• facebook
  • whatsapp
  • telegram

అర్హ‌త సులువే! ఆశించిన సీటే స‌వాలు!

నీట్‌-2021 ప్రణాళిక 

నీట్‌ రాసేవారు పరీక్ష రాయడం, దాని ద్వారా మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో సీటు సాధించడం రెండూ వేర్వేరు అంశాలుగా పరిగణించాలి. నీట్‌ ద్వారా కనీస అర్హత పొందితేనే ఏ కళాశాలలో అయినా ఏదో ఒక కేటగిరీలో సీటు పొందొచ్చు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలన్నా నీట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.  

నీట్‌ యూజీ- 2021 విధానంపై ఇప్పటివరకూ ఎన్‌టీఏ స్పష్టత ఇవ్వలేదు. నీట్‌- 2020 ప్రశ్నపత్రం 180 ప్రశ్నలు- 720 మార్కులుగా (ఫిజిక్స్‌ 45 ప్రశ్నలు, 180 మార్కులు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు, 180 మార్కులు, బయాలజీ 90 ప్రశ్నలు 360 మార్కులు) ఉంది. పై ప్రశ్నలన్నీ నాలుగు ఆప్షన్లతో బహుళైచ్ఛిక ప్రశ్నలు, సింగిల్‌ కరెక్ట్‌ ఆన్సర్‌/ బెస్ట్‌ ఆప్షన్‌. (సరైన సమాధానానికి +4, తప్పు సమాధానానికి -1 మార్కులు).  

జేఈఈ మెయిన్‌లా నీట్‌లోనూ ప్రశ్నల్లో చాయిస్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈ చాయిస్‌ కూడా ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లుగా విడదీసి మొదటి సెక్షన్‌ అన్ని ప్రశ్నలను సమాధానం చేసేవిధంగా, రెండో సెక్షన్‌లో 5 ప్రశ్నలను చాయిస్‌గా ఇవ్వవచ్చు. దీనిపై ఎన్‌టీఏ అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మొత్తం 200 ప్రశ్నలకుగానూ ఫిజిక్స్‌లో 5 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 5 ప్రశ్నలు, బయాలజీలో 10 ప్రశ్నలు చాయిస్‌ రావొచ్చు.

ఏదిఏమైనా నీట్‌లో అర్హత సాధించడం సులభం. గత మూడేళ్ల అర్హత మార్కులను గమనిస్తే ఏ మార్కు సాధిస్తే క్వాలిఫై అవ్వొచ్చో అవగాహన వస్తుంది.

కరోనా నేపథ్యంలో ఎన్‌టీఏ జేఈఈ మెయిన్స్‌లో కానీ నీట్‌ సిలబస్‌లోకానీ ఎలాంటి తొలగింపు చేయలేదు. ప్రశ్నపత్రం తీరులోనూ మార్పు లేదు. పరీక్ష సమయం, పరీక్ష తీరు, మార్కులు, ప్రశ్నల సంఖ్యలో ఏ మార్పూ లేదు.

కటాఫ్‌ మార్కు ఎలా?

జనరల్‌ కేటగిరీ విద్యార్థి క్వాలిఫై అవడమంటే 50 పర్సంటైల్‌ తెచ్చుకోవాలి. అంటే పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల మార్కులను ఆరోహణ క్రమంలో అమర్చి మధ్య విద్యార్థి అంటే 50వ పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థి ఏ మార్కు సాధిస్తారో ఆ సంవత్సరం ఆ మార్కును కటాఫ్‌ మార్కుగా నిర్ణయిస్తారు. గత నాలుగేళ్లుగా ఈ కటాఫ్‌ మార్కు 119 నుంచి 147 లోపు (720 మార్కులకు) ఉంది. 

అందుకని- ఈ మార్కు సాధించడం సాధారణ విద్యార్థికి కూడా సులువే. అవగాహనతో సరైన ప్రణాళికతో కేవలం ఒక సబ్జెక్టుకు ప్రాధాన్యమిచ్చి చదివినా కూడా ఈ మార్కు సాధించవచ్చు. ఉదాహరణకు బయాలజీని బైపీసీ విద్యార్థి సులభంగానే భావిస్తారు. కాబట్టి, దానిలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలకు పరిమితమై ఆ పుస్తకాల్లోని వాక్యాలను ప్రశ్నలుగా మలచి చదవగలిగితే 90 ప్రశ్నల్లో సాధారణ విద్యార్థి కూడా 70- 80 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలడు. గత మూడేళ్లుగా 81 నుంచి 84 నీట్‌ ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని వాక్యాలే. సగటున 75 ప్రశ్నలు సరిగా రాశారని భావించినా విద్యార్థి అర్హత సాధించడమే కాకుండా కొన్ని స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లో లేదా ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కేటగిరీ- సిలో సీటు సాధించే అవకాశం ఉంటుంది.

