• facebook
  • whatsapp
  • telegram

విదేశాల్లో వైద్యవిద్యకు వెళ్లాలా.. వద్దా?

ఇతర దేశాల్లో ఎంబీబీఎస్‌కు అనుస‌రించాల్సిన వ్యూహం ఏమిటి?

నీట్ ముగిసింది. ఆశించిన సీటు రాలేదు. ఇక ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనే కల అలాగే మిగిలిపోవాలా? అంత నిరాశ అవసరం లేదంటున్నారు నిపుణులు. నీట్‌లో అర్హత సాధించి, కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కాస్త ఖర్చు పెట్టుకోగలిగితే కలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే ఆయా సంస్థలకు వెళ్లి కోర్సును కొనసాగించవచ్చు.

ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అంతర్జాతీయ విద్యార్థుల్లో సింహభాగం మనవాళ్లే ఉంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం 2017-18లో సుమారు ఏడున్నర లక్షల మంది, 2018-19లో దాదాపు ఆరు లక్షలమందిపైగా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లారని తేలింది. ఇందులో ఎంబీబీఎస్‌కు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అగ్ర దేశాల్లో మెడిసిన్ చేసి, ప్రాక్టీస్ పెట్టుకొని, అక్కడే స్థిరపడాలనే ఆలోచన ఉన్నవారూ విదేశాల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇతర దేశాల్లో వైద్యవిద్యను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులు, ఇతర అంశాల గురించి ముందుగానే తెలుసుకొని, తగిన అవగాహనతో అడుగు ముందుకేయడం మంచిది. 

పలు రకాల ప్రయోజనాలు

అత్యాధునిక విద్య, భద్రత:  విదేశాల్లోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు / సంస్థలు ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యాధునిక విద్య‌ను విద్యార్థులకు అందిస్తున్నాయి. అనుభ‌వం క‌లిగిన ప్రపంచ స్థాయి అధ్యాపకులను నియ‌మించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిగ్రీలను విద్యార్థులకు ప్రదానం చేస్తున్నాయి. విదేశీ విద్యార్థుల భద్రత విషయంలో శ్రద్ధ వహిస్తున్నాయి. మ‌న విద్యార్థులు ఎక్కువ‌గా ఏ కాలేజీలు లేదా సంస్థల్లో చేరుతున్నారో తెలుసుకుని వాటి ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.  

ఆంగ్లంతో అనుకూలం: అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడానికి విదేశాల్లోని చాలా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎంబీబీఎస్ బోధన, ఇతర సూచనలు, సమాచార మార్పిడికి ఇంగ్లిష్ భాషను వినియోగిస్తున్నాయి. ఆంగ్లంలో చదువుకున్నప్పటికీ స్థానిక భాషను నేర్చుకోవడం అన్నివిధాలుగా మంచిది. 

ఖ‌ర్చు తక్కువ‌: భారతదేశంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్‌కు అయ్యే ఖ‌ర్చు అతి తక్కువగా ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆతిథ్య దేశంలో ప్రాక్టీస్ చేసుకోడానికి ఆ దేశాలు అనుమతిస్తున్నాయి. ఇదో అదనపు ప్రయోజనం.

ఎక్కువ సీట్లు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థన్నింటినీ కలిపినప్పటికీ మన దేశంలో సీట్ల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడి ప్రైవేటు సంస్థల్లో ట్యూషన్ ఫీజుతో పోలిస్తే విదేశాల్లో రుసుంలు తక్కువ. ప్రమాణాలు ఎక్కువ. అందుకే విద్యార్థులు వైద్య విద్య కోసం ఖండాంతరాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తం కోర్సు పూర్తి చేసేందుకు అయ్యే ఖ‌ర్చు ప‌లు దేశాల్లో దాదాపు ఈ విధంగా ఉంది. చైనాలో రూ.20-35 ల‌క్ష‌లు, నేపాల్‌లో రూ.60-70 ల‌క్ష‌లు, క‌రీబియ‌న్‌లో రూ.80 ల‌క్ష‌ల నుంచి రూ.1.5 కోట్లు, ఉక్రేయిన్‌లో రూ.20-38 ల‌క్ష‌లు, కిర్గిజ్‌స్తాన్‌లో రూ.17-24 ల‌క్ష‌లు, పోలాండ్‌లో 50-75 ల‌క్ష‌లు, బంగ్లాదేశ్‌లో రూ.30-60 ల‌క్ష‌లు, ర‌ష్యాలో రూ.17-25 ల‌క్ష‌లు, ఫిలిప్పీన్స్‌లో రూ.15-22 ల‌క్ష‌ల వ‌ర‌కు సుమారుగా ఖ‌ర్చు అవుతుంది. 

