• facebook
  • whatsapp
  • telegram

మార్కుల మంత్రం.. సమయపాలనే! 

50 రోజుల నీట్‌ ప్రణాళిక

మెడికల్‌ సీటు కోసం రాయాల్సిన ‘నీట్‌’ షెడ్యూల్‌ విడుదలైంది. ప్రవేశపరీక్ష తేదీ తెలిసింది; స్పష్టత ఏర్పడింది! ఇప్పటివరకూ వరస వాయిదాలతో డీలా పడిన విద్యార్థులు ఇక తుది సన్నద్ధతకు సిద్ధం కావాలి. పరీక్ష విధానంలో స్వల్పంగా వచ్చిన మార్పులు గమనించాలి. గరిష్ఠ మార్కులు సాధించే దిశగా ప్రిపరేషన్‌నూ, పునశ్చరణనూ పదునెక్కించాలి! 

జాతీయ, రాష్ట్ర స్థాయుల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌., బీడీఎస్‌., ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి జరిపే నీట్‌-2021 (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) సెప్టెంబరు 12వ తేదీన నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ విధానంలో (కలం, కాగితంతో రాసే పరీక్ష) ఇంగ్లిష్, హిందీలతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నీట్‌ జరుగుతుంది.

కొవిడ్‌-19 నేపథ్యంలో మేలో జరగవలసిన పరీక్ష ఆగస్టుకు వాయిదాపడి ఆ తర్వాత సెప్టెంబరు 12వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు నింపడంలో విద్యార్థి దగ్గర సంపూర్ణ సమాచారం లేనప్పటికీ దాన్ని రెండు భాగాలుగా ఒకటి ఇప్పుడు, మిగిలిన వివరాలను ప్రవేశానికి ముందు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడు పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా తేదీలను నిర్ణయించారు. 

పరీక్ష సిలబస్, పరీక్ష విధానం, అర్హత, వయః పరిమితి, రిజర్వేషన్‌ విధానం, పరీక్షా కేంద్రాలు... వీటన్నింటినీ, సంబంధిత దరఖాస్తునూ https://neet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మార్పులు స్వల్పమే

గత సంవత్సరం వరకు పరీక్షలో 180 ప్రశ్నలు ఉండేవి. వాటిలో బయాలజీ- 90, ఫిజిక్స్‌- 45, కెమిస్ట్రీ- 45. ప్రతి సరైన సమాధానానికీ¨ +4 మార్కులు, తప్పు సమాధానానికి మైనస్‌ 1 మార్కు. వీటిలో బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉండేవి. కానీ బోటనీ నుంచి 45, జువాలజీ నుంచి 45 కచ్చితంగా ఉండేవి కాదు. అయితే కరోనా కారణంగా ప్రతి సబ్జెక్టులో 5 ప్రశ్నలు చాయిస్‌ రూపంలో వదిలివేసే విధంగా అవకాశం కల్పించారు.

ఈ సంవత్సరం జరగబోయే పరీక్ష విధానంలో స్పల్ప మార్పులున్నాయి. మొత్తం 180కి బదులు 200 ప్రశ్నలు ఉంటాయి. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ఇస్తున్నారు. ప్రతి సబ్జెక్టులోనూ 45 స్థానంలో 50 ప్రశ్నలు సెక్షన్‌-ఎ, సెక్షన్‌-బిగా ఇస్తారు. 

చకచకా.. కచ్చితంగా!

నీట్‌లో 3 గంటల కాల వ్యవధిలో 180 ప్రశ్నలకు జవాబు గుర్తించాలి. అంటే ఎంసెట్‌లో ఉన్న 160 ప్రశ్నలకంటే 20 ప్రశ్నలు అధికం. పైగా రుణాత్మక మార్కులు ఉన్నాయి. 

ఎంసెట్‌తో పోలిస్తే.. నీట్‌ పరీక్షలో విద్యార్థికి వేగం, కచ్చితత్వం ఎక్కువ ఉండాలి. 180 ప్రశ్నలకే సమయం చాలనప్పుడు 200 ప్రశ్నలు చదివి జవాబులు గుర్తించాలంటే సరైన అభ్యాసం, ప్రణాళిక ఉండాల్సిందే. లేకపోతే పరీక్షా సమయంలో అధిక ఒత్తిడికి లోనై తెలిసిన ప్రశ్నలకు కూడా జవాబు గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మరేం చేయాలి?

దీనికి విద్యార్థి అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే.. సబ్జెక్టుపరంగా కాలాన్ని విభజించుకోవాలి. దాని ప్రకారమే జవాబులు గుర్తించే విధంగా ఇప్పటి నుంచే ఈ 50 రోజులూ అభ్యాసం చేయాలి. వేగంగా జవాబులు గుర్తించటం సాధన చేయాలి. 

