• facebook
  • whatsapp
  • telegram

క‌న్వీన‌ర్ కోటా వైద్య‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

* తెలంగాణ‌కు 3వ ర్యాంకు
* ఏపీ 6వ ర్యాంకు

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)-2020 ఫలితాలు ఎట్టకేలకు అక్టోబ‌రు 16న ‌ రాత్రి వెలువడ్డాయి. ఈ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు. ఇద్దరికీ సమానంగా... 720 మార్కులకు గాను 720 మార్కులు (నూటికి నూరు శాతం) వచ్చాయి. వైద్య ప్రవేశ పరీక్షలో నూటికి నూరు శాతం మార్కులు రావటం అరుదైన విషయం కాగా ఒడిశా విద్యార్థి సోయబ్‌ అఫ్తాబ్‌, దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ పోటాపోటీగా ఒకే మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు. నీట్‌లో ఒడిశాకు జాతీయ స్థాయి తొలి ర్యాంకు దక్కటం ఇదే ప్రథమం. రవుర్కెలాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్‌ (18) రాజస్థాన్‌లోని కోటలో శిక్షణ తీసుకున్నాడు. దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ తొలి ర్యాంకర్‌తో సమానంగా 720 మార్కులు సాధించినప్పటికీ టై-బ్రేకింగ్‌ విధానం ప్రకారం రెండో ర్యాంకును కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

 నీట్‌ ఫ‌లితాల్లో తెలంగాణ‌ రాష్ట్ర విద్యార్థులూ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థిని తుమ్మల స్నికిత 3వ ర్యాంకు సాధించి, తెలంగాణ ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.  అనంత పరాక్రమ(11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషారెడ్డి(14వ ర్యాంకు), శ్రీరామ్‌ సాయి శాంతవర్థన్‌(27వ ర్యాంకు), ఆర్షశ్‌ అగర్వాల్‌(30వ ర్యాంకు), మల్లేడి రుషిత్‌(33వ ర్యాంకు), ఆవుల శుభాంగ్‌(38వ ర్యాంకు) ముందు వరుసలో నిలిచారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్‌(అఖిల భారత ర్యాంకుల్లో 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. అక్టోబ‌రు ఆఖరి వారంలో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నీట్‌-2020ను గత నెల 13న నిర్వహించారు. 

తెలుగు విద్యార్థుల సత్తా

నీట్‌లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. 720కి 715 మార్కులతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు జాతీయస్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్షలో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన సింధు అదే ప్రతిభను జాతీయ స్థాయిలోనూ కనబరచడం విశేషం. విజయవాడకు చెందిన కోట వెంకట్‌ 13వ ర్యాంకు, బి.మానస 16వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్‌ అరాఫత్‌ 18వ ర్యాంకులో నిలిచాడు. కడపకు చెందిన శేఖర్‌ సాత్విక్‌శర్మ 20, జొన్నల బాలశివరామకృష్ణ 26వ ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 57,721 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 33,841 మంది (58.63%) అర్హత పొందారు. అర్హత సాధించినవారు గతేడాది (70.72%) కంటే దాదాపు 12 శాతం తగ్గడం గమనార్హం. అర్హత సాధించిన విద్యార్థుల జాబితా కేంద్రం నుంచి త్వరలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి వస్తుంది. దీనిని అనుసరించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల జాబితాను విశ్వవిద్యాలయం ప్రకటిస్తుంది. నవంబరు మొదటి వారంలో తొలి విడత కౌన్సెలింగ్‌ను ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రారంభించే అవకాశం ఉంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో 5,100 వరకు సీట్లు ఉన్నాయి. దంత వైద్య కళాశాలల్లో 1,440 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 85% సీట్లు, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 50% సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లలో 15% జాతీయ కోటాకు అప్పగించారు. జాతీయ కోటాకు రాష్ట్రం నుంచి కేటాయించిన సీట్లు రెండో కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలితే.. వర్సిటీలకు తిరిగి అప్పగిస్తున్నారు. 2019-20లో ఇలా 53సీట్ల వరకూ వచ్చాయి. వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లోభర్తీ చేశారు.

నీట్‌లో తొలి పది ర్యాంకర్లు..