స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయం: వైద్య విద్య కోసం ఇతర దేశాల నుంచి వచ్చే అభ్యర్థులను ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు/ సంస్థలు అనేక స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సాయాలను అందిస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక చేయూతలు అందుతున్నాయో ముందుగా విద్యార్థులు తెలుసుకోవాలి. చాలా వరకు ఆ సమాచారం ఆయా సంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటుంది. 

సరిహద్దులు దాటితే ఎదురయ్యే సమస్యలు

భాషతో బాధలు:  ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో స్థానిక భాష‌లోనే విద్యాబోధ‌న జ‌రుగుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని ప్రధాన దేశాలు ఉక్రెయిన్, చైనా, రష్యా, పోలాండ్ ల్లో ఇంగ్లిష్ ను ఎక్కువగా వినియోగించరు. అందువల్ల స్థానిక భాష తెలియక‌పోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ప్ర‌ముఖ‌ విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషలోనే బోధిస్తాయి. కానీ, స్థానిక భాషపై పరిజ్ఞానం ఉంటేనే  మరింత ప్రయోజనం పొందడానికి వీలుంటుంది. అందుకే పలు యూనివర్సిటీలు స్థానిక భాషను రెండో భాషగా విద్యా ప్రణాళికలో చేరుస్తాయి. మొత్తం మీద లోకల్ లాంగ్వేజ్ పరిజ్ఞానం లేకపోతే కొంత వరకు ఇబ్బందులు తప్పవు.

ప్రమాణాల ఇబ్బందులు: బోధ‌న ఒక్కో దేశంలో ఒక్కో ర‌కంగా ఉంటుంది. విద్యార్థులకు ఏ రెండు దేశాలూ ఒకే విద్యానుభవాన్ని అందించవు. ప్రమాణాలు, పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో విద్యార్థులను త‌ర‌గతి గదుల‌కే ప‌రిమితం చేసి పుస్తకాల్లో ఉన్న‌వే బోధిస్తారు. మ‌రికొన్ని దేశాల్లో త‌ర‌గ‌తి గది బోధ‌న కంటే ప్రాక్టిక‌ల్‌గా నేర్పించడంపై దృష్టిపెడతారు. ఇలాంటి అంశాలను తెలుసుకోడానికి తమకు అవసరమైన, అనుకూలమైన వాటిని అభ్యర్థులు ఎంచుకోడానికి తగిన పరిశోధనలు ముందుగా చేసుకోవాలి. ఇది కొంత కష్టమైన విషయమే. సరిగా తెలుసుకోలేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ఇందుకోసం అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాలి. పూర్వ విద్యార్థులతో చర్చించాలి. 

వాతావరణంతో వెతలు: విద్యార్థులు ఏ దేశానికి వెళ్లాల‌నుకున్నా ముందుగా అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. రాజకీయ పరిణామాలు, భద్రత, అందుబాటు ధరల్లో వైద్యం తదితరాల గురించి పరిశీలించాలి. వాతావ‌ర‌ణం అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉండ‌దు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఆ అంశాలనూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని విశ్వ‌విద్యాల‌యాన్ని ఎంచుకోవాలి. 

నకిలీ విశ్వవిద్యాయాలతో నష్టాలు: విదేశాల్లో చదువుకోడానికి వెళ్లడంలో మరో ముఖ్యమైన ఇబ్బంది నకిలీ విశ్వవిద్యాలయాలు. అభ్యర్థులు వీటి మోసాలబారిన పడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలు సరైన ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్లు ఇచ్చేస్తుంటాయి. మోసం తెలిసేసరికి ఏమీ చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే వైద్య విద్య కోసం  విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారు ఇలాంటి మోసాల‌కు గురికాకుండా నేష‌న‌ల్ మెడికల్ క‌మిష‌న్ (ఎన్ఎంసీ) సాయం చేస్తోంది. గుర్తింపు పొందిన, సమాన విద్యను అందించే విశ్వవిద్యాలయాల జాబితాను ప్రకటించి విద్యార్థుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. విద్యార్థులు వీటిని పరిశీలించుకోవాలి. 