పెరుగుతోంది పోటీ

మూడు సంవత్సరాలుగా ఈ పరీక్షపై అవగాహన పెరుగుతోంది. పోటీ కూడా పెరుగుతోంది. గతంలో జేఈఈ మెయిన్‌ రాసేవారి సంఖ్య బాగా ఎక్కువగా; మెడికల్‌ విభాగంలో పరీక్ష రాసేవారి సంఖ్య తక్కువగా ఉండేది. కానీ గత రెండేళ్ల నుంచి పరిస్థితి మారింది. నీట్‌ రాసేవారి సంఖ్య జేఈఈ మెయిన్‌ రాసేవారి కంటే ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది నీట్‌కు 16,50,000 మంది వరకూ హాజరయ్యారు. పోటీ పెరిగిందనడానికి - తొలి ర్యాంకు మార్కు, అధిక మార్కులో ఉండే విద్యార్థుల సంఖ్య పెరగడమే నిదర్శనం! 

ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థి మార్కులను చూద్దాం. నీట్‌- 2020లో 720, నీట్‌- 2019లో 701, నీట్‌- 2018లో 691, నీట్‌- 2017లో 697. గత ఏడాది 720 మార్కులకు ఇద్దరు విద్యార్థులు 720 మార్కులు సాధించారు. ఈ అత్యధిక మార్కు 690 నుంచి 720కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో మంచి కళాశాలలో సీటు సాధించాలంటే 720 మార్కులకు 550కుపైగా సాధించేలా విద్యార్థుల ప్రణాళిక ఉండాలి.

మొదట ఏఐక్యూ (ఆల్‌ ఇండియా కోటా) సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ ఎ, కేటగిరీ బి, కేటగిరీ సి సీట్లు... ఈ విధమైన వరుస క్రమంలో విద్యార్థులు కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు పొందుతున్నారు.

తొలి కేటగిరీ ఏఐక్యూలో సీటు పొందాలంటే 720 మార్కులకు 580కుపైగా సాధించాలి. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 520 మార్కులకుపైగా, ప్రైవేటు కేటగిరీ-ఎలో అయితే 510కిపైగా, కేటగిరీ బి, సి అయితే 300 మార్కులకుపైగా సాధించినవారే సీట్లు చేజిక్కించుకుంటున్నారు. 

జాతీయ స్థాయిలో 60,000 వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కొన్ని మెడికల్‌ కళాశాలల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎంబీబీఎస్‌లో చేరాలంటే నీట్‌లో కనీసం 500 మార్కులు వచ్చేలా తయారవ్వాలి. అంటే అత్యధిక ప్రాధాన్యం బయాలజీకి ఇచ్చి 90 ప్రశ్నల్లో కనీసం 80 ప్రశ్నలు సాధించేలా పట్టు సాధించాలి. అంటే బయాలజీలో 80 × 4 = 320 మార్కులు సాధిస్తే తర్వాత కెమిస్ట్రీలోని 45 ప్రశ్నల్లో 40 వరకు గుర్తించేలా అభ్యాసం చేస్తే 160 మార్కులు కెమిస్ట్రీలో వస్తాయి.

భౌతిక శాస్త్ర విభాగం గత మూడేళ్ల ప్రశ్నలను విశ్లేషిస్తే చాలా సులభంగా ఉంటోంది. దానిలోనూ కొద్దిగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలోని లెక్కలను అన్ని మోడళ్లు సాధించగలిగితే ఇక్కడ కూడా 40 ప్రశ్నల వరకు తేలిగ్గానే వస్తాయి. గత ఏడాది ఎక్కువమంది విద్యార్థులకు రసాయనశాస్త్రంలో కంటే భౌతికశాస్త్రంలోనే అధిక మార్కులు వచ్చాయి. ఇలా 600 మార్కులను లక్ష్యం చేసుకుంటే తేలిగ్గా 500పైగా సాధించి మెడికల్‌ సీటు సాధించుకోవచ్చు.

నీట్‌ ఆగస్టులో ఉంది. ఇప్పటినుంచి ఈ సమయాన్ని విద్యార్థులు తమకు అనుకూలంగా ప్రణాళిక వేసుకోవాలి. మేలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉన్నాయి. ఇప్పటినుంచి ఆ పరీక్షలు అయ్యేవరకు ద్వితీయ సంవత్సర సిలబస్‌ను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ టైప్‌లో తయారు కావాలి. ఇంటర్‌ పరీక్షలు ముగిశాక తొలి సంవత్సర సిలబస్‌కు ప్రాధాన్యమిచ్చి పునశ్చరణ చేసుకోవాలి. ఆపై కనీసం 10 గ్రాండ్‌ టెస్టులు రాయగలిగితే తుది పరీక్షకు సంపూర్ణంగా తయారయినట్లే అవుతుంది!

Posted Date : 29-03-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