1.సోయెబ్‌ అఫ్తాబ్‌
2.ఆకాంక్షా సింగ్‌
3.తుమ్మల స్నికిత
4.వినీత్‌ శర్మ
5.అమ్రిష ఖైతాన్‌
6.గుత్తి చైతన్య సింధు
7.సాత్విక్‌ జి
8.శ్రీజన్‌ ఆర్‌
9.కార్తిక్‌ రెడ్డి
10.మాత్రవాడియా మానిత్‌

ఫీజుల తగ్గుదల!

పీజీ వైద్య విద్యలో తగ్గినట్లే ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్యలోనూ ఫీజులు తగ్గబోతున్నాయి. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ‘బి’ కేటగిరీ సీటును 2019-20లో రూ.13,37,057తో భర్తీ చేశారు. కొత్త ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వారం, పదిరోజుల్లో ఖరారు చేయనుంది. ఎంబీబీఎస్‌ ‘బి’ కేటగిరీ సీటు ఫీజు ప్రస్తుతమున్న దానికంటే రూ.3 లక్షలకు పైగా తగ్గొచ్చని సమాచారం. దీనికి అనుగుణంగానే ‘సి’ కేటగిరీ సీట్ల ఫీజులూ తగ్గుతాయి.

ముందుగా అఖిల భారత కోటా ప్రవేశాలు

జమ్ము-కశ్మీర్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్యకళాశాలల నుంచి సేకరించిన 15 శాతం ఎంబీబీఎస్‌ సీట్లతో నిర్వహించనున్న అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ప్రవేశాల కంటే ముందుగానే నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి అఖిల భారత కోటాకు 467 ఎంబీబీఎస్‌ సీట్లను ఇస్తారు. అఖిల భారత కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు అందజేస్తారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత ప్రవేశాల సమాచారం కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్‌, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో 4,915 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన

నీట్‌ అఖిల భారత ర్యాంకులు విడుదలైనా.. ఆ సమాచారం రాష్ట్రానికి చేరడానికి వారం పట్టవచ్చని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా ప్రాథమిక ర్యాంకులను రాష్ట్ర స్థాయిలో విడుదల చేస్తారు. అక్టోబ‌రు  చివరి వారంలో కన్వీనర్‌ కోటాలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటనను విడుదల చేసి, అర్హుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. కొవిడ్‌ దృష్ట్యా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.

ఓపెన్‌లో అర్హత మార్కు 147

ఓపెన్‌ కేటగిరీలో గతేడాది అర్హత మార్కు 134 ఉండగా.. ఈసారి 147 మార్కులకు అర్హతగా నిర్ణయించారు. అఖిల భారత స్థాయిలో 50-60వేల లోపు ర్యాంకులు వచ్చినవారికి ఈసారి రాష్ట్రస్థాయిలో 1500-2000 లోపు ర్యాంకులు రావచ్చని నిపుణుల అంచనా.

ఈసారి పోటీ పెరిగింది

గతేడాదితో పోల్చితే అగ్రర్యాంకుల్లో రాష్ట్రానికి కొంత తక్కువ ర్యాంకులే వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులే సాధించారు. సుమారు 500 మార్కులు వచ్చిన విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీలో కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్‌ విద్యార్థులకు 420 వరకూ అవకాశం ఉండవచ్చు. ఎయిమ్స్‌, జిప్‌మర్‌లలోనూ నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేస్తుండడంతో.. మన విద్యార్థుల్లో ఎక్కువ మంది వాటిల్లో సీట్లు పొందుతారు. తద్వారా ఇక్కడ ఇతరులు సీట్లు పొందడానికి అవకాశాలు పెరుగుతాయి.
                                                       -పి.శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్య విద్యాసంస్థలు

