• facebook
  • whatsapp
  • telegram

సిలబస్‌ క్షుణ్ణంగా.. రివిజన్‌ ధీమాగా!

నీట్‌-2021 మొదటి ర్యాంకర్‌ మృణాల్‌ కుటేరి

నీట్‌..!  విద్యార్థులు తమ డాక్టర్‌ కలను నిజం చేసుకునేందుకు దాటాల్సిన ప్రవేశద్వారం! అక్కడికి చేరేందుకు దారులు అంత సులువేం కాదు.. కఠోర శ్రమ, నిర్విరామ అభ్యాసం, అన్నింటికీ దూరంగా ఉంటూ ఏకాగ్రత పెంచుకోవడం.. అదో ముళ్లదారి! కానీ, ఈ అభిప్రాయాలను పటాపంచలు చేశాడో విద్యార్థి. గంటల తరబడి చదవలేదు, శిక్షణా పెద్దగా తీసుకోలేదు. స్నేహితులతో ముచ్చట్లు ఆపలేదు, ఇష్టమైన వీడియో గేమ్‌ని వదల్లేదు. ఖాళీగా ఉన్న లాక్‌డౌన్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌లు అదనం. ఇవన్నీ చేస్తే ఇక నీట్‌ ర్యాంకేంటి..  పాస్‌ అవటమే కష్టమనుకుంటున్నారు కదూ.. కానీ, అతడు సాధించాడు.. అలా ఇలా కాదు;  ఏకంగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధించేశాడు! అతడే హైదరాబాద్‌కు చెందిన మృణాల్‌ కుటేరి. తన విజయ ప్రస్థానాన్ని ఈనాడు- ‘చదువు’తో ఇలా పంచుకున్నాడు.. 

మాది హైదరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో రాధాకృష్ణ నగర్‌. కేరళ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. నాన్న మురళీధర్‌ కుటేరి హెచ్‌ఆర్‌ సంస్థ నడిపిస్తున్నారు. అమ్మ రతీరవీంద్రన్‌ కన్సల్టెంట్‌. నేను ఇంటర్మీడియట్‌ దాకా హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆకాశ్‌లో నీట్‌ శిక్షణ తీసుకున్నాను. ఇంటర్మీడియట్‌ మొత్తం కొవిడ్‌ సమయంలోనే గడిచింది. కాబట్టి ప్రత్యక్ష చదువులకు అవకాశం లేకుండానే చదువు పూర్తయిపోయింది. దీనికి తోడు నీట్‌కు సన్నద్ధమయ్యే సమయమంతా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అలాంటి వాతావరణంలో మనల్ని ఆకట్టుకుని ప్రిపరేషన్‌ చెడగొట్టే చాలా విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. నా విషయంలోనూ టీవీ, వీడియోగేమ్స్‌ ఇలా ఎన్నో ఉన్నా.. వాటిని ఆస్వాదిస్తూనే ఎలాంటి ఒత్తిడీ లేని వాతావరణంలో చదువు కొనసాగించాను.

చిన్నతనం నుంచే వైద్యరంగంపై ఆసక్తి ఉండేది. ఆర్మీ డాక్టర్‌ వృత్తిని చూశాక ఈవైపు మనసు మళ్లింది. అది ఎంతో సాహసోపేతమైన వృత్తి, దాంతోపాటు సేవ చేసే అవకాశం. దాన్ని చూశాక నేనూ ఇలా ఆర్మీ డాక్టర్‌ కావాలనే ఆలోచన మొదలైంది. 9వ తరగతికి వచ్చాక వైద్యుడినైతే చాలు అది ఏ విభాగమైనా పర్లేదనే ఆలోచనకి వచ్చాను. ఆ దిశగానే నా చదువు మొదలుపెట్టాను. ఊహించకుండానే 720 మార్కులు, మొదటి ర్యాంకు వచ్చాయి. 

నా సన్నద్ధతలో ఒత్తిడిని ఓడించడం తొలి విజయమైతే, ఎన్‌సీఈఆర్‌టీ విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవడం రెండో గెలుపు. 

