• facebook
  • whatsapp
  • telegram

నీట్‌గా.. ప్రణాళిక

మనదేశంలోని అన్ని వైద్య, దంతవైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష - ‘నీట్‌’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌). ఎయిమ్స్‌, జిప్‌మర్‌ మినహా ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ లేదా స్వయం ప్రతిపత్తిగల విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైనా ప్రవేశం పొందాలంటే నీట్‌ అర్హత తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యమున్న పరీక్షకు పకడ్బందీ ప్రణాళికతో ఇప్పటినుంచే సిద్ధమవటం తప్పనిసరి! అందుకు ఉపకరించే విశ్లేషణ ఇదిగో!

ఏ రాష్ట్రంలోనైనా 85% సీట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ ద్వారా నీట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేసుకోవచ్చు. వాటిలో రిజర్వేషన్‌ ప్రక్రియలు ఆ రాష్ట్ర విధానంపైనే ఆధారపడి ఉంటాయి. 15% సీట్లు ఇతర రాష్ట్ర విద్యార్థులతో సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. అయితే ఈ విధానం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జమ్మూ- కశ్మీర్‌ రాష్ట్రాలకు వర్తించదు. ఆ రాష్ట్రాలు నూరు శాతం సీట్లను నీట్‌ ర్యాంకు ఆధారంగానే భర్తీ చేస్తాయి. అంటే తెలుగు రాష్ట్ర విద్యార్థులు కౌన్సెలింగ్‌ కోటాలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇతర రాష్ట్ర విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేసే సీట్లకు అర్హత లేదు. అయితే ప్రైవేటు కళాశాలల్లోని కేటగిరీ- బి, సి సీట్లకు మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లవచ్చు, అలాగే ఇతర రాష్ట్ర విద్యార్థులు మన రాష్ట్రాల్లోనూ చేరవచ్చు. డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ ఈ నిబంధన లేదు. అంటే ఏ రాష్ట్ర విద్యార్థి ఏ రాష్ట్రంలోనైనా చేరవచ్చు. 371(డి)ను కన్వీనర్‌ కోటాలోని సీట్లకు మాత్రమే వర్తింపజేస్తున్నారు.

పరీక్షా విధానం
నీట్‌-2017 పేపర్‌లో మొత్తం 180 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో బయాలజీ నుంచి 90 (బోటనీ, జువాలజీ కలిపి), ఫిజిక్స్‌ నుంచి 45, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలు ఉంటాయి. బోటనీ, జువాలజీ సమవిభజన ఉండటం లేదు. గత సంవత్సరాల్లోని పేపర్లను పరిశీలిస్తే బోటనీ ప్రశ్నల సంఖ్య జువాలజీ కంటే ఎక్కువగా ఉంటోంది. సుమారుగా 50 ప్రశ్నలు బోటనీ నుంచీ, 40 ప్రశ్నలు జువాలజీ నుంచీ ఉంటాయని భావించవచ్చు. పరీక్ష వ్యవధి- మూడు గంటలు. ప్రతి సరైన సమాధానానికి +4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక రుణాత్మక మార్కు. అంటే నీట్‌ మొత్తం 720 మార్కులకు జరుగుతుంది. పరీక్షాపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. తెలుగు మాధ్యమంలో రాసే అవకాశం కూడా ఉంది. గత సంవత్సరం నుంచి కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే తర్జుమాలో ఏదైనా తప్పు దొర్లితే ఆంగ్లమాధ్యమంలో ఉన్న ప్రశ్ననే ప్రమాణంగా తీసుకుంటారు. తెలుగు విద్యార్థులు తెలుగు మాధ్యమంలో చదివితేనే తెలుగు ఎంచుకోవడం మేలు. ఇంగ్లిష్‌ మీడియం వారు ఆంగ్ల ప్రశ్నపత్రాన్నే తీసుకోవడం మంచిది.

అదనపు సిలబస్‌
నీట్‌-2018 మే మొదటి ఆదివారం- అంటే మే 6, 2018న జరుగుతుంది. సీబీఎస్‌ఈ వారి 11, 12 తరగతుల సిలబసే నీట్‌ సిలబస్‌. ఇదీ తెలుగు రాష్ట్రాల్లోని ఫిజిక్స్‌, కెమిస్ట్రీల సిలబస్సూ ఒకటే. బోటనీ, జువాలజీల్లో మన సిలబస్‌ జాతీయ సిలబస్‌ కంటే కొంత అధికం. ఈ అదనపు సిలబస్‌ నీట్‌లో మన విద్యార్థులు మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతోంది. అంటే వీరు సిలబస్‌పై అవగాహన పెంచుకుని ప్రాక్టికల్స్‌కు సంబంధించి ప్రయోగదీపికలను కూడా చూడగలిగితే సరిపోతుంది. సిలబస్‌ అవధులు తెలుసుకుని తయారైతే సులువుగా విజయం సాధించవచ్చు. సిలబస్‌పై అవగాహన లేక ఇబ్బందిపడటమే చాలామందిలో కనపడుతోంది.

