• facebook
  • whatsapp
  • telegram

పునశ్చరణతో పట్టు... మాక్‌ పరీక్షలతో ధీమా!

మేటి ర్యాంకుకు నీట్‌ వ్యూహం

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మెడికల్, డెంటల్, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌- 2022 (యూజీ) పరీక్ష తేదీ జులై 17గా ఖరారైంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 6న ముగియనుంది. దీనిలో గరిష్ఠ మార్కులూ, మెరుగైన ర్యాంకు తెచ్చుకునేదెలా?  నిపుణుల సూచనలు ఇవిగో!  

జాతీయ స్థాయిలో నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) యూజీ పరీక్షను 2013 నుంచి 2018 వరకు సీబీఎస్‌ఈ నిర్వహించింది. 2019 నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. నీట్‌ ద్వారా అభ్యర్థి సాధించిన ర్యాంకు ఆధారంగా జాతీయస్థాయిలో 15 శాతం నేషనల్‌ పూల్‌ లేదా ఆల్‌ ఇండియా కోటా (ఏఐక్యూ) సీట్లు, మిగిలిన 85 శాతం ఆయా రాష్ట్రాల్లో స్థానిక సీట్లు పొందడానికి వీలవుతుంది. జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఎయిమ్స్, జిప్మర్, ఏఎఫ్‌ఎమ్‌సీ, బీహెచ్‌యూలతోపాటు ప్రముఖ కేంద్రీయ వైద్య విద్యాసంస్థలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని పొందాలంటే నీట్‌ పరీక్ష ద్వారా అర్హత సాధించాలి. 

నీట్‌ 2021 పరీక్షకు 16.14 లక్షలకుపైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే 95.6 శాతం పరీక్షకు హాజరయ్యారు. వారిలో దాదాపు 56.4 శాతం (8,70,074 మంది) అర్హతను పొందారు. ఈ అభ్యర్థుల్లో బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 1.19 లక్షలు ఎక్కువ. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరిలో దాదాపు 2.4 లక్షలమంది అర్హత సాధించారు. 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు

నీట్‌కు 80 రోజులకు పైగా వ్యవధి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులూ ఈమధ్యలో 20 రోజుల వరకు బోర్డు పరీక్షల కోసం సమయాన్ని వెచ్చించాలి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన రోజులకు సరిపడా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 

పాఠ్యాంశాలను చదువుతున్నప్పుడు సమాంతరంగా షార్ట్‌ నోట్స్‌లో కీలకమైన, క్లిష్టమైన అంశాలనూ, అనువర్తనాలనూ రాసుకుంటూ ఉండాలి. ఈ నోట్సులో పొందుపరిచినవి పునశ్చరణకు ఉపయోగపడతాయి. 

నమూనా ప్రశ్నపత్రాలతోపాటు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి. ఈ సందర్భంగా ఏ అంశాల్లోని ప్రశ్నలు తప్పుగా గుర్తిస్తున్నారో గమనించి వాటిని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి.

ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టుకు కొంత సమయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలు చదవడానికి వినియోగించాలి. ఎందుకంటే ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షకు ఈ పుస్తకాలు ప్రామాణికం. 

బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. వాటిని పట్టికల రూపంలోనో, ఫ్లోచార్టుల రూపంలోనో రాసి ఉంచుకుని వీలైనన్నిసార్లు పునశ్చరణ చేయాలి. 

సబ్జెక్టుల్లో వచ్చే సందేహాల నివృత్తికి అధ్యాపకుల సహాయం తీసుకుంటూ పాఠ్య పుస్తకాల్లోని అంశాలపై పట్టు సాధించాలి. 

తేలికగా అనిపించే అధ్యాయాలను ఎక్కువసార్లు చదవడం తగ్గించి, కష్టమైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. 

బంధువులతో, స్నేహితులతో నిరుపయోగ చర్చలను నివారించాలి. ఉదాహరణకు ప్రశ్నపత్రం కష్టంగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా... లాంటి విషయాలను చర్చించకూడదు. 

కనీసం 20 గ్రాండ్‌ టెస్టులు

నీట్‌ పరీక్ష తేదీలోగా కనీసం 20 గ్రాండ్‌ టెస్ట్‌లను సాధన చేయడం మంచిది. 