అభ్యాసమే అసలు గెలుపు

నీట్‌ విషయంలో డిసైడింగ్‌ సబ్జెక్టు భౌతికశాస్త్రం. ఓ సీటొస్తే చాలు అనుకునేవారు కేవలం తమకు వచ్చిన విషయాలపైనే దృష్టిపెడతారు. కొందరు రానిది కూడా చదివే ప్రయత్నం చేసి విఫలమవుతుంటారు, కానీ నా విషయంలో అలా జరగలేదు. అందరి విషయంలో ఒకే ఫార్ములా కుదరకపోవచ్చు. నేను పదకొండో తరగతి నుంచే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ పూర్తిగా చదివేశాను. పరీక్షలకు నాలుగు నెలల ముందు నుంచి రివిజన్‌ మొదలుపెట్టాను. ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంచుకునేందుకు ఈ అభ్యాసం కలిసొచ్చింది.

మనకేది సరైనదో తెలుసుకుని..

మొదట పరీక్షకు సన్నద్ధం కావాలనే ఆలోచన వచ్చిన వెంటనే ఆన్‌లైన్లో, వివిధ పత్రికల్లో వచ్చిన టాపర్ల ముఖాముఖిలు, శిక్షకుల గైడెన్స్‌ ఆర్టికల్స్‌ చదివాను. వాటిని బట్టి నాకు ఏ మార్గం అయితో సరైనదో ఓ నిర్ధారణకు వచ్చాను. ఎలా చదివితే టాప్‌ ర్యాంకు వస్తుందనే విషయంపై ఎక్కువమందిని సంప్రదించి వివరాలు తెలుసుకున్నాను. కానీ, అందులో ఏదీ నాకు కుదరలేదు. కొందరు ‘మార్కులెందుకు పోయాయి?’ అంటే ‘ఒత్తిడి’ అనే జవాబిచ్చారు. నీట్‌ అంటే సాధారణ పరీక్ష కాదు కాబట్టి ఆ విషయాలు, పరీక్షకు తగ్గట్టే మనసుపై చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడమే మొదటి పనిగా పెట్టుకుని ప్రయత్నం చేశాను. అసలెక్కడా ఒత్తిడి దరిచేరనివ్వలేదు.

గంటల తరబడి ఎందుకు..?

నేను నీట్లో రాణించేందుకు ప్రత్యేక ప్రణాళికలేం పెట్టుకోలేదు. రెండేళ్ల కాలంలో శిక్షణ సంస్థ చెప్పిన విషయాలపై దృష్టి పెట్టడం, అన్ని సబ్జెక్టులను ఖాళీ సమయాల్లో చదవడం చేశాను. ఆన్‌లైన్‌ శిక్షణ కాకుండా ఇంట్లో 3, 4 గంటలు మాత్రమే సన్నద్ధత మీద దృష్టి పెట్టాను. మిగతా సమయాల్లో వీడియో గేమ్స్‌ ఆడటం, నచ్చిన వెబ్‌ సిరీస్‌ చూడటం చేశాను. ఎప్పుడూ ఉదయం 9 గంటలకు ముందూ, రాత్రి 10గంటల తర్వాతా నేను పుస్తకాలు పట్టింది లేదు. స్మార్ట్‌గా విషయాలను విభజించుకుని చదివేసి వాటిపై అవగాహన పెంచుకుంటే చాలని నమ్మాను కాబట్టి గంటల తరబడి దానికే కేటాయించి దానిపై విరక్తి పుట్టేలా చేసుకోలేదు. ఇష్టమొచ్చిన విషయాన్ని చాలా ఇష్టంగా చదివాను. అదే సులువుగా మార్కులు సాధించేందుకు సాయపడింది.

రోజుకు రెండు పరీక్షలు!