స్టడీ మెటీరియల్‌
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే అతి ముఖ్యమైనది విద్యార్థి ఉపయోగించే స్టడీ మెటీరియల్‌. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌కు పరిమితమయ్యేవారు. ఎంసెట్‌లో ప్రశ్నించే తీరుకీ, నీట్‌లో ప్రశ్నించే తీరుకీ తేడా ఉంది. అందుకని దానికి అనుగుణంగా తయారుచేసిన స్టడీ మెటీరియల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 95 శాతం మంది స్టేట్‌ సిలబస్‌కు పరిమితమవుతున్నారు. అందుకే ఆ ప్రశ్నించే విధానంపై పట్టు ఏర్పడటం లేదు. సీబీఎస్‌ఈ ఆధారిత స్కూల్స్‌ ఎక్కువగా ఉండే ఉత్తర భారతదేశం వారు తయారుచేసిన స్టడీ మెటీరియల్‌ అధిక లాభం చేకూర్చవచ్చు.
ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు ఈ సంవత్సరం విడుదల చేసిన అరిహంత్‌ మాస్టర్‌ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చాలా బాగున్నాయి; సరిపోతాయి.
బయాలజీ పుస్తకాలు కూడా ఫరవాలేదు.

సీబీఎస్‌ఈ బోధనలో, ప్రశ్నపత్రాల తయారీలో అనుభవం ఉన్న అధ్యాపకులు తయారుచేసిన స్టడీ మెటీరియల్‌ను ప్రామాణికంగా తీసుకుని అభ్యసించవచ్చు. విద్యార్థి ఒక ప్రామాణిక పుస్తకాన్నే రెండు మూడుసార్లు పునశ్చరణ చేస్తే వేగం, కచ్చితత్వం పెరుగుతాయి. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు అభ్యసించాలనే అపోహ నుంచి బయటకు రావటం మేలు. దొరికే కాలవ్యవధి చాలా స్వల్పం. ఈ కొద్ది సమయంలో చాలా పుస్తకాలను చదవాలనుకోవడం పొరపాటు. ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి చదవాలి.

ఉదాహరణకు ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్స్‌ చేసేటప్పుడు విధానానికి ప్రాముఖ్యం ఇవ్వాలి కానీ వాడవలసిన ఫార్ములాకు కాదు. అంశాన్ని విశ్లేషించి అవగాహనతో ముందుకు తీసుకుపోయే స్టడీ మెటీరియల్‌ ప్రయోజనకరం. ఒక పుస్తకానికి మాత్రమే పరిమితమై పునశ్చరణతో తయారైతే మెరుగైన ఫలితం ఉంటుంది. ఇప్పటినుంచి మే వరకూ నిర్దిష్ట ప్రణాళిక తయారుచేసుకోవాలి. పరీక్ష మే మొదటివారంలో ఉన్నందున ఏప్రిల్‌లో గ్రాండ్‌ టెస్టులకు కేటాయించుకోవాలి. ఇంటర్‌ పరీక్షల తర్వాత గ్రాండ్‌ టెస్టులలోపు సిలబస్‌ని కొన్ని భాగాలు చేసుకుని పరీక్షలు రాసే ప్రణాళిక వేసుకోవాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్‌, మార్చిలో థియరీ పరీక్షలు! అందువల్ల తయారీ ప్రణాళిక జనవరి 30 లోపు మాత్రమే ఉండాలి. ప్రణాళిక వేసుకునేటప్పుడు ఇంటర్‌ బోర్డు పరీక్షల కంటే నీట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటి నుంచి నవంబరు లేదా డిసెంబరు వరకూ ఫిజిక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. ఆ తర్వాత క్రమంగా ఆ సబ్జెక్టుకు సమయం తగ్గించి బయాలజీ, కెమిస్ట్రీలకు కేటాయించే కాలం పెంచాలి. ఒక డైరీ తీసుకుని ప్రతిరోజూ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో ఏం చదవాలనుకున్నారో ఆ అంశాలను విభజించి నిర్దిష్ట కాలాన్ని కేటాయిస్తూ రాసుకోవాలి. రోజు పూర్తయి రాత్రి నిద్రకు ఉపక్రమించేటపుడు ఆ రోజు డైరీలో రాసుకున్న అంశాలు పూర్తయ్యాయా, మిగిలిపోయాయా చూసుకోవాలి. మిగిలివుంటే దానికి నిజమైన కారణాన్ని డైరీలో రాసుకోవాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే విద్యార్థికి తన బలహీనతలు అర్థమవుతాయి.