సబ్జెక్టులవారీగా సమయ విభజన పరీక్షలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ముందునుంచే దాన్ని అలవరుచుకోవాలి. 

నేరుగా జవాబులను గుర్తించగలిగే ప్రశ్నలన్నింటినీ ముందుగా పూర్తిచేసి అనుమానంగా ఉన్నవీ, అధిక సమయం తీసుకునేవీ చివర్లో పూర్తి చేసుకోవాలి 

పార్ట్‌-బిలో అన్ని ప్రశ్నలనూ ప్రయత్నించకుండా బాగా తెలిసిన 10 ప్రశ్నలను సబ్జెక్టువారీగా గుర్తించడానికి సాధన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త. 

వీలైనన్ని మాక్‌ టెస్టులను (నమూనా పరీక్ష) సాధన చేయాలి. దీనివల్ల సమయ పాలనపై తగిన పట్టు సాధించవచ్చు.

పరీక్ష విధానం

గత సంవత్సరం నుంచి స్వల్ప మార్పులు జరిగాయి. అంతకుముందు ఉన్న 180 ప్రశ్నలకు బదులుగా 200 ప్రశ్నలను ఇస్తున్నారు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 90, 45, 45 ప్రశ్నలకు బదులుగా 100, 50, 50 చొప్పున ఇస్తున్నారు. బయాలజీలో బోటనీ, జువాలజీల్లో 50, 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్‌-ఎలో 35 ప్రశ్నలు, సెక్షన్‌-బిలో 15 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌-ఎలో ఉన్న ప్రశ్నలన్నింటితోపాటు సెక్షన్‌-బిలో 10 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలి. సెక్షన్‌లలో చాయిస్‌ ఉందని దీని అర్థం.

ఒకవేళ సెక్షన్‌-బిలో 10 కంటే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలకు జవాబులు గుర్తించినా వాటిలో మొదటి 10 ప్రశ్నల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున మొత్తం 180 ప్రశ్నలకు గరిష్ఠ మార్కుల సంఖ్య 720. ఏదైనా ప్రశ్నకు జవాబును తప్పుగా గుర్తిస్తే 1 మార్కును తగ్గిస్తారు. అంటే తప్పుగా గుర్తించిన ప్రశ్న వల్ల 5 మార్కులు కోల్పోవలసి ఉంటుంది.

‘తేలికగా ఉంది. చాయిస్‌ కూడా ఉంది’ అనుకున్నా దీనిలో రెండు ఇబ్బందులున్నాయి. 1. నెగిటివ్‌ మార్కులు. 2. సెక్షన్‌-బిలో సరైన ప్రశ్నల ఎంపిక 

గతంలో 3 గంటల కాల వ్యవధిలో 180 ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తిస్తే ఇప్పుడు 200 నిమిషాల్లో (3 గంటల 20 నిమిషాల్లో) 200 ప్రశ్నల్ని చదివి, వాటిలో 180 ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కచ్చితత్వం, త్వరితంగా జవాబుల్ని సాధించడం రెండూ చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా మార్కులపై, ర్యాంకుపై ప్రభావం ఉంటుంది. 

ప్రశ్నపత్రంలో ఉన్న 200 ప్రశ్నలన్నీ బహుళైచ్ఛికమే. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఉంటే వాటిలో సరైన జవాబును ఎంచుకోవాలి. సరైన జవాబును ఓఎంఆర్‌ షీటుపై బ్లూ లేదా బ్లాక్‌ ఇంక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ సహాయంతో గుర్తించాలి. రఫ్‌ వర్క్‌ చేయడానికి ప్రత్యేకంగా వేరే కాగితాలు ఇవ్వరు. కాబట్టి ప్రశ్నపత్రంలో ఉన్న ఖాళీ ప్రదేశాలను మాత్రమే దీని కోసం ఉపయోగించుకోవాలి.

         NEET - E-Books         


మ‌రింత స‌మాచారం... మీకోసం!

NEET Study Material

Telugu Medium English Medium


 

Download
 Previous Papers  E.M T.M
 Model Papers  E.M T.M

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వర్తమానం... పోటీ పరీక్షలకు ప్రాణం!

‣ చక్కగా నిద్రపోతే బాగా గుర్తుంటుంది!

‣ దక్షిణాసియా వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ

‣ వేగంగా చదివితేనే.. పాసయ్యేలా..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-04-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.