రెండేళ్లుగా ఒడిశాకు వెళ్లలేదు

మెడికల్‌ ప్రవేశ పరీక్ష కోచింగ్‌ కోసం 2018 ఏప్రిల్‌లో రాజస్థాన్‌లోని కోటాకు వచ్చాను. అప్పటి నుంచి ఒక్కసారి కూడా స్వస్థలం ఒడిశాలోని రవూర్కెలాకు వెళ్లలేదు. అమ్మ, చెల్లి కూడా నాతోపాటే ఇక్కడ ఉన్నారు. నాన్న భవన నిర్మాణదారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తోటి విద్యార్థులకు స్వస్థలాలకు వెళ్లారు. అయినా నేను కోటాలోనే ఉండి నీట్‌కు సిద్ధమయ్యా. రోజుకు 10-12 గంటలు చదివాను. వాట్సాప్‌ మినహా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటాను. దిల్లీ ఎయిమ్స్‌లో చేరుతాను. కార్డియాలజిస్టునవుతా. పేదలకు సేవ చేస్తా.
-సోయబ్‌ అఫ్తాబ్‌, ఫస్ట్‌ ర్యాంకర్‌

అమ్మానాన్నల బాటలోనే..

నాన్న సదానంద్‌రెడ్డి హృద్రోగ నిపుణులు. అమ్మ లక్ష్మీరెడ్డి గైనకాలజిస్టు. వాళ్లిద్దరి స్ఫూర్తితోనే ఈ రంగంపై ఆసక్తి ఏర్పడింది. నాన్న 20 ఏళ్ల క్రితం దిల్లీ ఎయిమ్స్‌లోనే పీజీ చేశారు. నేనూ అక్కడే చదువుతా.
                                           - టి.స్నికిత, ఆలిండియా 3వ ర్యాంకు

పరిశోధనలపై ఆసక్తి..

నాన్న నారాయణరావు మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ. నాకు న్యూరాలజీ విభాగంపై ఆసక్తి. పరిశోధనలపై ఆసక్తితోనే నీట్‌ రాశా. దిల్లీ ఎయిమ్స్‌లో చదవాలన్నదే లక్ష్యం.
                                                - అనంత పరాక్రమ, 11వ ర్యాంకు

న్యూరో సర్జన్‌గా సేవలందిస్తా

తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో నేను ఉత్తమ ర్యాంకు సాధించగలిగాను. దిల్లీలోని ఎయిమ్స్‌లో చదివి.. న్యూరో సర్జన్‌గా సేవలందిస్తా.
                    - సాయిత్రిషారెడ్డి, 14వ ర్యాంకు

నా లక్ష్యం..కార్డియాలజిస్టు

చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలని లక్ష్యం. రోజుకు 16 గంటల పాటు సాధన చేయడంతో 13వ ర్యాంకు వచ్చింది. కార్డియాలజిస్టు కావాలని ఉంది. దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరతాను. అధ్యాపకుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధ్యమైంది.
            -కోట వెంకట్‌, 13వ ర్యాంకర్‌

న్యూరాలజిస్టునవుతా..

చిన్నప్పటి నుంచి న్యూరాలజిస్టు కావాలన్నది లక్ష్యం. విద్యుత్తు శాఖలో ఏడీఈగా పని చేస్తున్న మా నాన్న వెంకటేశ్వరరెడ్డి నా లక్ష్యసాధన దిశగా శిక్షణ ఇప్పించారు. రోజుకు 12 గంటల పాటు చదివాను 16వ ర్యాంకు సాధించగలిగాను. దిల్లీ ఎయిమ్స్‌లో చేరతాను.
                 -బి.మానస, 16వ ర్యాంకర్‌

వైద్యురాలినవుతా.. శాస్త్రవేత్తగా ఎదుగుతా

కచ్చితంగా మొదటి పది ర్యాంకుల్లో ఒక ర్యాంకు వస్తుందని ఊహించా. 6వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మా తాతయ్య గుత్తి సుబ్రహ్మణ్యం, తల్లిదండ్రులు కోటేశ్వరప్రసాద్‌, సుధారాణి అందరూ వైద్యులే. వారిలాగే ప్రజలకు సేవలందించాలని చిన్నప్పటి నుంచే కలలుగన్నా. ఎక్కువ మంది ప్రజలకు మేలు కలిగేలా ఏదైనా కొత్త అంశాన్ని కనుగొనాలనేది నా లక్ష్యం. వైద్యురాలిగా, మంచి పరిశోధకురాలిగా పేరు తెచ్చుకుంటా. దిల్లీ ఎయిమ్స్‌లో చదవాలని నిర్ణయించుకున్నా.
 - చైతన్యసింధు, నీట్‌ 6వ ర్యాంకర్‌
 

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.