మన తప్పుల్ని సరిదిద్దుకునేందుకూ, ఎందులో బలంగా ఉన్నామో, మన బలహీనత ఏంటో తెలుసుకోవాలంటే కనీసం రోజుకు ఒకటి- రెండు మాక్‌ పరీక్షలు రాయాలి. పరీక్షకు సమయాన్ని ఎలా వాడుకోవాలో కూడా ఈ పరీక్షల ద్వారా తెలిసొస్తుంది. ప్రశ్నలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేయాలి. తర్వాత వాటిని దిద్దుకుని స్వయంగా తప్పుల్ని వెతుక్కుని వాటిని మార్చుకోవడంతో పాటు ఆ విషయంపై మరింత దృష్టి సారించాలి. ఇలా చేస్తే అనుకున్న ర్యాంకు సులువుగా వచ్చేస్తుంది. నా విషయంలో శిక్షణ సంస్థ పెట్టిన పరీక్షలతో పాటు నాకు నేనే ఇంటి దగ్గర రెండు పరీక్షలు రాసేవాణ్ణి. పోర్షన్ల వారీగా ఓ పరీక్ష రాసి మళ్లీ పూర్తి సబ్జెక్టుకు ఓ పరీక్ష రాసేవాన్ని అదే లోపాలు గుర్తించేందుకు ఉపయోగపడింది. ఎంత చదివినా మరిచిపోతుంటాం.. నా విషయంలోనూ పరీక్ష సమయానికి ఎక్కడ మరిచిపోతానో అనే భయంతో మళ్లీ మళ్లీ చదవడంతో పాటు ప్రాక్టీస్‌ పరీక్షలు రాశాను. అవి కలిసొచ్చాయి.

20 ప్రశ్నలు వాడుకున్నా..

ఏటా నీట్‌లో 180 ప్రశ్నలు ఇస్తుంటారు. కొవిడ్‌తో ఈసారి 20 ప్రశ్నలు అదనంగా పెంచి మొత్తం 200 ప్రశ్నలు ఇచ్చారు. నాకు ఆ అదనంగా ఇచ్చిన 20 కలిసొచ్చాయి. చాలావరకు ప్రశ్నల్లో 50, 50 సమాధానాలు చాలానే ఉన్నాయి. పూర్తి అవగాహన లేదు. వాటిని ఈ చాయిస్‌ కింద వదిలేశాను. పరీక్షలో ముందు బాగా వచ్చిన ప్రశ్నలను సాల్వ్‌ చేసేందుకు ప్రయత్నం చేశాను. వాటికి సరైన సమాధానం సాధించిన తర్వాతే వేరే వాటికి వెళ్లాను. కొన్ని ఏదైతే అదైందని అదృష్టం మీద భారం వేసుకుని అన్ని జవాబులు ఇచ్చి వచ్చాను. అవి ఉపయోగపడ్డాయి. పరీక్ష అయిపోయిన తర్వాత ఓఎంఆర్, కీ పేపర్‌ను సరిచూసుకుంటే నేను పెట్టినవి అన్నీ సరైనవే అని గుర్తించాను. కానీ ఫలితాలు వచ్చేదాకా మొదటి ర్యాంకును ఊహించలేదు.

అంతా ఎన్‌సీఈఆర్‌టీనే..

గత ఏడాది పరీక్షలో బయాలజీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు అనిపించింది. ఆ ప్రశ్నపత్రాన్ని పెద్దగా విశ్లేషణ చేయాలనిపించలేదు. అందుకే మళ్లీ పట్టించుకోలేదు. కానీ ఈ రెండు సబ్జెక్టులను ఎక్కువ చదివాను, ప్రశ్నలను సాధన చేశాను కాబట్టి ఎక్కువ మార్కులు వాటి నుంచే వచ్చాయి. వీటితోపాటు భౌతికశాస్త్రం, కెమిస్ట్రీలపై థీరీతో పాటు సమస్యలు సాల్వ్‌ చేసేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల మీదే ఆధారపడ్డాను. ఈ పరీక్షకు సంబంధించి పూర్తి ప్రాణం ఇదేనని భావిస్తున్నాను.

వ్యాపకాలను వదులుకోవద్దు!

పరీక్ష, చదువుపై ఒత్తిడి తగ్గించుకునేందుకు మన అలవాట్ల్లూ, వ్యాపకాలే మంచి దారి. నా వరకు పాటలు వినడం, వీడియో గేమ్స్‌ ఆడటం రిలీవ్‌మెంట్‌. వాటిని ఆస్వాదిస్తూ ఖాళీ సమయాల్లోనే చదవడం, సాధన చేయడం కలిసొచ్చిన అంశం.

