలి.

తెలుగు అకాడమీ ఎంసెట్‌ గైడ్‌ క్షుణ్ణంగా సాధన చేయాలి.

ముందుగా కొంచెం కష్టమైనా, మొదటి విడత ఫిబ్రవరి పరీక్ష రాయండి. దానివల్ల ప్రశ్నలస్థాయి, భాషా సరళి తెలుస్తాయి.

ఒకవేళ మొదటి విడత సరిగా రాయలేకపోయినా మరో 3 విడత పరీక్షలు ఉండనే ఉన్నాయి.

ప్రతిసారీ మీ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి!

మార్పులతో ప్రయోజనమేంటి?

నిన్నటివరకూ నిస్తేజంగా ఉన్న విద్యార్థికి ఒక్కసారిగా ఈ జేఈఈ మెయిన్‌ 2021 ప్రకటన స్పష్టత ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే నాలుగుసార్లలో విద్యార్థి ఎన్నిసార్లయినా రాయొచ్చు. అంతేకాకుండా అన్నింటినుంచీ ఎక్కువ మార్కుల ద్వారా వచ్చిన పర్సంటైల్‌ స్కోరును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఇది విద్యార్థికి ఎంతో ఉపయోగకరం.

ఈ పరీక్షతోపాటు ప్రతి విద్యార్థీ విధిగా తమ ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలకూ సమాయత్తం కావాలి. సాధారణంగా బోర్డు పరీక్షలు మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో నిర్వహిస్తారు. ఇవి ముగిశాక నిర్వహించే చివరి విడత పరీక్షను సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా అవసరం.

కొవిడ్‌ సంక్షోభంలో ఇంటర్మీడియట్‌ తరువాత మంచి ఇంజినీరింగ్‌ సంస్థలో ప్రవేశం పొందాలనుకునేవారికి జేఈఈ మెయిన్‌ ప్రధానమైంది. అసలు జరుగుతుందా లేదా అన్న మీమాంసలో ఉన్నవారికి 4 దఫాలుగా నిర్వహిస్తూ చాలా ఊరటనిచ్చిందనే చెప్పాలి.

జేఈఈ మెయిన్‌ 2020 విషయానికొస్తే-  11, 12 తరగతుల సిలబస్‌ను 98% లాక్‌డౌన్‌ ప్రకటించకముందే ఆఫ్‌లైన్‌ క్లాసుల ద్వారా పూర్తిచేసుకుని, మిగిలిన సాధనను ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకోవడం ద్వారా ఆ పరీక్ష నుంచి ఎలాగోలా బయటపడ్డాడు. కానీ జేఈఈ మెయిన్‌ 2021 విషయానికొస్తే దేశవ్యాప్తంగా అన్ని కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లూ పూర్తిగా ఆఫ్‌లైన్‌ క్లాసులను నిర్వహించలేకపోయాయి. అంతేకాకుండా 12వ తరగతి విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ తరగతులనే విన్నారు. అలాంటివారికి నాలుగుసార్లు నిర్వహించడం ఎంతో కొంత మనోధైర్యాన్ని ఇస్తుంది.

సాధారణంగా జాతీయస్థాయి పోటీపరీక్షలన్నీ ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషల్లో నిర్వహిస్తారు. దీనివల్ల మాతృభాషలో ఇంటర్మీడియట్‌ విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులకు ఈ పోటీపరీక్ష అందనిదిగానే ఉండేది. కొత్త విధానంలో ఇంగ్లిష్, హిందీలతోపాటు ఈ పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించబోతున్నందున మాతృభాషలో విద్యనభ్యసించే విద్యార్థులు కూడా తమ కలలను సాకారం చేసుకోగలుగుతారు. 

పరీక్షలు ఎప్పుడెప్పుడు? 

మొదటి విడత: ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు

రెండో విడత: మార్చి 15 నుంచి 18 వరకు

మూడో విడత: ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు

నాలుగో విడత: మే 24 నుంచి 28 వరకు

Posted Date : 11-03-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