• facebook
  • whatsapp
  • telegram

వైద్య కళాశాలలకు కొత్త నిబంధనలు

* వచ్చే ఏడాది ప్రారంభించే విద్యా సంస్థలపై ఎన్‌ఎంసీ నిర్ణయం


వచ్చే విద్యాసంవత్సరం (2021-22)లో వైద్యకళాశాలల ప్రారంభానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కొత్త నిబంధనలు జారీచేసింది. ‘ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజ్‌ రెగ్యులేషన్స్‌(సవరణ)2020’ పేరుతో విడుదల చేసిన నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎన్‌ఎంసీ పేర్కొంది. 
* ప్రతి వైద్యకళాశాల ప్రాంగణంలో కాలేజ్‌తోపాటు, బోధనాసుపత్రి, విద్యార్థుల వసతి సౌకర్యం కలిసి ఉండాలి. కళాశాల/ఆసుపత్రి బోధనా సిబ్బంది, ఇతర సిబ్బందికి గృహ వసతి ఉన్నా, లేకపోయినా ఫర్వాలేదు. వైద్యకళాశాల, విద్యార్థులు, ఇంటర్న్స్‌ గృహసముదాయం, బోధనాసుపత్రి అన్ని కలిపి ఒకేచోట (యూనిటరీ క్యాంపస్‌) ఉండటం వాంఛనీయం.
* కేటగిరీ ఎక్స్, వై నగరాలు, కొండప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాలు, అధికారికంగా నోటిఫై చేసిన గిరిజన ప్రాంతాల్లో క్యాంపస్‌ రెండు భాగాలుగా ఉండొచ్చు. ఒక భూభాగంలో బోధనాసుపత్రి, మరో భూభాగంలో వైద్యకళాశాల, విద్యార్థులు, ఇంటర్న్స్‌కి గృహవసతి ఏర్పాటుచేసుకోవచ్చు.
* ఒకవేళ క్యాంపస్‌ రెండుచోట్ల ఉంటే, రెండింటి మధ్య 10 కిలోమీటర్లకు మించి దూరంకానీ, 30 నిమిషాలకు మించి ప్రయాణసమయంకానీ పట్టకూడదు. ఇందులో ఏది తక్కువ అయితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యకళాశాలకోసం బోధనాసుపత్రిగా ఉపయోగించుకొనేట్లయితే, అది రెండు భూభాగాల్లో ఉన్నప్పటికీ దాన్ని వైద్యకళాశాల అనుబంధ బోధనాసుపత్రిగా గుర్తించవచ్చు. అయితే సదరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కనీసం 300 పడకల ఆసుపత్రై ఉండాలి. 
* వైద్యకళాశాల నిర్మాణం కోసం ఉపయోగించే భూభాగాన్ని మరే ఇతర అవసరాలకూ ఉపయోగించకూడదు. అక్కడ నర్సింగ్, డెంటల్, ఇంజనీరింగ్, ఇతర కాలేజీలుకానీ, హాస్టల్‌ నిర్మాణాలుకానీ చేపట్టకూడదు.
* వ్యక్తుల చేతిలో ఉండే 300 పడకల ఆసుపత్రులను బోధనాసుపత్రిగా మార్చవచ్చు. ఈశాన్యరాష్ట్రాలు, కొండప్రాంతాల్లో అయితే 250 పడకలు ఆసుపత్రిని ఇలా బోధనాసుపత్రిగా మలచవచ్చు. దీనికితోడు అన్ని ఆసుపత్రులూ అత్యవసర వైద్యసేవలకోసం అదనంగా 30 పడకలు తప్పనిసరిగా కేటాయించాలి. ఇలా బోధనాసుపత్రికోసం మళ్లించే ఆసుపత్రులు కనీసం 2ఏళ్లు పూర్తిస్థాయిలో పనిచేసి ఉండాలి.
* 2021-22 విద్యాసంవత్సరంలో ప్రారంభించే వైద్యకళాశాలలకు విద్యార్థులను చేర్చుకోవడానికి ఏడాదికాలానికే అనుమతి ఇస్తారు. తర్వాత అవి సాధించే వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆ అనుమతులను పునరుద్ధరిస్తూపోతారు. మౌలికవసతులు, మానవ వనరులు నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేదా? అన్నది తొలి, మూడో రెన్యువల్‌తోపాటు, సదరు మెడికల్‌ కాలేజ్‌ జారీచేసే ఎంబీబీఎస్‌ డిగ్రీకి గుర్తింపు ఇచ్చేంతవరకూ ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూపోతారు. విద్యార్థుల ప్రవేశాల రెన్యువల్‌ కోసం నిర్దిష్టగడువులోగా మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్‌ వార్షిక ప్రవేశాలకోసం నిర్దేశించిన కనీస ప్రమాణాలను పాటించకపోతే తదుపరి ప్రవేశాలకు అనుమతివ్వరు. 

Posted Date : 04-11-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