గుడ్డిగా అనుసరించొద్దు!

ఎవరో ఏదో చెప్పారని, వాళ్లు అదే చదివారని మనం కూడా అంతే గుడ్డిగా అదే విషయాన్ని చదివేయొద్దు. ఒక్కొక్కరికి ఒక్కో దారి కలిసొస్తుంది. నాకు ఫ్రీగా చదవడం కుదిరింది, అందరికీ అదే సెట్టవదు. కాబట్టి అన్నిదారుల్ని వెతుక్కుని అందులో మనకేది కుదురుతుందో ఆ మార్గాల్లో సాధన చేయడం ఉత్తమం. అప్పుడే అనుకున్న మార్కులు, ర్యాంకులు సాధ్యమవుతాయి. స్మార్ట్‌గా చదవండి, విషయాలపై నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేయండి.

ఎప్పటికప్పుడు నోట్స్‌

ప్రతిరోజూ చదివే అంశం గుర్తుండేందుకూ, చివరి దశలో పునశ్చరణ సులువు అయ్యేందుకూ సొంతంగా నోట్స్‌ రాసుకునేవాణ్ణి. భౌతికశాస్త్రంలో సమస్యల అభ్యాసానికీ, కీ పాయింట్లు రాసుకునేందుకూ, రఫ్‌ వర్క్‌కీ ఈ నోట్స్‌ వాడుకున్నాను. ఫలితంగా చివర్లో ఓసారి పునశ్చరణ సమయంలో దీన్ని చూసుకుంటే సరిపోయింది.

పూర్తి మార్కులు ఈ రెండింటితో!

నేను పరీక్షకు సన్నద్ధత మొదలుపెట్టిన నాటి నుంచి పరీక్ష రాసేదాకా రెండు విషయాలపైనే నా దృష్టంతా ఉంది. అవే ఒక్క మార్కు పోకుండా మొత్తం 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకు కొట్టేందుకు సాయపడ్డాయి. 

1. ప్రశాంతమైన మనసు: నీట్‌ లాంటి పరీక్షలు రాసేటప్పుడు విషయంపై ఎంత అవగాహన ఉన్నా.. మనమెంత టాపర్లమైనా ప్రశాంతమైన మనసూ, ఒత్తిడి లేని వాతావరణమూ లేకపోతే రాసేది కూడా రాయలేం. నా గెలుపులో ఇదే తొలి కారణం. దాంతోపాటు ఇంట్లో అమ్మానాన్న నాకు నచ్చినదానిపైనే దృష్టిపెట్టేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడూ నా చదువులపై ఆరా తీయడం, మార్కులను పట్టించుకోవడం చేయలేదు. దానికితోడు మా శిక్షణ సంస్థలోనూ మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఒత్తిడి ఉన్నా అసలు నేను ఆవైపే ఆలోచించలేదు.

2. కాన్సెప్ట్, క్లారిటీ: శిక్షణ సంస్థలిచ్చిన మెటీరియల్‌ కంటే ఈ సన్నద్ధతలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలదే ముఖ్య భూమిక. అందులో ఉన్న సిలబస్‌ను చదివేస్తే పెద్దగా శిక్షణలే అక్కర్లేదనేది నా భావన. కొన్నిసార్లు విషయాలపై ఏదైనా సందేహం వస్తేనో, రివిజన్‌ సమయంలోనో శిక్షణ సంస్థల మెటీరియల్‌ అనుసరించాను. ఈ పరీక్షలో టాప్‌ 10 ర్యాంకు రావాలంటే ఏం చదువుతున్నాం, దానిపై మనకు ఎంతవరకు నాలెడ్జ్‌ ఉంది, ఎంత లోతుగా చదివాం అనేవి చూడాలి. అంత నైపుణ్యం వచ్చినప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా పరిష్కరించే సత్తా మనకొస్తుంది. నా విషయంలో ఇదే కలిసొచ్చింది.

- అభిసాయి ఇట్ట (ఈనాడు, హైదరాబాద్‌)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒత్తిడిని ఓడించండి!

‣ నాణ్యమైన విద్యకు నవోదయం

Posted Date : 05-11-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.