స్టడీప్లాన్‌లో పఠనానికి సుదీర్ఘ కాలవ్యవధి ఇవ్వకుండా మధ్యలో ఐదు నిమిషాల పాటు విరామం ఇవ్వాలి. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రివేళల్లో ఎక్కువసేపు చదువుతూ కనీస నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. నవంబరు, డిసెంబరు వరకూ చదవడంలో తర్కం ఉండొచ్చు కానీ తర్వాత తర్కించడం తగ్గించాలి; అధ్యాపకులు చెప్పిన విధానం అవలంబించి మార్కులు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.ఒక ప్రామాణిక పుస్తకాన్నే రెండు మూడుసార్లు పునశ్చరణ చేస్తే వేగం, కచ్చితత్వం పెరుగుతాయి. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు అభ్యసించాలనే అపోహ నుంచి బయటకు రావటం మేలు. దొరికే కాలవ్యవధి చాలా స్వల్పం. ఈ కొద్ది సమయంలో చాలా పుస్తకాలను చదవాలనుకోవడం పొరపాటు. ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. పఠనానికి సుదీర్ఘ కాలవ్యవధి ఇవ్వకుండా మధ్యలో ఐదు నిమిషాల పాటు విరామం ఇవ్వాలి. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది.

సొంతంగా నోట్సు
చదివే అంశాలపై జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడానికి ప్రతి విద్యార్థీ సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. ‘మైండ్‌ మ్యాప్స్‌’ ఇందుకు ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఒక అంశాన్ని తీసుకుని దానికి అనుబంధంగా ప్రశ్నలను ఎలా అడుగుతున్నారో చూసి, దానికి అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఉదా: కెమిస్ట్రీలో అకర్బన రసాయన శాస్త్రంలో ఎక్కువ ప్రశ్నలు గ్రూపుల నుంచి వస్తున్నాయి. వాటి ధర్మాలను ఒక క్రమంలో రాసుకుంటూ పోతే ఆ పుస్తకంలోని ఆ పేజీని చూడగానే అన్ని అంశాలూ గుర్తుకువస్తాయి. సరైన అవగాహనతో చేస్తే మొత్తం రెండు సంవత్సరాల ఫిజిక్స్‌ సిలబస్‌ 15 పేజీల్లోపు, కెమిస్ట్రీ 10 పేజీల్లోపు వస్తుంది. ఇది విద్యార్థి పునశ్చరణకు చాలా బాగా ఉపయోగం. అయితే వీటిలో వివాదాస్పదమైన అంశాలను జోడించవద్దు. అలాచేస్తే విద్యార్థి ఎక్కువ సమయం వాటికి కేటాయించి విలువైన కాలాన్ని కోల్పోయే ప్రమాదముంది.

బలహీనతల గుర్తింపు
ప్రతి విద్యార్థికీ కొన్ని అంశాలపై పట్టు ఉండి, మరికొన్నింటిపై తక్కువ అవగాహన ఉండటం సాధారణమే. మరేం చేయాలి? తనకు అనుగుణంగా ఉన్న అంశాలకు కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించి దానిలో పూర్తి పట్టు ఏర్పరచుకోవాలి. దీంతోపాటే తాను బలహీనంగా ఉన్న చాప్టర్లను పూర్తిగా వదిలేయకుండా వాటిలో కనీసం ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవటం ఆచరణీయం. అంటే పట్టు ఉన్న అంశాలపై ఇంకా శ్రద్ధవహించి పరిపూర్ణత సాధించడం; పట్టులేనివాటిపై సగటు పరిజ్ఞానం ఏర్పరచుకోవడం చేసినపుడే ఉత్తమ ర్యాంకుకు అవకాశం ఉంటుంది. గత సంవత్సరాల్లోని నీట్‌ ప్రశ్నపత్రాలను ఒకసారి సాధించడం ద్వారా విద్యార్థికి తన బలహీనతలు అర్థమవుతాయి. వాటిపై శ్రద్ధవహించాలి కానీ పూర్తి సమయాన్ని వాటికే కేటాయించవద్దు.అలా చేస్తే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బాగా వచ్చినవి కూడా పరీక్షలో సరిగా రాయలేని పరిస్థితి ఏర్పడుతుంది. బలహీనతలు కొంత అధిగమించి ఆత్మవిశ్వాసం ఏర్పరచుకోవడం చాలా ఆవశ్యకం.

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