సొంత‌గ‌డ్డ‌పై ప్రాక్టీస్‌కు పరీక్ష

విదేశీ విద్యార్థులు ఎప్పుడైనా భారతదేశానికి తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేయవచ్చు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు తమ సొంత‌గడ్డలో ప్రాక్టీస్ చేయడానికి ఎంసీఐ ఆమోదించిన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల పరీక్ష లేదా ఎఫ్‌ఎమ్‌జీఈలో 2021 వ‌ర‌కు డిగ్రీ పొందిన విద్యార్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఆన్ లైన్ తరగతులు

క‌రోనా వైర‌స్ కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వం చాలా వ‌ర‌కు విదేశాల‌కు రాక‌పోక‌లు నిలిపివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థుల‌కు అక్క‌డి విశ్వ‌విద్యాల‌యాలు/ సంస్థ‌లు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నాయి. ఇమ్మిగ్రేష‌న్ సేవ‌లు పున‌రుద్ధ‌రించిన ‌త‌ర్వాతే విదేశాల‌కు వెళ్ల‌డానికి అవ‌కాశం ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు వారికి ఆన్‌లైన్‌లోనే బోధ‌న నిర్వహిస్తారు. 

ఏయే దేశాలకు వెళుతున్నారు?

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు ఎక్కువ‌గా ఫిలిప్పీన్స్‌, ర‌ష్యా, చైనా‌, కిర్గిజ్‌స్తాన్‌, ఉక్రేయిన్‌, నేపాల్ ‌దేశాల‌కు వెళుతున్నారు. వీటిలోని కొన్ని దేశాల్లో ఫీజులు ఎక్కువ‌గా ఉంటే, మ‌రికొన్ని దేశాల్లో సీటు పొందాలంటే స్థానికంగా నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్షలో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. 

ఇక నుంచి అందరికీ నెక్ట్స్ 

ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన తర్వాత నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిర్వ‌హించే ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్‌జీఈ) రాయాల్సి ఉంది. 2022 సంవ‌త్స‌రం నుంచి దీని స్థానంలో నేష‌న‌ల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ బిల్లు-2019 ద్వారా దీన్ని ప్ర‌వేశ‌పెట్టింది. భ‌విష్య‌త్తులో విదేశాల్లో ఎంబీబీఎస్ చ‌ద‌వాల‌నుకునే వారికి ఇది అద్భుత‌మైన అవ‌కాశం. కోర్సు అనంతరం దేశ వ్యాప్తంగా నిర్వ‌హించే ఈ నెక్ట్స్‌ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధిస్తే విద్యార్థి ఏ దేశంలో విద్య‌న‌భ్య‌సించినా గుర్తింపు ల‌భిస్తుంది. విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాల‌నుకునే విద్యార్థులు అక్క‌డి వాతావ‌ర‌ణం, కోర్సు కాల‌ప‌రిమితి త‌క్కువ ఉన్న విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌ల‌ను ఎంపిక చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని విద్యార్థులు ఎక్కువ‌గా ఫిలిప్పీన్స్‌లో చదవడానికి ఆస‌క్తి చూపుతున్నారు. అక్క‌డి వాతావ‌ర‌ణం మ‌న దేశంలో ఉన్న‌ట్లే ఉంటుంది. ప్రముఖ‌ విశ్వ‌విద్యాల‌యాలు ఉండ‌టంతో పాటు బోధ‌న ఇంగ్లిష్‌లో ఉంటుంది. విద్యార్థులు త‌ర‌గ‌తి గ‌దిలో కంటే ప్రాక్టిక‌ల్‌గానే ఎక్కువ‌గా నేర్చుకుంటారు. ఫీజులూ తక్కువే. మొత్తం కోర్సుకు దాదాపు రూ.15-22 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చవుతుంది.‌ ప్ర‌తి సంవ‌త్స‌రం తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 800 నుంచి 900 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ విద్య‌నభ్య‌సించ‌డానికి వెళుతున్నారు. దేశం మొత్తం మీద తీసుకుంటే దాదాపు 3500 మంది అక్కడికి వెళుతున్నారని అంచ‌నా. విదేశాల్లో ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసి స్వ‌దేశానికి తిరిగివ‌చ్చిన వారిలో 15-20% మంది ఇక్క‌డ నిర్వ‌హించే అర్హ‌త ప‌రీక్ష‌ల్లో విజ‌వంత‌మ‌వుతున్నారు. 

 

 

- గ‌రిక‌పాటి స‌తీశ్, ఎస్‌జీ క‌న్స‌ల్టెన్సీ, హైద‌రాబాద్

Posted Date : 13-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