బయాలజీకి 50 నిమిషాలు, ఫిజిక్స్‌కు గంట, కెమిస్ట్రీకి 45 నిమిషాలు, మిగిలిన 25 నిమిషాలూ మిగిలిపోయిన ప్రశ్నలకు .జవాబు గుర్తించడానికి కేటాయించాలి. 

పరీక్ష ప్రారంభించేటప్పుడు ఏ సబ్జెక్టుతో ప్రారంభించాలనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదు. గతంలో ఏ విధంగా అభ్యాసం చేశారో అదే విధంగా.. అదే వరుసలో జవాబులు గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలి. 

బయాలజీతో ప్రారంభించే విద్యార్థి ఆ సబ్జెక్టు ప్రశ్నలు నిడివిగా ఉన్నప్పటికీ 50 నిమిషాల్లో పూర్తిగా జవాబులు గుర్తించాలి. అందుకోసం- సబ్జెక్టులో వరుస క్రమంలో ప్రశ్నలను చదువుతూ.. చదివేటప్పుడే జవాబు గుర్తించగలిగే ప్రశ్నలకు జవాబులను గుర్తిస్తూ వెళ్లాలి. 

ఫిజిక్స్‌ ప్రశ్నలను చదువుతూ ముందుకు వెళ్లేటప్పుడు సిద్ధాంతపరమైన ప్రశ్నలు, సూటిగా గుర్తించగలిగే ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తూ వెళ్లాలి. ఇలాచేస్తే 15 నిమిషాల్లో 35+15 ప్రశ్నలు చదివి దాదాపు 10 ప్రశ్నల వరకు జవాబులను గుర్తించవచ్చు. 

తర్వాత ప్రశ్నలు చదివి ఉంటారు కాబట్టి ఏ ప్రశ్నలకు సులభంగా జవాబులు గుర్తించగలరో తెలిసిపోతుంది. లెక్కింపదగిన లెక్కలను చేసి వాటి జవాబులు గుర్తించాలి. 

తర్వాత నిడివిగా అంటే.. 1 నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలకు జవాబులు రాబట్టగలిగితే వాటిని సాధించాలి. 

తెలియని ప్రశ్నలను ఇప్పుడు వదిలివేసి కాలం మిగిలినప్పటికీ తర్వాత సబ్జెక్టుకు మారాలి. 

ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే విద్యార్థులు తెలిసిన అన్ని ప్రశ్నలకూ జవాబులు సరిగా గుర్తించగలుతారు. 

పరీక్ష మాధ్యమం

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే నీట్‌ పరీక్ష గతంలో ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉండేది. తర్వాత కొన్ని ప్రాంతీయ భాషల్లోనూ జరిగింది. ఇప్పుడు ఇంగ్లిష్, హిందీకి తోడుగా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతించారు. తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లిష్‌తోపాటు విద్యార్థి కావాలని కోరితే తెలుగు లేదా ఉర్దూలో కూడా పరీక్ష రాసుకునే వీలుంటుంది. అయితే ఏ భాషలో పరీక్ష రాయాలన్నా ప్రశ్నలు ఇంగ్లిష్‌తోపాటు ఆ భాషలో ఇస్తారు. 

గత ఏడాది గణాంకాల ప్రకారం- తెలుగు రాష్ట్రాల్లో 1.30 లక్షలమంది వరకూ నీట్‌ రాశారు. వీరిలో 500 మందిలోపు విద్యార్థులు మాత్రమే తెలుగు భాషలో కూడా ప్రశ్నపత్రాన్ని అడిగారు. ప్రవేశపరీక్షలో శాస్త్రీయ నామాలు ఇంగ్లిష్‌ పరంగా విద్యార్థులకు ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా వారు ఏ మాధ్యమంలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారో అదే మాధ్యమాన్ని ప్రవేశ పరీక్షలోనూ ఎంచుకోవడం మేలు. 

తొలిసారిగా నీట్‌-2021 మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో జరుగబోతోంది. అవి: 1. ఇంగ్లిష్‌ 2. హిందీ 3. అస్సామీస్‌ 4. బెంగాలీ 5. గుజరాతీ 6. కన్నడ 7. మలయాళం 8. మరాఠీ 9. ఒడియా 10. పంజాబీ 11. తమిళం 12. తెలుగు 13. ఉర్ద్దూ.

ఇదీ సూత్రం

ఏ పోటీ పరీక్ష అయినా విద్యార్థి ఒక్క తప్పూ చేయకుండా తనకు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు గుర్తించగలిగితే సీటు సాధించే ర్యాంకు వస్తుంది. ముందుగా చదివేటప్పుడు ఒక సబ్జెక్టులో అధిక ప్రశ్నలు తనకు తెలియనివి ఉన్నట్లయితే వెంటనే సబ్జెక్టు మారిపోవడం మేలు. ఇక్కడ విద్యార్థి గుర్తించవలసిన అంశం- ప్రశ్న సులభమైనదైనా, క్లిష్టమైనదైనా జవాబుకు ఒకటే మార్కులు. అదే విధంగా సబ్జెక్టుకు కనీస మార్కులు లేవు. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ మార్కులు సాధించగలిగే అవకాశం ఉంటుందో ఆ సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మేలవుతుంది.

ప్రశ్నల రూపంలో..

ఇప్పటి నుంచి 50 రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే కావలసిన దానికంటే ఎక్కువ సమయమే విద్యార్థులు నేర్చుకోవడానికి వినియోగించారు. అందుకే ఇప్పుడు ప్రశ్నల రూపంలో అభ్యాసం చేయడం మేలు. 

ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టుకు 1 గంట సమయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాలు చదువుతూ ప్రశ్నలను తామే తయారుచేసుకోవడానికి వినియోగించాలి. ఆ తర్వాత ఒక 3 గంటలు నూతన విధానంలో ఒక పరీక్షను ప్రాక్టీస్‌ చేయడం మంచిది.

పరీక్ష తర్వాత ఎక్కడ తప్పులు చేస్తున్నారో చూసుకుని ఆ అంశాలను సాయంత్రం పునశ్చరణ చేసుకోవాలి.

బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు గుర్తుంచుకోవలసిన అంశాలను టేబుల్స్‌ రూపంలో తయారు చేసుకోవాలి. 

ఫిజిక్స్‌కు సారాంశం (సినాప్సిస్‌) తయారుచేసుకుని వాటిని మాత్రమే పునశ్చరణ చేసుకోవాలి. 

ప్రతి మూడు రోజులకు ఒక గ్రాండ్‌ టెస్ట్‌ అంటే.. మొత్తం సిలబస్‌లో ఒక పరీక్ష రాసుకునే విధంగా ప్రణాళిక వేసుకుంటే కనీసం 15 గ్రాండ్‌ టెస్టులు రాసినట్లు అవుతుంది. 

దీంతో పరీక్ష రోజు ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా కాలవ్యవధి 3 గంటలను సక్రమంగా వినియోగించుకోవచ్చు.   

కెమిస్ట్రీలో 180 మార్కులకు 140 మార్కులు వస్తే ఇక ఫిజిక్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కేటగిరీ-ఎ లేదా గవర్నమెంట్‌ కాలేజీ లేదా ఏఐక్యూ (ఆల్‌ ఇండియా కోటా) లో సీటు సాధించే వీలుంటుంది. 

ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే ఏ విద్యార్థి అయినా సులభంగా నీట్‌లో మంచి ర్యాంకునూ, దానిద్వారా మెడికల్‌ సీటునూ సాధించవచ్చు. 

బయాలజీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి 360 మార్కులకుగాను 320 మార్కులకు పైగా వచ్చే విధంగా సిద్ధం కావాలి. 


ప్రశ్నలన్నీ బహుళైచ్ఛికమే (మల్టిపుల్‌ చాయిస్‌) 

ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్‌-ఎలో 35 ప్రశ్నలున్నాయి. అన్నింటికీ జవాబును గుర్తించాలి. 

సెక్షన్‌-బిలో ఉన్న 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే జవాబు గుర్తించాలి. ఇక్కడ 5 ప్రశ్నలను చాయిస్‌లో వదిలివేయవచ్చు. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ https://neet.nta.nic.in/ లో దరఖాస్తు సమర్పణ: 13 జులై 2021 నుంచి 6 ఆగస్టు 2021 వరకు

ఫీజు చెల్లింపునకు చివరి తేది (క్రెడిట్/ డెబిట్‌ కార్డ్‌/ నెట్‌ బ్యాంకింగ్‌/ యూపీఐ/ పేటీఎం వాలెట్‌ ద్వారా): 7 ఆగస్టు 2021 

వెబ్‌సైట్‌లో దరఖాస్తులోని వివరాల సవరణకు కేటాయించిన తేదీలు: 8 ఆగస్టు 2021 నుంచి 12 ఆగస్టు 2021 వరకు

ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: పరీక్షకు 3 రోజుల ముందు

పరీక్ష తేది: 12 సెప్టెంబరు 2021

పరీక్ష వ్యవధి: 3 గంటలు.


 

Posted Date : 19-07-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